- ఆ తర్వాత అభ్యంతరాల స్వీకరణ
- రాజకీయ పార్టీల సమావేశంలో కమిషనర్ నాగ నరసింహారావు
ప్రజాశక్తి-కాకినాడ : ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా అక్టోబర్ 27న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తామని కాకినాడ సిటీ నియోజకవర్గ ఈఆర్‌ఓ, నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్.నాగనరసింహారావు చెప్పారు. కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం సమగ్ర ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం షెడ్యూల్ ప్రకారం అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. ఏప్రిల్ 15, 2023వ తేదీ తరువాత ఇప్పటివరకు ఫారం 6,7,8 ద్వారా 75,581 దరఖాస్తులు రాగా 6643 తిరస్కరించామని, సుమారు 50 వేల దరఖాస్తులు పరిష్కరించామన్నారు. మరో 18,532 దరఖాస్తులు విచారణలో ఉన్నాయని కమిషనర్ చెప్పారు. దోష రహిత ఓటర్ల జాబితా రూపకల్పనలో భాగంగా ప్రతి ఒక్క దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తున్నామన్నారు. ఇందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా తమ వంతు సహకారం అందించాలని కమిషనర్ కోరారు. ఓటర్లకు దూరంగా ఉన్న, శిధిలావస్థకు చేరిన 47 పోలింగ్ కేంద్రాలను అదే ప్రాంగణం లేదా దగ్గరలోని భవనాలకు మార్పు చేశామన్నారు. పరిష్కరించిన దరఖాస్తులను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని కమిషనర్ ఆదేశించారు. సమావేశంలో ఎలక్షన్ డిప్యూటీ తహసిల్దార్ మురళీకృష్ణ, వైసిపి ప్రతినిధి ఎంజికే కిషోర్, టిడిపి ప్రతినిధులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్,తదితరులు పాల్గొన్నారు.
ఎఈఆర్‌ఓ లతో సమావేశం
ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియపై కాకినాడ సిటీ నియోజకవర్గ ఈఆర్వో, నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్షించారు. ఏఈఆర్వో లు, సూపర్వైజర్లు, విఆర్వోలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆచూకీ లేని ( నాన్ ట్రేస్డ్ ) ఓటర్లకు సంబంధించి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిన నోటీసులు, తిరిగి వెనక్కి వచ్చిన నోటీసులపై కమిషనర్ సమీక్షించారు. వెనక్కి వచ్చిన దరఖాస్తులను ఆయా బి ఎల్ వో లు, వీఆర్వోల ద్వారా మరోసారి నిర్ధారించుకుని తక్షణమే వాటి వివరాలు అందజేయాలని ఆదేశించారు. ఒకటి రెండు రోజుల్లో ఆ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఆర్‌వోలు కోన శ్రీనివాస్, ఎంవి మురళీకృష్ణ, హరిదాసు, నాగశాస్త్రులు, జాన్‌బాబు, వరహాలయ్య, సూపర్వైజర్లు, విఆర్వోలు పాల్గొన్నారు.










