
రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పడిపోతుంటే మాట్లాడని మీ గొంతులు, వేల కోట్ల రూపాయల దేశ సంపదను కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన దొంగలను పట్టుకురమ్మని ఒక్క మాట అడగని మీ కంఠాలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాయి? స్వాతంత్య్రానంతరం ఎన్నడూ కనివిని ఎరుగని జిఎస్టీ భారాలను మోయలేని సామాన్యుని వైపు కన్నెత్తి చూడని మీ కళ్ళు, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వేల కిలోమీటర్లు నడిచిన కరోనా కూలీలను చూడని మీ కళ్ళు, ఆక్సిజన్ అందక ఆగిపోయిన అభాగ్యుల శవాల దరిచేరని మీ చూపులు ఇప్పుడు ఎందుకు పేదరికం వైపు చూస్తున్నాయి? అని ప్రశ్నించాలి.
'దేశంలో పేదరికం మన ముందు ఒక రాక్షసిలా వుంది. దాన్ని ఎదుర్కోవడం నేటి ప్రాధాన్యతా అంశం. 20 కోట్ల మంది పేదలు ఇంకా దారిద్య్ర రేఖకు దిగువన వుండడం విషాదకరం'. ఈ మాటలన్నది ప్రతిపక్ష పార్టీలో, మేధావులో కాదు. స్వయానా కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని తమ రిమోట్ ద్వారా నడుపుతున్న ఆర్‌ఎస్‌ఎస్ నేత. తన అనుబంధ సేనల్లో ఒకటైన స్వదేశీ జాగరణ్ మంచ్ నిర్వహించిన వెబ్‌నార్‌లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే మాట్లాడుతూ 'దేశం లోని ఒక శాతం సంపన్నుల వద్ద 20 శాతం జాతీయ సంపద ఒకవైపు కేంద్రీకరించబడుతుంటే, మరోవైపు 50 శాతం జనాభా వద్ద కేవలం 13 శాతం సంపద మాత్రమే వుంది', 'కార్మిక శక్తి సర్వే ప్రకారం దేశంలో నిరుద్యోగం 7.6 శాతం వున్నది'. ఇలా ఇంకా ఎన్నో చెప్పారు. గత ఎనిమిది సంవత్సరాలు తమ నియంత్రణలో నడిచిన ప్రభుత్వ విధానాల మీద మొసలి కన్నీరు కార్చడం ఆర్‌ఎస్‌ఎస్ బహు నాలుకల నిజస్వరూపానికి నిదర్శనం.
బిజెపి పాలనా వైఫల్యాలు
రూపాయి విలువ రోజురోజుకు దిగజారడం, పెట్టుబడిదారీ వ్యవస్థ దైవ సమానంగా భావించే స్టాక్ మార్కెట్ నుండి ప్రతి రోజు వేల కోట్లు అమెరికాకు చేరడం, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుండడం, అన్ని రకాల వస్తుసేవలపై జిఎస్టీ పన్నుల భారాలు, కరిగిపోతున్న మధ్యతరగతి ఆశలు, పెరుగుతున్న నిరుద్యోగం దేశాన్ని చుట్టుముట్టాయి. వీటిని నివారించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. నోట్ల రద్దు, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో పాలనా వైఫల్యం స్వాతంత్య్రానంతర విషాద ఘట్టాలుగా చరిత్రకు ఎక్కాయి.
వ్యవసాయాన్ని కార్పొరేటు కంపెనీలకు అప్పగించేందుకు మూడు నల్లచట్టాలు, దేశ రక్షణ లాంటి ముఖ్యమైన రంగాల్లోకి ప్రైవేటు సంస్థలను అనుమతించడం కోసం 'అగ్నిపథ్' ప్రవేశపెట్టడం, దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలుగా వున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థల ప్రైవేటీకరణ, దేశ భద్రతతో కూడిన సమాచార వ్యవస్థ బిఎస్‌ఎన్‌ఎల్, చౌకగా ప్రజలకు అందుబాటులో వున్న రైల్వేల అమ్మకం పెద్దఎత్తున సాగుతున్నది. వీటన్నింటి వెనుక ఆర్‌ఎస్‌ఎస్ మార్గదర్శకాలు లేకుండా జరగవన్నది జగమెరిగిన సత్యం.
