Jun 12,2022 06:53

రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను, సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వంను కాపాడే వారే రాష్ట్రపతిగా వుండాలనేది అనుభవం. ఇప్పుడు కేంద్రం ఒత్తిళ్లు, బెదిరింపులతో ఫిరాయింపులతో నయానో భయానో సీట్లు కూడగట్టడం చాలా చోట్ల చూశాం. ఆ విధంగా వచ్చే ఎన్నికల తర్వాత సర్కారు ఏర్పాటుపై కూడా రాష్ట్రపతి నిర్ణయం కీలకమయ్యే అవకాశం వుండొచ్చు. లౌకిక శక్తులు తమ బలాన్ని చూపకపోతే ఆయన మరింత పాక్షికంగా వ్యవహరిస్తారనడంలో సందేహం లేదు. కనుకనే వీలైనంత వరకూ ప్రతిపక్షాలు ఒక ఉమ్మడి
అభ్యర్థిని నిలిపే ప్రయత్నం చేయవలసి వుంటుంది. పట్టు విడుపులతో అలాంటి పోటీ అభ్యర్థిని ఎంపిక చేయడానికి అనేక సంప్రదింపులు, కసరత్తు జరుగుతుంది.

వచ్చే జులై 18వ తేదీన కొత్త రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుందని ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. దానికి ముందు నుంచే ఈ విషయమై పలు ఊహాగానాలు, వ్యూహాలు సాగుతూ వస్తున్నాయి. కేంద్రంలో మోడీ అధికారం లోకి వచ్చే సమయానికి ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతిగా వుండేవారు. కాంగ్రెస్‌ వామపక్షాల మద్దతుతో ఎన్నికైనప్పటికీ ఆయన ప్రధాని నరేంద్ర మోడీతోనూ పేచీలు లేకుండా చూసుకున్నారు. మోడీ కూడా తనకు ఆయనపై ప్రత్యేక గౌరవమని చెబుతూ వచ్చారు. మరోసారి కూడా ఆయనను కొనసాగిస్తారనే వరకూ ఈ ఊహలు నడిచాయి. కాని అది జరగదని కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా ప్రధాని రాష్ట్రపతి ఎంపికలో పూర్తిగా తమ మనిషినే ఎంచుకుంటారు. భారత రాష్ట్రపతి పదవి బ్రిటిష్‌ రాణి వలె లాంఛనప్రాయమైనదిగా కనిపించినా ప్రత్యేక పరిస్థితులలో నిర్ణాయకంగా మారుతుంది. కాంగ్రెస్‌ గుత్తాధిపత్యం వున్నంత వరకూ ఈ విషయం పెద్దగా అర్ధం కాలేదు గాని 1977లో ఎమర్జన్సీ తర్వాత కాంగ్రెసేతర ప్రభుత్వాలు మిశ్రమ ప్రభుత్వాలు ఏర్పడుతున్న కొద్దీ ఈ ప్రాధాన్యత మరింత పెరిగింది. ఇంకా వెనక్కుపోతే అసలు ఎమర్జన్సీ విధించడానికి అప్పటి రాష్ట్రపతి ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌ అంగీకరించడమే ఒక విపరీతం. కాంగ్రెస్‌ తరపున నిలబడిన నీలం సంజీవరెడ్డిని అంతకు ముందు పాత కాంగ్రెస్‌ వర్గం, స్వతంత్ర జనసంఫ్‌ు వంటి పార్టీలు బలపర్చగా ఇందిరాగాంధీ ఆత్మప్రబోధానుసారం ఓటేయమని పిలుపునిచ్చి వి.వి.గిరి ని కమ్యూనిస్టుల సాయంతో గెలిపించారు. గిరి తర్వాత కాలంలో అత్యంత విధేయుడైన ఫకృద్దీన్‌ను తీసుకొచ్చారు. ఆయన నోరెత్తకుండా ఎమర్జన్సీ విధించి పరమ నిరంకుశ పాలనకు దస్కతుదారుడయ్యాడు. ఒక విధంగా ఆమె ఓటమికీ బాట వేశారు. ఆమెను ప్రజలు ఓడించి జనతా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత...మారిన పరిస్థితులలో అంతకుముందు ఓడిన సంజీవరెడ్డి...అందరి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. దేశంలో అలాంటి ఏకగ్రీవ ఎన్నిక అదొక్కటే. మిగిలిన రాష్ట్రపతులందరూ ఏవో పార్టీల నుంచి ఎవరో ఒక ప్రత్యర్థిని ఎదుర్కొని గెలవాల్సి వచ్చింది. కేంద్ర రాష్ట్రాలలో భిన్న పార్టీలు పాలించే పరిస్థితి పెరుగుతున్న కొద్ది ఈ పోటీ ఆసక్తికరంగా మారుతున్నది. అయితే ప్రతిపక్ష అభ్యర్థి ఎప్పుడూ గెలవలేదు. దానికి రాష్ట్రపతి ఎన్నిక విధానం కూడా ఒక కారణం.
