Jun 03,2023 07:55

  • పర్స సత్యనారాయణ శత జయంతి సందర్భంగా

         'పర్స'గా రాష్ట్రమంతా ఆప్యాయంగా, గౌరవంగా పిలుచుకొనే పర్స సత్యనారాయణ 1924 జూన్‌ 4న పుట్టారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా (ప్రస్తుతం పల్నాడు జిల్లా) కంభంపాడు స్వగ్రామం. 18 ఏళ్ళ వరకు ఆ ప్రాంతంలోనే ఉన్నారు. గుంటూరు పట్టణంలో ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి పూర్తి చేశారు. తదనంతరం ఉద్యోగం కోసం ఖమ్మం జిల్లా సింగరేణి గనుల ప్రాంతానికి బయలుదేరి వెళ్ళారు. సింగరేణి గనులలో గుమస్తా ఉద్యోగం వచ్చింది. సింగరేణి గనులలో కార్మికులను సంఘటిత పరిచి యూనియన్‌ నిర్మాణం చేయడం కోసం నెల్లూరు నుండి కొత్తగూడెం వెళ్లిన కమ్యూనిస్టు పార్టీ నాయకుడు శేషగిరిరావుతో పరిచయమయ్యింది. శేషగిరిరావు సింగరేణి గనులలో తొలిగా యూనియన్‌ నిర్మాణం చేసే పనుల్లో పర్స తోడయ్యారు. యూనియన్‌ నిర్మాణం అయ్యింది. పర్స ఆ యూనియన్‌లో ఒక ముఖ్య నేతగా ఎన్నికయ్యారు. యూనియన్‌ కార్యకలాపాలపై కన్నెర్ర చేసిన అప్పటి యాజమాన్యం (బ్రిటిష్‌, నిజాం ఉమ్మడి యాజమాన్యం) పర్సను ఉద్యోగంలో నుండి తీసివేసింది. అప్పటికే తెలంగాణలోని బొగ్గుగనులున్న అన్ని ప్రాంతాల్లో యూనియన్‌ ప్రారంభమయ్యింది. పర్సను ఉద్యోగంలో నుంచి తీసివేసినందుకు బొగ్గు గని కార్మికులు తీవ్రంగా నిరసించారు. కొత్తగూడెం బొగ్గు గని కార్మికులు గనులను బహిష్కరించి సమ్మెను ప్రారంభించారు. బొగ్గు ఉత్పత్తి స్తంభించిపోయింది. కార్మికుల నిరసనకు వంగి వచ్చిన యాజమాన్యం 24 గంటల్లోనే మరల పర్సను ఉద్యోగంలోకి తీసుకుంది. సమ్మె జయప్రదం కావడంతో కొత్తగూడెం, ఇతర ప్రాంతాల్లో బొగ్గు గని కార్మికుల్లో పెద్ద విజయోత్సాహం వెల్లివిరిసింది. కార్మికుల సమ్మెతో ఉద్యోగం మరల వచ్చినా ఉద్యోగంలో చేరలేదు. యూనియన్‌ ప్రధాన నేత శేషగిరిరావు సలహా, ప్రోత్సాహంతో ఉద్యోగంలో మరల చేరకుండా యూనియన్‌ పూర్తి కాలం కార్యకర్తగా పని చేయడానికి నిర్ణయించుకొని యూనియన్‌ ఆర్గనైజర్‌గా తొలి ఉద్యమ జీవితం ప్రారంభించారు.
           సింగరేణి గనులలో తొలి కార్మిక సంఘంగా నిలదొక్కుకుని అనతి కాలంలోనే తెలంగాణ అంతటా పెద్ద సంఘంగా సింగరేణి యూనియన్‌ అభివృద్ధి చెందింది. దాని ప్రధాన నేతగా పర్స ఎదిగారు. సమర్ధవంతంగా యూనియన్‌ నాయకుడిగా పని చేశారు.
         సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన పర్స సింగరేణి కార్మిక నేతగా కార్మికులతో మమేకమై అనతి కాలంలోనే కార్మిక వర్గ దత్తపుత్రుడిగా, ఉత్తమ శ్రేణి కార్మిక నాయకుడిగా రూపొందారు. కార్మిక యూనియన్‌లో కమ్యూనిస్ట్‌ పార్టీ నిర్మాణం జరిగింది. 1943లో కమ్యూనిస్ట్‌ పార్టీ సభ్యులయ్యారు. సింగరేణి యూనియన్‌ జనరల్‌ సెక్రటరీగా దీర్ఘకాలం పని చేశారు. 1946వ సంవత్సరం అనంతరం వీర తెలంగాణ విప్లవ పోరాటం ప్రారంభమయ్యింది. పార్టీ నిర్ణయం మేరకు పాల్వంచ అటవీ ప్రాంతంలో సాయుధ దళాల నాయకుడిగా విప్లవ స్థావరానికి చేరుకున్నారు. 1947 చివరిలో నిజాం ప్రభుత్వం అరెస్టు చేసి 6 సంవత్సరాల పాటు జైల్లో పెట్టింది. తీవ్ర నిర్బంధంలో విప్లవ వీరుడిగా పర్స రాటు తేలారు. 1953లో జైలు నుండి విడుదలైన అనంతరం బహిరంగంగా ట్రేడ్‌ యూనియన్‌ కార్యకలాపాలలో ముమ్మరంగా పని చేయడం ప్రారంభించారు.
 

