
మోడీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత వైఖరి ప్రభుత్వ నిల్వలు తరిగిపోవడానికి దారి తీసింది. బహిరంగ మార్కెట్ లోకి నిల్వలను విడుదల చేస్తే ఆహారధాన్యాల సరఫరా పెరిగి వాటి ధరలు తగ్గుతాయని ప్రభుత్వం భావించింది. కాని ఆ నిల్వలను స్పెక్యులేటర్లు చేజిక్కించుకుని తమ వద్ద దాచుకున్నారు. దాని వలన ద్రవ్యోల్బణం యథావిధిగా కొనసాగింది. పైగా ప్రభుత్వ నిల్వలు తగ్గిపోవడంతో ధరలు మరింత పెరుగుతాయన్న ముందస్తు అంచనాలు బలపడ్డాయి. ఒకసారి ఆహారధాన్యాల ధరలు పెరగడం మొదలైతే తక్కిన ఆహార పదార్థాల ధరలు కూడా పైకి ఎగబాకడం ప్రారంభిస్తాయి.
ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరించి ఎక్కువ ఆహారధాన్యాలను ప్రజలకు అందించాలంటే అప్పుడు ప్రభుత్వం ఎఫ్‌సిఐ ద్వారా మరింత ఎక్కువగా ఆహారధాన్యాల సేకరణకు పూనుకోవలసి వస్తుంది. ఈ ఏడాది ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌లో 5 కోట్ల 21 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించాలని నిర్ణయించింది. ఈ పని చేస్తే తప్ప ప్రస్తుత ఆహారధాన్యాల ధరల పెరుగుదలను నియంత్రించడం సాధ్యం కాదు.
దేశంలో ఆహార పదార్థాల ధరలు తక్కిన వస్తువుల ధరలకన్నా ఎక్కువగా పెరుగుతున్నాయి. జులై 2023లో అన్ని వస్తువుల ద్రవ్యోల్బణం మొత్తంగా 7.44 శాతం ఉంది (గతేడాది జులై నెలతో పోల్చితే). ఆహారధాన్యాలు, కాయగూరలు, పాల ఉత్పత్తులు, తదితర ఆహార పదార్థాల ధరల ద్రవ్యోల్బణం విడిగా చూస్తే 11.5 శాతం ఉంది. టమాటా వంటి కొన్నింటి ధరలు అసాధారణంగా పెరిగినందువలన వాటిని అధికంగా సరఫరా చేసేవిధంగా కొన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంది. దాని వలన ఆగస్టులో ఈ ద్రవ్యోల్బణం 10 శాతానికి చేరువలోకి వచ్చింది. మొత్తం ద్రవ్యోల్బణం కూడా 6.83 శాతానికి తగ్గింది. అయినప్పటికీ వినిమయ వస్తువుల ధరల పెరుగుదల, అందునా ఆహార ధరల పెరుగుదల ఇంకా ఒక తీవ్ర సమస్యగానే ఉంది.
ఆహార ధరలు ఈ విధంగా వేగంగా పెరిగిపోతూ వుండడం అనేది కేవలం భారత దేశానికే ప్రత్యేకించిన సమస్యగా లేదు. మూడవ ప్రపంచ దేశాలన్నింటితోబాటు సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో సైతం ఇది సమస్యగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ధోరణి ఇది. మామూలుగా అందరూ దీనికి ఉక్రెయిన్ యుద్ధం కారణం అంటున్నారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కొరత ఏర్పడిన మాట వాస్తవమే. కాని, ఇప్పుడు మనం చూస్తున్న ద్రవ్యోల్బణం యుద్ధం వలన వచ్చిన కొరత కన్నా, కొరత ఏర్పడబోతోందన్న ముందస్తు అంచనా ఫలితంగా వచ్చింది. యుద్ధం వచ్చిన తర్వాత వాస్తవంగా ఆహార ధాన్యాల సరఫరాలో కొరత ఇంకా ఏర్పడక ముందే ప్రపంచంలో ఆహార ధాన్యాల వ్యాపారంలో లాభాల రేటు చాలా దేశాల్లో పెరిగింది. ఇందుకు అనేక దాఖలాలు ఉన్నాయి. దీనిని బట్టి రాబోతున్న ఆహారధా న్యాల కొరతను దృష్టిలో ఉంచుకుని గుత్త వ్యాపార సంస్థలు ముందుగానే వాటి ధరలను పెంచేశారని స్పష్టం ఔతుంది. మన దేశంలో కూడా ఇదే జరిగింది. అందుకే చాలామంది ''ద్రవ్యోల్బణం మీద ముందస్తు అంచనాలు'' ధరల పెరుగుదలకు దోహదం చేశాయని అంటున్నారు.
