- ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది
ప్రజాశక్తి-కాకినాడ : పరిపాలనా సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్నకు చెబుదాం (జేకేసీ) కింద వస్తున్న అర్జీల పరిష్కారంలో నాణ్యత, అర్జీదారుల సంతృప్తి అత్యంత ప్రధానమని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (వ్యవసాయ, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్య శాఖ), ప్రత్యేక కమిషనర్ (రైతు భరోసా కేంద్రాలు) గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కోర్టుహాల్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకష్ణ ద్వివేది కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఆర్.రమేష్ కుమార్, జిల్లా ఎస్‌పీ ఎస్.సతీష్ కుమార్‌తో కలిసి జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్, గృహ నిర్మాణం, సర్వే, వ్యవసాయం తదితర విభాగాలకు సంబంధించి వస్తున్న అర్జీలు, వాటి పరిష్కారంపై ఆయా విభాగాల జిల్లాస్థాయి అధికారులతో చర్చించారు. జేకేసీ అర్జీలను నిర్దేశ గడువులోగా పరిష్కరిస్తూ ఈ కార్యక్రమం అమల్లో ముందు వరుసలో ఉన్న కాకినాడ జిల్లా అధికార యంత్రాంగానికి గోపాలకృష్ణ ద్వివేది అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ.. ప్రతి శాఖ తమ శాఖకు సంబంధించి ఎలాంటి అర్జీలు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? ఏ విధంగా పరిష్కారమవుతున్నాయి? తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షించి, కార్యక్రమం విజయవంతంగా అమలయ్యేందుకు కృషిచేయాలన్నారు. ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి కార్యక్రమం అమలును పరిశీలించాలన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అన్ని స్థాయుల్లోనూ అధికార యంత్రాంగం వారి వారి బాధ్యతలను పూర్తిస్థాయిలో అప్రమత్తతతో, జవాబుదారీతనంతో, సమర్ధతతో నిర్వహించడం ద్వారా ఫిర్యాదులు ఎక్కువగా నమోదు కాకుండా చూసుకోవచ్చని దీనివల్ల ఆయా శాఖలకు మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు. జేకేసీ అర్జీల పరిష్కార ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని ఇందుకు మండలం, డివిజన్, జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయని అదే విధంగా శాఖల స్థాయిలోనూ నాణ్యతపై ఎప్పటికప్పుడు మదింపు చేయాలని గోపాలకష్ణ ద్వివేదీ పేర్కొన్నారు. సమావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, ఇన్‌ఛార్జ్ డీఆర్‌వో కె.శ్రీరమణి, కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహం, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, వ్యవసాయ అధికారి ఎన్.విజరుకుమార్, డీపీవో ఆర్.విక్టర్ తదితరులు పాల్గొన్నారు.










