
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జయహో బి.సి పేరిట నిర్వహించిన సభలో వెనుకబడిన తరగతులవారికి ప్రయోజనం కలిగించే ఒక్కటైనా కొత్త పథకం గాని, వారి సంక్షేమానికి అదనంగా నిధులు కేటాయిస్తూ గాని ప్రకటించకపోవడం ఆ తరగతులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రపంచీకరణ ధాటికి వృత్తులు దెబ్బతింటుండగా వాటిని నిలబెట్టడానికి ప్రభుత్వం వృత్తిదారులకు ఎలాంటి మద్దతు కల్పిస్తుందో చెప్పకపోవడం వారికి ఆవేదన మిగిల్చింది. రిలయన్స్ సంస్థ సెలూన్లలో అధునాతన హంగులు ఏర్పాటు చేసి యువతను ఆకర్షించడంతో అటువైపు మళ్లుతున్నారు. దాంతో సాధారణ క్షౌరవృత్తిదార్లు పని కోల్పోతున్నారు. ఇలా కార్పొరేట్ల తాకిడికి చేతివృత్తులు కకావికలమవుతున్నాయి. కాని, అదే రిలయన్స్ గ్రూపునకు చెందిన (ఆంధ్రప్రదేశ్‌తో ఎలాంటి సంబంధంలేని) పరిమళ్ నత్వానీకి అధికార పార్టీ రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టింది. వృత్తులను దెబ్బతీసే కార్పొరేట్లకు పదవులివ్వడమే బిసిల ఉద్ధరణా అని కొందరు బుద్ధిజీవులు ప్రశ్నిస్తున్న పరిస్థితి.
కులాల వారీగా కార్పొరేషన్‌లు ఏర్పాటు చేయడం, వాటిలో కొందరికి పదవులివ్వడమే ప్రధానాంశంగా ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీీ వాటికి నిధులు కేటాయించనందున అవి ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాయి. అంతేగాక వివిధ వృత్తుల వారికి నవరత్నాలలో భాగంగా ప్రకటించిన పథకాలకు సంబంధించి చిన్నచిన్న కారణాలతో చాలామందికి సర్కారు నుండి లబ్ధి చేకూరడంలేదు. అర్హులైన అనేకమందికి సంబంధించిన వివరాల నమోదులో స్పెల్లింగ్ తప్పుల వంటి వాటి కారణంగా లబ్ధికి దూరం చేయడం బాధాకరం. అటువంటి లోపాలను ఆన్‌లైన్‌లో సరిదిద్దేందుకు తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తేనే సామాన్యులకు మేలు కలుగుతుంది. ఈ నేపథ్యంలో బిసిల సంక్షేమం కోసం, వివిధ వృత్తుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడంతోబాటు అర్హులైనవారందరికీ పథకాలు అందే విధంగా తప్పొప్పులను సరిదిద్దేందుకు ఆన్‌లైన్‌లో ప్రత్యేక అవకాశం కల్పించడం అవసరం.
'మరో 18 నెలల్లో రాష్ట్రంలో యుద్ధం జరగబోతోంది. ఇది మంచికి చెడుకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది నా మాటగా ప్రతి ఇంట్లో చెప్పండి' అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించడం ద్వారా ఈ సభ ఎన్నికలకు సన్నాహకమేనని చెప్పకనే చెప్పారు. వైసిపి ప్రభుత్వ హయాంలో బిసిలకు ఉత్తమాటలకు పరిమితం కాకుండా బిసిలకు రాజ్యాధికారం పంచామని, ఈ విషయాన్ని ప్రతి 50 ఇళ్లకు ఒక కార్యకర్త వెళ్లి చెప్పాలన్నారు. ఇదే విషయాన్ని గురువారంనాటి పార్టీ సమావేశంలో చర్చించి వారికి 'గ్రామ సారథులు'గా నామకరణం కూడా చేశారు. అధికార పార్టీ ఎన్నికల సన్నాహ సభకు జనాన్ని సమీకరించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి బస్సులను వినియోగించారు. బుధవారం విజయవాడలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపున రాష్ట్రమంతటి నుండి బస్సులు మళ్లించడంతో ఆయా ప్రాంతాల్లో సాధారణ ప్రయాణికులు ఇక్కట్ల పాలయ్యారు. ప్రజల బాధలపై మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, వివిధ ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు చిన్నపాటి నిరసన కార్యక్రమానికి, సభలకు, ప్రదర్శనలకు పిలుపునిచ్చినా గృహ నిర్బంధాలు, అడ్డగింతలు, విపరీత ఆంక్షలు విధించే పోలీసు యంత్రాంగం బుధవారం నాడు ప్రేక్షక పాత్ర వహించడం ఆశ్చర్యకరం. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు అన్ని పార్టీలు, సంఘాల పట్ల సమదృష్టితో చట్ట నిబంధనల ప్రకారం వ్యవహరించాలే తప్ప అధికార పార్టీకి ఒకలా మిగిలిన వారికింకోలా చూడరాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ సమానావకాశాలివ్వడం రాజ్యం బాధ్యత.
ఏది ఏమైనా వెనుకబడిన తరగతుల ప్రజానీకానికి మేలు చేకూర్చేలా ప్రభుత్వం కృషి చేయడం అవసరం. దెబ్బతినిపోతున్న వృత్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టే దిశగా యోచించాలి.