ఎలక్టొరల్‌ ఓట్ల లెక్కలు
        పదవిలో వున్న రాష్ట్రపతి దిగిపోయేలోగా కొత్త వారి ఎన్నిక జరగాలని రాజ్యాంగంలోని 62(1)వ అధికరణం నిర్దేశిస్తున్నది. అత్యున్నత స్థాయిలో ఎట్లాంటి శూన్యత వుండరాదనేది దీని ఉద్దేశం. రాష్ట్రపతి భారత దేశ సమగ్రతకూ సార్వభౌమత్వానికి ప్రతీక. రాజ్యాంగాధినేత. రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం జులై 25తో ముగుస్తుంది గనక ఆ లోగానే 18న ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఇది కూడా దేశంలోని వివిధ రాష్ట్రాలలో వారం రోజుల పాటు దశలవారీగా కొనసాగుతుంది. రాష్ట్రపతిని ఎంపిలు, ఎంఎల్‌ఎలు కలసి ఎన్నుకుంటారు. దీన్నే ఎలక్ట్రోరల్‌ కాలేజీ అని పిలుస్తారు. ఇందులో ఎంపీల ఓటు విలువ ఎక్కువగా వుంటుంది. రాష్ట్రాలలో 1971 జనాభా ప్రాతిపదికన రాష్ట్రాల ఎంఎల్‌ఎ ఓటు విలువ నిర్ణయమవుతుంది. ఉదాహరణకు యు.పి లో అత్యధికంగా ఓటు విలువ 208 వుంటే సిక్కింలో ఆ విలువ ఏడు మాత్రమే. యు.పి లోని 403 మంది ఎంఎల్‌ఎల మొత్తం ఓట్లకు 83,824 విలువ అయితే సిక్కింలో 32 మంది ఎంఎల్‌ఎల ఓట్ల విలువ 224 మాత్రమే. దేశంలోని మొత్తం 4033 మంది ఎంఎల్‌ఎల ఓట్ల విలువ 5.43 లక్షల ఓట్లు. లోక్‌సభ లోని 543, రాజ్యసభ లోని 233 మంది సభ్యులకు కూడా ఎంఎల్‌ఎల సంఖ్యను బట్టి ఓటు విలువ నిర్ణయమవుతుంది. 5.43 లక్షల ఓటు విలువను మొత్తం 700 (అసలు సంఖ్య 776)తో భాగించి లెక్క కడతారు. అప్పుడు ఎంపీలు, ఎంఎల్‌ఎల ఓట్ల మొత్తం విలువ 10.86 లక్షలకు చేరుతుంది. ఈ ఎన్నికల కసరత్తులో బిజెపి ఎన్‌డిఎ మిగిలిన వారికంటే బాగా ఆధిక్యత కలిగివున్నా మెజార్టీకి దూరంగానే వుంది. ఇప్పటికి ఖాళీగా వున్న 57 రాజ్యసభ స్థానాలను మినహాయించి చూస్తే బిజెపికి 42 శాతం, దాని మిత్రులకు 6 శాతం మొత్తం 5,25,706 ఓట్లున్నాయి. కాంగ్రెస్‌కు 13.5, దాని మిత్రులకు 10.5 శాతం ఓట్లున్నాయి. వామపక్షాలకు 2.5 శాతం వుంటే తృణమూల్‌కు 5.4 శాతం, వైసిపి కి 4 శాతం, బిజెడి కి 2.85 శాతం, ఇతరులకు తక్కినవి వున్నాయి. ఓట్లను బట్టి చూస్తే బిజెపి కూటమికి కేవలం 20 వేల ఓట్లు మాత్రమే తక్కువ పడతాయి. ఇప్పటికే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, ఎ.పి ముఖ్యమంత్రి జగన్‌ ప్రధాని మోడీని కలుసుకుని వచ్చారు. వారు బిజెపి చెప్పిన అభ్యర్థికే ఓటు వేస్తారన్న అభిప్రాయం అందరిలో వుంది. గతసారి కూడా అధికారం లోని టిడిపి, టిఆర్‌ఎస్‌, ప్రతిపక్షం లోని వైసిపి బిజెపి కూటమి అభ్యర్థికే ఓటేశాయి.
