Apr 23,2023 07:11

ప్రపంచ జనాభాలో సగం మంది ఇంకా మలేరియా ముప్పును ఎదుర్కొంటున్నారు. మన దేశంలో మలేరియా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ, ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం మలేరియా కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. నివారించగలిగిన మార్గాలు, అవసరమైన వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపుగా 6 లక్షల ప్రాణాలను మలేరియా బలి తీసుకుంటోంది. అయితే ఇవన్నీ అధికారిక లెక్కలు చెబుతున్న వాస్తవాలు. ఇక అనధికారిక మరణాల లెక్కలు ఇంకెన్నో? అయితే దీనిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఏటా ఏప్రిల్‌ 25న మలేరియా దినం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా మలేరియా వ్యాధి తీవ్రత ఎలా ఉంది? ఎలా సోకుతుంది ? లక్షణాలేమిటి ? నిర్ధారణ, నివారణ తదితర వివరాలు తెలుసుకుందాం...

1


దోమల వల్ల వచ్చే ప్రాణాంతక వ్యాధి మలేరియా. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడమే మలేరియా దినోత్సవ ప్రధాన లక్ష్యం. అయితే అనేక దేశాల్లో ఇప్పటికీ మలేరియా అంటువ్యాధిగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2023లో విడుదల చేసిన నివేదిక ప్రకారం. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది మలేరియా బారిన పడే ప్రమాదం ఉందని తెలిపింది. కాగా 2021లో ప్రపంచవ్యాప్తంగా 247 మిలియన్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇందులో 6,19,000 మంది మరణించినట్లు అంచనవేసింది. అయితే ఈ సంఖ్యలో అత్యధిక భాగం ఆఫ్రికన్‌ ప్రాంతాల నుంచే నమోదైనట్లు డబ్ల్యూ హెచ్‌ఓ తెలిపింది. కాగా ఈ ప్రాంతంలో 95శాతం మలేరియా కేసులు, 96శాతం మరణాల రేటు నమోదైనట్లు తెలిపింది. మొత్తం మరణాల సంఖ్యలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలు 80శాతం మంది ఉన్నట్లు నివేదికలో పేర్కొంది.

  • మలేరియా దినం చరిత్ర..

ఏప్రిల్‌ 25ను ప్రపంచ మలేరియా దినంగా 2008 నుంచి ప్రతి ఏటా జరుపుకుంటున్నాం. అయితే ఈ మలేరియా దినం ఆఫ్రికన్‌ మలేరియా దినం నుంచి అభివృద్ధి చెందింది. ఆఫ్రికాలోని ప్రభుత్వాలు 2001 నుంచి మలేరియా దినం జరుపుకుంటున్నాయి. అయితే 2007లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 60వ సెషన్‌లో ఆఫ్రికా మలేరియా దినం ప్రపంచ మలేరియా దినంగా గుర్తించాలనీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలేరియా ఉనికిని, తీవ్రతను అంచనావేయాలని, దీని నివారణకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రతిపాదించారు. ఆ విధంగా 2008లో మొదటి ప్రపంచ మలేరియా దినం జరుపుకున్నాం. దీనిలో భాగంగా మలేరియాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో దాతల చొరవ కోసం నిధుల సేకరించడం, శాస్త్రీయ పురోగతిని కమ్యూనికేట్‌ చేయడానికి పరిశోధన, విద్యా సంస్థలను ఏకతాటిపైకి తీసుకురావడం దీని లక్ష్యం.

  • మలేరియా అంటే?.. ఎలా వ్యాపిస్తుంది?

మలేరియా ఒక అంటు వ్యాధి. ఇది ఆడ అనాఫిలస్‌ దోమ కుట్టడం వల్ల వస్తుంది. వాస్తవానికి, ఈ దోమలో ప్లాస్మోడియం వైవాక్స్‌ అనే ప్రోటోజోవా ఉంటుంది. ఇది ఈ వ్యాధికి నిజమైన కారణం. మలేరియా జ్వరం ఎక్కువగా వేసవి, వర్షాకాలంలో వస్తుంది. అనాఫిలస్‌ దోమ కాటుకు గురైన వెంటనే, ప్లాస్మోడియం వైవాక్స్‌ మానవ శరీరంలోకి ప్రవేశించి స్వయంగా గుణించడం ప్రారంభిస్తుంది. ఈ పరాన్నజీవి రోగి కాలేయం, రక్త కణాలపై దాడి చేస్తుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోక పోతే, రోగి మరణించే అవకాశం ఉంది.

