
అటవీ భూములను కూడా ఇందుకు మార్గదర్శక సూత్రాల ప్రకారం మళ్ళింపుకు, సంబంధిత శాఖలకు పి.ఎస్.పి ల కోసం ప్రైవేటు భూముల సేకరణకు లీజు ప్రాతిపదికన డెవలపర్ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. భూ సేకరణకు ప్రైవేటు భూ యజమాని, డెవలపర్ పర్పసర బేరసారాలతో నిర్ణయాలు తీసుకోవాలి. ప్రైవేటు భూములను లీజుకు తీసుకుంటే, ప్రభుత్వ భూములకు ఇచ్చే విధంగానే లీజు మొత్తాలను నిర్ణయించాలని, లీజు మొత్తంలో ఎకరానికి వెయ్యి రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలని, మిగిలిన మొత్తం భూయజమానికి చెల్లించాలని పేర్కొంది. పెట్టుబడిదారుల పబ్బం గడపటానికి, తమ పబ్బం గడుపుకోవటానికి ప్రజా ప్రయోజనాలను, ఇక్కడ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయటానికి పాలకులు నిరంకుశంగా వ్యవహరిస్తున్న మూసలోనే ఈ విధానాలున్నాయి.
దేశంలో, రాష్ట్రంలో పంపు స్టోరేజ్ జల విద్యుత్ ప్రాజెక్టుల (పి.ఎస్.పి) స్థాపన అవసరాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తూ, వాటిని నెలకొల్పేందుకు ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అనుమతులు, ప్రోత్సాహకాలు భారీగా ఇస్తున్నాయి. కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించటం, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ పేరుతో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని క్రమేణా తగ్గించి వేస్తూ, పునరుత్పత్తి ఇంధన విద్యుత్ (ఆర్.ఇ) స్థాపక సామర్ధ్యాన్ని భారీగా చేర్చే లక్ష్యాలను ప్రకటించి, అందుకు ప్రైవేటు ప్రాజెక్టులతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకొంటున్నాయి. సౌర విద్యుత్ ప్రాజెక్టులు పగటిపూట సూర్యరశ్మి ఉన్నపుడు, పవన విద్యుత్ ప్రాజెక్టులు ప్రధానంగా వర్షాకాలంలో గాలి వేగం బాగా ఉన్నపుడు విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. ఆ విధంగా ఆ ప్రాజెక్టుల నుండి పీక్ సమయాలలో, సీజన్లలో డిమాండు తీర్చేందుకు విద్యుత్ లభించదు. ఆ లోటును తీర్చేందుకు పి.ఎస్.పి లను, మిగులు విద్యుత్తును బ్యాటరీలలో నిల్వ ఉంచి, అవసరమైనపుడు వాడుకొనే పద్ధతిని, ఎప్పుడు అవసరమైతే అప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, ఉత్పత్తి నిలుపు చేయడానికి సాంకేతికంగా వీలున్న గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులను వినియోగించు కోవాలని ప్రభుత్వాలు ప్రతిపాదించాయి. విద్యుత్తును వినియోగించి గ్రీన్ హైడ్రోజన్‌ను తయారు చేసి, అవసరమైనపుడు దానిని విద్యుత్‌గా మార్చి సరఫరా చేసే విధానంపై కూడా మోడీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. చివరి మూడు ప్రత్యామ్నాయాలు ప్రస్తుతం చాలా ఖరీదైనవి కావటంతో, పి.ఎ.స్.పి లకు ముందు ప్రాధాన్యత ఇస్తున్నాయి.
