
బ్లింకెన్ ప్రస్తావించిన 'వ్యక్తులు' సాధారణ ప్రజలు కాదు, వారు బడా కార్పొరేట్లు. వారి ప్రయోజనాలే అమెరికాను ముందుకు నడిపిస్తాయి. రాబోయే శతాబ్దపు పరీక్షలు అంటూ ఆయన మాట్లాడుతున్నది అమెరికా లోని పెట్టుబడిదారీ వ్యవస్థ, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి. పెట్టుబడిదారీ వాదానికి సోషలిజం ఎప్పుడూ ముప్పుగానే వుంటుంది. సోషలిస్టు ఆలోచనలు ఎక్కడ, ఏ కొద్దిగా పొడసూపినా వెంటనే పెట్టుబడిదారుల మనస్సుల్లో భయాందోళనలు నెలకొంటాయి. తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు వారు శాయశక్తులా ప్రయత్నిస్తారు. క్వాడ్ ద్వారా, అటువంటి కూటముల ద్వారా, ఆ సమావేశాలనంతరం చేసిన ప్రకటనల ద్వారా వారు చేయాలనుకుంటోంది, చెప్పాలనుకుంటోంది ఇదే.
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో కల్లోలపరిచే అమెరికా ముమ్మర దౌత్య కార్యకలాపాలతో మే మాసం ముగిసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రారంభించి, పలువురు అమెరికా ప్రభుత్వ అధికారులు మన ప్రాంతానికి క్యూ కట్టారు. జపాన్, దక్షిణ కొరియాల్లో ద్వైపాక్షిక పర్యటనలు జరపడంతో పాటు టోక్యోలో క్వాడ్ నేతల సమావేశంలో బైడెన్ పాల్గొన్నారు. క్వాడ్ సమావేశంలో కొత్త చొరవ - ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫోరం ఫర్ ప్రాస్పరిటీ (ఐపిఇఎఫ్)ని బైడెన్ ప్రారంభించారు. ఉక్రెయిన్‌లో యుద్ధం, నాటో జోక్యాన్ని దృష్టిలో వుంచుకుంటే, ఈ ప్రాంతంలో ఉన్నత స్థాయిలో అమెరికా కార్యకలాపాలు ముమ్మరంగా సాగడం ఆశ్చర్యాన్ని కలిగించడం సహజమే. చైనా అభివృద్ధిపై ఆందోళన చెందుతున్న అమెరికా...చైనా ప్రగతిని అడ్డుకోవడానికి కూటములను నిర్మించాలన్న అమెరికా ప్రయత్నాల్లో మనకు సమాధానం దొరుకుతుంది.
వాషింగ్టన్‌లో మే 26న ఆహుతుల మధ్య అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ జె.బ్లింకెన్ ప్రసంగిస్తూ, ''ఉక్రెయిన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ చేస్తున్న యుద్ధం ఒకపక్క కొనసాగుతుండగా, అంతర్జాతీయ వ్యవస్థకు సుదీర్ఘ కాలంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వల్ల తలెత్తనున్న పెను సవాలుపై మనం దృష్టి పెట్టనున్నాం. అంతర్జాతీయ వ్యవస్థను మార్చాలన్న ఉద్దేశ్యం, అది చేయడానికి అవసరమైన ఆర్థిక, దౌత్య, సైనిక, సాంకేతిక శక్తి సామర్ధ్యాలు వున్న ఏకైక దేశం చైనా మాత్రమే. అధ్యక్షుడు సీ జిన్‌పింగ్ నేతృత్వంలో, పాలక చైనా కమ్యూనిస్టు పార్టీ దేశీయంగా మరింత అణచివేత ధోరణితో, విదేశాల్లో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. కానీ, చైనా పంథాను మార్చేందుకు మనం దానిపైనే ఆధారపడలేం. అందువల్ల పారదర్శకమైన, అందరినీ కలుపుకుని పోగల అంతర్జాతీయ వ్యవస్థ కోసం మన దార్శనికతను మరింత ముందుకు తీసుకెళ్ళగలిగే రీతిలో బీజింగ్ చుట్టుపక్కల వ్యూహాత్మక వాతావరణాన్ని మనం రూపొందించాలి'' అన్నారు. వాస్తవానికి, 2022 ఫిబ్రవరిలో విడుదల చేసిన ఇండో-పసిఫిక్ వ్యూహాత్మక పత్రం ఇదే విషయాన్ని పేర్కొంటోంది. ఈ వ్యూహాత్మక లక్ష్యాల సాధనకు గానూ ఇటీవల జరిగిన ద్వైపాక్షిక సమావేశాలను, క్వాడ్ సదస్సును ఉపయోగించుకున్నారు.