  • ఈ ఏడాది థీమ్‌

ప్రతి ఏడాది ఒక థీమ్‌తో ప్రపంచ మలేరియా దినం జరుపుకుంటారు. ఈ సంవత్సరం ప్రపంచ మలేరియా దినం థీమ్‌ ''జీరో మలేరియా కేసులను గుర్తించే సమయం'' కోసం ఆచరణ, అమలు, ఆవిష్కరణ.. అనే థీమ్‌ను 2023కు గానూ ఎంచుకుంది.

1
  • మలేరియా తీవ్రత...

మలేరియా ఎక్కువగా ఆఫ్రికాలోనూ, ఆగేయ ఆసియాలోని కొన్ని భాగాల్లో తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే మొత్తం మలేరియా మరణాల్లో 90 శాతం ఆఫ్రికా దేశాల్లోనే సంభవిస్తున్నాయి. ఆఫ్రికాలో ప్రతి నిమిషానికీ ఒక పిల్లవాడు మలేరియాతో మరణిస్తున్నాడు. అన్ని అంటువ్యాధులలో, న్యుమోనియా, డయేరియా తరువాత, ఒక నెల, ఐదు సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల మరణాలకు కారణమైన వ్యాధుల్లో మలేరియా మూడో స్థానంలో ఉంది. ఒక నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్త ఉన్న మలేరియా కేసుల సంఖ్యలో భారతదేశం 3% వాటాను కలిగి ఉంది, వ్యాధి తీవ్రత ఇంత స్థాయిలో ఉన్నప్పటికీ ఇప్పటికే 40 దేశాలు మలేరియా రహిత దేశాలుగా ప్రకటించుకున్నాయి. అయితే ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన అజర్‌ బైజార్‌, తజకిస్తాన్‌ దేశాలతో కలిపి 42 దేశాలు మలేరియా రహిత దేశాలుగా గుర్తింపు పొందాయి.

  • దేశంలో మలేరియా పరిస్థితి..!

ఇప్పటి వరకూ మన దేశంలో ఏ రాష్ట్రంలోనూ మలేరియాను పూర్తిగా నిర్మూలించిన దాఖలాలు లేవు. కేవలం సముద్రమట్టానికి 2000-2500 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశాలు మినహా ఏ ప్రాంతం సురక్షితంగా లేదు. కాగా అస్సోం, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్‌ ఈశాన్య రాష్ట్రాలు (సిక్కిం మినహా) మలేరియాకు అధిక ప్రమాదం ఉన్న రాష్ట్రాలుగా గుర్తించారు. కాగా రాష్ట్రంలో తూర్పుగోధావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి.

3
  • ప్రధాన ప్రజారోగ్య సమస్యగా..

భారతదేశంలో మలేరియా ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా ఉంది. దేశంలో దాదాపు 95% జనాభా మలేరియా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కాగా నమోదవుతున్న మలేరియా కేసుల సంఖ్యలో 80 శాతం వరకూ గిరిజన, కొండ ప్రాంతాలే. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నవారే ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. వీరికి ప్రయాణ మార్గాలు, వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం ఈ పరిస్థితికి కారణం. అయితే ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు దేశ జనాభాలో సుమారు 20% మాత్రమే. ఈ 20 శాతం మంది ప్రజలపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించి నివారణా చర్యలను పాటించగలిగితే ప్రభుత్వం నిర్ధేశించుకున్న ప్రకారం 2030కి మలేరియాను నివారించడం సాధ్యమే.

  • లక్షణాలు ఎప్పుడు కనిపిస్తాయి?