పి.ఎస్.పి లు రెండు రకాలు. నదీజలాల వినియోగానికి ఇప్పటికే రిజర్వాయర్లు ఉన్న చోట పి.ఎస్.పి లను ఏర్పాటు చేయటం ఒకటి. దేశంలో, రాష్ట్రంలో కూడా పాటిస్తున్న అంతర్జాతీయ జల వినియోగ సూత్రాల ప్రకారం, నదీ జలాలను ముందు మంచి నీటి అవసరాలకు, తరువాత సాగునీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు వినియో గించుకోవాలి. ఈ అవసరాలకు నీటిని విడుదల చేసే సమయాలలో జల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలి. రిజర్వాయర్లు నిండి, సముద్రంలోకి నీరు వృధాగా పోయే పరిస్థితులలో, పూర్తిగా జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అవసరమైతే ధర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గించే విధానం అమలు జరుగుతున్నది. దీనికి తోడు రివర్సిబుల్ పంపింగ్ విధానం కొన్ని చోట్ల అమలులో ఉంది. రిజర్వాయరు నుండి నీటిని విడుదల చేసినపుడు జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ, దిగువన నిర్ణీత పరిమాణంలో నీటిని నిల్వ ఉంచే ఏర్పాటు చేసి, రాత్రిపూట, పీక్ ఏతర సమయాలలో లభించే మిగులు విద్యుత్తును వాడి ఆ నీటిని తిరిగి రిజర్వాయరులోకి తోడిపోసి, పీక్ సమయాలలో రిజర్వాయరు నుండి పరిమితంగా నీటిని విడుదల చేసి జల విద్యుత్ ఉత్పత్తి చేసే విధానం అమలులో ఉంది. ఆ పద్ధతిలో ఒక యూనిట్ జల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీటిని తిరిగి రిజర్వాయరు లోకి తోడి పోయ టానికి 1.2 యూనిట్ల విద్యుత్ అవసరమవుతున్నది. ఇలాంటి పద్ధతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలం ఎడమ కాలవ జల విద్యుత్ స్టేషన్, పులిచింతల ప్రాజెక్టు వంటి రెండు మూడు చోట్ల ఉంది. వాటి సామర్ధ్యం చాలా పరిమితంగా ఉంది.
రిజర్వాయర్లు లేని చోట ప్రత్యేకంగా పి.ఎస్.పి ల కోసం వాటిని నిర్మించి, అందుబాటులో ఉన్న జల వనరుల నుండి వాటికి నీటిని మళ్ళించి అవసరమనుకున్నపుడు జల విద్యుత్ ఉత్పత్తి చేయటం మరొక విధానం. ఇందుకు అవసరమైన నిర్మాణాలను చేయటం, నిర్వహించటం గణనీయమైన పెట్టుబడితో కూడుకొన్నది. దానికితోడు, అనేక సమస్యలూ ఉన్నాయి.
ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకే
రాష్ట్రంలో 33,240 మెగా వాట్ల ్గసామర్థ్యంతో 29 పి.ఎస్.పి లను ఏర్పాటు చేయవచ్చునని, వాటితో పాటు సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు డిజైన్ చేయవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లాలలో లక్ష 45 వేల ఎకరాల భూమిని గుర్తించింది. గతేడాది మే లో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యు.ఇ.ఎఫ్) సమావేశంలో, గత నెల విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ పెట్టుబడిదారుల శిఖరాగ్ర సమావేశంలో ఇలాంటి ప్రాజెక్టుల స్థాపనకు ప్రైవేటు పెట్టుబడిదారులతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నది. ఈ ప్రాజెక్టుల స్థాపనకు డెవలపర్లను ఎంపిక చేయడానికి ఎటువంటి పోటీ బిడ్డింగు విధానాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించ లేదు. ఇవి పై సమావేశాలలో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోగలిగే వ్యవహారాలు కావు. అంతకన్నా ముందు అవసరమైన అంశాల పరిశీలన జరపటంతో పాటు, సాధ్యాసాధ్యాలు, ఈ ప్రాజెక్టుల స్థాపనకు భూమి, నీరు, ఇతర అవసరాలను సమకూర్చటంతో పాటు, వాటి స్థాపన వల్ల స్థానిక ప్రజలకు, పర్యావరణానికి తలెత్తే దీర్ఘకాలిక సమస్యలను పరిగణనలో తీసుకొని ఉండాలి. పై సమావేశాలలో ఈ ప్రాజెక్టుల స్థాపనకు ఒప్పందాలు చేసుకొన్నట్లు చూపటం పోటీ బిడ్డింగు లేకుండా, ఆశ్రిత పెట్టుబడిదారులకు ఏకపక్షంగా అనుమతులను ఇవ్వటాన్ని సమర్ధించుకొనేందుకు ఆ సమావేశాలను ఒక ముసుగుగా వాడుకొనే ఎత్తుగడే. అనకాపల్లి జిల్లా పెదకోటలో 1500 మె.వా., విజయనగరం జిల్లా రైవాడలో 1000 మె.వా., నంద్యాల జి ల్లా పిన్నాపురంలో 1680 మె.వా., అన్నమయ్య జిల్లా ఒంగిమలలో 1800 మె.వా. పి.ఎస్.పి ల స్థాపనకు అదాని సంస్థకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నంద్యాల జిల్లా ఔక్‌లో 800 మె.వా., అనంతపురం జిల్లా సింగనమల లో 800 మె.వా. పి.ఎస్.పి ల స్థాపనకు అరొబిందోకు, అల్లూరి సీతారామరాజు జిల్లా యర్రవరంలో 1200 మె.వా. ప్రాజెక్టును షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌కు, వైఎస్‌ఆర్ కడప జిల్లా పైడిపాలెం నార్త్‌లో 1000 మె.వా., పైడిపాలెం ఈస్ట్‌లో 1200 మె.వా. పిఎస్‌పి లను ఇండోసోల్ సోలార్‌కు ప్రభుత్వం కేటాయించింది.