                                                           తుపాకి ఎక్కుపెట్టినా చెక్కు చెదరని ధీరుడు

వీర తెలంగాణ విప్లవ పోరాటం జరుగుతున్న కాలంలోనే ఒక రోజు నిజాం పోలీసులకు దొరికిపోయారు. ఆయనను సంకెళ్ళు వేసి నిజాం మిలట్రీ క్యాంపుకు తీసుకువెళ్ళారు. అప్పటికే ఆయనను కనిపిస్తే కాల్చి వేయమనే ఆదేశం జారీ చేసి ఉంది. ఆయనను తుపాకితో కాల్చడానికి పోలీస్‌ అధికారిని కూడా నిర్ణయించారు. పోలీస్‌ క్యాంపులో చేతులు విరిచి తాళ్ళతో కట్టివేశారు. ఆయనను కాల్చి వేయడానికి తుపాకి, పోలీస్‌ అధికారి సిద్ధంగా ఉన్నారు. మరణ శాసనం చేసిన నిజాం ప్రభుత్వం పర్స మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయింది. మృత్యువు కళ్ళ ముందు నర్తిస్తున్నా పార్టీ పట్ల ప్రజల పట్ల అచంచల విశ్వాసాన్ని ఘంటాపధంగా ప్రకటించారు పర్స. ప్రశాంత వదనంతో ఆయన ముఖం కాంతివంతంగా ఉంది. ఆయనను తుపాకి పెట్టి కాల్చాల్సిన పోలీస్‌ అధికారి ఆయన వ్యక్తిత్వం, ప్రజాయోధుడిగా ఆయన చరిత్ర తెలిసినవాడు. అధికారి మానవత్వంతో తుపాకిని ఎక్కుపెట్టలేదు. 'పర్స మీరు వెళ్ళండి' అని చెప్పి వెళ్ళిపోయాడు. అనంతరం నిజాం పోలీసులు ఆయనను జైలుకు తీసుకువెళ్ళారు.
 

                                                             జైళ్ళ హింసను ఎదుర్కొన్న విప్లవ వీరుడు

జైళ్ళలో ఆయనకు కఠిన శిక్షలు అమలు చేయాలని నిజాం ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. చీకటి గదిలో ఒక్కరినే నెలలు తరబడి బంధించి ఉంచేవారు. కాళ్ళకు, చేతులకు బేడీలు వేసి వాటిని పొడవాటి గొలుసులతో కట్టి జైలు గది ఊచలకు రాత్రి పగలూ కట్టి ఉంచేవారు. అత్యంత నాసి రకం భోజనం, నెలలు తరబడి నిద్ర లేని రాత్రులతో పర్స జైలు జీవితం ఎంత నరకంగా ఉన్నా ఆయన మనోస్థైర్యాన్ని నిజాం ప్రభుత్వం దెబ్బతీయలేకపోయింది. పోలీస్‌ క్యాంపులలో ఆయనను తీవ్ర చిత్రహింసలకు గురి చేసినా పార్టీ కార్యకలాపాలు గురించి, సాయుధ పోరాట స్థావరాలు గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా గొప్ప మనోధైర్యాన్ని ప్రదర్శించేవారు. రెండుసార్లు అతి చాకచక్యంగా జైలు గోడలు దూకి అడవులలోని సాయుధ పోరాట స్థావరాలకు చేరుకొని పోరుకు నాయకత్వం వహించారు.
 

