- త్రాగునీటి కోసం విద్యార్థులు పాట్లు
ప్రజాశక్తి - వేంపల్లె : ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని వేంపల్లె జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన ఆర్ ఓ ప్లాంట్లు కొద్ది రోజుల నుంచి పని చేయడం లేదు. దీంతో విద్యార్థులకు తాగునీటి కోసం తిప్పలు పడుతున్నారు. నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా కోట్లాది రూపాయలతో జిల్లా పరిషత్ బాలుర, బాలికల పాఠశాలలను అతి సుందరంగా తీర్చిదిద్ది నిర్మించారు. ఈ సందర్భంగా ఒక్కోక పాఠశాలలో దాదాపు రూ 30 లక్షల ఖర్చు పెట్టి ఫిల్టర్ నీటిని అందివ్వాలనే ఉద్దేశంతో బాలికల, బాలుర పాఠశాలలో వేరు వేరుగా ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. పాఠశాలలో ఉన్న ఆర్ఓ ప్లాంట్లు విద్యార్థులకు మూణ్ణాల ముచ్చటగా మారిపోయింది. పాఠశాలలను స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే ప్రారంభించారు. ఆయా పాఠశాలల విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే ఉద్దేశ్యంతో అదే రోజు ఆర్ఓ ప్లాంట్లను కూడా సిఎం ప్రారంభించారు. సిఎం ప్రారంభించిన నాటి నుండి ఆర్ఓ ప్లాంట్లు దాదాపు నాలుగు, ఐదు సార్లు మరమ్మతులకు గురైంది. దీంతో ఆర్ఓ ప్లాంట్లు మరమ్మతులు చేయకుండా వదిలివేయడం జరిగింది. దీంతో పాఠశాలలు పునఃప్రారంభం నుండి రెండు పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ పని చేయకపోవడంతో విద్యార్థులు త్రాగునీటిని కొందరు బాటిళ్ళులో ఇంటి నుండి తెచ్చుకోగా మరి కొందరు విద్యార్థులు పాఠశాల సమీపంలో ఉన్న దుకాణాలు, హోటళ్లు వద్దకు వెళ్లి నీటి దప్పిక తీర్చు కొంటున్నారు. బాలికల పాఠశాలలో అయితే తరగతి గదికి వాటర్ క్యాన్ పెట్టుకొని విద్యార్థుల సొంత డబ్బులతో నీటిని తెచ్చుకొని త్రాగుతున్నారు. అలాగే బాలుర పాఠశాలలో ట్యాంక్ కు సంబంధించిన పైపు లైన్ లీకేజీ కావడంతో ట్యాంక్ లో ఉన్న నీరు వృథాగా పోవడంతో మరుగుదొడ్లులో నీటి సౌకర్యం లేకుండా పోయినట్లు ఉపాధ్యాయు అంటున్నారు. లీకేజీ పైపు మరమ్మతులు చేసేందుకు ఎక్కడ పైపు లైన్ ఉందో అర్థం కావడం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. మోటర్ ద్వారా ట్యాంకుకు నీటిని నింపిన కొద్ది గంటలలోనే ట్యాంక్ లో ఉన్న నీరు అంతా వృధాగా పోయి ట్యాంక్ ఖాళీ అవుతున్నట్లు వాపోతున్నారు. త్రాగునీరు లేని విషయం అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలిసినప్పుటికి ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇంత పెద్ద పాఠశాలలు ఉన్నప్పటికీ త్రాగునీరు లేక పోవడం దారుణమని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయాన్ని సంబంధించిన కాంట్రాక్టర్ల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేదని పాఠశాల ఛైర్మన్ గురుప్రసాద్ తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో బాలుర ఉన్నత పాఠశాలలో 3వ తరగతి నుండి 10 వ తరగతి వరకు దాదాపు 900 మంది, బాలికల పాఠశాలలో దాదాపు 870 మంది విద్యార్థులు చదువుతున్నారు. పనులు నాసిరకంగా చేయడంతో ఆర్ఓ ప్లాంట్ ప్రతిసారి మరమ్మతులకు గురి అవుతున్నట్లు విద్యార్థి తల్లిదండ్రులు అంటున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత తాగునీటి కోసం బాలుర పాఠశాల విద్యార్థులు రోడ్డుపై ఉన్న దుకాణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఆర్ ఓ ప్లాంట్ మరమ్మతులకు గురైన ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆర్ఓ ప్లాంట్ దిష్టిబొమ్మ లాగ పాఠశాలల ఆవరణంలో దర్శనం ఇస్తున్నది. పాఠశాల నిర్మాణం అందంగా ఉన్నప్పటికీ విద్యార్థులకు తాగు నీటి ఇబ్బందులు విద్యార్థులకు తప్పడంలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థులకు పాఠశాలల్లో ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
- త్రాగునీటి ఇబ్బందులు తొలగించాలి : సల్మాన్, విద్యార్థి
సిఎం జగన్ ప్రారంభించిన బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు త్రాగడానికి త్రాగునీరు కరువైంది. పెద్ద ఆర్ఓ ప్లాంట్ ఉన్నప్పటికీ ఆర్ఓ ప్లాంట్ నుండి నీరు రాకపోవడంతో ఆలకర ప్రాయంగా ఆర్ఓ ప్లాంట్ ఉన్నాయి. నీటి దప్పిక తీర్చుకోవడానికి వాటర్ ప్యాకెట్లు కొనుగోలు చేసి దప్పిక తీర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చెడిపోయిన ఆర్ఓ ప్లాంట్ లను త్వరితగతిన మరమ్మతులు చేయించాలి.