దావోస్ డబ్ల్యు.ఇ.సి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అదానీ గ్రూపుతో 10 వేల మె.వా. సౌర విద్యుత్, 3700 మె.వా. పిఎస్ పిల స్థాపనకు ఒ ప్పందాలు చేసుకుంది. జల, సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు గ్రీన్‌కో తో, అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లతో ఒప్పందాలు చేసుకుంది. గత జూన్ లో జరిగిన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపిబి) సమావేశంలో అదాని గ్రూపు రూ.15,740 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆమోదం తెలిపింది. పార్వతీపురం, కడప, సత్య సాయి జిల్లాలలో పి.ఎస్.పి ల ఏర్పాటును అదానీ గ్రూపు ప్రతిపాదించింది. పార్వతీపురం జిల్లా కురుకుట్టిలో 1200 మె.వా. పి.ఎస్.పి, కర్రివలసలో 1000 మె.వా. పి.ఎస్.పి, చిత్రావతిలో 500 మె.వా., గండికోటలో 1000 మె.వా. పి.ఎస్.పి లను అదానీ గ్రూపు చేపడుతున్నది. అన్నమయ్య జిల్లాలో రాయవరం, న్యూ ఓగిమల లో వెయ్యి మె.వా. చొప్పున రెండు, గండికోటలో 800 మె.వా. పి.ఎస్.పి ల ఏర్పాటుకు ఫిబ్రవరిలో డెవలపర్ల నుండి ఆసక్తి వ్యక్తీకరణను ఎన్‌రెడ్ కాప్ ఆహ్వానించింది.
పి.ఎస్.పి ని ప్రోత్సహించే విధానాన్ని గత డిసెంబరు 12న రాష్ట్ర ప్రభుత్వం 25వ నంబరు జీవోలో ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర నిబంధనలు లేదా ప్రామాణిక బిడ్డింగు మార్గదర్శక సూత్రాలను ఎప్పటికప్పుడు సవరించిన విధంగా స్వంత వినియోగానికి, రాష్ట్రంలో, బయట విద్యుత్తును అమ్ముకొనేందుకు పి.ఎస్.పి లను నెలకొల్పే డెవలపర్లు అర్హులని జీవోలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుత్పత్తి ఇంధన అభివృద్ధి సంస్థ (ఎన్‌రెడ్ కాప్) ఈ విధానం అమలుకు నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. రాష్ట్రంలో పి.ఎస్.పి ప్రాజెక్టులను గుర్తించేందుకు, వాటికి వివరమైన ప్రాజెక్టు నివేదికలను (డిపిఆర్) తయారుచేయటం, డెవలపర్‌కు భూమిని సమకూర్చటం, ప్రాజెక్టుల అమలుకు అవసరమైన అనుమతులన్నిటిని పొందటంలో డెవలపర్లకు సహాయం చేయటం, ప్రభుత్వ విధానాలు, మార్గదర్శక సూత్రాల ప్రకారం ప్రాధాన్యతనిచ్చి నీటి కేటాయింపులకు వీలు కల్పించటం నోడల్ ఏజెన్సీ విధులలో ఉన్నాయి. డెవలపర్ కోరితే, ఎ.పి జెన్‌కో, ఎ.పి ట్రాన్‌స్కో వాటి నైపుణ్యాన్ని, సేవలను పి.ఎస్.పి ల ప్లానింగు, నిర్మాణం, నిర్వహణ కోసం అందించవచ్చు. వాటి కన్సల్టెన్సీ సేవలకు నోడల్ ఏజెన్సీ వీలు కల్పించాలి. ప్రభుత్వ విధానాలు, మార్గదర్శక సూత్రాల ప్రకారం పి.ఎస్.పి లకు ప్రాధాన్యతపై నీటి కేటాయింపుకు నోడల్ ఏజెన్సీ వీలు కల్పించాలి.