                                                                     ఉత్తమ పోరాట యోధుడు

ఉన్నత వ్యక్తిత్వం, అత్యున్నత త్యాగం, మచ్చలేని విప్లవ జీవితం, విలువలు, విధానాల పట్ల నిబద్ధత, ఉక్కు క్రమశిక్షణ ఉత్తమ పోరాట యోధుని లక్షణాలు. ఆ లక్షణాలన్నీ మూర్తీభవించిన వ్యక్తి పర్స. ఆందోళకారుడిగా, పోరాట యోధుడిగా, ప్రచారకుడిగా, నిర్మాణ దక్షుడిగా ఈ నాలుగు లక్షణాలు సమపాళ్ళలో సంతరింప చేసుకున్న సంపూర్ణ నాయకుడు పర్స. ఆయన మంచి ఆందోళనకారుడు. జీవిత చరమాంకంలో సైతం ఆయన కలం ఆగలేదు. కవితలు, వ్యాసాలు రాయడం మానలేదు. ఉద్యమ జీవితంలో ఎన్నో కరపత్రాలు, వ్యాసాలు రాసిన ఆయన చేయి తిరిగిన రచయిత.
           ఆదిలాబాద్‌ నుండి శ్రీకాకుళం వరకూ కార్మిక రంగ కార్యకర్తలను కర్తవ్యోన్ముఖులను చేస్తూ వేలాది లేఖలు రాసిన చేయి ఆయనది. కార్మికవర్గ పోరాటాలలో అసంఖ్యాకంగా ఆయన చేసిన ఉపన్యాసాలు ఆంధ్రప్రదేశ్‌ లోని లక్షోపలక్షల కార్మికులను ఎంతగా ప్రభావితం చేసిందీ ఆయన సహచరులందరికీ తెలిసిందే. ఆయన సాదాసీదా కమ్యూనిస్టు యోధుడు కాదు. వీర తెలంగాణ విప్లవ పోరాటంలో తుపాకి పట్టి గెరిల్లా దళాలను సమర్థంగా నడిపించిన విప్లవ నేత. కార్మికోద్యమ నేతగా తెలుగునాట అసంఖ్యాక ఉద్యమాలకు, పోరాటాలకు నాయకత్వం వహించారు. విజయాలు సాధించారు.
 

                                                                      ప్రజాప్రతినిధులకు ఆయన ఆదర్శం

పాల్వంచ శాసన సభ నియోజకవర్గానికి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా 1962లో ఘన విజయం సాధించారు. నియోజకవర్గం అంతా నిరంతరం పర్యటిస్తూ ప్రజల ఎమ్మెల్యేగా పేరు పొందారు. విశాఖ ఉక్కు ఉద్యమం సందర్భంగా పార్టీ నిర్ణయంతో రాజీనామా చేశారు. 1962 నుండి తుది శ్వాస విడిచే వరకూ ఎమ్మెల్యేకు వచ్చే జీతభత్యాలన్నీ ఎప్పటికప్పుడు రాష్ట్ర కమిటీకి అణా పైసలతో సహా జమ కట్టేవారు. మాజీ ఎమ్మెల్యేకి వుండే ఏ ప్రత్యేక సదుపాయాలను ఆయన ఎప్పుడూ వాడుకోలేదు. అత్యంత నిరాడంబరంగా ఆయన, ఆయన కుటుంబం జీవించింది. వీర తెలంగాణ విప్లవ పోరాటంలో పాల్గొన్న యోధులను కూడా కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించింది. నాయకత్వ స్థానాల్లో ఉన్న ఎవ్వరూ తామ్రపత్రం స్వీకరించవద్దని, పాసు, పెన్షను, ప్రయాణ సౌకర్యాలను వాడుకోవద్దని పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. ఈ నిర్ణయాన్ని పర్స తుచ తప్పకుండా జీవితకాలమంతా అమలు చేశారు.
 

                                                                    ఆయన... ఆయన కుటుంబం...

పందొమ్మిదవ ఏట కొత్తగూడెంలో కమ్యూనిస్టు అయిన పర్స అంచలంచెలుగా ఎదిగి పార్టీలో, కార్మిక రంగంలో రాష్ట్ర అగ్రనేతల్లో ఒకరుగా అభివృద్ధి చెందారు. సనాతన సాంప్రదాయ కుటుంబంలో పుట్టి 'యజ్ఞోపవీతం' విసర్జించి 'విప్లవపధం'లో నడిచారు. కొద్దిపాటి బట్టల సంచితో ఉద్యోగం కోసం కారేపల్లి (ఖమ్మం జిల్లా బొగ్గు గనుల ప్రాంతం) వచ్చిన ఆ యువకుడు....72 ఏళ్ల ఉద్యమ జీవితం లో ఏనాడూ స్థిర, చర ఆస్తుల సంపాదనకు వెంపర్లాడలేదు. ఆ ఆలోచననే దరి చేరనియ్యలేదు. పార్టీ ఇచ్చే పరిమితమైన భత్యంతో మాత్రమే కుటుంబాన్ని పోషించేవారు. కామ్రేడ్లు, మిత్రులు ఏ సహాయం చేయడానికి ముందుకు వచ్చినా నిరాకరించేవారు. నిత్యం కుటుంబంలో దరిద్రం తాండవిస్తున్నా చలించేవారు కాదు. 19వ ఏట ఏ ఆస్థి లేని పర్స ఎలాగైతే వున్నారో 91వ ఏట తుది శ్వాస వరకూ అదే విధంగా ఉన్నారు. నీతి, నియమాలు, విలువలు, విధానాలు ప్రాణంగా భావించి యావజ్జీవితం నిప్పు లాంటి మనిషిగా బతికారు. ఆయన జీవితంలో ఇన్ని విజయాలు సాధించడానికి ఆయన భార్య భారతీదేవి సహకారం ఆయనకు వరం. ఆమె ఎప్పుడూ పర్స విప్లవ పధానికి అడ్డు రాలేదు. ఆమె కూడా భర్తతోపాటే పార్టీ కార్యకర్తగా, కొత్తగూడెం కార్మికులకు అమ్మగా, ఐద్వా నాయకురాలిగా సముచిత పాత్ర వహించారు.
 

                                   ఓపిక ఉన్నంత వరకూ కాదు... ఊపిరి ఉన్నంత వరకూ...ఉత్తమ కమ్యూనిస్టు

పర్స జీవిత చరమాంకంలో పది సంవత్సరాల పాటు పర్స దంపతులు చిన్న కుమార్తె లీలా ఇంట్లో (ఏలూరు)లో ఉన్నారు. రెండు చిన్న గదులు ఉన్న ఆ ఇంట్లో ఓ చిన్న గదిలో అతి సామాన్య జీవనం గడిపారు. ఏ ప్రత్యేక సదుపాయాలు కోరుకోలేదు. ఏలూరులో నిత్యం పార్టీ ప్రజా రంగాల కార్యకర్తలతో ఇష్టాగోష్టి సమావేశాలు నిర్వహించి ఉత్తేజపరిచేవారు. ఉత్సాహపరిచే వారు. ఉద్యమ అనుభవాలు చెప్పి వారిలో చైతన్య స్ఫూర్తిని నింపేవారు. చివరి శ్వాస వరకు అధ్యయనం ఆపలేదు. రాత్రి, పగలు అదే పనిగా పార్టీ సాహిత్యం, ప్రజా సంఘాల పత్రికలు చదివేవారు. కార్మిక లోకం గురించి జిల్లాలకు లేఖలు రాసేవారు. పార్టీ ధ్యాసే శ్వాసగా బతికారు. 2015 మే 22న తుది శ్వాస విడిచారు.

(వ్యాస రచయిత సి.పి.ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)
మంతెన సీతారాం