రాజ్యాంగ సవాళ్లు - రాష్ట్రపతి
         అందువల్ల ఇక్కడ సమస్య గెలుపు ఓటమి కాదు. మూడు తీవ్ర సవాళ్లను దేశం ముందు ఈ సర్కారు నిలిపింది. దీని దూకుడుకు పగ్గాలు వేసే ప్రయత్నంలో విశాల లౌకిక సమీకరణ ముఖ్యం. 1. మోడీ ఏకపక్ష నిరంకుశ పోకడలు 2. సంఘ పరివార్‌ విశృంఖల విద్వేష రాజకీయాలు నిలవరించడం కీలకం. ఈ విద్వేష రాజకీయాలు వారు కూడా సమర్థించుకోలేని స్థితికి చేరాయనడానికి ఇటీవల ఇద్దరు నేతలపై వేటు వేయడమే తార్కాణం. చార్మినార్‌ సమీపంలో జిన్నా టవర్‌ దగ్గర కూడా ఉద్రిక్తతలు రేగాయి. 3. 2024 ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై కూడా వీటి ప్రభావం చాలా వుంటుంది. 1979, 1989, 1990, 1991, 1996, 1998, 1999 కాలంలో అప్పటి రాష్ట్రపతి నిర్ణయాల కోసం దేశమంతా చూసింది. విపరీతమైన ఉత్కంఠ ఏర్పడటమే గాక వివాదగ్రస్తమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. సంజీవరెడ్డి అనుభవం తర్వాత ఇందిరాగాంధీ అత్యంత విధేయుడైన జైల్‌సింగ్‌ను రాష్ట్రపతిని చేశారు. ఆమె ఆజ్ఞాపిస్తే పార్లమెంటు భవనం పూడ్చడానికి కూడా సిద్ధమన్న జైల్‌సింగ్‌ రాజీవ్‌ గాంధీని క్షణాల మీద ప్రధానిగా చేయడమే గాక చివరి దశలో ఆయనను బర్తరఫ్‌ చేసే అధికారం వుందని వివాదం సృష్టించారు. ఆర్‌.వెంకట్రామన్‌ వంటి వారు జాతీయ ప్రభుత్వం వంటి పేరుతో అనిశ్చిత పరిస్థితి సృష్టించారు. శంకర్‌ దయాళ్‌ శర్మ బాబ్రీ మసీదు విధ్వంసాన్ని అందరికన్నా ముందే ఖండించి లౌకిక భావన చాటారు. ఆయనే 1996లో హడావుడిగా వాజ్‌పేయికి అవకాశమిచ్చి అపకీర్తి మూటకట్టుకున్నారు. ఆ ప్రభుత్వం 13 రోజులలోనే నిష్క్రమించాల్సి వచ్చింది. అందుకు భిన్నంగా తొలి దళిత రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ రాజ్యాంగ సమీక్ష పేరిట వాజ్‌పేయి సర్కారు చేసిన హడావుడికి అడ్డుకట్ట వేసేలా వ్యవహరించారు. అంతర్జాతీయంగానూ అమెరికా కర్ర పెత్తనానికి లోబడనవసరం లేదని చాటారు. కనుక రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను, సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వంను కాపాడే వారే రాష్ట్రపతిగా వుండాలనేది అనుభవం. ఇప్పుడు కేంద్రం ఒత్తిళ్లు, బెదిరింపులతో ఫిరాయింపులతో నయానో భయానో సీట్లు కూడగట్టడం చాలా చోట్ల చూశాం. ఆ విధంగా వచ్చే ఎన్నికల తర్వాత సర్కారు ఏర్పాటుపై కూడా రాష్ట్రపతి నిర్ణయం కీలకమయ్యే అవకాశం వుండొచ్చు. లౌకిక శక్తులు తమ బలాన్ని చూపకపోతే ఆయన మరింత పాక్షికంగా వ్యవహరిస్తారనడంలో సందేహం లేదు. కనుకనే వీలైనంత వరకూ ప్రతిపక్షాలు ఒక ఉమ్మడి అభ్యర్థిని నిలిపే ప్రయత్నం చేయవలసి వుంటుంది. పట్టు విడుపులతో అలాంటి పోటీ అభ్యర్థిని ఎంపిక చేయడానికి అనేక సంప్రదింపులు, కసరత్తు జరుగుతుంది.
