
ద్రౌపది ముర్ము బిజెపి నాయకురాలు, గతంలో ఆ పార్టీ ప్రజా ప్రతినిధి, గతంలో ఆ పార్టీ చేత నియమించబడిన గవర్నర్, ఇప్పటికీ ఆ పార్టీలో కొనసాగుతున్న రాజకీయ నాయకురాలు. ఆమె అభ్యర్థిత్వాన్ని నిర్ణయించింది, ప్రకటించింది బిజెపి. ఇదంతా రాజకీయ పార్టీగా బిజెపి ద్వారా జరుగుతుంటే రాజకీయాలు చూడలేమనడం ధృతరాష్ట్ర రాజకీయం కాదా! గిరిజన మహిళ కాబట్టి బలపరుస్తున్నట్లయితే గతంలో ఇదే స్థానానికి పోటీ చేసిన గిరిజన అభ్యర్థిని ఎందుకు బలపరచలేదు? జవాబు లేదు. గిరిజన అంటే ద్రౌపది ముర్మునే కాదు కదా. బిజెపి విధానాల వల్ల లక్షల ఆదివాసీ గూడేల్లో నివసిస్తున్న లక్షోపలక్షల గిరిజనులు నిరాశ్రయులై, దౌర్భాగ్య జీవితాల్లోకి నెట్టబడుతున్న వారి గురించి ఒక్క రోజైనా ఈ పార్టీల ఎంపీలు పార్లమెంట్‌లో మాట్లాడారా? రాష్ట్రపతికి ఏకగ్రీవంగా ఎన్నిక చేయించే ఉద్దేశ్యం బిజెపి కి వుందా? ఇతర పార్టీలను సంప్రదించారా? కనీసం తమను బలపరుస్తున్న పార్టీలతోనైనా మాట్లాడారా?
రాష్ట్రం లోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి పార్టీల బలహీనతలను రాష్ట్రపతి ఎన్నికలు బట్టబయలు చేశాయి. రోజూ తమ నామస్మరణ చేసి తరించే వారు సైతం సమర్థించలేని స్థితిలో ఈ పార్టీల వైఖరులు దిగజారాయి. 'తెలుగు ఆత్మగౌరవం', 'రాజన్న రాజసం' అంటూ తమ పూర్వీకుల పేర్లను జపిస్తూ ఆ గౌరవాన్ని కూడా ఈ పార్టీలు కోల్పోయాయి. పోటీలో వున్నవారు ఓట్లు అభ్యర్థించడం ఇన్నాళ్ళు చూశాము. కాని ఓటు వేసేవారే అభ్యర్థిని అడుక్కునే దౌర్భాగ్య పరిస్థితిని ఆంధ్ర ప్రదేశ్ లోనే చూస్తున్నాం. తెలుగువారి సహజ గుణాలైన పౌరుషం, ఆత్మాభిమానం, ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదిరించి నిలిచే ధీరత్వం, ద్రోహం చేసిన వారి పట్ల వుండే కఠినత్వం...ఏమయ్యాయని ప్రతి ఆంధ్రుడు ఆందోళనకు గురవుతున్నాడు. దిగజారుతున్న రాజకీయ పార్టీల విన్యాసాలను చూసి అసహ్యించుకుంటున్నారు.
రాష్ట్రపతి స్థానం దేశంలో అత్యంత ఉన్నతమైన రాజ్యంగబద్ధమైన పదవి. రాజ్యాంగాన్ని రక్షించడం ప్రధాన బాధ్యత. రాజ్యాంగం అంటే ఒక పుస్తకం కాదు. అది దేశ విధానం. దేశ ప్రజల భవితకు, రక్షణకు ఇవ్వబడిన హామీ పత్రం. అనేక సంవత్సరాలుగా పోరాడి, ప్రాణాలర్పించిన యోధుల మది నుండి, ప్రపంచ అనుభవాల సారం నుండి ఆవిష్కరించబడిన మార్గదర్శి. అలాంటి రాజ్యంగబద్ధమైన కీలక స్థానానికి ఎన్నుకునే అభ్యర్థి ఆ రాజ్యాంగాన్ని కాపాడగలగాలి. ఆ అర్హత కలిగిన అభ్యర్థిని పుట్టుకనుబట్టి నిర్ణయించుకోవాలా? ఆ అభ్యర్థి నిలిపిన రాజకీయ పార్టీని బట్టి నిర్ణయించుకోవాలా? జవాబు చెప్పడానికి గణితశాస్త్ర మేధావో, విజ్ఞానవేత్తో, రాజకీయ సలహాదారో అక్కరలేదు. చిన్న పిల్లలను అడిగినా చెబుతారు ఎంఎల్‌ఏ, ఎంపీలు ఓటు వేసి ఎన్నుకునే అభ్యర్థిని రాజకీయాలను బట్టి నిర్ణయించుకోవాలి కదా అని. ఈ మాత్రం అవగాహన మన రాష్ట్రం లోని వైసిపి, టిడిపి లకు లేదనుకోవాలా!! అవగాహన వుండి ఈ తప్పులో కాలేస్తున్నారంటే ఇంకేవో కారణాలు వుండాలి.
