
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 48 లక్షల మంది ధూమపానం, ఇతర పొగాకు ఉత్పత్తుల వ్యసనానికి బలైపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్ధ లెక్కలు చెప్తున్నాయి. అందులో 16 లక్షల మంది భారతీయులే కావటం ఆందోళన కలిగించే విషయం. డబ్బిచ్చి ప్రాణాంతక వ్యాధుల్ని కొనుక్కోవడమంటే ఇదే. మన దేశంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారమే...జనాభాలో 34 శాతం పురుషులు, మూడు శాతం స్త్రీలు ఇప్పటికే...ప్రత్యక్ష, పరోక్ష రూపాలలో ధూమపాన విషపు కోరల్లో చిక్కుకొని ఉన్నారు. వీరికి ఏటా కొత్తగా 3.6 శాతం మంది ప్రజలు తోడవుతున్నారని, ఆధునిక సర్వేలు వెల్లడిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో పొగాకు వాడకం ఏటా 2.3 శాతం వంతున తగ్గుతుంటే...మన దేశంలో పొగాకు వ్యసనపరులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పొగాకులో, వాటి వివిధ ఉత్పత్తులలో సుమారు నాలుగు వేల విషపదార్థాలు ఉన్నాయని రసాయన విశ్లేషకులు గుర్తించారు. అవి 25 రకాల వ్యాధులకు, ముఖ్యంగా ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులకు కారణమవు తున్నాయి. పరిస్థితులు ఇలానే కొనసాగితే రానున్న దశాబ్దాలలో ధూమపానంతో సహా పొగాకు ఉత్పత్తులు చేసే చెరుపు అంతా ఇంతా కాదు.
ఇప్పటికే ప్రతి మూడు అకాల మరణాలలో ఒకటి ధూమపానం వల్లే సంభవిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలుపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 90 కోట్ల మంది పురుషులు, 20 కోట్ల మంది స్త్రీలు, మొత్తం 110 కోట్ల మంది ధూమపాన ప్రియులని అంచనా. వీరిలో అభివృద్ధి చెందిన దేశాల పురుషులు 20 కోట్లు, స్త్రీలు 10 కోట్లు. అయితే వీరిలో వర్ధమాన దేశాలకు చెందిన పురుషులు 70 కోట్లు, స్త్రీలు 10 కోట్లు అని ఆరోగ్య సంస్ధల గణాంకాలు వివరిస్తున్నాయి. ఎవరికి వారు వ్యక్తిగతంగా ఈ సమస్యను చూసినప్పుడు ఏమీ అనిపించకపోవచ్చు. కానీ ప్రజారోగ్య పరిరక్షణ పరంగా సామాజిక దృక్పథంతో చూసినప్పుడు ఈ సంఖ్యలు ఎవరికైనా ఆందోళన కలిగించక మానవు. నేడు భారత దేశానికి పొంచి ఉన్న అణ్వాయుధాల ముప్పు కన్నా...దేశంలో నిల్వ ఉన్న పొగాకు, వాటి ఉత్పత్తుల వల్ల సంభవించే ముప్పు అధికమని జాతీయ పొగాకు నిర్మూలన సంస్థ మనల్ని హెచ్చరిస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ధూమపానం చేసే వారికే కాక పక్కన ఉన్న వారికి, కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదం వుంది. దీనివల్లనే ధూమపాన ప్రియులున్న కుటుంబంలోని వారు, ఆఫీస్‌లలోని వారు పొగాకు ఉత్పత్తుల వ్యాధులకు గురవుతున్నారు. వీటిలో ముఖ్యంగా పేర్కొనదగినవి ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు. పొగాకు పొగ లోని విష పదార్థాలు పక్కన ఉన్న వారినే కాకుండా పర్యావరణాన్ని కూడా కలుషితం చేస్తున్నాయి. ఫలితంగా పొగ తాగని వారు కూడా పొగాకు పొగకు గురవుతున్నారు.
మరీ ముఖ్యంగా మహిళలు ధూమపానానికి దూరంగా ఉండాలి. లేకపోతే ఆ ప్రభావం పుట్టబోయే పిల్లలపై పడుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి వంటి కొన్ని జిల్లాల్లో మహిళలు చుట్ట తాగటం అది కూడా అడ్డపొగ (చుట్ట కాలే వైపు నోట్లో పెట్టుకొని పీల్చడం) చాలామందికి తెలిసిన విషయమే. ఈ వ్యసనాన్ని మాన్పించే కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు ఈ వ్యసన నిర్మూలనకు కృషి చేయాలి. పొగాకు వ్యాపారం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ...దేశంలో పొగాకు వాడకం వల్ల వస్తున్న వ్యాధుల కోసం వెచ్చించే ధనం అధికమంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంవత్సరం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ''మనకు ఆహారం కావాలి. పొగాకు కాదు'' అనే నినాదాన్ని ఇచ్చింది. ప్రజలు శాస్త్రీయ వాస్తవాలతో చైతన్యవంతులై ధూమపానాన్ని, పొగాకు ఉత్పత్తులను స్వచ్ఛందంగా బహిష్కరించాలి.
- డా|| టి. సేవకుమార్,
ఇండియన్ మెడికల్ అసోసియేషన్
జాతీయ కౌన్సిల్ సభ్యులు, గుంటూరు.