
ప్రపంచ ప్రఖ్యాత రచయిత మార్క్‌ట్విన్ ఒక చిన్న ప్రయోగం చేసి చూడమన్నాడు. ఒక గాజు సీసాలో కొన్ని నల్ల చీమల్ని, మరికొన్ని ఎర్ర చీమల్ని వేసి పరిశీలించమన్నాడు. అవి వేటికవే నింపాదిగా తిరుగుతుంటాయి. కొంత సేపటికి ఆ గాజు సీసాను పైకీ కిందికీ కదిలించి చూడమన్నాడు. దానివల్ల చీమలు ఒకదాని మీద ఒకటి కుప్పలుగా పడిపోతాయి. దాంతో చీమల ప్రవర్తనలో మార్పువస్తుంది. నల్లచీమలు-ఎర్రచీమలే తమని చంపుతున్నాయి అని అనుకుంటాయి. అలాగే ఎర్రచీమలు తమను నల్లచీమలే చంపుతున్నాయి అనుకుంటాయి. గమనిస్తే నల్ల చీమలు- ఎర్ర చీమలు చంపుకోవడం ప్రారంభిస్తాయి. నిజానికి అక్కడ అసలు శత్రువు ఎవరూ అంటే... గాజు సీసాను పైకి కిందికీ ఊపి, చీమల ప్రశాంతతను చెడగొట్టినవారు. ఆ రెండు రకాల చీమల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి-వాటి మధ్య అంతర్యుద్ధానికి కారణమైనవారు - వారే అసలు దోషులు! ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నదీ అదే. ఇక్కడి ప్రజలు ఒకరికొకరు శత్రువులు కారు. ప్రజల మధ్య శత్రుత్వాన్ని పెంచి పోషిస్తున్నది పాలకులేనన్నది బహిరంగ రహస్యం. తెల్లరంగుకూ నల్లరంగుకూ మధ్య, పురుషులకూ స్త్రీలకూ మధ్య, ధనిక పేద వర్గాల మధ్య, అగ్ర, నిమ్న వర్ణాల మధ్య వివిధ జాతుల మధ్య, మతాల మధ్య నిరంతరం ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నది దెవరు? ఎప్పుడో మార్క్‌ట్విన్ చెప్పిన ప్రయోగం ఈ దేశంలో శతాబ్దాలుగా జరుగుతూనే ఉంది. సమకాలీనంలో మరీ ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ సమాజపు గాజు సీసాను కుదుపుతున్నది ఎవరో వివేకవంతులైన సామాన్య ప్రజలు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉండాలి !
కొందరు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి స్వంత బిడ్డల్ని సైతం చంపుకునే వరకు వెళుతున్నారు. మనుషుల్ని నరికి వండుకుతినే వరకు వెళుతున్నారు. ఇందులో విద్యావంతులు అవునా కాదా అనే దానికి ప్రాధాన్యత లేదు. ఆటవికులా? గ్రామీణులా? నగరవాసులా? అనే దానికి కూడా ప్రాధాన్యత లేదు.
సమాజంలో కొందరు వ్యక్తులు పనిగట్టుకుని అంధవిశ్వాసాలు ప్రజల జీవితాల్లో ప్రధాన భాగమై ఉండేట్లు జాగ్రత్తలు తీసుకుంటారు. అలా జనాన్ని నిస్సహాయులుగా తయారు చేసి, వారిపై తమ పట్టు బిగిస్తారు. కొందరు కొంత కాలానికి తమ విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి, ఒక్కోసారి అమానవీయంగా కూడా ప్రవర్తిస్తుంటారు. నిత్యం మనం అలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. మెదడులో జరిగే ఈ పరివర్తనల్ని మానసిక శాస్త్రం పూర్తిగా వివరిస్తుంది. నేటి యువతీ యువకులు అలాంటి విషయాలు అధ్యయనం చేయడం అవసరం. ఎవరి మెదుడును వారు అదుపులో ఉంచుకుంటే చాలు విద్యావంతులు కూడా అవసరమైన సైన్సు, తర్కం, విశ్వ పరిజ్ఞానం, చరిత్ర వంటివి వదిలేసి మహిమలు, మాయలు, సినిమాలు, టెలివిజన్ సీరియల్స్, రియాల్టీషోలు... అందులో అక్రమ సంబంధాల కథలు, అక్రమ సంపాదనల కథలు, అక్రమ మార్గాన అధికారపీఠాలెక్కే కథలు చూస్తూ ప్రభావితులవుతున్నారు. అనైతికంగా కోట్ల ఆస్థుల్ని స్వంతం చేసుకునే సన్నాసుల జీవిత చిత్రణలు జన సామాన్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయీ? కొంచెం ఆలోచించుకోవాలి కదా? రాబోయే తరాలకు మనం ఎలాంటి సమాజాన్ని ఇవ్వబోతున్నామో విశ్లేషించుకోవాలి కదా?