బిజెపి అభ్యర్థిని బలపరుస్తున్న ఈ రెండు పార్టీలు వింత వాదనలు చేస్తున్నాయి. రాష్ట్రపతి పదవి రాజ్యాంగబద్ద పదవి కాబట్టి ఇక్కడ రాజకీయాలు చూడకూడదంటున్నారు. ద్రౌపది ముర్ము గిరిజన మహిళ కాబట్టి బలపరుస్తున్నామంటున్నారు. దేశ ఉన్నత పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అవసరమంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. ఇవన్నీ మన తాతలనాడు చెప్పిన 'తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ గడ్డికి' అన్నట్లుగా వుంది. ద్రౌపది ముర్ము బిజెపి నాయకురాలు, గతంలో ఆ పార్టీ ప్రజా ప్రతినిధి, గతంలో ఆ పార్టీ చేత నియమించబడిన గవర్నర్, ఇప్పటికీ ఆ పార్టీలో కొనసాగుతున్న రాజకీయ నాయకురాలు. ఆమె అభ్యర్థిత్వాన్ని నిర్ణయించింది, ప్రకటించింది బిజెపి. ఇదంతా రాజకీయ పార్టీగా బిజెపి ద్వారా జరుగుతుంటే రాజకీయాలు చూడలేమనడం ధృతరాష్ట్ర రాజకీయం కాదా! గిరిజన మహిళ కాబట్టి బలపరుస్తున్నట్లయితే గతంలో ఇదే స్థానానికి పోటీ చేసిన గిరిజన అభ్యర్థిని ఎందుకు బలపరచలేదు? జవాబు లేదు. గిరిజన అంటే ద్రౌపది ముర్మునే కాదు కదా. బిజెపి విధానాల వల్ల లక్షల ఆదివాసీ గూడేల్లో నివసిస్తున్న లక్షోపలక్షల గిరిజనులు నిరాశ్రయులై, దౌర్భాగ్య జీవితాల్లోకి నెట్టబడుతున్న వారి గురించి ఒక్క రోజైనా ఈ పార్టీల ఎంపీలు పార్లమెంట్‌లో మాట్లాడారా? రాష్ట్రపతికి ఏకగ్రీవంగా ఎన్నిక చేయించే ఉద్దేశ్యం బిజెపి కి వుందా? ఇతర పార్టీలను సంప్రదించారా? కనీసం తమను బలపరుస్తున్న పార్టీలతోనైనా మాట్లాడారా? అడక్కపోయినా బలపరచిన పార్టీలను కనీస గౌరవం లేకుండా 'మేము ఎవరి మద్దతు అడగలేదు, వారే వెంటబడి మద్దతు ఇచ్చారు' అంటూ బిజెపి నేతలు అవమానిస్తుంటే 'తుడుచుకొని' పోయే దుస్థితి ఎందుకు వచ్చిందో ఈ రెండు పార్టీల ప్రజా ప్రతినిధులు ఆలోచించాలి.
ద్రౌపది ముర్మును అభ్యర్థిగా నిలిపిన బిజెపికి...ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఎంఎల్‌ఏ, ఎంపీ లేకపోయినా నూటికి నూరు శాతం ఓట్లు పడుతున్న...దేశంలోని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎందుకీ సంపూర్ణ మద్దతు? ఆంధ్ర ప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇరవై సంవత్సరాలు చేసినందుకా? రాజధాని నిర్మాణానికి నిధుల వరద కురిపించినందుకా? పోలవరం ఒక్కటేమిటి అలాంటి వరాల ప్రాజెక్టులు లెక్కకు మిక్కిలి కట్టించినందుకా? విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేసి అలసిపోయినందుకా? ఎందుకు? ప్రశ్నే కాని జవాబు లేదు.
