Feb 12,2023 08:30

ఒకరి గుండెలో జలపాతమై చేరి
మోయలేని బరువు పెంచుతుంది,
మరొకరి గుండెలో చినుకులై చేరి
గిలిగింతలు పెడుతుంది!
ఊహలకు రెక్కలను తొడిగి
వాస్తవాలను పక్కకు నెడుతుంది,
ఎన్నడూ చూడని శూన్యాన్ని కుమ్మరించి
ఎన్నో రంగులను వెదజల్లుతుంది!

కాలం అడుగుల కిందపడి నలిగిపోతూనే
కాలం కౌగిలిలో చేరి కరిగిపోతుంది,
చూపుల సవ్వడిలో చేరి
ఎదురుచూపులనే మిగిలిస్తుంది!
మాటలను మాయం చేసి
మౌనానికి భాషను నేర్పుతుంది,
మనిషిని మాయం చేసి
నీడను మాత్రమే మిగిలిస్తుంది!

అందరిలో ఏకాకితనాన్ని పెంచి
ఒంటరిలో ఏకాంతాన్ని పంచుతుంది,
అనంతమైన ఆకాశాన్ని
గుప్పెడంత గుండెలో దాచేస్తుంది!
ఎక్కడ వెదికినా నేనున్నానంటూ
ఏనాడు చూసినా పరిమళిస్తుంది,
అదే మన ఊపిరికి చిరునామా
దానిపేరే అసలైన అమలిన ప్రేమ!

పుట్టి గిరిధర్‌,
94949 62080