ఆడ అనాఫిలస్‌ దోమ కుట్టినప్పుడు దాని శరీరంలోని మలేరియా కారక ప్లాస్మోడియం సూక్ష్మజీవి మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. మనిషి శరీరంలోకి చేరాక రక్తం నుంచి కాలేయంలోకి చేరతాయి. అక్కడ వాటి సంఖ్య వృద్ధి చెందుతుంది. సాధారణంగా ప్లాస్మోడియం శరీరంలోని చేరిన వారం నుంచి పది రోజుల వరకూ ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఈ సమయంలో శరీరంలోని ప్లాస్మోడియం సూక్ష్మజీవులు కాలేయంలో తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి. ఆతర్వాత ఇవి ఎర్ర రక్త కణాల్లోకి ప్రవేశిస్తాయి. వీటి వల్ల ఎర్ర రక్త కణాలు పగిలిపోతాయి..

4
  • మలేరియా లక్షణాలు..

జ్వరం, గడగడ వణుకు వస్తున్నదా అయితే మలేరియా కావచ్చు అనే ఆరోగ్య నినాదం ఎప్పటినుంచో మనలో నలుగుతుంది..సాధారణంగా మలేరియా వచ్చిన వారికి జ్వరం తీవ్రంగా ఉంటుంది, వణుకు ఉండడం, తలనొప్పి, కండరాల నొప్పి, ఛాతిలో నొప్పిగా ఉండటం, దగ్గు, చెమటలు పట్టడం మొదలైనవి మలేరియా సాధారణ లక్షణాలు. దోమకాటుకు గురైన ఏడు నుంచి 18 రోజుల మధ్య మలేరియా లక్షణాలు కనిపిస్తాయి. కొద్దిమందిలో కాలేయం దెబ్బతిని పచ్చకామెర్లు కనిపించవచ్చు. కొద్దిమందిలో ఊపిరితిత్తుల్లో నెమ్ము ఏర్పడి దగ్గు, ఆయాసం లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. మరి కొద్దిమందిలో మెదడుకు కూడా సోకి అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోవచ్చు.. చిన్నపిల్లలు, వృద్ధులు, షుగర్‌, కిడ్నీ వ్యాధులు లాంటి జబ్బులతో బాధపడేవారు ఈ వ్యాధిని తట్టుకోవడం కష్టమవుతుంది..
మలేరియా సోకిన రోగికి సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాంతక పరిణామాలు రావోచ్చు. ఈ మలేరియా వల్ల రోగి మెదడులోని రక్తనాళాల్లో వాపు, ఊపిరితిత్తుల్లో ద్రవం చేరడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి. వైద్య భాషలో దీనిని పల్మనరీ ఎడెమా (ూబశ్రీఎశీఅaతీy వసవఎa) అని అంటారు. ఇదే కాకుండా మలేరియా సోకిన వ్యక్తులకు కాలేయం, మూత్రపిండాలు వంటి ప్రధాన అవయవాలు చెడిపోతాయి. ఎర్ర రక్తకణాలు దెబ్బతిని రక్తహీనతకు దారితీస్తుంది.

  • వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన ఆహారం?

మలేరియా రోగికి ఆహారంలో సాస్‌లు, ఊరగాయలు వంటి నిలవ ఆహారం ఎక్కువగా ఉండకూడదు.. కాఫీ, టీ, కోకో కోలా లేదా మరేదైనా కెఫిన్‌ కలిగిన పానీయాలు తీసుకోవడం తగ్గించుకోవాలి. పండ్లు, పండ్ల రసాలు లేదా పప్పు, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు.. మొదలైనవి తాగడం మంచిది. ప్రధానంగా కాచి చల్లార్చిన నీరు అధికంగా తీసుకోవాలి. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ని ఫ్లష్‌ ఔట్‌ చేసి త్వరగా కోలుకోడానికి సహాయపడుతుంది. ఇక నీటి శాతం అధికంగా ఉండే కీరా, కమలాపండ్లు వంటివి తీసుకోవచ్చు.