సముద్ర జలాలకు సంబంధించి కొత్త అవగాహనా చొరవ ఇండో-పసిఫిక్ పార్టనర్‌షిప్ ఫర్ మారిటైమ్ డొమైన్ అవేర్‌నెస్ (ఐపిఎండిఎ)ను క్వాడ్ సదస్సు ప్రకటించింది. ''అక్రమ చేపల వేట సమస్యను పరిష్కరించేందుకు, తమ సముద్ర జలాల హక్కులను, వాటి సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు తమ సముద్ర తీర ప్రాంతాలకు సమీపంలో జలాలను మరింత మెరుగ్గా పర్యవేక్షించేందుకు ఈ ప్రాంతంలోగల తమ భాగస్వాములకు ఐపిఎండిఎ వీలు కల్పిస్తుంది,'' అని బ్లింకెన్ పేర్కొన్నారు. క్వాడ్ సదస్సుపై వైట్‌హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం, ''డార్క్ షిప్'' (తమ ఆచూకీ తెలియకుండా వుండేందుకు గాను ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఎఐఎస్)ను స్విచ్ఛాఫ్ చేసే నౌకలు)లను కనుగొనేందుకు అనుమతించడానికి, సముద్ర జలాల్లో సమావేశమయ్యేందుకు చర్యలు తీసుకోవడం, ప్రస్తుతమున్న ప్రాంతీయ కేంద్రాల వ్యాప్తంగా (భారత్‌లో హిందూ మహాసముద్ర ప్రాంతంలో సమాచార ఫ్యూజన్ సెంటర్ వంటివి) సమాచార మార్పిడికి మద్దతునివ్వడం వంటి వ్యూహాత్మక ఎత్తుగడలతో కూడిన కార్యకలాపాలను కనిపెట్టేందుకు ఐపిఎండిఎ అనుమతిస్తుందని ఆ ఫ్యాక్ట్ షీట్ పేర్కొంది.
''భారత్, అమెరికాలను మరింత దగ్గర చేసేందుకే'' ఐపిఎండిఎ అని అమెరికా స్పష్టంగా పేర్కొంది. ఈ జలాల్లో నావికా దళాలకు చెందిన నౌకల రాకపోకలపై ముఖ్యంగా చైనా నౌకలపై నియంత్రణ కోసమే ఈ చర్య అని స్పష్టమవుతోంది. ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్‌గా భారతదేశ మౌలిక సదుపాయాలన్నింటినీ ఇందుకోసమే ఉపయోగిస్తున్నారు.
క్వాడ్ సదస్సు నేపథ్యంలో, నాలుగు దేశాలైన అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియాలకు చెందిన అభివృద్ధి ఆర్థిక సంస్థల సమావేశాన్ని కూడా నిర్వహించారు. ''ప్రైవేటు రంగంతో మరింత బలమైన సంబంధాలను'' పటిష్టపరుచుకునే స్పష్టమైన లక్ష్యంతో, పారిశ్రామిక భాగస్వాములు వ్యాపార, పెట్టుబడుల అంశాలను చర్చించేందుకు వీలుగా ఈ సమావేశం జరిగింది. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలను తీసుకోవడానికే ఈ సమావేశమంటూ పైకి పేర్కొన్నప్పటికీ లోపల ఉద్దేశ్యాలు మాత్రం చాలా స్పష్టంగా వున్నాయి. ''క్వాడ్ దేశాల్లో, క్వాడ్ దేశాలవ్యాప్తంగా కీలకమైన, కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతికతల కోసం అవసరమైన పెట్టుబడుల లభ్యతను కోరే స్వతంత్ర పెట్టుబడిదారుల కన్సార్టియం - క్వాడ్ ఇన్వెస్టర్స్ నెట్‌వర్క్''ను ప్రారంభిస్తున్నట్లు వైట్‌హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ పేర్కొంది. ఏం జరుగుతోందనేది ఈ కింద చదవాలి.
