న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌లో ఉత్పత్తులు చౌక, తక్కువ ధరతో విక్రయించుకోవచ్చు అనుకునే వారికి అమెజాన్ షాక్ ఇచ్చింది. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ వేదికపై ఉత్పత్తులను అమ్మే విక్రేతల నుంచి వసూలు చేసే ఫీజును పెంచాలని నిర్ణయించింది. అమెజాన్‌లో వస్తువుల అమ్మకానికి గాను ఆ సంస్థ విక్రేతల నుంచి ఛార్జీ వసూలు చేస్తుంది. దాదాపు అన్ని కేటగిరీల ఉత్పత్తులపై ఈ పెంపును చేపట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వస్త్రాలు, సౌందర్య ఉత్పత్తులు, కిరాణా, ఔషధాలు తదితర రకాల వస్తువులపై విధించే సెల్లర్ ఫీజును మే 31 నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో అమ్మకందారులు ఆ భారాన్ని వినియోగదారులపై మోపనున్నారు. ఆయా కేటగిరీలను బట్టి ఈ ఛార్జీలు ఉంటాయని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం రూ.300లోపు ఉన్న హెయిర్‌కేర్, బాత్, సౌందర్య ఉత్పత్తులకు 7 శాతంగా ఉన్న ఫీజును 8.5 శాతానికి పెంచనుంది. రూ.1000 పైగా ఉన్న ఉన్న దుస్తులపై 19 శాతంగా ఉన్న ఫీజును 22.5 శాతానికి చేర్చింది. లాభదాయకతను పెంచుకునే పనిలో భాగంగా సెల్లర్స్ ఫీజును పెంచిందని స్పష్టమవుతోంది. ఫీజు పెంపునతో తమ అమ్మకాలపై ప్రభావం పడొచ్చని విక్రేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.