ఐతే ద్రవ్యోల్బణం బాగా పెరగవచ్చునన్న అంచనాలు ఎప్పుడు వేయగలుగుతారు? వాస్తవంగా సరుకుల కొరత లేకున్నా, కొరత ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు అటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతం కొరత లేకున్నా, సరుకుల నిల్వలు పెద్దగా లేనప్పుడు సమీప భవిష్యత్తులో వాటికి కొరత ఏర్పడుతుంది అని అంచనా వేసే వీలుంటుంది. కాని, ఆహారధాన్యాల నిల్వలు భారీగా ఉన్నప్పుడు ఎవరైనా సరుకుల కొరత ఏర్పడుతుంది అన్న అంచనాకు వస్తారా? ప్రభుత్వం దగ్గరే భారీగా నిల్వలు ఉన్నప్పుడు మార్కెట్లో ఆహారధాన్యాల ధరలు పెరిగితే ప్రభుత్వం ఆ పెరుగుదలను అదుపు చేయడానికి తనవద్దనున్న నిల్వలను వినియోగదారులకు తక్కువ ధరలకు అందించి వాటి ధరలు బహిరంగ మార్కెట్లో పెరగకుండా నిరోధిస్తుంది. ఒకవేళ ప్రైవేటు వ్యాపారుల దగ్గరే నిల్వలు పేరుకుపోతే అప్పుడు వాళ్ళు ప్రధానంగా ఆ నిల్వలను తగ్గించుకోవడం మీద దృష్టి పెడతారే తప్ప వాటి ధరలను పెంచడం మీద కాదు. ఒకవేళ వాళ్ళలో ఎవరైనా ఆహారధాన్యాల ధరలను పెంచితే, తక్కినవాళ్ళు వినియోగదారులను తమవైపు తిప్పుకోడానికి పూనుకుంటారు. ఆ క్రమంలో తమ వద్ద పేరుకుపోయిన నిల్వలను తగ్గించుకుంటారు. అందుచేత ఆహారధాన్యాల సరఫరా తగినంత మోతాదులో లేని పరిస్థితుల్లో మాత్రమే వాటి ధరలు పెరుగుతాయని ముందస్తు అంచనాలకు రావడం వీలౌతుంది. ప్రపంచం మొత్తం మీద తలసరి తృణధాన్యాల ఉత్పత్తి 1980-82 మధ్య కాలంలో 355 కిలోలు ఉండేది. 2000-2002 నాటికి అది 343 కిలోలకు పడిపోయింది. 2016-18 మధ్య కూడా అది 344 కిలోలుగా మాత్రమే ఉంది. పైగా, 2002 నుండీ ఈ తృణధాన్యాలలో గణనీయమైన భాగం ఎథనాల్ ఉత్పత్తికి మళ్ళించడం ప్రారంభించారు. అంటే తలసరి ఆహారధాన్యాల లభ్యత తగ్గిపోయింది అని స్పష్టం అవుతోంది.
అలా ఆహారధాన్యాల లభ్యత తగ్గిపోతూ వస్తున్నా, వాటి ధరలు ఇటీవలి వరకూ పెద్దగా పెరిగింది లేదు. దానికి కారణం ఏమిటి? నయా ఉదారవాద విధానాలు శ్రామిక ప్రజల కొనుగోలు శక్తిని, ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాలలో, బాగా దెబ్బ తీశాయి. దాంతో ఒక పక్క ఆహారధాన్యాల లభ్యత తగ్గుతూ వున్నా, మరోవైపు వాటిని కొనుగోలు చేయగల శక్తి కూడా తగ్గిపోతూ వచ్చింది. అందుకే, పేదరికం పెరుగుతున్నా, పౌష్టికాహార లభ్యత తగ్గుతున్నా, ఆహారధాన్యాల ధరలు పెద్దగా పెరగలేదు. అప్పుడప్పుడూ ఆహారధాన్యాల ధరలు పెరిగినా, వాటిని అదుపు చేయడానికి శ్రామిక ప్రజల కొనుగోలు శక్తిని మరింత కుదించడమే పరిష్కారంగా పాలక వర్గాలు పరిగణిస్తూ వచ్చాయి. అంటే ధరలు పెరిగినప్పుడు సరుకుల సరఫరాను పెంచడం బదులు, వాటి డిమాండ్‌ను తగ్గించడం ద్వారా మార్కెట్లో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి సిద్ధపడ్డారన్నమాట.