క్వాడ్ దేశాల సైబర్ భద్రతా భాగస్వామ్యాన్ని సమన్వయం చేస్తూ, మరింత బలోపేతం చేసేందుకు అవగాహన కుదిరింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు గాను, మొట్టమొదటిసారిగా 'క్వాడ్ సైబర్ సెక్యూరిటీ డే' కూడా ప్రకటించారు. క్వాడ్ నాలుగు దేశాల మధ్య సైబర్ డేటాను పరస్పరం మార్పిడి చేసుకోవడాన్ని పెంచేందుకు, సైబర్ డొమైన్‌లో వారి కార్యకలాపాలను సమన్వయం చేసుకునేందుకు ఇది ఉద్దేశించబడింది. ఈ రోజుల్లో డేటా సేకరించడం వల్ల వారికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవడమే కాదు.దాన్నొక ఆయుధంగా కూడా ఉపయోగించవచ్చు. ప్రభుత్వం సేకరించే ఈ డేటా ఏ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇందులో నిఘా అనేది అన్నింటికంటే కీలకమైన అంశంగా వుంది. అంతకన్నా ఎక్కువైనది, కీలకమైన డేటాను పరస్పరం మార్పిడి చేసుకోవడం అంటే మన వ్యక్తిగత స్వేచ్ఛల విషయంలో రాజీ పడడమే కాదు, మనదేశ సార్వభౌమత్వాన్ని కూడా తాకట్టు పెడతామనేది కీలకమైంది.
పైగా, నాలుగు దేశాల జాతీయ ఉపగ్రహ డేటా వనరుల లింక్‌లను సమగ్రపరిచే ''క్వాడ్ శాటిలైట్ డేటా పోర్టల్''ను అందించడం ద్వారా నాలుగు దేశాల మధ్య ఉపగ్రహ డేటాను పంచుకునేందుకు క్వాడ్ సమావేశం మార్గాలను తెరిచింది. భూమికి సంబంధించిన పరిశీలనాంశాలతో (ఎర్త్‌్ అబ్జర్వేషన్ల రంగం) సహా రోదసీ అప్లికేషన్లను అభివృద్ధిపరిచేందుకు మనం కలిసి పని చేయాలని ఆ సమావేశం పేర్కొంది. రోదసీని ఒక ఆయుధంగా మార్చుకోవడాన్ని అమెరికా పెంచి పోషిస్తోంది. ఎలాన్‌మస్క్ వంటి ప్రైవేటు పెట్టుబడిదారులు వందలాది చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడానికి ప్రోత్సహించడం ద్వారా రోదసిని వలసరాజ్యంగా మార్చడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. మన భూమి చుట్టూ గల రోదసి కక్ష్యను వందలాది ఉపగ్రహాలతో ఊపిరాడకుండా చేయడం నెమ్మదిగా అత్యంత వివాదాస్పద అంశంగా మారనుంది. ఈ నేపథ్యంలో మనం ఈ కింది పరిణామాలను చూడాల్సి వుంటుంది.
క్వాడ్ సమావేశంలో మన వ్యూహాత్మక ప్రయోజనాలపై ప్రధాని నరేంద్ర మోడీ రాజీ పడ్డారు. బైడెన్‌తో ద్వైపాక్షిక సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ మోడీ, స్వతంత్ర విదేశాంగ విధానానికి తెర దించేశారు. అమెరికా ప్రయోజనాలతో భారత్ ప్రయోజనాలు ముడిపడి వున్నాయంటూ ఆయన చాలా ఉల్లాసంగా ప్రకటించారు. ''నిజం చెప్పాలంటే, భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం అంటే విశ్వసనీయమైన భాగస్వామ్యం. రక్షణ రంగంలో, ఇతర రంగాల్లో మన ఉమ్మడి ప్రయోజనాలు, మనం పంచుకున్న విలువలు, ఇరుదేశాల మధ్య ఈ విశ్వసనీయ సంబంధాలను మరింత బలోపేతం చేశాయి. సాంకేతిక రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని కూడా మనం పెంచుకుంటున్నాం. అంతర్జాతీయ అంశాల్లో కూడా మనం పరస్పరం సహకరించుకుంటున్నాం. ఇండో-పసిఫిక్ ప్రాంతంపై మనం ఒకే రకమైన అభిప్రాయాలు పంచుకుంటున్నాం. ఈ సహకారానికి క్వాడ్, ఐపిఇఎఫ్‌లు రెండు ముఖ్యమైన ఉదాహరణలుగా వున్నాయి.'' 'రక్షణ సంబంధాలు' అనేది ఇక్కడ స్పష్టంగా ప్రస్తావించబడింది.
