Apr 19,2023 07:42

         జమ్ము-కాశ్మీర్‌ లోని పుల్వామాలో 40 మంది వీరజవాన్లను బలిగొన్న పాకిస్థాన్‌ ఉగ్రవాద చర్య విషయమై ఆనాటి రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ తెలిపిన వివరాలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. వారు బలికావడానికి పాక్‌ కుట్రల కంటే మన కేంద్ర ప్రభుత్వం, హోం మంత్రిత్వశాఖ, రక్షణ మంత్రిత్వశాఖ వైఫల్యమే ప్రధాన కారణమని ఆయన వెల్లడించడంతో అప్పట్లో ప్రతిపక్షాల విమర్శలన్నీ వాస్తవాలని తేటతెల్లమయింది. మాలిక్‌ వెల్లడించిన అంశాలపై మోడీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.
      2019 ఫిబ్రవరి 14.... వీరజవాన్ల శరీరాలు ఛిద్రమై, రహదారులు రక్తమోడిన సమయంలో... మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌లో ఓ విదేశీ టి.వి ఛానల్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. పుల్వామా ఘటన మధ్యాహ్నం 3.15 నుంచి 3.30 మధ్య జరిగితే ఆయన సాయంత్రం 6.45 గంటలకు అందుబాట్లోకి వచ్చారు. దేశంతోపాటు ప్రపంచమంతా కలవరపాటుకు గురైన సమయంలో...దాదాపు మూడు గంటలపాటు ప్రధాని అందుబాట్లో లేరు. సత్యపాల్‌ మాలిక్‌ తాజా ఇంటర్వ్యూ ప్రకారం....మన లోపాలు, తప్పిదాల వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పగా, 'నోర్మూసుకో...ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దు' అని ప్రధాని ఆదేశించారు. హోం మంత్రి అమిత్‌షా, భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా ఈ విషయాలేవీ బయట మాట్లాడొద్దని చెప్పారు. అప్పటికి లోక్‌సభ ఎన్నికలకు ఎనిమిది వారాల సమయం మాత్రమే ఉంది. ఈ ఘటనకు ముందు లోక్‌నీతి, ది హిందూ, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ జరిపిన సర్వేలో విపరీతంగా పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ కునారిల్లుతుండటం తదితర అంశాలపై ప్రజల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందని తేలింది. పుల్వామా ఘటన జరిగిన జరిగిన 12వ రోజున భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్‌లో చొరబడి బాలాకోట్‌ ఉగ్రవాద స్థావరంపై బాంబు దాడి చేశాయి. పుల్వామాలో చిందించిన రక్తానికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుందని, 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని మీడియా పేర్కొంది. అనంతరం దేశభక్తి, జాతీయత చుట్టూ ఎన్నికల ప్రచారం సాగింది. భారీ మెజారిటీతో బిజెపి ప్రభుత్వం కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చింది.
          రాష్ట్ర పాలనా యంత్రాంగానికి అధిపతిగా ఉన్న గవర్నర్‌ను వాస్తవాలు వెల్లడించొద్దని ప్రధాని, హోంమంత్రి, జాతీయ భద్రతా సలహాదారు బెదిరించి అడ్డుకున్నారని వెల్లడికావడమే తాజా సంచలనం. ఆయన లేవనెత్తిన అంశాల్లో ప్రధానమైనది...ఉగ్రవాద ముప్పు తీవ్రంగా ఉన్న తరుణంలో రోడ్డు మార్గంలో వేల మంది సైనికులను పంపించడం సరికాదని, కనీసం ఐదు విమానాలను ఏర్పాటు చేయాలని సిఆర్‌పిఎఫ్‌ శ్రీనగర్‌ ఐ.జి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చేసిన విజ్ఞప్తిని బుట్టదాఖలు చేయడం. ప్రాణాలకు ముప్పున్న వీర సైనికులకు విమానాలు కేటాయించకపోవడానికి కారణాలేమిటో ఇప్పటికైనా కేంద్రం సమాధానమివ్వాలి. భద్రతా దళాలు నిత్యం రహదారులను జల్లెడ పడతాయి. ప్రతి వాహనాన్నీ తనిఖీ చేస్తాయి. 2,547 మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లతో కూడిన 78 వాహనాల కాన్వారు తీవ్రవాద దాడి ముప్పు ఉన్న హై సెక్యూరిటీ జోన్‌ లోకి ప్రవేశిస్తుండగా, ఓ పేలుడు పదార్థాల వాహనం కూడలి నుంచి దూసుకొచ్చి ఓ ఆర్మీ ట్రక్కును ఢకొీట్టింది. దాంతో, 40 మంది సైనికులు బలయ్యారు. 12 రోజులపాటు వందల కిలోమీటర్లు దాటి, మన భద్రతా చర్యలన్నింటినీ దాటి 300 కిలోలకుపైగా పేలుడు పదార్థాలున్న వాహనం అక్కడికి ఎలా చేరుకోగలిగింది? ఇంత భారీ ఆర్మీ కాన్వారు కదులుతున్నప్పుడు ఉగ్రవాదులు వెనుక రోడ్లపై పేలుడు పదార్థాలతో ఎలా ప్రయాణించారు? సంఘటనకు ముందు రోజు వచ్చిన నివేదికతో సహా 11 ఇంటెలిజెన్స్‌ నివేదికలు ప్రత్యక్ష ఉగ్రవాద దాడికి అవకాశం ఉందని చెప్పినా బాధ్యులెవరూ ఎందుకు పట్టించుకోలేదు? సిఆర్‌పిఎఫ్‌ డిమాండ్‌ చేసినా విమానాలు ఎందుకు ఇవ్వలేదు. ఇంటలిజెన్స్‌ సెక్యూరిటీ లోపాన్ని ఆరా తీసిన గవర్నర్‌ నోరు ఎందుకు మూయించారు? మన దేశ భద్రతా ప్రయోజనాలు, రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. పుల్వామాలో ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఈ ఘటనను నిరోధించవచ్చా? అనే అంశాలపై వాస్తవాలు తెలుసుకునే హక్కు ప్రతి భారతీయుడికీ ఉంది.