
- మహిళలకు ఆర్‌టిసిలో ఉచిత ప్రయాణం
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : ' కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పసుపు పంటకు మద్దతు ధర కల్పిస్తాం.. వరి ధాన్యానికి బోనస్ ఇస్తాం.. మహిళలకు ఆర్‌టిసిలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.. బిఆర్‌ఎస్ పాలనలో దోచుకున్న ప్రజల సొమ్మును బయటకు తీస్తాం' అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. టిపిసిసి విజయభేరి బస్సు యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ..కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు సర్వీస్‌లాగానే తెలంగాణలో సైతం ఆర్‌టిసిలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నెలా రూ.2500 ప్రతి కుటుంబానికీ అందిస్తామన్నారు. 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, ప్రతి కుటుంబానికీ 200 యూనిట్‌ల కరెంట్ ఉచితంగా ఇస్తామని చెప్పారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధరతోపాటు పసుపు మద్దతు ధర కల్పిస్తామని, ఎంఎస్‌పి కంటే అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇండ్లు లేని అందరికీ ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లు నిర్మిస్తామన్నారు. చేయూత పథకం ద్వారా నాలుగు వేల రూపాయల పింఛన్ అందిస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీని గద్దె దించి కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని కోరారు. బాల్కొండలో సునీల్‌రెడ్డిని, ఆర్మూర్‌లో వినరుకుమార్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
రాహుల్‌తో కోదండరాం భేటీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టిజెఎస్ అధ్యక్షులు కోదండరాం భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం కరీంనగర్ వి పార్క్ హోటల్‌కు చేరుకుని రాహుల్‌తో సమావేశం అయ్యారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని కోదండరాంను రాహుల్ కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా సూచించారు. పోటీకి ఆసక్తి లేదని కోదండరాం పేర్కొన్నారు. ఎన్నికల్లో అవగాహన, బిఆర్‌ఎస్‌ను ఎదుర్కునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. తెలంగాణ ప్రయోజనల కోసం, రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలని కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని జన సమితి నిర్ణయించిందన్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ముథోల్, ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్ స్థానాలను తెలంగాణ జనసమితి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ నియంత పాలనను దించడానికే టిజెఎస్ ఏర్పడిందని కోదండరాం వెల్లడించారు. ఈ భేటీలో కెసి వేణు గోపాల్, రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.