నిత్య జీవితంలో మనం నీరు కాచి వడబోసి తాగుతున్నాం. ఎందుకూ? ఆరోగ్యం కాపాడుకోవడం కోసం. ఆహారం తీసుకోవడంలో శుభ్రతని పాటిస్తున్నాం. వాతావరణ కాలుష్యాల నుంచి తప్పించుకుంటున్నాం. ఇవన్నీ ఎంతో ప్రాధాన్యమున్న అంశాలు. అలాగే మూఢ నమ్మకాలకు బలికాకుండా ఆరోగ్యకరమైన ఆలోచనలతో జీవితం గడపడం అవసరం.
''ఉనికిలో లేని ఒక 'ఉత్పతి'్తకి (PRODUCT) చేసే వ్యాపార ప్రకటనే - మతం'' -క్లైవ్ జేమ్స్.
(ఆస్ట్రేలియన్ రచయిత, జర్నలిస్ట్. 57 సంవత్సరాలు యూ.కె.లో 'టెలివిజన్ సమీక్షకుడిగా, వ్యాఖ్యాతగా వ్యవహరించారు)
వీటన్నిటికి తోడు ప్రధానులు, ముఖ్యమంత్రులు, గవర్నర్ల వంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఇతరత్రా ఉన్నత స్థాయిలో ఉన్నవారి ప్రవర్తనల్ని, వారి ఉపన్యాసాల్ని జనం విశ్లేషించుకుంటూ ఉండాలి. అవి మన రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేదా అని అవలోకించుకుంటూ ఉండాలి. ఉన్నతస్థితికి చేరినంత మాత్రాన వారికి మానసిక బలహీనతలు ఉండవని కాదుగదా? బలాలతో పాటు బలహీనతలూ ఉంటాయి. పైగా వారి ప్రాచుర్యాన్ని సమాజంలో నిలుపుకోవడానికి జనంలో ఉన్న బలహీనతల్ని కాపాడే ప్రయత్నమే చేస్తారు. జనం బలహీనతల్ని వదిలించే ప్రయత్నం ఏ మాత్రమూ చేయరు. దొంగ సన్యాసుల కాళ్లు మొక్కుతూ సామాన్య జనానికి వీరు కూడా ఒక 'సూచన' చేస్తుంటారు. ప్రజలు తాము నిత్యం ఎదుర్కొనే సమస్యలపై పోరాడకుండా ఉంటేనే వారిని పరిపాలించడం సులభమని వీరికి తెలుసు అలాంటి సంకేతాల్ని జనం తిప్పి కొట్టాలి. ఏమాత్రం ప్రభావితం కాకుండా ప్రశ్నించడాన్ని, సంఘర్షిస్తూ తమ హక్కులను సాధించుకోవడాన్ని ఏ మాత్రమూ వదులుకోకూడదు.
''జనం గ్రహించే విధంగా అబద్దాలను ఎండ గట్టడం, నిజాలను నిర్భయంగా ఎలుగెత్తి చెప్పడం మేధావుల కర్తవ్యం'' అని అన్నారు నోమ్‌చామ్‌స్కీ- (అమెరికన్ భాషా శాస్త్రవేత్త, తాత్వికుడు, సామాజిక సమీక్షకుడు, రాజకీయ కార్యకర్త). ఏ ఆలోచనలైతే వాస్తవానికి దగ్గరగా ఉంటాయో, జన బాహుళ్యానికి ఉపయోగకరంగా ఉంటాయో, మానవీయ విలువలతో ఉంటాయో వాటినే మనం ఆచరించాలి. వాటి గురించే ఇతరులకు చెప్పాలి. అంతే! అందుకు విరుద్ధంగా అంధవిశ్వాసాల మీద ఆధారపడ్డ ఆలోచనలను సమూలంగా నాశనం చేయాలి. అహింస, ద్వేషం, హేతువాదంతో జయించాలి! అందుకు అనుక్షణం సంసిద్ధులమై ఉండాలి !
(వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.)
డాక్టర్ దేవరాజు మహారాజు