ఎ.పి జెన్కోను పట్టించుకోలేదు
జల విద్యుత్ ప్రాజెక్టులను అనాదిగా గతంలో ఎ.పి ఎస్‌ఇబి, తరువాత ఎ.పి జెన్కో నిర్మించి, నిర్వహిస్తున్న విధానం కొనసాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తన పి.ఎస్.పి విధానంలో ఎ.పి జెన్కో ఇలాంటి ప్రాజెక్టులను నెలకొల్పే ప్రతిపాదన కూడా చేయలేదు. ప్రస్తుతమున్న డ్యాంల వద్ద సాధ్యాసాధ్యాలను బట్టి జెన్కోతో పి.ఎస్.పి లను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. అయినప్పటికి, ముఖ్య మంత్రి, విద్యుత్ మంత్రి, సంబంధిత అధికారుల ఉపన్యాసాలలో, ప్రకటనలలో కూడా అలాంటి ప్రస్తావన కూడా చేయటం లేదు. పి.ఎస్.పి పై ముసాయిదా మార్గదర్శక సూత్రాలను ప్రకటించి, వాటిపై సూచనలను ఆహ్వానించి ఈ నెల 10వ తేదీన కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శక సూత్రాలను ప్రకటించింది. ప్రైవేటు డెవలపర్లు పి.ఎస్.పి లను నెలకొల్పటానికి ప్రోత్సహించేందుకు అనేక రాయితీలు కల్పించాలని పలు ప్రతిపాదనలను చేస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు (ఎన్.టి.పి.సి, జెన్కో వంటివి) నామినేషన్ ప్రాతిపదికపై పి.ఎస్.పి లను ఇవ్వవచ్చునని కేంద్ర మార్గదర్శక సూత్రాలలో పేర్కొన్నారు. ప్రైవేటు డెవలపర్లకు రెండు దశల పోటీ బిడ్డింగు ద్వారా కూడా పి.ఎస్.పి లను కేటాయించవచ్చు అని పేర్కొన్నారు. పి.ఎస్.పి లను నెలకొల్పేందుకు ప్రైవేటు డెవలపర్లకు సేవలందించేందుకు ఎ.పి జెన్కో సామర్ధ్యాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో పి.ఎస్.పి లను నెలకొల్పాల్సిన అవసరాన్ని పూర్తిగా విస్మరించి, ప్రైవేటు పెట్టుబడిదారుల పబ్బం గడపటమే తన పరమావధిగా వ్యవహరిస్తున్నది. తన విధానాన్ని రూపొందించే ముందు మొక్కుబడిగానైనా ఆసక్తిగల వారి సూచనలను తెలుసుకొనే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు.
గిరిజనుల ప్రయోజనాలు బలి
అమలులో ఉన్న కేంద్ర జల విద్యుత్ విధానం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు జల విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు డెవలపర్లను ఎంపిక చేయడానికి రెండు దశల పారదర్శక బిడ్డింగు విధానాన్ని అనుసరించాలి. అందుకు 12 శాతానికి పైగా ఉచితంగా విద్యుత్ ఇవ్వటం, వాటా పెట్టుబడి, ముందుగా చెల్లింపులు, తదితర అంశాల ప్రాతిపదికన డెవలపర్లను ఎంపిక చేయాలి. డిపిఆర్ ను సంబంధిత కేంద్ర సంస్థలు పరిశీలించాక, కేంద్ర విద్యుత్ అధారిటీ (సిఇఎ) అనుమతి లభించాక ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలి. అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఎ), ఫెడ్యూల్డు ప్రాంతాలకు పంచాయతి విస్తరణ చట్టం (పిఇఎస్‌ఎ) వంటి చట్టాల నిబంధనలను పాటించాలి. సంబంధిత మంత్రిత్వ శాఖ నుండి పరిసరాల, పర్యావరణ, అటవీ అనుమతులను పొందాలి.
