
- కేంద్రం ఒత్తిడితో రాష్ట్ర సర్కారు నిర్ణయం
- ఇప్పటి వరకు ఎరువుల అమ్మకాలపై పన్నుల్లేవు
- ఇకపై అదనపు ట్యాక్స్‌్ భారం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె)ను ఈ సంవత్సరం ఖరీఫ్ నుంచి జిఎస్‌టి పరిధిలోకి తీసుకొస్తున్నారు. ఆర్‌బికెలు ప్రారంభమై మూడేళ్లు నిండగా ఇప్పటి వరకు వాటిలో నిర్వహిస్తున్న ఎరువుల వ్యాపారంపై ప్రభుత్వం ఎలాంటి పన్నులూ చెల్లించట్లేదు. కొద్దీగొప్ప చెల్లించినా ఒక క్రమపద్ధతి లేదు. మాన్యువల్‌గా చేస్తున్నారు. కాగా ఆర్‌బికెలలో ఎరువుల అమ్మకాలపై జిఎస్‌టి కట్టట్లేదని కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ ఏడాది నుంచి ఆర్‌బికెలను జిఎస్‌టి పరిధిలోకి ఎపి ప్రభుత్వం తీసుకొస్తోందని, అందుకోసం ప్రస్తుతం ఆర్‌బికెల మ్యాపింగ్ జరుగుతోందని సమాచారం. ఆర్‌బికెలకు ఎరువుల సరఫరా నిమిత్తం ఎపి మార్క్‌ఫెడ్‌ను ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా నియమించింది. మార్క్‌ఫెడ్ నుంచి ఆర్‌బికెలకు ఎరువులు సరఫరా చేస్తున్నందున, ఇదంతా ప్రభుత్వరంగ సంస్థల మధ్య లావాదేవీలని, లైసెన్స్‌లు, జిఎస్‌టి నెంబర్ అవసరం లేదని ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. ఆర్‌బికెలలో అమ్మకాల సమయంలో వినియోగదారులైన రైతులకు ఎలాంటి బిల్లులూ జారీ చేయట్లేదు. బిల్లులు జారీ చేసినట్లయితే అందులోనే జిఎస్‌టి కలిసి ఉంటుంది. రిటైలర్ పాయింట్ అయిన ఆర్‌బికెలలో జరిగే విక్రయాలపై జిఎస్‌టి తప్పనిసరిగా చెల్లించాలని కేంద్రం పేర్కొనడంతో మార్క్‌ఫెడ్‌కు ఒక జిఎస్‌టి నెంబరు, మార్క్‌ఫెడ్‌కు బ్రాంచిలుగా వ్యవహరిస్తున్న రాష్ట్రంలోని అన్ని ఆర్‌బికెలకూ కలిపి కామన్‌గా వేరే జిఎస్‌టి నెంబర్ అమలు చేస్తున్నారు. దీనివలన ఆర్‌బికెలలో విక్రయించే ఎరువులకు ప్రభుత్వం జిఎస్‌టి చెల్లించాలి. సర్కారుకు ఇది అదనపు భారమని చెబుతున్నారు. ప్రస్తుతం ఎరువుల సేల్స్‌పై కేంద్రం 5 శాతం జిఎస్‌టి అమలు చేస్తోంది.
డిబిటి ఎఫెక్ట్
కేంద్రం ఎరువుల విషయంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్వర్ (డిబిటి) విధానం తెచ్చింది. గతంలో ఎరువుల కంపెనీలకు ఏక మొత్తంలో సబ్సిడీ ఇచ్చేది. డిబిటిలో అయితే ఇ-పోస్ యంత్రాల్లో అమ్మకాలు నమోదు చేస్తారు. వాటి ప్రాతిపదికన కంపెనీలకు సబ్సిడీ ఇస్తున్నారు. ఆర్‌బికెలలో డిబిటి విధానం సరిగ్గా అమలు కావట్లేదని, తమకు సబ్సిడీ పడట్లేదని ఎరువుల కంపెనీలు ఆర్‌బికెలకు ఎరువుల సరఫరాను తగ్గించాయి. ఈ కారణంగానే కేంద్రం ఆర్‌బికెలపై దృష్టి సారించిందని సమాచారం.
పిఎసిఎస్‌లు కడుతున్నాయి
రాష్ట్ర వ్యాప్తంగా 10,778 ఆర్‌బికెలుండగా 10,661 ఆర్‌బికెలు ఎరువుల వ్యాపారం చేస్తున్నాయి. అలాగే ఎప్పటి నుంచో ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పిఎసిఎస్) ఎరువుల వ్యాపారం చేస్తున్నాయి. వాటికి లైసెన్స్‌లు, జిఎస్‌టి ఉన్నాయి. ఎపిలో 2 వేలకు పైన సొసైటీలుండగా ఆర్థికంగా పరిపుష్టి కలిగిన 925 సొసైటీలు ఎరువుల వ్యాపారం చేస్తున్నాయి.
గతేడాది పిఎసిఎస్‌లు 3.54 లక్షల టన్నుల ఎరువులు అమ్మాయి. ఆర్‌బికెలలో 3.87 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయి. 2023-24లో ఆర్‌బికెలలో 10.5 లక్షల టన్నులు, సొసైటీలలో 7.5 లక్షల టన్నుల ఎరువులు అమ్మాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇదిలా ఉండగా సొసైటీల పరిధిలోకి ఆర్‌బికెలను తీసుకొస్తూ ఈ మధ్య ప్రభుత్వం చట్టం చేసింది. దాంతో సొసైటీలతోపాటు ఆర్‌బికెలనూ జిఎస్‌టి పరిధిలోకి తేవాల్సి వచ్చిందని అధికార వర్గాలు వెల్లడించాయి.