5
  • వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

మలేరియా ఎంత వేగంగా ప్రాణాంతకంగా మారుతుందో ముందుగా నిర్ణయించలేం. వీలైనంత త్వరగా వైద్య సహాయం పొందడం అవసరం. చిన్నపిల్లలు, నవజాత శిశువులు, గర్భిణులు, స్త్రీలలో మలేరియా కేసులు ఎక్కువ ప్రమాదకరంగా మారుతాయి.
మలేరియా పీడిత ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు లేదా ప్రయాణిస్తున్నప్పుడు అధిక జ్వరం ఉంటే, వైద్య సంరక్షణను కోరండి. పర్యటన తర్వాత వారాలు, నెలలు లేదా ఒక సంవత్సరం తర్వాత కూడా లక్షణాలు కనిపించినా వైద్య సహాయం తీసుకోవాలి

  • మలేరియారకాలు...

సాధారణంగా మలేరియా అంటే అది ఒకే రకమైన జ్వరం అనే మనకు తెలుసు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, మలేరియా జ్వరం ఒకటి మాత్రమే కాదు, ఐదు రకాలు. అంటే, ఐదు రకాల పరాన్నజీవుల ద్వారా ఈ వ్యాధిని సోకవచ్చు.
1. ప్లాస్మోడియం ఫాల్సిపరం: ఈ పరాన్నజీవి వల్ల వచ్చే మలేరియా జ్వరం సర్వసాధారణం. ఒక వ్యక్తి సోకిన 48 గంటల తర్వాత మాత్రమే లక్షణాలను చూపించడం ప్రారంభిస్తుంది. రోగి మూర్ఛపోవచ్చు.
2. ప్లాస్మోడియం వైవాక్స్‌: ఇది ఆగేయాసియా, లాటిన్‌ అమెరికా ప్రజల్లో మలేరియా రావడానికి కారకం. ప్లాస్మోడియం ఫాల్సిపరమ్‌ తర్వాత ఇది రెండో అత్యంత సాధారణ మలేరియా జ్వరం.
3. ప్లాస్మోడియం ఓవల్‌ మలేరియా: ఈ రకమైన మలేరియా చాలా అసాధారణం. ఈ పరాన్నజీవి.. రోగి కాలేయంలో లక్షణాలను కలిగించకుండా సంవత్సరాల పాటు జీవించగలదు.
4. ప్లాస్మోడియం మలేరియా: ఈ పరాన్నజీవి వల్ల వచ్చే మలేరియా పేరు క్వార్టన్‌ మలేరియా. ఇది పైన పేర్కొన్న మలేరియా జ్వరం కంటే తక్కువ ప్రమాదకరం. ఇందులో నాలుగో రోజు రోగికి జ్వరం వస్తుంది. మూత్రంతో ప్రోటీన్‌ విసర్జన అవుతుంది. దీంతో రోగి శరీరంలో ప్రోటీన్‌ శాతం తగ్గుతుంది.
5. ప్లాస్మోడియం నోలెసి: మలేరియా పరాన్నజీవి తూర్పు ఆసియాలో కనిపిస్తుంది. రోగికి జ్వరం, వణుకుతో పాటు ఆకలి కూడా మందగిస్తుంది.

6
  • తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

1. దోమ తెరలు : రోజు మొత్తంలో మనల్ని కుట్టడానికి దోమలకు అనువైన సమయం ఏదో తెలుసా? మనం నిద్రపోయే సమయం. అప్పడైతే మనం కదలకుండా ఉంటాం. దోమ కుడుతున్నా టప్మని దాన్ని కొట్టలేం. మనం నిద్రించేటప్పుడు దోమలు ఎంచక్కా తమ పని చేసుకుని పోతాయి. అందుకే దోమలు కుట్టకుండా చూసుకోవడంలో దోమతెరలది ప్రధాన పాత్ర.