పెసా చట్టం గిరిజనుల, షెడ్యూలు ప్రాంతాలలో నివసించే వారి హక్కులు కాపాడేలా గ్రామ సభల ద్వారా స్వయం పాలనను చట్టబద్ధంగా గుర్తిస్తుంది. సహజ వనరులపై వారి సాంప్రదాయక హక్కులను గుర్తిస్తుంది. అభివృద్ధి ప్రణాళికలను అనుమతించటంలో, అన్ని రంగాలను నియంత్రించటంలో గ్రామసభల కీలక పాత్రకు పెసా అధికారం కల్పించింది. ఒక గ్రామ ప్రజల సాంస్కృతిక, సాంప్రదాయాలను కొనసాగించటం, గిరిజనుల ప్రయోజనాలను దెబ్బ తీసే పథకాలను, సహజ వనరులను నియంత్రించటానికి గ్రామ సభలకు అధికారాలను కల్పించింది. గ్రామ సభలు నియంత్రించే అంశాలలో జల్, జంగిల్, జమీన్ (నీరు, అటవి, భూమి) వనరులు ఉన్నాయి. షెడ్యూలు ప్రాంతాల ''ప్రాజెక్టులను అమలు చేసేటపుడు వాటివల్ల చేకూరే ప్రయోజనాలను స్థానిక ప్రజలతో అర్ధవంతంగా పంచుకొనేందుకు స్థానిక ప్రాంత అభివృద్ధి నిధిని (ఎల్.ఎ.డి.ఎఫ్) తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
పి.ఎస్.పి లకు సంబంధించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఈ చట్టాలను ఉల్లంఘిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం పిఎస్‌పిలను ప్రోత్సహించే విధానం పేరుతో జారీ చేసిన జీవో, మోడీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శక సూత్రాలు సంబంధిత చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయి. అవి చట్టాలను ఉల్లంఘించటమే. గిరిజన ప్రాంతాల ప్రజల హక్కులను, సంస్కృతీ సాంప్రదాయాలను, సహజ వనరులపై వారికి ఉన్న హక్కులను కాలరాస్తున్నాయి. మోడీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తూ ఏకంగా చట్టాలనే సవరిస్తున్నది. స్థానిక ప్రాంత అభివృద్ధికి సంబంధించి జల విద్యుత్ ప్రాజెక్టులపై కేంద్ర మార్గదర్శక సూత్రాలను, ఆర్ అండ్ ఆర్ నిబంధనలను డెవలపర్లు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో లో పేర్కొంది. కేంద్రం తాజాగా జారీ చేసిన మార్గదర్శక సూత్రాలలో పి.ఎస్.పి లకు స్థానిక ప్రాంత అభివృద్ధి నిధి అవసరం లేదని, నిర్వాసితుల పునరావాసం, తిరిగి స్థిరపడటం (ఆర్ అండ్ ఆర్) సమస్యలు ఉండవని, అవి ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న బాధ్యతకు మినహాయింపు ఇవ్వాలని, వాటికి రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు ఇవ్వాలని ఏకరువు పెట్టింది.
పి.ఎస్.పి లకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నుండి ఎస్‌ఓసి లేదా ఆమోదం పొందటం నుండి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ విధానంలో పేర్కొంది. పి.ఎస్.పి లకు ప్రభుత్వ భూమి బదలాయింపు, దీర్ఘకాలిక లీజుకు (ఎకరానికి ఏడాదికి రూ.31 వేలు చొప్పున, రెండేళ్ళకు ఒకసారి 5 శాతం పెంపుదల) ప్రభుత్వ భూమిని సమకూర్చాలని పేర్కొంది. అటవీ భూములను కూడా ఇందుకు మార్గదర్శక సూత్రాల ప్రకారం మళ్ళింపుకు, సంబంధిత శాఖలకు పి.ఎస్.పి ల కోసం ప్రైవేటు భూముల సేకరణకు లీజు ప్రాతిపదికన డెవలపర్ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. భూ సేకరణకు ప్రైవేటు భూ యజమాని, డెవలపర్ పర్పసర బేరసారాలతో నిర్ణయాలు తీసుకోవాలి. ప్రైవేటు భూములను లీజుకు తీసుకుంటే, ప్రభుత్వ భూములకు ఇచ్చే విధంగానే లీజు మొత్తాలను నిర్ణయించాలని, లీజు మొత్తంలో ఎకరానికి వెయ్యి రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలని, మిగిలిన మొత్తం భూయజమానికి చెల్లించాలని పేర్కొంది. పెట్టుబడిదారుల పబ్బం గడపటానికి, తమ పబ్బం గడుపుకోవటానికి ప్రజా ప్రయోజనాలను, ఇక్కడ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయటానికి పాలకులు నిరంకుశంగా వ్యవహరిస్తున్న మూసలోనే ఈ విధానాలున్నాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా, తమ హక్కుల, జీవనోపాధి, సహజ వనరుల రక్షణ కోసం ఇప్పటికే చింతపల్లి, తదితర గిరిజన ప్రాంతాలలో గిరిజనులు ఆందోళనలు చేస్తున్నారు.
/వ్యాసకర్త విద్యుత్ రంగ నిపుణులు, సెల్ : 9441193749/
ఎం. వేణుగోపాలరావు