సంపద కేంద్రీకరణ
పెట్టుబడిదారీ వ్యవస్థ సహజ లక్షణం ఆర్థిక అసమానతలను పెంచడం. అయితే సరళీకరణ ఆర్థిక విధానాలు అత్యంత వేగంగా అమలు చేస్తున్న నేటి బిజెపి పాలనలో సంపద కేంద్రీకరణ పెరిగి, అసమానతలు తీవ్రమవుతున్నాయి. దేశ జనాభా సగటు ఆదాయం రూ. 2,03,500 కాగా, దేశంలో అట్టడుగున వున్న 50 శాతం జనాభా సగటు ఆదాయం రూ.55,000. అదే ఒక్క శాతంగా వున్న పెద్ద కార్పొరేటు సంస్థల సగటు ఆదాయం రూ.44,44,000. అంటే దేశంలోని 50 శాతం జనాభా వద్ద 13.10 శాతం సంపద మాత్రమే వుంటే, కేవలం ఒక్క శాతంగా వున్న బడా బాబుల వద్ద 21.70 శాతం కేంద్రీకరించబడింది. ఆర్‌ఎస్‌ఎస్ ఆశీస్సులతో, ప్రధాని ఆశ్రయంలో అపర కుబేరుడుగా పెరిగిపోతున్న గౌతం అదానీ రోజుకు సగటున 1,612 కోట్ల రూపాయలు సంపాదించేస్తున్నాడు. భారత శ్రీమంతుల సంఖ్య హనుమంతుని తోక కంటే వేగంగా పెరిగిపోతున్నది. ప్రస్తుతం 1,100 మందికి చేరింది. వీరి గుప్పెట్లో రూ.100 లక్షల కోట్లు చేరాయి.
ప్రైవేట్ కార్పొరేట్ రంగం యొక్క స్థూల స్థిర ఆస్తుల విలువ 2000-01లో రూ.5.5 లక్షల కోట్లు కాగా, 2010-11లో రూ.30.5 లక్షల కోట్లు, 2020-21లో రూ.77 లక్షల కోట్లకు పెరిగింది (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నుండి ఈ లెక్కలు సేకరించబడినవి). ఈ లెక్కలన్నీ ఆర్‌ఎస్‌ఎస్ నేతకు తెలియవనుకోగలమా? మరి తెలిసినా ఎనిమిది సంవత్సరా లుగా ఎందుకు మౌనంగా వున్నారు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అదే ఆర్‌ఎస్‌ఎస్ బహురూప స్వభావం.
ప్రజలపై భారాలు
ఒకే పన్ను అంటూ ఆర్భాటంగా చేసుకున్న ప్రచారం అంతిమంగా ప్రజలపై అదనపు భారాలు వేయడానికి, రాష్ట్రాల ఆర్థిక స్థితిని దిగజార్చి కేంద్రంపై ఆధారపడడానికి దారి తీసింది. గతంలో ఎన్నడూ లేనంతగా హోల్‌సేల్ ధరలు 15.8 శాతం పెరిగాయి. ఆయిల్ ధరలు 40.63 శాతం, ఆహార పదార్థాలు 14.4 శాతం పెరిగాయి. ఇదే సమయంలో దేశ చరిత్రలో రికార్డు స్థాయిలో నెలకు రూ. 1.48 లక్షల కోట్లు పన్నుల రూపంలో ప్రజల గోళ్లు ఊడగొట్టి మరీ కేంద్రం వసూళ్లు చేసుకుంది. గత సంవత్సరం కంటే 28 శాతం అధికంగా వసూలు చేసుకున్నారు. పెట్రోల్, డీజల్ ధరల భారం దీనికి అదనం. మరోవైపు నిరుద్యోగాన్ని అదపు చేయాలనే కనీస ప్రయత్నం కూడా కేంద్ర పాలకులకు లేదు. 20 నుండి 24 సంవత్సరాల మధ్య వయసులో వున్న వారిలో 42 శాతం మంది నిరుద్యోగులుగా వుండగా, 20 నుండి 29 సంవత్సరాల మధ్య వున్న వారిలో 80 శాతం మంది పాక్షిక, లేదా పూర్తి స్థాయి నిరుద్యోగులుగా వున్నారు. ఉన్నత చదువులు చదివిన 3 కోట్ల మంది యువత ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. ద్రవ్య చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయింది. అక్టోబర్ 7 నాటికి ఒక డాలర్‌కు రూ.82.37లకు దిగజారింది.
దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 2023 నాటికి రూ.150 లక్షల కోట్ల అప్పులకు చేరుతుందని కేంద్ర ప్రభుత్వమే అంచనా వేసింది. స్వాతంత్య్రానంతర కాలం నుండి బిజెపి అధికారంలోకి వచ్చే వరకు రూ.57 లక్షల కోట్లు అప్పు వుంటే, ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ బిడ్డ బిజెపి పాలనా కాలంలో రూ.100 లక్షల కోట్లకు చేరడం ఈ ప్రభుత్వ వైఫల్యానికి తిరుగులేని సాక్ష్యం. ఇంత అప్పు చేసి ఏమి చేశారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. పేదలకు అందే అరకొర సంక్షేమ పథకాలను ఉచిత పథకాలంటూ స్వయాన ప్రధానే చర్చ లేవదీశారు. ఎన్నికల హామీలకు డబ్బులు ఎక్కడివి? ఎలా అమలు చేస్తారు? చెప్పమంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలను నియంత్రించేందుకు నిబంధనలు రూపొందిస్తుంది. ఇవన్నీ ఆర్‌ఎస్‌ఎస్‌కు తెలియకుండా జరుగుతున్నాయని అనుకోగలమా ?