భారతదేశంలో సరిగ్గా ఇదే జరిగింది. 1991లో ఆహార ధాన్యాల తలసరి, రోజువారీ లభ్యత 510.1 గ్రాములు. 2019-20 నాటికి ఇది కొద్దిగా తగ్గి 501.8 గ్రాములకు చేరింది. ఆ తర్వాత కరోనా కాలంలో ప్రభుత్వం తన వద్దనున్న నిల్వల నుండి ప్రజలకు పంపిణీ చేపట్టింది. ఫలితంగా ఆ తర్వాత రెండు సంవత్సరాలలో వరసగా 511.7 గ్రాములకి, 514.6 గ్రాములకి లభ్యత పెరిగింది. ఈ రెండేళ్ళూ మినహాయిస్తే తక్కిన నయా ఉదారవాద కాలం అంతా తలసరి ఆహారధాన్యాల లభ్యతలో పెరుగుదల ఏమీ లేదు. అటు లభ్యతా పెరగలేదు, ఇటు వాటి ధరలూ పెరగలేదు. శ్రామిక ప్రజల కొనుగోలు శక్తిని కుదించడం ద్వారా ఆహారధాన్యాల డిమాండ్ పెరగకుండా పాలకులు చూసుకున్నారు. తద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేశారు.
ఐతే ఈ విధమైన అదుపు ఎప్పుడైనా దెబ్బ తినవచ్చు. అప్పుడు ఆహారధాన్యాల ధరలు పెరగడం ప్రారంభిస్తాయి. దాని ఫలితంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. నయా ఉదారవాదం ద్రవ్యోల్బణానికి వ్యతిరేకం. అందుచేత దానిని అదుపు చేయడానికి అది శ్రామిక ప్రజల కొనుగోలు శక్తిని మరింత కుదించడానికి సిద్ధపడుతుంది. ఉక్రెయిన్ యుద్ధమూ, ప్రపంచ వ్యాప్తంగా ఆహారధాన్యాల ధరలు పెరగడమూ మన దేశంలో కూడా వాటి ధరలు పెరుగుతాయన్న ముందస్తు అంచనాలు ఏర్పడడానికి దోహదం చేశాయి. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం దగ్గరున్న ఆహారధాన్యాల నిల్వలు (ఇప్పటికీ అవసరాలకు మించి ఉన్నప్పటికీ) కొంత కాలం ముందున్నంత హెచ్చు స్థాయిలో ప్రస్తుతం లేవు. గత ఆరేళ్ళలో ఉన్న నిల్వలతో పోల్చితే 2023 ఆగస్టు నాటికి ఉన్న నిల్వలు తగ్గిపోయాయి. 5 కోట్ల 23 లక్షల 35 వేల టన్నుల నిల్వలు మాత్రం ఉన్నాయి. ఈ నిల్వలు మన ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాలకన్నా ఎక్కువే. ఐనప్పటికీ, గత ఆరేళ్ళ కాలంలో ఉండిన నిల్వల కన్నా తక్కువ. అందుచేత స్పెక్యులేటర్లకు వాటి ధరలు పెరగవచ్చునన్న అంచనాలు ఏర్పడి వాటి నిల్వలను పెంచుకునేవిధంగా నడిపించాయి.
మోడీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత వైఖరి ప్రభుత్వ నిల్వలు తరిగిపోవడానికి దారి తీసింది. బహిరంగ మార్కెట్ లోకి నిల్వలను విడుదల చేస్తే ఆహారధాన్యాల సరఫరా పెరిగి వాటి ధరలు తగ్గుతాయని ప్రభుత్వం భావించింది. కాని ఆ నిల్వలను స్పెక్యులేటర్లు చేజిక్కించుకుని తమ వద్ద దాచుకున్నారు. దాని వలన ద్రవ్యోల్బణం యథావిధిగా కొనసాగింది. పైగా ప్రభుత్వ నిల్వలు తగ్గిపోవడంతో ధరలు మరింత పెరుగుతాయన్న ముందస్తు అంచనాలు బలపడ్డాయి. ఒకసారి ఆహారధాన్యాల ధరలు పెరగడం మొదలైతే తక్కిన ఆహార పదార్థాల ధరలు కూడా పైకి ఎగబాకడం ప్రారంభిస్తాయి.
