Apr 03,2023 21:12

ముంబయి : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం సోమవారం ప్రారంభమయ్యింది. ఈ నెల 3, 5, 6 తేదిల్లో మూడు రోజుల పాటు ఇది సాగనుంది. ఈ భేటీలో వడ్డీ రేట్లను మరోమారు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. విధాన నిర్ణయాలను శక్తికాంత దాస్‌ గురువారం మీడియాకు వెల్లడించనున్నారు. ఇప్పటికే రెపోరేటును 6.50 శాతానికి చేర్చారు. నిపుణుల అంచనాలకు అనుగుణంగా మరోమారు 25 బేసిస్‌ పాయింట్లు పెంచితే కీలక వడ్డీ రేటు 6.75 శాతానికి చేరనుంది. అదే జరిగితే రుణ గ్రహీతలపై మరింత భారం పడనుంది. స్టాక్‌ మార్కెట్లపై ఒత్తిడి నెలకొననుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.