
న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో... దేశవ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. దీంతో పలు రాష్ట్రాలకు ఐఎండి గురువారం హెచ్చరికలు జారీ చేసింది. గోవాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన ఐఎండి.. రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాలు ముంపునకు గురికావచ్చని, చెట్లు, నివాసాలు కూలిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. అత్యవసర సేవలకు అంతరాయం కలగవచ్చని, దృశ్యమాన్యత తక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది. ఒకవేళ వరదలు వస్తే ప్రజలు సంప్రదించేందుకు ఉత్తర, దక్షిణ గోవాల్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఐఎండి అంచనా ప్రకారం.. బుధవారం రాష్ట్ర రాజధాని పనాజిలో అత్యధికంగా 76.7 మి.మీ వర్షపాతం నమోదైంది.
భారీ వరదలు కేరళను ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో ప్రజాజీవనం స్తంభించింది. పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. పలు జిల్లాల నుండి ప్రజలను సహాయక శిబిరాలకు తరలించారు. వరద నీరు పోటెత్తడంతో ఇడుక్కి జిల్లాలోని మలంకర డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. అలప్పుజ, పధనంథిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, కాసరగోడ్, మలప్పురం జిల్లాలకు ఐఎండి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా గురువారం కూడా ప్రజలను చినుకులు పలకరించాయి. గురువారం ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, ఈ సీజన్ సగటు కన్నా ఒక డిగ్రీ తక్కువ ఉన్నట్లు ఐఎండి తెలిపింది. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురవవచ్చని తెలిపింది.