
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రతతో పగటిపూట ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయని, అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా మే నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో వాతావరణంపై సోలార్ రేడియేషన్ ప్రసరణ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. భూమి ఉపరితలంపైకి వచ్చే సూర్యకిరణాల ప్రసరణ వర్షాకాలంలో ఉండే మేఘాల కారణంగా వేసవితో పోలిస్తే ఎండ తీవ్రత తక్కువగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంపై భాగంలో మేఘాలు తక్కువగా ఏర్పడటంతో సూర్యుని నుంచి కిరణాలు పడటం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి అసౌకర్యంతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది.