Dec 18,2022 12:23

ఆమెతో..
ప్రయాణమే ప్రత్యేకం.. ప్రశాంతం..
ఆమె చెప్పే ప్రతిమాటకూ
నా శిరస్సు కొండపల్లి బొమ్మవదు
నా అభిప్రాయాల ప్రవాహంలో
తాను గడ్డిపోచై కొట్టుకుపోదు
ఎన్నో అంశాల అక్షాంశం మీద
ఆ అతివ తూరుపు..
భవదీయుడు పశ్చిమం
ఆమె ప్రతి అధరువులో మధురవాంఛ
నాకేమో కారాలూ, మిరియాలూ ..
ఐనా.. ఆమెతో జీవనమెప్పుడూ అనురాగపు పక్షమే
పరిమళపు పూల సోయగాలే..
అనుభూతుల జలపాతం కింద
తడిసి ముద్దౌతూ ధన్యమౌతుంది
తన చూపులెప్పుడూ
పుస్తకాల్లోని అక్షరాలను
ప్రేమగా తడుముతుంటాయి
మాటలు మమతల మువ్వలై
వీనుల సవ్వడౌతాయి
మౌనంగా వున్నా..
ఆర్ద్రమైన అనుకంపనాలు
మా హృదయాల నడుమనున్న
అదృశ్య వారధితో
సందేశాలను పంపుతుంటాయి
ఆమె..
నా భవబంధాల లోగిలిలోనూ
బాధ్యతల భుజకీర్తులను
మోస్తున్న అవిశ్రాంత
నా ప్రణయ సాగరంలో
తలమునకలేసే జలకాంత
ఆమె కంటే ముందే ఆవలి గట్టుకు
చేరాలన్నది నా ప్రగాఢ ఆకాంక్ష
ఆ తరుణిలో నేను సగం,
తనవల్ల నాజీవితం సంపూర్ణం
నా అస్తిత్వాన్ని సుసంపన్నం చేస్తున్న
ఆమె.. నాకు అర్ధాంగి!
అహ.. కాదు కాదు
తనే నా పూర్ణాంగి!!!
 

శివ ప్రసాద్‌ బి.వి, 9848527109