నాటి రాజ్యసభలో ప్రతిపక్ష స్థానంలో వున్న నాటి బిజెపి నాయకుడు వెంకయ్య నాయడు ఐదు సంవత్సరాలు కాదు, పది సంవత్సరాలు హోదా ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చేదేలేదు పొమ్మన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి రాజధాని నిర్మాణానికి చెంబుడు నీళ్ళు, పిడికెడు మట్టి తెచ్చి ఆంధ్రప్రజలను అవమానించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిధుల కేటాయించం పొమ్మన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులు అవుతున్న గిరిజనులను ఆదుకునే బాధ్యత తమది కాదని పదేపదే బిజెపి నేతలు చెబుతున్నారు. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఐదు సంవత్సరాల వరకు సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు ఇచ్చే కనీస బాధ్యతను కూడా మధ్యలో నిలిపేశారు. కడప ఉక్కు, రామయపట్నం ఓడరేవు, విశాఖపట్నంలో రైల్వే జోన్, కేంద్రీయ విద్యాలయాలు, కేంద్ర సంస్థలు ఇలా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఎనిమిది సంవత్సరాలుగా ఆంధ్ర ప్రజలను వేధిస్తూ, అవమానిస్తూ, రాష్ట్రాన్ని ఆర్థిక అధోగతికి దిగజారుస్తున్న బిజెపి కి వైసిపి, టిడిపి పోటీలు పడి మద్దతు ఇవ్వడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం.
ఈ రాష్ట్రంలో ఏ చిన్న అవకాశం దొరికినా మత ఘర్షణలు పెట్టాలని నిత్యం 'కాటికాడ' (శ్మశాన స్థలం) బిజెపి కాపలా కాస్తున్నది. అంతర్వేది రథం తగలబడడం, అనేక దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం, రోడ్ల వెడల్పులో ప్రార్థనా స్థలాల మార్పు, జిన్నా టవర్, చివరికి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు... ఇలా ప్రతిదానిని మత ఉన్మాదంతో బిజెపి వివాదం చేస్తుంది. కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పేరు జత చేస్తే ఆ జిల్లాలో జరిగిన విధ్వంసంలో బిజెపి పాత్ర తెలియనిది కాదు కదా. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా బిజెపి నేతలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు 'బైబిల్ కావాలా, భగవద్గీత కావాలా' అని ఉన్మాద పూరిత మాటలు ఈ పార్టీలు మరచిపోవచ్చు గానీ; సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి, లౌకిక భావాలకు ప్రతీకలైన ఆంధ్ర ప్రజలు మరిచిపోగలరా?
బిజెపి నాయకులు వారిని నడుపుతున్న ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర అధికారాన్ని ఉపయోగించి రాజ్యాంగబద్దంగా రాష్ట్రాలకు రావలసిన హక్కులన్నింటినీ హరించి వేస్తున్నారు. ఒకే దేశం ఒకే పన్ను అంటూ రాష్ట్రాల ఆర్థిక మూలాలను కుదించి వేశారు. రాష్ట్ర జాబితాలో వున్న కీలకమైన విద్య, వైద్యం, విద్యుత్ లాంటి రంగాల్లో వినాశకర విధానాలను బలవంతాన అమలు చేయిస్తున్నారు. ఈ విధానాలను తలకెత్తుకున్న మన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల విలీనం, బైజూస్, వ్యవసాయ పంపు సెట్లకు మోటర్లు...ఇలా రకరకాల పేర్లు పెట్టి తన కాళ్ళకు తానే మొక్కుకొని నూరేళ్ళ ఆయుష్షు అని దీవించుకుంటున్నారు. వాస్తవంగా ఈ విధానాలను మన రాష్ట్రంలో అమలు చేయించడంలో బిజెపికి రెండు ప్రయోజనాలు వున్నాయి. ఒకటి ఈ విధానాల వల్ల తమ అనుకూల కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడం, రెండవది ఈ విధానాల వల్ల ప్రజల్లో వైసిపి మీద వచ్చే వ్యతిరేకతను ఉపయోగించుకొని తాను బలపడడం. ఈ ద్విముఖ వ్యూహంలో భాగమే ఆ పార్టీ నాయకులు వైసిపి, టిడిపిలపై చేసే విమర్శలు, పొగడ్తలు. ఊసరవెల్లి అవసరానికే రంగులు మారుస్తుందంటారు. బిజెపి నిత్యం రంగులు మార్చడం, తనను నమ్మిన పార్టీలను ముంచడమే విధానంగా కలిగిన పార్టీ.
