
'ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను ప్రశ్నించిన వారి నోళ్ళు నొక్కుతున్నారని హక్కుల సంఘాల వారు అంటున్నారు. దీనికి మీ సమాధానం ఎంత మరిచిపోదామన్నా, మరువడం కుదరడం లేదు. పగలైనా, రేయైనా, కలలో ఉన్నా, మెలకువలో ఉన్నా అదే చిత్రం విచిత్రంగా పదే పదే కళ్ళ ముందు త్రిడి ఎఫెక్టుతో తారట్లాడుచున్నదే.
అధినేతగా ఎక్కడా, ఏనాడూ పత్రికా సమావేశం పెట్టని మేము, ఇప్పుడు ఇలా కన్నంలో దొంగలా పట్టుబడవలసి వచ్చిందే.
మయసభ నందు భంగపడిన సుయోధనుని చూసి పాంచాలి పక్కున నవ్వినట్టు, అమెరికా జర్నలిస్టు సబ్రినా సిద్దిఖీ సంధించిన ప్రశ్న మా పతనానికి ఓ కారణం కాదు కదా? ఏమా విధి వైపరీత్యము?
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మా గౌరవార్థం ఇచ్చిన విందుకు మేమేల పోవలె. పోయితిమి పో. వారితో కలసి వైట్‌హౌస్ ఒత్తిడి మేరకు ఈ విలేకరుల సమావేశమునకు మొహమాటముతో ఏల అంగీకరించవలె. అంగీకరించితిని పో. ఆ సమావేశమునకు సదరు సబ్రినా సిద్దిఖీ ఏల రావలె? వచ్చినది పో. రాజకీయ వ్యవస్థకే ఆయువుపట్టు వంటి ఆ ప్రశ్ననే ఏల సంధించవలె.
ఊహించని ప్రశ్నకు మా నుండి లిప్తపాటున వచ్చిన సమాధానం.
'అలా అంటున్నారా. ఆశ్చర్యపోతున్నాను. ప్రజలు అడగరే. భారత్ ప్రజాస్వామ్య దేశం. భారత్ -అమెరికా డిఎన్‌ఎ లోనే ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామిక విలువల్లో కుల మత వయోబేధపరంగా భారతదేశంలో వివక్షలేదు.'
మా హృదయమేగా ఆ మాటలు మాట్లాడింది. పైపై పెదాలు కాదుగా. అయినా ఆ క్షణాన మా ముఖమెందుకు అంతగా పాలిపోయింది. దర్పణంలేక పోయినా వివర్ణమైన మా మోము మాకు స్పష్టంగా గోచరించిందే. అవును మా అంతరంగానికి అందని పరిణామమేదో జరుగుతున్నది.
ఇంతకీ ఆమె ఎవరు? పాకిస్తాన్ మూలాలు ఉన్న అమెరికా వాసి. వాషింగ్టన్, గార్డియన్ పత్రికల్లో పనిచేసిన ఘన అనుభవమున్ననేమి? ఆమె స్త్రీయే. అవును స్త్రీయే. ఒక పక్క పాకిస్థానీ మూలాలు. మరో పక్క స్త్రీ. ఈ రెండు కారణాలు చాలు. మా అనుచరగణం వెంటబడి వేధించడానికి. హా..హా..హా...!
మా వారు ప్రభువును మించిన ప్రభు భక్తులని ఆమె ఎరుగరుగాక ఎరుగరు. వారి వికృత విశ్వరూపం చూసి ఎందరెందరో తోకముడిచి మా పంచకు చేరి మా భజన చేసినవారే.
మా భీకర సహచర గణం సాటిలేని అద్వితీయ బూతు పంచాంగంతో ట్రోలింగ్ చేస్తూ ఎవ్వరిపైనైనా ఇట్టే లంఘించగలదు. ఈ అంశంలో వారి సృజనశీలత అపారమైనది సుమా. మాపై విమర్శలు సంధించిన వారిని పుర్రెకు తోచినట్టు అనడం లేదా మేం వినడం లేదా.
కానీ ఇది ఏమి? ఎంతగా సమర్థించు కుందామనుకున్నా కొంగున కట్టిన నిప్పువలె మమ్ములను ఈ అంశము వదలక లోలోన దహించుచున్నదేమి. ఆమెకే అంత కంతకు అంతటయూ మద్దతు లభిస్తున్నదేమి? కడకు వైట్‌హౌస్ ప్రతినిధి వర్గం కూడా ఈ ట్రోలింగ్‌లు తమకు 'అంగీకార యోగ్యం కాదని' ప్రకటించినదేమి? సిద్దిఖీ అడిగినట్లు ప్రశ్నించినవారి నోళ్ళు నొక్కేయడం ఆమెకే ఎదురైన అనుభవంగా లోకం గమనించు చున్నదా..? మా అనుచరగణం ట్రోలింగ్‌లు బూమరాంగ్ వలె మాపై విరుచుకు పడటం లేదుకదా..?!
- కె. శాంతారావు,
సెల్: 9959745723