
చుక్కలు చూస్తున్న కాయగూరల ధరలు వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. నెల రోజులుగా అంతకంతకూ పెరుగుతున్న ధరలతో ఏమీ కొనలేక జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. టమాటా, బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి సమస్తం రేట్లూ పైపైకే. అక్కడ ఇక్కడ అనే తేడా లేదు. నగరాలు, పట్టణాలు మొదలుకొని గ్రామ సీమల వరకు అంతటా ధరాఘాతమే. టామాటా ధర కిలో పాతిక ముప్పై ఉన్నది కాస్తా అమాంతం వందకు ఎగబాకింది. ఏడాది పొడవునా నలభై యాభై రూపాయలు అమ్మిన కిలో పచ్చిమిర్చి ఎకాయికిన రెండొందల దరిదాపులకెళ్లింది. కిలో అల్లం 350 అమ్మడం కనీవినీ ఎరుగని వింత. చెప్పుకుంటూపోతే కూరగాయల ధరల చిట్టా చాలా పెద్దది. ఇప్పటికే బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు యావత్ పచారీ సరుకుల రేట్లూ కొండెక్కి దిగట్లేదు. సందట్లో సడేమియాలా కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేసింది. ఈ మంటకు కూరగాయల మంట అదనం కావడంతో పేద, సామాన్య జనాలకు రోజువారీ బతుకు భారమైపోయింది. నీళ్లచారు, కారమన్నానికి సైతం వారు దూరం కావాల్సిన దుస్థితి దాపురించింది.
దక్షిణాదిలో వర్షాభావం, ఉత్తరాదిలో బివర్‌జోరు తుపాను వలన ఉత్పత్తి తగ్గడంతో కూరగాయల ధరలు పెరిగాయన్న వాదన సరికాదు. టమాటా, ఉల్లిపాయల వంటి కొన్నింటి ధరలు జూదాన్ని తలపిస్తుంటాయి. ఆ పంటలు పండించిన రైతులకు ఏడాదిలో ఏనాడూ ధర రాదు. కిలోకు రూపాయి పడ్డ సందర్భాలనేకం. కోత కూలి, రవాణా ఖర్చులు సైతం పడక రైతులు టమాటా, ఉల్లిపాయలను రోడ్లపై పారబోస్తున్న దృశ్యాలు తరచు కనిపిస్తాయి. వినియోగదారులకొచ్చేసరికి కిలో పాతిక ముప్పైకి తగ్గేదే లేదు. కొన్నిసార్లు అసాధారణంగా వంద మార్క్ దాటుతుంది. టమాటా, ఉల్లిపాయలే కాదు ఏ పంట చూసినా ఇదే పరిస్థితి. ఈ వైపరీత్యానికి వ్యాపారులు, దళారీలే కారణం. ఈ మధ్యన రిలయన్స్, అదానీ, ఫ్యూచర్ గ్రూపు వంటి కార్పొరేట్ సంస్థలు మార్కెట్‌ను హస్తగతం చేసుకుంటున్నాయి. అతి తక్కువకు రైతుల నుంచి కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజి గోదాముల్లో నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. ఒకేసారి ధరలు పెంచేసి దోచుకుంటున్నాయి. ఈ దోపిడీని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు సుముఖంగా లేవు. పైగా ఆ యా సంస్థలకు అనుకూలంగా విధానాలు రూపొందించి అమలు చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలు రద్దయ్యాయి కనుక సరిపోయింది. లేకుంటే రైతులు, వినియోగదారులు ఇంకెంత క్షోభించేవారో !
ఇటు రైతులు ఇటు వినియోగదారులు నష్టపోతున్న నేపథ్యంలో రెండు పక్షాలనూ ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. కానీ ప్రభుత్వం సరైన సమయంలో తగిన విధంగా స్పందించనందున రైతులు, ప్రజలు ట్రేడర్ల సట్టా వ్యాపారానికి సమిధలవుతున్నారు. వైసిపి ప్రభుత్వం రాగానే మార్కెట్ ఇంటెలిజెన్స్, మద్దతు ధరలు అన్నా ఆచరణలో అదేమీ లేదు. బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలు, చట్ట వ్యతిరేక రవాణా వేటిపైనా విజిలెన్స్, కంట్రోలు లేకనే వ్యాపారులు రెచ్చిపోతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అంతా అయిపోయాక కొన్ని చర్యలు చేపట్టి చేతులు దులుపుకోవడం సర్కారుకు రివాజైంది. టమాటా ధర వంద అయ్యాక తీరిగ్గా రైతు బజార్లలో యాభైకి అమ్మిస్తానంటోంది. ఒక మనిషికి రోజుకు ఒక కిలో ఇస్తున్నారు. దానికీ ఆధార్ కార్డు నిబంధన పెట్టారు. అన్ని రైతు బజార్లలో ఇస్తున్నారా అంటే అదీ లేదు. కేరళలో వామపక్ష ప్రభుత్వం మార్కెట్‌లో జోక్యం చేసుకొని రైతుల నుంచి కూరగాయలు సేకరించి సంచార మార్కెట్‌ల ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు అందిస్తోంది. రైతు, వినియోగదారు ఇద్దరినీ ఆదుకుంటోంది. ప్రభుత్వ జోక్యం పెరిగితే వ్యాపారులు దిగొస్తారు. ఈ పని మన దగ్గర జరగట్లేదు. ధరల స్థిరీకరణ నిధి ఏమైందో తెలీదు. రైతు, వినియోగదారు ఇద్దరి రక్షణకూ భరోసా కల్పించే చర్యలను ప్రభుత్వం చేపడితేనే ధరలు అదుపులోకి వస్తాయి. లేకుంటే ప్రజలకు అధిక ధరల పెను భారం తప్పదు.