
ప్రజలెన్నుకున్న ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొని పార్టీ ఫిరాయింపజేయాలన్న ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. తెలంగాణలో మెయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఫామ్ హౌస్‌లో ఎంఎల్‌ఏలను ప్రలోభపెట్టి పార్టీ మార్చేందుకు చేసిన కుట్రను పోలీసులు చాకచక్యంగా ఛేదించడం అభినందనీయం. ఈ బేరసారాలకు సంబంధించిన సమాచారాన్ని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పోలీసులకు అందించడం, దాని ఆధారంగా ఆపరేషన్ నిర్వహించడం చకచకా జరిగిపోయింది. ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల నగదు, కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ ప్రలోభపెట్టారు. ఢిల్లీ ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామచంద్ర భారతి ఎలియాస్ సతీష్ శర్మ, తిరుపతికి చెందిన సింహయాజి స్వామి, హైదరాబాద్‌కు చెందిన హోటల్ యజమాని నందకుమార్‌లను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే పట్టుబడ్డ ముగ్గురు నిందితులతో తమ పార్టీకి సంబంధం లేదని, ఇదంతా కట్టుకథ అంటూ బిజెపి నేతలు చేస్తున్న వాదన కేవలం బుకాయింపుగానే ప్రజలు భావిస్తున్నారు. సదరు సాధు పుంగవులిద్దరూ బిజెపి అగ్రనేతలతో కలిసి దిగిన ఫోటోలు గురువారం నాడు మీడియాలో హల్‌చల్ చేశాయి. హైదరాబాదుకు చెందిన వ్యాపారి సాక్షాత్తు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి అనుచరుడని ఫోటోలు రుజువు చేస్తున్నాయి. అయినా బుకాయింపుల ప్రహసనం ఇంకొంత కాలం పాటు కొనసాగవచ్చు. అయితే ఇదంతా బిజెపి నేతలు కొన్ని నెలలుగా వేసుకున్న పథకం ప్రకారం జరిగిందే! తెలంగాణలో చాలామంది షిండేలున్నారని వారు త్వరలోనే బయటకు వస్తారని ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజరు కొన్నాళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకుంటే ఈ ఆపరేషన్‌కు లింక్ బోధపడుతుంది. అది కర్ణాటక లేదా మహారాష్ట్ర లేకపోతే గోవా ఇంకో రాష్ట్రమా ఎక్కడైనా ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించి శాసనసభలో ఆ పార్టీకి తక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపించినప్పటికీ నోట్ల ఎరతోను, ఇడి, సిబిఐ కేసుల బెదిరింపులతోనూ వారిని ఫిరాయింపజేయడం చాలా కాలంగా బిజెపి సాగిస్తున్న ప్రక్రియ. అందుకు మహారాష్ట్ర ఇటీవలి ఉదాహరణ కాగా తెలంగాణది తాజా దష్టాంతం. అంతకుమించి వేరే విధంగా ఎవరూ ఆలోచించలేరు.
ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలోనూ ఉండకూడదన్నది బిజెపి విధానంగా ఉంది. ఒకవేళ వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వారు తమకు మిత్రులుగా లేదా లొంగి ఉండాలనేదే వారి కోరిక. అందుకోసం రకరకాల పద్ధతుల్లో ఆయా ప్రాంతీయ పార్టీలను వాటి నేతలను లొంగతీసుకోవడం సంఘ పరివారానికి వెన్నతో పెట్టిన విద్య. దేశంలో ప్రాంతీయ పార్టీలను బతకనివ్వకుండా చేయడమే మోడీ అమిత్ షా ద్వయం నిర్వహిస్తున్న కార్యక్రమం. ఆ కుట్ర అర్థమైన బిజెపి చిరకాల మిత్రులు శివసేన, అకాలీదళ్, జెడి(యు) వంటి పార్టీలు ఎన్‌డిఎ నుండి బయటకు వచ్చాయి.
ఎమ్మెల్యేలను నోట్ల కట్టలిచ్చి ప్రలోభపర్చిన ఘటనలు తెలుగు గడ్డపై కూడా గతంలో జరిగాయి. పేరెన్నిక గన్న 'ఓటుకు నోటు' కేసు హైదరాబాద్ మహానగరంలోనే చోటు చేసుకుంది. దాని ప్రకంపనల ప్రభావం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకూ తెలిసిందే! ఇప్పుడు అటువంటిదే పునరావృతమయింది. కాకపోతే పార్టీ మార్పు... అంతే! ఈ కేసు ప్రాథమిక విచారణలో ఉన్నప్పటికీ జరిగిన నోట్ల పంపిణీ, దాని వెనుక గల రాజకీయ కుట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. గుట్టు రట్టు కావడంతో బిజెపి నేతలు ఉన్నత న్యాయస్థానం గడప తొక్కారు. న్యాయ ప్రక్రియ కొనసాగుతున్నా పోలీసులు నిందితులను నిశితంగా పరిశోధించి అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేయాలి. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలకు ఈ వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధమున్నట్టు అందుకు సంబంధించిన సంభాషణలను పోలీసులు రికార్డు చేసినట్టూ వార్తలొచ్చాయి. న్యాయస్థానానికి సంపూర్ణ సమాచారాన్ని, పూర్తి ఆధారాలనిచ్చి నోట్లు తెచ్చినవారినీ, వారిని అందుకు నియోగించిన వారినీ యావత్ దోషులను నిర్ధారించేలా, వారు శిక్షింపబడేలా పోలీసు వ్యవస్థ వ్యవహరించాలి.