ద్వైపాక్షిక సమావేశానంతరం వైట్‌హౌస్ విడుదల చేసిన పత్రం కూడా మరింత స్పష్టంగా వుంది. ''అమెరికా-భారత్ సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం లోని పురోగతిని బైడెన్, మోడీ సమీక్షించారు. మన ప్రధాన రక్షణ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు వారు కట్టుబడి వున్నారు. ఇరు దేశాలకు లబ్ధి చేకూర్చగల ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు నిబద్ధులై వున్నారు.'' కంబైన్డ్ మిలటరీ ఫోర్సెస్‌లో భారత్ చేరికను ఇరు దేశాలు ప్రకటించాయి-బహ్రెయిన్ అసోసియేట్ సభ్యురాలిగా వుంటుంది.'' అమెరికాతో మన రక్షణ ప్రయోజనాలు ఏ విధంగా, ఏ మేరకు మిళితమైపోయాయో ఇది తెలియచేస్తుంది. రష్యా నుండి భారత్‌ను దూరం చేసేందుకు, అమెరికా, దాని మిత్రపక్షాలైన ఇజ్రాయిల్ వంటి దేశాల మీద...తన రక్షణ అవసరాలకు మరింతగా ఆధారపడడేలా అమెరికా చేసిన ప్రయత్నాలకు ఇదొక ఉదాహరణ. క్వాడ్ ముగిసిన వారం రోజుల్లోనే ఇజ్రాయిల్ రక్షణ మంత్రి భారత్‌లో పర్యటించి రక్షణ ఒప్పందాలను కుదుర్చుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.
కీలకమైన కొత్తగా ఆవిర్భవించే సాంకేతికలపై (సిఇటి) భారత్, అమెరికా చొరవను చేపట్టేందుకు, ఇప్పటికే వున్న భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు ఇరు దేశాల జాతీయ భద్రతా మండళ్లు ఒప్పందం కుదుర్చుకున్నాయని కూడా వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ భాగస్వామ్యం కింద, కృత్రిమ మేథస్సు, డేటా సైన్స్ వంటి రంగాల్లో 2022లో 25 ఉమ్మడి పరిశోధనా ప్రాజెక్టులకు మద్దతిచ్చేందుకు భారత్ ప్రారంభించే ఆరు టెక్నాలజీ ఇన్నొవేషన్ హబ్బుల్లో చేరేందుకు అమెరికాను భారత్ అనుమతించనుంది. దీనివల్ల మనకు లబ్ధి చేకూరడం బదులుగా మన ప్రయోజనాలు కచ్చితంగా దెబ్బతింటాయి.