ఆర్‌ఎస్‌ఎస్ కపటత్వం
అరవై సంవత్సరాల తర్వాత భారతీయ ప్రభుత్వం ఏర్పడిందని, ఇప్పటి నుండి భారతీయులకు అన్ని శుభగడియలేనని ఊదరగొట్టి 2014లో అధికారంలోకి వచ్చారు. ప్రజలను భ్రమల్లో ముంచి తమ హిందూత్వ రహస్య ఎజెండాను అమలు చేసుకోవడానికి అన్ని అవకాశాలను ఉపయోగించుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ చట్ట సవరణ, రాజ్యాంగ సంస్థలపై దాడి లేదా తమ గుప్పిట్లో పెట్టుకోవడం, ఫెడరల్ వ్యవస్థను బలహీనం చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థను దిగజార్చడం, పార్లమెంట్‌ను నామమాత్రంగా మార్చడం లాంటి అనేక రూపాల్లో తమ భావాజాలానికి అనుగుణంగా పాలన చేయించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు, వ్యవసాయాన్ని రెండింతల ఆదాయంగా మార్చడం, మేక్ ఇన్ ఇండియా లాంటి హామీల సంగతి ఏమిటని ప్రజలు ప్రశ్నించడం క్రమంగా పెరుగుతుంది. వాస్తవాలను గమనించే కొద్దీ వివిధ తరగతుల ప్రజలు ఉద్యమాల బాట పడుతున్నారు. వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక రైతాంగ సుదీర్ఘ పోరాటం, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల నిరసనలు, ప్రశ్నించే గొంతులు పెరగడం, అగ్నిపథ్ లాంటి వినాశకర విధానాలపై యువత ఆగ్రహం, కంటిలో కునుకు లేకుండా సోషల్ మీడియాలో అనేక పోస్టులు ఆర్‌ఎస్‌ఎస్ ను ఊపిరి ఆడనివ్వడంలేదు. రాజ్యంగ సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను, ప్రాంతీయ పార్టీలను ఇంత కాలం అదుపు చేయగలిగారు. కాని ఉద్యమాలను, భావాలను ఎంత అదుపు చేస్తే అంతకు రెట్టింపుతో మరో చోట ఉదయిస్తున్నాయి. వీటి నుండి ప్రజల దృష్టిని మార్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్ అనేక ఎత్తుగడలకు తెరలేపింది. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మసీదుకు వెళ్లడం, దాని ప్రధాన కార్యదర్శి ఆర్థిక విషయాలను మాట్లాడడం ఇందులో భాగమే.
ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి వేరు కాదు
ప్రస్తుత దేశ పాలకులంతా ఆర్‌ఎస్‌ఎస్ కుదరు నుండి వచ్చిన వారే. ప్రధానితో మొదలు అనేక మంది కేంద్ర మంత్రులు, బిజెపి రాష్ట్ర ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఆర్‌ఎస్‌ఎస్‌తో తమ అనుబంధాన్ని వివిధ సందర్భాల్లో సగర్వంగా చాటుకుంటున్న వారే. తాము సృష్టించిన, రాజకీయ పార్టీ తమ ఆదేశాలతో పాలకులు అనుసరించే విధానాల వల్ల ఏర్పడిన దుష్ఫలితాల గురించి మాతృసంస్థ ఇప్పుడు మాట్లాడడం వింతల్లోకెల్ల వింత. అది కూడా ఎప్పుడో మూత వేసిన స్వదేశీ జాగరణ్ మంచ్ నిర్వహించిన వెబ్‌నార్‌లో. విదేశీ, స్వదేశీ కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలు అమలు చేయడంలో తమ శక్తినంతా ధారపోసిన బిజెపి పాలకుల విధానాల గురించి స్వదేశీ జాగరణ్ మంచ్‌కు ఇప్పుడు గుర్తుకు రావడం మరో వింత. రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పడిపోతుంటే మాట్లాడని మీ గొంతులు, వేల కోట్ల రూపాయల దేశ సంపదను కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన దొంగలను పట్టుకురమ్మని ఒక్క మాట అడగని మీ కంఠాలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాయి? స్వాతంత్య్రానంతరం ఎన్నడూ కనివిని ఎరుగని జిఎస్టీ భారాలను మోయలేని సామాన్యుని వైపు కన్నెత్తి చూడని మీ కళ్ళు, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వేల కిలోమీటర్లు నడిచిన కరోనా కూలీలను చూడని మీ కళ్ళు, ఆక్సిజన్ అందక ఆగిపోయిన అభాగ్యుల శవాల దరిచేరని మీ చూపులు ఇప్పుడు ఎందుకు పేదరికం వైపు చూస్తున్నాయి? అని ప్రశ్నించాలి. ప్రజా చైతన్యంతో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. బిజెపి ముసుగులో సాగిన ఆర్‌ఎస్‌ఎస్ పాలన తీరును నిలదీయాలి. అందుకు కారణమైన మూలవిరాట్టులను నిలదీయాలి.
/వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు/
వి. రాంభూపాల్