వామపక్షాల వైఖరి
        ఈ ఎంపిక విషయంలోనూ మొదటి నుంచి వామపక్షాలు పై గీటురాళ్ల ఆధారంగానే వ్యవహరిస్తున్నాయి. ఏదో వ్యక్తులను బట్టి తాత్కాలిక హడావుడిని బట్టి నిర్ణయాలు తీసుకోలేదు. ఉదాహరణకు జైల్‌సింగ్‌ను మళ్లీ నిలబెట్టాలని ఎన్టీఆర్‌ ప్రతిపాదిస్తే సరికాదని చెప్పాయి. జి.జి.స్వెల్‌ను కూడా అభ్యర్థిగా అంగీకరించకుండా కృష్ణయ్యర్‌ను నిలబెట్టాయి. మహిళ లేదా దళితుల పేరిట ఇతర అంశాలు విస్మరిస్తున్నప్పుడు మొదట నారాయణ్‌ను తర్వాత మహిళను ఎన్నుకోవడం మంచిదని సూచించాయి. శాస్త్రజ్ఞుడి పేరుతో అబ్దుల్‌ కలామ్‌ ఆజాద్‌ను నిలబెట్టి అందరూ బలపర్చాలంటే నిరాకరించి లక్ష్మీ సెహగల్‌ ను నిలబెట్టాయి. రెండు మూడు రాష్ట్ర ప్రభుత్వాలున్న సిపిఎం ఈ విషయంలో ముందు నిలిచింది. అప్పటికీ ఇప్పటికీ బలాబలాల పొందికలు మారినా ఈ మౌలికాంశాలలో మార్పు లేదు సరికదా మరింత అవశ్యకంగా మారాయి. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ సీతారాం ఏచూరి తదితరులతో సంప్రదింపులు ప్రారంభించడం సహజమే అయినా తుది నిర్ణయం ఆచితూచి తీసుకోవడం అనివార్యమవుతుంది.
అభ్యర్థులపై ఊహాగానాలు
        ప్రతిపక్షం తరపున కెసిఆర్‌, శరద్‌ పవార్‌ వంటి పేర్లు చెబుతున్న ఆ పోటీలో వుండేవారు మరే పదవిలో వుండకూడదు. గెలవని స్థానం కోసం ముఖ్యమంత్రి పదవికి ఎవరు రాజీనామా చేస్తారు? నితిష్‌ కుమార్‌ గులాంనబీ ఆజాద్‌ వంటి పేర్లు మొదటే నిలబడకపోవచ్చు. మోడీ జాబితాలో రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, ఆనందీబెన్‌ పటేల్‌, ద్రౌపది ముర్ము వంటి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే పార్లమెంటుకే ముస్లిం అభ్యర్థిని ఎంపిక చేయని బిజెపి ఆరిఫ్‌ లేదా నఖ్వీ వంటి వారిని ప్రతిపాదించే అవకాశం లేదు. తనకన్నా సీనియర్‌ అయిన రాజ్‌నాథ్‌ను మోడీ ఇష్టపడరు. ఇక ఆనందీబెన్‌ గుజరాతీ గనక సమీకరణం కుదరకపోవచ్చు. ఆ విధంగా చూస్తే ముర్ముకే అవకాశాలు ఎక్కువని ఊహిస్తున్నారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా వున్న వెంకయ్య నాయుడుపైనా కొందరు కావాలని ఊహాగానాలు చేస్తున్నా జాతీయ మీడియాలో ఆపేరు కనిపించడం లేదు రామ్‌నాథ్‌ కోవింద్‌ వంటి వీర విధేయులు సంఫ్‌ు గట్టిగా అంగీకరించేవారు మాత్రమే చివరగా అధికార పార్టీ అభ్యర్థి అవుతారు.

                                           రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను, సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వంను కాపాడే వారే రాష్ట్రపతిగా వుండాలనేది అనుభవం. ఇప్పుడు కేంద్రం ఒత్తిళ్లు, బెదిరింపులతో ఫిరాయింపులతో నయానో భయానో సీట్లు కూడగట్టడం చాలా చోట్ల చూశాం. ఆ విధంగా వచ్చే ఎన్నికల తర్వాత సర్కారు ఏర్పాటుపై కూడా రాష్ట్రపతి నిర్ణయం కీలకమయ్యే అవకాశం వుండొచ్చు. లౌకిక శక్తులు తమ బలాన్ని చూపకపోతే ఆయన మరింత పాక్షికంగా వ్యవహరిస్తారనడంలో సందేహం లేదు. కనుకనే వీలైనంత వరకూ ప్రతిపక్షాలు ఒక ఉమ్మడి అభ్యర్థిని నిలిపే ప్రయత్నం చేయవలసి వుంటుంది. పట్టు విడుపులతో అలాంటి పోటీ అభ్యర్థిని ఎంపిక చేయడానికి అనేక సంప్రదింపులు, కసరత్తు జరుగుతుంది.                                         

                                                             తెలకపల్లి రవి