బిజెపి దేశంలో అనుసరిస్తున్న ఆర్థిక, సామాజిక, మతతత్వ విధానాలు ఎంతటి విఘాతాన్ని తెస్తున్నాయో చూస్తూనే వున్నాం. అనేక తరాలుగా నిర్మించుకున్న ప్రభుత్వరంగ సంస్థలను అతి చౌకగా తమ ఆశ్రిత పెట్టుబడిదారులకు అమ్మేస్తున్నారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు, టెలికాం, విద్యుత్, విమానాశ్రయాలు, నౌకాయానం, రైల్వే, రోడ్లు ఒక్కటేమిటి రక్షణ రంగం మొదలుకొని సైన్యం వరకు ప్రైవేటీకరణ విధానాలను అమలు చేస్తున్నారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును అమ్మివేస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ దిగజార్చారు. దేశాన్ని 80 లక్షల కోట్ల అప్పుల ఊబి లోకి నెట్టారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు, సామాజిక భద్రత, లౌకికతత్వాన్ని తీవ్ర ప్రమాదం లోకి పడేశారు. పౌర హక్కులను కాలరాయడం, అతి క్రూరమైన నిర్బంధం, హింస పెచ్చరిల్లిపోయాయి. రాజ్యాంగబద్ద సంస్థలన్నీ కీలుబొమ్మలుగా మారిపోతున్నాయి. ఇలాంటి వినాశకర విధానాలను అనుసరిస్తున్న పార్టీ అభ్యర్థి రాష్ట్రపతి స్థానంలో వుంటే దేశానికి, మనం నిర్మించుకున్న మన రాజ్యాంగానికి రక్షణ ఎలా వుంటుంది?
రాష్ట్రంలో నిత్యం పరస్పరం తీవ్రంగా విమర్శించుకొంటున్న వైసిపి, టిడిపి పార్టీలు కేంద్రం ముందు పిల్లి లాగా ఒదిగివుంటున్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు, దేశ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమైన అనేక వినాశకర చట్టాలను ఈ పార్టీలు పార్లమెంట్‌లో బలపరచాయి. వ్యవసాయ నల్ల చట్టాలు మొదలుకొని అటవీ హక్కుల సవరణ బిల్లు వరకు గుడ్డిగా బలపరచాయి. ఈ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చి పోరాటాలు జరిగితే ఆ చట్టాలనే వీధుల్లో వ్యతిరేకిస్తున్నాయి. ఈ దుస్థితి ఈ పార్టీలకు ఎందుకు వచ్చింది? స్పష్టమైన రాజకీయ విధానం లోపించడం, అవకాశవాదం, అవినీతి విధానాల పర్యవసాన ఫలితమే ఈ హీనస్థితికి మూలం. మార్పు రాజకీయాలంటూ రోజుకో రాజకీయ విధానాన్ని మార్చుకుంటున్న జనసేన బిజెపి విష కౌగిలిలో చేరింది. ఆ పార్టీ నేతకు అండగా నిలుస్తున్న యువత భవిష్యత్తుకు వినాశనాన్ని తెచ్చిపెడుతున్న బిజెపి చంకన చేరి ఏ భారతాన్ని దర్శించమంటున్నారు?
ప్రత్యామ్నాయం అంటే రాజకీయ పార్టీలు ప్రత్యామ్నాయం కాదు. రాజకీయ, ఆర్థిక, సామాజిక విధానాల ప్రత్యామ్నాయం కావాలి. ఆంధ్ర రాష్ట్రంలో వున్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీల విధానాలన్నీ ఒక్కటే. కేంద్రానికి ఊడిగం చేయడం, రాష్ట్రంలో పోట్లాడుకోవడం ద్వారా ప్రజలను మోసం చేస్తున్నాయి. ఈ పార్టీలను బలపరుస్తున్న యువత, మహిళ, విద్యార్థి, కార్మిక, కష్టజీవులు, బుద్ధిజీవులు ఆలోచించాలి. రాష్ట్ర రాజకీయాల్లోకి వినాశకర బిజెపిని స్వాగతించే ఈ పార్టీల విధానాలను ప్రశ్నించాలి. ఎదిరించాలి. రాష్ట్రపతి ఎన్నికలో బిజెపి అభ్యర్థికి వ్యతిరేకంగా నిలిచేటట్లు ప్రజా ప్రతినిధులను డిమాండ్ చేయాలి.
వి. రాంభూపాల్ / వ్యాసకర్త : సిపిఎం ఎ.పి రాష్ట్ర కమిటీ సభ్యుడు /