పేరు మారితే తీరు మారే
మంచి కాలం రహిస్తుందా!
నిజంగానే మాతృభారతి
నిండు హర్షం వహిస్తుందా!?
నిజంగానే! నిజంగానే!?
అగ్రభావపు ఉగ్రమూకలు
అంతరిస్తాయా?
భగ బ్రతుకుల నగ్న ప్రశ్నలు
ఆవిరవుతాయా?
నిజంగానే! నిజంగానే!?
నేలకొరిగిన నీతి జెండా
నింగికెగిరేనా?
గాయపడిన జాతిజనుల
ఖ్యాతి పెరిగేనా?
నిజంగానే! నిజంగానే!?
మంచుకొండ.. లోయ నిండా
ప్రేమ నిండేనా?
మణిపురంలో మయూరాలు
నాట్యమాడేనా?
నిజంగానే! నిజంగానే!?
సామరస్యపు భావనలతో
శాంతి పండేనా?
ఘర్మజలమూ.. ధర్మజలమూ
గంగ సాటేనా?
నిజంగానే! నిజంగానే!?
ద్వేష పాలన.. వేట పాలన
ఆగిపోయేనా?
ప్రజాస్వామిక నిజరథం
సాగిపోయేనా?
నిజంగానే! నిజంగానే!?
- నల్లి ధర్మారావు
సెల్ : 76609 67313
( మహాకవి శ్రీశ్రీ శైలి స్ఫూర్తితో )