  •  క్రిమి సంహారక పూత మందు పూసిన దోమతెరలైతే ఇంకా మంచిది.
  • క్రిమిసంహారక పూతమందు పూసిన దోమతెరలను ఉపయోగించి కొంతవరకు నివారించవచ్చు. మలేరియా ఎక్కువగా ప్రబలే గిరిజనులు నివసించే ప్రాంతాలలో ఈ దోమతెరలను అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

2. ఇంటి కిటికీలకు, తలుపులకు జాలీలు (మెష్‌)బిగించుకోవాలి.
3. దోమలు ఎక్కువగా ఉన్న సమయాలలో శరీరాన్ని వీలైనంతగా కప్పి ఉండే దుస్తులు ధరించాలి.
4. దుస్తులు కప్పని భాగాల్లో దోమలను వికర్షించే లేపనాలు పూసుకోవాలి.
5. దోమలను చంపే ఎలక్ట్రిక్‌ బ్యాట్లు, కాల్చినప్పుడు పొగ వచ్చే మస్కిటో కాయిల్స్‌ వాడవచ్చు. ఐతే ఈ పొగలో ఆరోగ్యానికి హాని కలుగజేసే వాయువులు ఉంటాయి. కనుక ఇవి శ్రేయస్కరం కాదు.
6. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఈ దోమలు పుట్టకుండా చర్యలు తీసుకోవడం మంచి పద్ధతి .మనవీధి నిండా దోమలు ఉంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవి మనల్ని కుట్టకుండా వదలవు కదా!

7
  • ప్రధాన పాత్ర ప్రభుత్వానిదే...

దోమలపై చేసే యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయకుండా ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కాదు.
1. మురుగు కాలువలలో నీరు నిలువకుండా సక్రమంగా ప్రవహించేలా చేయాలి.
2. నీరు నిల్వ ఉన్నచోట దోమలు పిగలకుండా ఆయిల్‌ బాల్స్‌, అబేట్‌ లాంటివి ఉపయోగించాలి.
3. చెత్తకుండీలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి.
4. పట్టణ ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ప్రణాళికా బద్ధంగా ఏర్పాటు చేయాలి.
5. క్రమం తప్పకుండా అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్‌ నిర్వహించాలి. క్రిమిసంహారక మందులను పిచికారీ చేయించాలి.
6. నివాస ప్రాంతాల సమీపంలో ఉన్న చెరువులు, గుంటల్లో దోమ లార్వాలను చంపడానికి గాంబూసియా చేపలను వదలాలి.
7. ప్రజలు వారానికి ఒకరోజు డ్రైడే పాటించేలా ప్రోత్సహించాలి. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రతి శుక్రవారాన్ని డ్రైడేగా ప్రకటించింది. కానీ ఆచరణలో చేయడం లేదు. ప్రజల సహకారం, క్రియాశీల భాగస్వామ్యం లేకుండా డ్రైనేని పాటించడం సాధ్యంకాదు.
8. దోమల నిర్మూలన ప్రచారాన్ని పెద్దఎత్తున చేపట్టాలి. ప్రజలకు కరపత్రాలు పంచడం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీలు లాంటి ప్రజారోగ్య వ్యవస్థను ఉపయోగించి గ్రామసభల ద్వారా ఆరోగ్య అవగాహన కల్పించాలి.
9. దోమల నిర్మూలనను ఒక ఉద్యమంలా చేపట్టాలి. ఇందులో ప్రజలను, ప్రజా సంఘాలను, స్వచ్ఛంధ సంస్థలను భాగస్వాములను చెయ్యాలి.
10. పారిశుధ్యం లోపించడమే దోమల పెరుగుదలకు ప్రధాన కారణం. అధికార యంత్రాంగాన్ని, ఉద్యోగులను కదలించి పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషిచేయాలి.
ప్రజలు కూడా తమ హక్కులను, బాధ్యతలను గుర్తెరిగి ప్రభుత్వాన్ని తన బాధ్యతలు నెరవేర్చమని డిమాండ్‌ చేస్తూ, తమ పరిధిలో జరిగే కార్యక్రమాలలో భాగస్వాములు కావాలి. అప్పుడే దోమకాటు నుంచి అవి కలిగించే చేటు నుంచి మనల్ని, మనబిడ్డల్ని, మన జిల్లాని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని దోమ కాటు నుంచి నుంచి తప్పించగలం. మలేరియాను నిర్మూలించగలం. తద్వారా చికున్‌ గుణ్య, డెంగీ లాంటి విష జ్వరాలను కూడా నివారించగలం. ఈ జాగ్రత్తలను ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకొని ప్రజలను చైతన్యం చేయగలిగితేనే ప్రభుత్వం నిర్ధేశించుకున్న ప్రకారం 2030 నాటికి మలేరియా రహిత దేశంగా ప్రకటించుకోడం సాధ్యమవుతుంది.