ఆహారధాన్యాల ధరలను నియంత్రించడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది: ప్రభుత్వం ద్రవ్య విధానాన్ని తగువిధంగా మార్పు చేయడం. ఇందులో వడ్డీ రేట్లను పెంచడం, రుణ లభ్యతను అదుపు చేయడం అనే రెండు చర్యలు ఉంటాయి. పాత రోజుల్లో ఇటువంటి సందర్భాలలో ఆహారధాన్య వ్యాపారులకు మాత్రమే రుణ లభ్యతను అదుపు చేసేవారు. దాని ఫలితంగా వారు ఎక్కువ నిల్వలను ఉంచుకోవడం సాధ్యపడేది కాదు. అప్పుడు ఆహారధాన్యాల ధరలు తగ్గేవి. కాని ప్రస్తుత నయా ఉదారవాద కాలంలో కొన్ని తరగతుల వ్యాపారులకు మాత్రమే నియంత్రణ అమలు చేయడం సాధ్యం కాదు. అందుచేత అందరికీ రుణ లభ్యతను అదుపు చేయాల్సి వుంటుంది. దీని వలన చిన్న, మధ్య తరహా పెట్టుబడిదారులు ఎక్కువగా దెబ్బ తింటారు. అది నిరుద్యోగం మరింత పెరగడానికి దారి తీస్తుంది. దాని వలన ప్రజల కొనుగోలు శక్తి మొత్తం మీద చూసినప్పుడు తగ్గిపోతుంది. అంటే ఆహారధాన్యాలకు డిమాండ్ తగ్గుతుంది. దానివలన ద్రవ్యోల్బణం తగ్గుతుంది. నయా ఉదారవాదం ద్రవ్యోల్బణానికి చూపించే పరిష్కారం ఇదే.
ఇక రెండో పద్ధతి: ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరించడం. అప్పుడు ప్రభుత్వం దగ్గరున్న నిల్వలు బహిరంగ మార్కెట్ లోకి కాకుండా నేరుగా ప్రజలకు చేరుతాయి. అప్పుడు నిల్వలు స్పెక్యులేటర్లకు అందుబాటులోకి లేకుండా పోతాయి. వినియోగదారులు బహిరంగ మార్కెట్ నుండి ప్రజా పంపిణీ వ్యవస్థ వైపు మరలుతారు. ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరించి ఎక్కువ ఆహారధాన్యాలను ప్రజలకు అందించాలంటే అప్పుడు ప్రభుత్వం ఎఫ్‌సిఐ ద్వారా మరింత ఎక్కువగా ఆహారధాన్యాల సేకరణకు పూనుకోవలసి వస్తుంది. ఈ ఏడాది ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌లో 5 కోట్ల 21 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించాలని నిర్ణయించింది. ఈ పని చేస్తే తప్ప ప్రస్తుత ఆహారధాన్యాల ధరల పెరుగుదలను నియంత్రించడం సాధ్యం కాదు. ఎంతో అపఖ్యాతిని ఆర్జించిన నల్ల వ్యవసాయ చట్టాలు ఎంత పనికిమాలినవో ఇప్పుడు బాగా బోధపడుతుంది. రైతులంతా ఉద్యమించి ఆ చట్టాలను రద్దు చేసేవరకూ పోరాడారు గనుక సరిపోయింది. అలా కాకుండా, ఆ చట్టాలే అమలులో ఉండినట్లైతే మొత్తం దేశంలోని ఆహార ధాన్యాలన్నీ ప్రైవేటు రంగం గుప్పెట్లో ఇరుక్కుపోయి వుండేవి. అప్పుడు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం ప్రభుత్వానికి అసాధ్యం అయివుండేది. రైతుల పోరాటం ఈ దేశాన్ని కాపాడింది. అందువల్లే ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రస్తుతానికి బతికి బట్ట కట్టింది.
( స్వేచ్ఛానుసరణ )
ప్రభాత్ పట్నాయక్