Nov 08,2022 07:20

తెలంగాణాలో ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపిని ఓడించి టిఆర్‌ఎస్‌కు ఘన విజయం కట్టబెడుతూ ప్రజలిచ్చిన తీర్పు భవిష్యత్‌కు పునాది. బిజెపి జమానాలో దేశం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో చారిత్రక ఆవశ్యకతను 'మునుగోడు' చాటి చెప్పింది. అన్ని విధాలా విఫలమవడమే కాకుండా ప్రజల్లో మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న బిజెపిని అధికారం నుంచి తొలగించే లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అవసరమైన రాజకీయ పొందికలకు మునుగోడు దిక్సూచిగా నిలిచింది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడానికి ముందు నుంచే అత్యంత ఉత్కంఠ రేపిన మునుగోడు పోలింగ్‌ మొన్న 3న జరగ్గా, ఆదివారం ఉద్విగ క్షణాల మధ్య ఓట్ల లెక్కింపు నిర్వహించారు. బిజెపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై అధికార టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్ధికి 10 వేలకుపైన మెజార్టీ లభించింది. సిట్టింగ్‌ సీటు కోల్పోయిన కాంగ్రెస్‌, మూడవ స్థానానికి దిగజారడమే కాకుండా డిపాజిట్‌ సైతం దక్కించుకోలేక చతికిలపడింది. టిఆర్‌ఎస్‌కు 43 శాతం ఓట్లు రాగా బిజెపికి 38.4 శాతం ఓట్లు వచ్చాయి.
           మునుగోడు ఉప ఎన్నికను బలవంతంగా రుద్దింది బిజెపినే. గత ఎన్నికల్లో మునుగోడులో కాంగ్రెస్‌ తరపున గెలుపొందిన రాజగోపాల్‌రెడ్డిని బిజెపి ఆకర్షించింది. ఆ మచ్చను తుడిచేయడానికి రాజగోపాల్‌రెడ్డితో రాజీనామా చేయించి ఉప ఎన్నికల బరిలోకి దింపింది. బిజెపి జిత్తులను స్వతహాగా కమ్యూనిస్టు ప్రభావం కలిగిన మునుగోడు ప్రజలు బిజెపిని ఓడించి తమ చైతన్యాన్ని చాటారు. తెలంగాణలో ఎప్పటి నుంచో ఉనికి చాటుకోవాలని ఉబలాటపడుతున్న బిజెపి, హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కొన్ని కార్పొరేటర్‌ స్థానాలను కైవసం చేసుకొని, తదుపరి దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో అభ్యర్ధుల ప్రాబల్యంతో గెలిచింది. నాగార్జునసాగర్‌, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో ఓడినప్పటికీ, 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మునుగోడులో హంగు, ఆర్భాటాలతో బిజెపి తలపడింది. బిజెపి ఆశలను ప్రజలు ఓటు అనే ఆయుధంతో చిదిమేశారు. ధాన్యం కొనుగోలు మొదలుకొని నిధుల బదిలీ వరకు బిజెపి తెలంగాణకు చేసిన అన్యాయం ముందు ఎన్నికల ప్రచారంలో బిజెపి నాయకులు చేసిన ఉద్రేక, విద్వేష ప్రసంగాలు ఎంత మాత్రం నిలబడలేకపోయాయి. ఇదే సమయంలో టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎల కొనుగోలుకు బిజెపి చేసిన కుట్ర బయటపడటంతో మోడీ, అమిత్‌షా పరువు పోయింది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు బిజెపి ఎంతకైనా బరితెగిస్తుందనడానికి కర్ణాటక, మహారాష్ట్ర ఉదాహరణ. తెలంగాణలోనూ ఆ పార్టీ అటువంటి కుయుక్తులే పన్నుతోందని లోకానికి వెల్లడయింది.
        మునుగోడులో టిఆర్‌ఎస్‌ విజయం రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు దిశా నిర్దేశం చేసింది. కేంద్రంలో బిజెపిని నిలువరించేందుకు బిఆర్‌ఎస్‌ పేరిట జాతీయ పార్టీ పెట్టిన కెసిఆర్‌కు ఇదొక అనుభవం. బిజెపిని దేశానికి శత్రువుగా పేర్కొని, ఆ పార్టీని ఓడించాలన్న లక్ష్యాన్ని సాకారం చేసేందుకు మునుగోడులో వామపక్షాలు తమ వంతు పాత్ర పోషించాయి. బిజెపిని ఓడించగలిగే టిఆర్‌ఎస్‌కు మద్దతిచ్చాయి. వామపక్షాల మద్దతు టిఆర్‌ఎస్‌ గెలుపునకు తోడ్పడింది. గత ఎన్నికల్లో కంటే టిఆర్‌ఎస్‌కు చాలా చోట్ల ఓట్లు పెరగడానికి వామపక్షాల మద్దతే కారణమని పలు విశ్లేషణలు తెలుపుతున్నాయి. మునుగోడు ఎన్నికల సమయంలోనే రాహుల్‌గాంధీ జోడో యాత్ర తెలంగాణలో సాగినప్పటికీ ఆ పార్టీకి ఎంతమాత్రం ఉపయోగపడలేదు. గత ఎన్నికల్లో మునుగోడులో 49 శాతం ఓట్లతో గెలిచిన కాంగ్రెస్‌, ఇప్పుడు పది శాతం ఓట్లే తెచ్చుకోవడం ప్రజల్లో ఆ పార్టీ ప్రతిష్ట క్షీణతను తెలుపుతుంది. గత ఎన్నికల్లో 6.5 శాతం ఓట్లు తెచ్చుకున్న బిజెపికి ఇప్పుడు 38 శాతం వచ్చాయంటే కాంగ్రెస్‌ ఓటు అటు బదిలీ అయిందని స్పష్టమవుతోంది. ఇది ఓ హెచ్చరిక. ప్రజలకు అత్యంత ప్రమాదకారిగా తయారైన బిజెపిని ఓడించేందుకు లౌకిక, ప్రజాస్వామ్య, ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలి. అప్పుడే బిజెపిని అధికారానికి దూరం పెట్టడం సాధ్యమవుతుంది. మునుగోడు ఎన్నిక నేర్పుతున్న పాఠమిదే. బిజెపికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిచ్చే వైసిపి, టిడిపి, జనసేన వంటి ప్రాంతీయ పార్టీలు ఈ వాస్తవాన్ని గ్రహించాలి.