8
  • నివారణా మార్గాలు...

దోమలు పుట్టకుండా.. పుట్టిన దోమలు మనల్ని కుట్టకుండా చూసుకోవడమే ఈ వ్యాధిని నివారణకు ఉత్తమ మార్గం. ముందుగా దోమల పుట్టకుండా ఏం జాగ్రత్త తీసుకోవాలో చూద్దాం.

  • మంచినీటి ట్యాంకులు, కూలర్లు వంటి వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
  •  ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండే గుంతల్లో మట్టిని నింపుకోవాలి. లేదంటే నీటి గుంతల్లో కిరోసిన్‌, డీడీటీ పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల దోమలు పుట్టవు.
  •  నీరు నిల్వ ఉండే తొట్టెలు, ట్యాంకుల్లో లార్వా వృద్ధి చెందకుండా వారానికి ఒకసారైనా శుభ్రం చేయడం మంచిది.
  •  తాగి పారేసిన కొబ్బరి బోండాంలు, పగిలిపోయిన సీసాలు, కుండలు,వాడకుండా పక్ననపడవేసిన టైర్లు లాంటి వాటిని ఇంటి పరిసరాలలో లేకుండా చూసుకోవాలి. వాటిలో 7నుంచి 10 రోజులు నీరు నిల్వవుంటే అందులో దోమలు గుడ్లు పెట్టి లక్షలాది పిల్లదోమలకు జన్మనిస్తాయి.
  •  బావులు, నీటిట్యాంకులకు మూతలు పెట్టాలి.
  •  గ్రామం లేదా కాలనీలోని వారంతా కలిసి వారానికి ఒకరోజు డ్రై డేని పాటించాలి. ఆరోజు పూల కుండీలు, కూలర్లు, నీటితొట్లు మొదలైన వాటిలో ఉన్న నీటిని పూర్తిగా పారబోసి ఒక్క గంటసేపు ఎండనివ్వాలి.
  •  ఇంట్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. తొలగించిన చెత్తను పబ్లిక్‌ చెత్త కుండీలో వెయ్యాలి లేదా చెత్త సేకరించే వారికి ఇవ్వాలి.
  •  రోడ్డుపక్క మురుగు కాలువలలో చెత్తవేయరాదు. అలా వేయడంవల్ల మురుగునీరు నిలిచిపోయి ఈ కాలువలే దోమల పెంపక కేంద్రాలుగా తయారవుతాయి.
  •  గ్రామ పంచాయతీ, మునిసిపాలిటీ వారు ఫాగింగ్‌ చేసే సమయంలో ఇంటి తలుపులు, కిటికీలు తెరచి వుంచాలి. ఇంటిలోని గోడలపై కూడా క్రిమి సంహారక మందులను పిచికారీ చేయించుకోవలి.
  •  సెప్టిక్‌ ట్యాంకుపైపు చివర నైలాన్‌ మెష్తో కట్టి ఉంచాలి. అలా చేయని పక్షంలో సెప్టిక్‌ ట్యాంక్‌ దోమలు పెంపకకేంద్రంగా మారిపోతుంది

ఈ జాగ్రత్తలను ఇంటివరకే పరిమితం చేస్తేచేస్తే దోమలను నిర్మూలించలేము. గ్రామం, కాలనీలలోని వారంతా కలిసి కృషిచేసినప్పుడే ప్రయోజనం ఉంటుంది.

డాక్టర్‌ ఎంవి రమణయ్య
ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్‌