Jun 02,2023 07:51

ఏ కార్పొరేట్ల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులలో భారీగా పారు బకాయిలు పెరుగుతున్నాయో, వారి ప్రయోజనాల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని చూడటం, వారికి బ్యాంకులను అప్పగించాలని చర్యలు తీసుకోవడం దురదృష్టకరం. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సరిపడినంత మూలధనాన్ని పెంచాలని, ఉద్దేశ్యపూర్వకంగా బ్యాంకు అప్పులు ఎగ్గొడుతున్న వారి ముక్కు పిండి బాకీలు వసూలు చేసేలా కఠిన చట్టాలు రూపొందించాలని, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ విడనాడాలని కార్మిక వర్గం, దేశభక్తి కలిగిన ప్రజలు ఉవ్వెత్తున పోరాటాలు నిర్వహించాల్సి వుంది.

నరేంద్ర మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో మాట్లాడుతూ బ్యాంకుల ప్రైవేటీకరణ షెడ్యూల్‌ ప్రకారం ముందుకు సాగుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దేశ విశాల ప్రయోజనాలను పట్టించుకోకుండా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించే చర్యలు తీసుకుంటుండడం సమర్ధనీయం కాదు!! ఆర్థికమంత్రి ప్రకటన బట్టి ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేయడం ప్రభుత్వ ప్రాధమ్యంగా మారిందని అర్ధం అవుతోంది.
 

                                                                      దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి

1969కి ముందు అనేక సందర్భాలలో పార్లమెంటులో వామపక్ష పార్లమెంట్‌ సభ్యులు బ్యాంకులను జాతీయం చేయాలన్న డిమాండును లేవనెత్తుతూ వచ్చారు. దేశంలో ఆదాయాల పంపిణీ ఏ తీరుగా ఉందో అధ్యయనం చేసిన పి.సి.మహల్‌నోబిస్‌ కమిటీ 1960 నాటికి దేశంలోని పది శాతం మంది సంపదలో 40 శాతం వాటా పొందుతున్నారని తేల్చింది. దేశంలో గుత్తసంస్థల తీరును అధ్యయనం చేసిన మోనోపలీస్‌ ఎంక్వైరీ కమిషన్‌ 1964 నాటికి దేశంలోని పరిశ్రమలలో 85 శాతం కొద్దిపాటి గుత్తసంస్థల చేతుల్లో ఉన్నాయని తెలిపింది.1947-1951 మధ్య 205 ప్రయివేటు బ్యాంకులు బోర్డులు తిప్పేశాయి. 1951లో 567 ప్రయివేటు బ్యాంకులు ఉంటే 1969 నాటికి అవి కాస్తా 91 అయ్యాయి. ప్రైవేటు బ్యాంకులెంత దివాలా తీశాయో దీనినిబట్టి స్పష్టం అవుతున్నది.
1969లో బ్యాంకుల జాతీయకరణపై పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ఆనాడు యువ పార్లమెంట్‌ సభ్యునిగా ఉన్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి పాల్గొని, బ్యాంకుల జాతీయకరణను వ్యతిరేకిస్తూ 4 అంశాలు పేర్కొన్నారు. బ్యాంకుల జాతీయకరణ ఒక వికృతమైన చర్య అని, అవసరం లేనిదనీ అకారణమైనదనీ, అనుచితమని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ రంగ సంస్థల పట్ల బిజెపి వైఖరికి నిలువెత్తు తార్కాణం. అయితే, ఆనాడు కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు బ్యాంకు జాతీయకరణకు పట్టు పట్టడం వల్లనే అది సాకారం అయ్యింది.
            బ్యాంకుల జాతీయకరణ (1969, 1980) జరిగిన నాటి నుండి బ్యాంకింగ్‌ రంగం గణనీయంగా పురోగతి సాధించింది. 1969లో మన దేశంలో మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్ల మొత్తం రూ. 5000 కోట్లు కాగా, 2021 నాటికి అవి రూ.157 లక్షల కోట్లకు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో సైతం పెద్ద ఎత్తున బ్యాంక్‌ శాఖలు ప్రారంభించిన ఘనత ప్రభుత్వ రంగ బ్యాంకులదే. 1969లో మొత్తం బ్యాంక్‌ శాఖల సంఖ్య 8000 కాగా, 2021 నాటికి ఆ సంఖ్య 1,18,000కు పెరిగింది. ఆర్థిక వ్యవస్థలో కీలక రంగాలైన వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాలు విశేష ప్రయోజనం పొందడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కీలకపాత్ర పోషించాయి.
           దేశంలో బ్యాంకింగ్‌ రంగ చిత్రం 1991 నుండి పెనుమార్పులకు లోనయింది. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకుల ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వాలు నయా ఉదారవాద విధానాలను అమలు చేయడం ప్రారంభించాయి. ఎవరికైనా రూ. ఒక కోటికి మించి రుణం ఇవ్వాలంటే రిజర్వుబ్యాంకు నుండి ముందస్తు అనుమతి ఉండాలన్న నిబంధనను తొలగించారు. వ్యవసాయం, సంబంధిత రంగాలకు, బలహీన వర్గాలకు రుణాలు ఇవ్వడం ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలన్న విధానాన్ని ఆచరణలో అమలు చేయకుండా నీరుగార్చారు. గుత్తపెట్టుబడుల నిరోధ చట్టం (ఎంఆర్‌టి.పి యాక్టు)ను రద్దుచేశారు. క్రమేపీ బ్యాంకింగ్‌ రంగంలో విదేశీ పెట్టుబడుల శాతాన్ని 74 శాతానికి పెంచారు. అనేక ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలను దాదాపు 40 శాతం పైగా అమ్మివేశారు. దీంతో బ్యాంకుల ప్రైవేటీకరణకు మార్గం సుగమం అయ్యింది.
           2008లో వచ్చిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ వందల సంఖ్యలో ప్రైవేట్‌ బ్యాంకులు దివాలా తీశాయి. 180 ఏళ్ల చరిత్ర కలిగిన లెహమాన్‌ బ్రదర్స్‌, జేపీ మోర్గాన్‌ ఛేజ్‌, గోల్డ్‌ మ్యాన్‌ శాక్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, మోర్గాన్‌ స్టాన్లీ, మెరిన్‌ లించ్‌, లాయిడ్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ స్కాట్లాండ్‌ వంటి అంతర్జాతీయ బ్యాంకింగ్‌ దిగ్గజాలు సైతం కేవలం మొండి బకాయిల కారణంగా కుప్పకూలాయి. ఇవన్నీ ప్రభుత్వ ఉద్దీపన ప్యాకేజీ ద్వారా, ప్రజల సొమ్మును వాటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మాత్రమే నిలదొక్కుకున్నాయి.
           2008 ఆర్థిక సంక్షోభం నుంచి మన దేశం నిలదొక్కుకొని గట్టెక్కడానికి ప్రభుత్వరంగ బ్యాంకులే ముఖ్య కారణమని ప్రపంచ దేశాలు కొనియాడాయి. మరి మన దేశంలో ప్రైవేటీకరణ తర్వాత మన బ్యాంకులు దివాలా తీస్తే వాటికి జవాబుదారు ఎవరు? ప్రజల సొమ్ముకు ఎవరు బాధ్యత వహిస్తారు?
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణ దేశాభివృద్ధిని వెనుక బాట పట్టించడమే గాక, ప్రజల కష్టార్జితాన్ని, విలువైన పొదుపును ప్రయివేటు వారికి, కార్పొరేట్లకు అప్పగించడం అవుతుంది. ప్రైవేటీకరణ సమర్ధకులు ప్రభుత్వాల ప్రైవేటీకరణ విధానాలను సమర్ధించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులపై లేనిపోని అభాండాలను మోపుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయన్న వాదనలు ఈ కోవలోనివే. గత మూడేళ్ళుగా ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.2 లక్షల కోట్ల నిర్వహణ లాభాలు ఆర్జిస్తున్నాయి.గత పదిహేనేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్జించిన మొత్తం నిర్వహణ లాభాలు రూ. 20,43,278 కోట్లు.
          ప్రభుత్వ పెద్దల అనుయూయులు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు భారీగా ఎగ్గొట్టడం వల్ల మాత్రమే, ప్రభుత్వ రంగ బ్యాంకులకు నష్టాలు వస్తున్నాయి. గత ఆరేళ్లలో ప్రభుత్వ బ్యాంకుల 11 లక్షల కోట్ల రూపాయల పారు బకాయిలను మాఫీ చేశారు. ప్రభుత్వ బ్యాంకుల పారు బకాయిల్లో 73 శాతం హెయిర్‌ కట్‌ చేస్తున్నారు. 'హెయిర్‌ కట్‌' పేరుతో భారీ బకాయిలు పడిన సంస్థలను అతితక్కువ మొత్తం చెల్లించి బడా గుత్తసంస్థలు చేజిక్కించుకోగలుగుతున్నాయి. ఇది ఉద్దేశ్య పూర్వకంగా బ్యాంక్‌ రుణాలు ఎగ్గొడుతున్న బడా బాబులపై ప్రభుత్వాలకున్న జాలి, దయ!!
          రైల్వేల తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగం. దేశంలో పెద్దఎత్తున వ్యవసాయ రంగానికి రుణాలిచ్చి వెన్నుదన్నుగా నిలుస్తున్నది ప్రభుత్వ బ్యాంకులే. చదువుకున్న, వెనుకబడిన, షెడ్యూల్డ్‌ కులాల వ్యక్తులకు రిజర్వేషన్ల ద్వారా ఉపాధి, ఆర్థిక సాయం కల్పిస్తున్నది ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగమే. ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ పేరుతో 50 కోట్లపై చిలుకు 'జన్‌ధన్‌' ఖాతాలను తెరిచింది ప్రభుత్వ బ్యాంకులే. కేంద్ర ప్రభుత్వం నిర్వహించమన్న సామాజిక పథకాలను కేవలం ప్రభుత్వ రంగమే నిర్వహిస్తోంది.
            ప్రధాన మంత్రి పేరు మీద ఉన్న జీవన జ్యోతి బీమా యోజన, జనశ్రీ బీమా యోజన పథకాలలో ఎల్‌ఐసి, ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థల భాగస్వామ్యం 96 శాతం ఉంటే, ప్రైవేటు బీమా సంస్థల భాగస్వామ్యం కేవలం 4 శాతం మాత్రమే. జన్‌ ధన్‌ యోజన పథకం లో ప్రభుత్వరంగ బ్యాంకుల వాటా 97 శాతం ఉంటే, ప్రయివేటు బ్యాంకుల వాటా కేవలం 3 శాతం. ఇవి ప్రభుత్వ గణాంకాలు!! నష్టాలు వచ్చే సామాజిక పథకాల్లో ప్రయివేటు బ్యాంకులు, బీమా సంస్థల పాత్ర నామమాత్రంగా ఉంది !! అయినా, ప్రభుత్వ రంగ బ్యాంకు, బీమా కంపెనీల ప్రైవేటీకరణకు ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగడం తీవ్ర అభ్యంతరకరం.
 

                                                                  ఉపాధి కల్పనపై ప్రైవేటీకరణ ప్రభావం

బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగాల నియామకాలు దాదాపు దశాబ్ద కాలంపాటు నిలిపివేయడమేగాక, లక్షలాది మందిని స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో సాగనంపారు. బ్యాంకింగ్‌ లో ప్రభుత్వ వాటాలు అమ్మడం మొదలైన తరువాత నుండి ఇప్పటి దాకా దాదాపు 40 శాతం పైగా వాటాలను ప్రభుత్వ బ్యాంకుల నుండి ఉపసంహరించడం జరిగింది. ఇప్పటికే 2 సార్లు పైగా స్వచ్ఛంద పదవీ విరమణను బ్యాంకింగ్‌ రంగంలో ఇవ్వడం జరిగింది. బ్యాంకింగ్‌ రంగంలో లక్షల్లో ఉద్యోగులు సమీప భవిష్యత్తులో రిటైర్‌ అవుతుంటే, కేవలం వేల సంఖ్యలో ఖాళీలు నింపుతామని ప్రకటిస్తున్నారు. ఇది యువత అవకాశాలకు గండి కొట్టడమే.
          రిజర్వ్‌ బ్యాంకు గణాంకాల ప్రకారం గతంలో 58 శాతం గ్రామీణ రూరల్‌ శాఖలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే, 2021 నాటికి వాటి సంఖ్య 29 శాతానికి పడిపోయింది. 2020 ఏప్రిల్‌ నుంచి ఇప్పటిదాకా అమలు జరిగిన బ్యాంక్‌ విలీనాల కారణంగా 28 ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య నేడు 12కు చేరుకుంది. భవిష్యత్‌లో ఇది 4 లేక 5 కు పరిమితం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఇప్పటికే బ్యాంక్‌ విలీనాల మూలంగా వందలాది శాఖలు తగ్గించబడ్డాయి. దీని ప్రభావం భవిష్యత్‌ నియామకాలపై పడింది.
         ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఉద్యోగులు పెద్ద ఎత్తున కస్టమర్లకు సేవలు అందిస్తున్నారు. స్టేట్‌ బ్యాంక్‌లో ఉద్యోగి సగటున 1680 మందికి సేవలు అందిస్తుంటే, అదే ప్రయివేటు రంగంలో అగ్రగామి బ్యాంక్‌ అయిన హెచ్‌.డి.ఎఫ్‌.సి లో ఉద్యోగి కేవలం 467 కస్టమర్లకు సేవలు అందిస్తున్నాడు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇంకా విశేష సేవలు అందించాలంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాఖలు తెరవాలి. ఉద్యోగుల సంఖ్య పెరగాలి. ప్రస్తుతం అమలు జరుగుతున్న ప్రైవేటీకరణ విధానాల వలన ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదు.
ఏ కార్పొరేట్ల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులలో భారీగా పారు బకాయిలు పెరుగుతున్నాయో, వారి ప్రయోజనాల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని చూడటం, వారికి బ్యాంకులను అప్పగించాలని చర్యలు తీసుకోవడం దురదృష్టకరం. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సరిపడినంత మూలధనాన్ని పెంచాలని, ఉద్దేశ్యపూర్వకంగా బ్యాంకు అప్పులు ఎగ్గొడుతున్న వారి ముక్కు పిండి బాకీలు వసూలు చేసేలా కఠిన చట్టాలు రూపొందించాలని, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ విడనాడాలని కార్మిక వర్గం, దేశభక్తి కలిగిన ప్రజలు ఉవ్వెత్తున పోరాటాలు నిర్వహించాల్సి వుంది.

/వ్యాసకర్త ఎ.ఐ.ఐ.ఇ.ఏ ఉపాధ్యక్షులు,
సెల్‌ : 9441797900/
పి. సతీష్‌

పి. సతీష్‌