ప్రధాని మోడీ, వివిధ దేశాల నేతల సమక్షంలో బైడెన్ ఐపిఇఎఫ్ గురించి ప్రకటించారు గానీ వివరాలేమీ ఇవ్వలేదని పలువురు వ్యాఖ్యాతలు ఇప్పటికే ప్రస్తావించారు. దీనివల్ల మన ప్రాంతంలోని దేశాలకు ఎలాంటి ఉపయోగం వుండబోదని వారు వ్యాఖ్యానించారు. ఎందుకంటే పెట్టుబడులు, సాంకేతికత, లేదా మార్కెట్ సౌలభ్యత వంటి విషయాల్లో కొత్తగా దీనివల్ల వచ్చేదేమీ లేదు. అయితే, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ దీని వాస్తవిక లక్ష్యం గురించి (మే 23) ప్రకటించారు. ''చివరగా, ఇది చాలా కీలకమైన, ఇండో-పసిఫిక్ దిశగా మన లక్ష్య సాధనలో ప్రాథమిక అంశం అని భావిస్తున్నాను. మన ఇండో-పసిఫిక్ వ్యూహంలో ఆర్థిక మూలస్థంభానికి ఒక రూపును, సమగ్రతను ఐపిఇఎఫ్ తీసుకువస్తుందని మేం నమ్ముతున్నాం. ఈ ప్రాంత భవిష్యత్‌కు ఒక రూపమివ్వడంలో సహాయపడేందుకు ఇది మాకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఏ వ్యూహమైనా విజయం సాధించడంలో ఆర్థికాంశాలు కీలకమైన పాత్ర పోషిస్తాయని మనందరికీ తెలుసు. దీనితో పాటు ఇండో-పసిఫిక్‌లో మన కార్యకలాపాలను మరింత పెంచేందుకు గల అవకాశాలన్నింటితో పాటు రాబోయే దశాబ్దాల్లో కీలకమైన ఈ ప్రాంతంపై మనదైన ముద్రను వేయడానికి అవకాశాలను కల్పించేందుకు ఐపిఇఎఫ్‌ను కీలకమైన వేదికగా మేం చూస్తున్నాం.''
అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ మరింత వివరణ ఇచ్చారు : ''మన ప్రజల కోసం, రాబోయే శతాబ్దంలో ఎదురయ్యే పరీక్షలను ఎదుర్కోవడం కోసం కొత్త సంకీర్ణాలకు, కూటములకు మనం మద్దతు ఇవ్వాల్సి వుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కంటే ఇది ఎక్కడా వాస్తవం కాదు. ఇక్కడ మన సంబంధాలు, మన ఒప్పంద కూటములు అన్నీ కూడా ప్రపంచంలోకెల్లా అత్యంత బలమైనవి.'' మిత్రపక్షాలను, భాగస్వాములను ఒకచోటకు తీసుకురావడం ద్వారా, సాంప్రదాయ, అణు, రోదసి, సమాచార రంగాల వ్యాప్తంగా పనిచేయడం, ఆర్థిక, సాంకేతిక, దౌత్య రంగాల్లో మన బలాలను పరిపుష్టం చేసుకోవడం ద్వారా 'సమగ్ర నిరోధకత'గా పిలిచే కొత్త విధానం లేదా దృక్పథాన్ని అమెరికా అనుసరిస్తోందని ఆయన వివరించారు.
బ్లింకెన్ ప్రస్తావించిన 'వ్యక్తులు' సాధారణ ప్రజలు కాదు, వారు బడా కార్పొరేట్లు. వారి ప్రయోజనాలే అమెరికాను ముందుకు నడిపిస్తాయి. రాబోయే శతాబ్దపు పరీక్షలు అంటూ ఆయన మాట్లాడుతున్నది అమెరికా లోని పెట్టుబడిదారీ వ్యవస్థ, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి. పెట్టుబడిదారీ వాదానికి సోషలిజం ఎప్పుడూ ముప్పుగానే వుంటుంది. సోషలిస్టు ఆలోచనలు ఎక్కడ, ఏ కొద్దిగా పొడసూపినా వెంటనే పెట్టుబడిదారుల మనస్సుల్లో భయాందోళనలు నెలకొంటాయి. తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు వారు శాయశక్తులా ప్రయత్నిస్తారు. క్వాడ్ ద్వారా, అటువంటి కూటముల ద్వారా, ఆ సమావేశాల అనంతరం చేసిన ప్రకటనల ద్వారా వారు చేయాలనుకుంటోంది, చెప్పాలనుకుంటోంది ఇదే.
తమ జీవితాలు మరింత మెరుగ్గా వుండాలంటే అందరం ఐక్యంగా వుండి, మన శాంతికి, సంపదలకు, పురోగతికి విఘాతంగా నిలిచిన శక్తులన్నింటిపైనా పోరు సల్పాలని సామాన్య ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. క్వాడ్, అమెరికాతో పొత్తులు, కూటములు మనకెంత మాత్రం ప్రయోజనకరం కాదని అర్ధం చేసుకోవాల్సి వుంది.

ఆర్. అరుణ్ కుమార్ ( వ్యాసకర్త : సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు )