Mar 26,2023 08:37

నాటకం సార్వజనీనం, సర్వకాలీనం. ప్రాముఖ్యత కలిగిన ప్రాచీన కళల్లో నాటక కళ ఒకటి. ఒక దేశం ప్రేరణా, ప్రమేయం లేకుండా ఈ నాటక కళ వివిధ దేశాల్లో విడివిడిగా ఎదిగింది. దాదాపుగా ఒకే కాలంలో పాశ్చాత్య దేశాల్లోనూ, మనదేశంలోనూ నాటక ప్రక్రియ మొదలయ్యింది. కాలాన్ని బట్టీ, ప్రదేశాన్ని బట్టీ, సంస్కృతిని బట్టీ నాటకం రూపం మారుతుందేగానీ అంతర్లీనంగా దాని మూల సూత్రం మాత్రం అందరికీ ఒక్కటే ఉంటుంది. అందువల్లే నాటకం బహుళాదరణ పొందిన రంగస్థల ప్రక్రియగా విలసిల్లుతుంది. ప్రస్తుతమున్న నాటకం కాలక్రమేణా రూపం మార్చుకుంటా విశ్వజనీనమైంది. దాని గుర్తుగానే ప్రపంచ రంగస్థల దినోత్సవం పుట్టింది. ఈ వేడుకలలో భాగంగా అన్ని దేశాల్లో జరుగుతున్న నాటకాలు, ప్రదర్శనలు ప్రక్రియల ప్రమాణాలపై పరిశీలనలు జరుపుకుంటారు. సీనియర్‌ రచయితలు నటులకు, నటీమణులకు సత్కారాలు చేస్తారు. ఈ ఏడాది మార్చి 27న 61వ ప్రపంచ రంగస్థల దినోత్సవం ఈ సందర్భంగా నాటకరంగం తీరుతెన్నులపై ప్రత్యేక కథనం.

క్రీ.పూ. ఆరో శతాబ్దానికి ముందే ఈజిప్టులో ఆసియా మైనర్‌లో పేషన్‌ నాటకాలు వుండేవని తెలుస్తుంది. క్రీ.పూ.900-800లో రాసిన గ్రీకు నాటకాలలో హౌమర్‌ రాసిన ఇలియడ్‌, ఒడెస్సీ గ్రీకుల మహా గ్రంథాలు, కావ్యాలు ఆధారంగా తీసుకున్నవే అంటారు. గ్రీకు నాటకం పుట్టిందీ, వికసించిందీ ఏథెన్స్‌లోనే. ఇక ఈజిప్టులోని ఆసియా మైనర్‌లో పేషన్‌ నాటకాలు వుండేవి. వాటిని అబిడోఐస్‌ పేషన్‌ ప్లేస్‌ అని అన్నారు. ఈజిప్టు ప్రజల ఆరాధ్యుడిగా, జనన మరణాలకు అధిపతిగా ఒరిసిస్‌ను భావించేవారు. పేషన్‌ నాటకాలు ఈ ఒరిసిస్‌ గౌరవార్థం జరిగే ఉత్సవాలలో ప్రదర్శించేవారు.

1
  • గ్రీకులే ఆద్యులు..

క్రమంగా గ్రీకులు దేవుళ్ళకు, దేవతలకు మానవరూపం కల్పించుకొనేవారు. వారి చుట్టూ ఎన్నోకథలల్లి అనేకపేర్లతో వారు ఉత్సవాలను, క్రతువులను నిర్వహిస్తుండేవారు. ఆయా క్రతువుల్లో మేక చర్మాన్ని ధరించి, చిందులు వేస్తూ స్తుతి గీతాలను గానం చేస్తూ కథలను వినిపించే వారు. ప్రత్యేకత ఏమంటే.. అవన్నీ విషాదాంత కథలే..
నాటక విమర్శకుడు శ్రీనివాస చక్రవర్తి వీటిని భజన బృందాలు అనీ, వారిని కోరస్‌ అని పిలిచేవారని అన్నారు. ఈ బృందం గానం చేసే గీతాలను డిథిరాంట్స్‌ అనేవారు. ఈ బృంద నాయకుడు కొరిఫెకస్‌. ఇతడు మన నాటకాలలో సూత్రధారుడు వంటివాడు. క్రమేణా ఎస్కిలస్‌, సోఫోక్లిస్‌, యూరిపిడిస్‌ అనే ముగ్గురు గ్రీకు విషాదాంత నాటక రచయితలుగా పేరొందారు. ఎస్కిలస్‌ ఎనభై నాటకాలు రాసినా ప్రస్తుతం ఏడు మాత్రమే లభ్యమవుతున్నాయట. సోఫోక్లిస్‌ వందకు పైగా నాటకాలు రాశాడన్నారు. కానీ ఈయనవి కూడా ఏడు మాత్రమే లభ్యమవుతున్నాయి. నాటక పోటీల్లో సోఫోక్లిస్‌ ఎస్కిలస్‌ను ఓడించాడు. ఈ పోటీల్లో 18 సార్లు గెలుపొందాడు. సోఫోక్లిస్‌ వారసుడిగా యురిపిడస్‌ను చెప్తారు. అయినా ప్రవృత్తిరీత్యా సోఫోక్లిస్‌కి పూర్తిగా విరుద్ధ స్వభావం కలవాడు. యురిపిడస్‌ 92 నాటకాలు రచించగా నాటకపోటీల్లో ఐదుసార్లు బహుమతులు గెలుచుకున్నాడు. ఈ రకంగా గ్రీకులో పుట్టిన నాటకం అన్ని దేశాలలోనూ వ్యాపించి, శాఖోపశాఖలుగా విస్తరిల్లి మానవ జీవితాలలో ఒక భాగంగా రూపు దిద్దుకుంది.

  • రోమన్‌లో వినోద క్రీడగా..

రోమ్‌ గ్రీసు దేశాన్ని జయించి, పరిపాలన హస్తగతం చేసుకోవటంతో గ్రీకు సంస్కృతి తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది. గ్రీకు నాటకాల రచనా శైలిని అనుకరిస్తూ రోమన్‌ పురాణాలు, చారిత్రక ఘట్టాలను ఇతివృత్తంగా స్వీకరించి, నాటక రచనలు చేశారు. రోమన్‌ రిపబ్లిక్‌ అవతరించిన తర్వాత ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వినోద క్రీడలలో నాటక ప్రదర్శన కూడా ఒకటి. అప్పట్లో రోమన్‌ల భాష లాటిన్‌. ఆయా నాటకాలు లాటిన్‌ భాషలోనే రాసేవారు. రోమన్‌ నాటక రచయితల్లో లివియస్‌ ఆండ్రోనికస్‌ పితామహుని లాంటివాడు. ఈయన అనేక గ్రీకు నాటకాలను లాటిన్‌లోకి అనువదించాడు. తరువాత మార్కస్‌ పాక్యులియస్‌, సేవియస్‌, ప్లాటస్‌, చెప్పుకోదగిన వారు. ప్లాటస్‌ సుమారు 130 నాటకాలు రాసినట్లు తెలుస్తోంది. వీరిలో (రోమన్‌ నాటక రచయితల్లో) సెనెకాను చివరి వాడిగా చెప్పుకోవచ్చు. ఈయన నీరో చక్రవర్తికి గురువు. నీరో ఆజ్ఞ శిరసావహించి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతటితో రోమన్‌నాటక రంగం అంతరించింది.

2
  • ఫ్రెంచిలో.. విషాద నాటకాలు..

లాటిన్‌ భాష నుంచి ఫ్రెంచ్‌ భాష ఆవిర్భవించింది. ఫ్రాన్స్‌ దేశంలోనూ నాటక కళ బాగా అభివృద్ధి చెందింది. ఫ్రెంచ్‌ నాటక రచయితల్లో పియరీ కార్నియవ్‌, జీన్‌రేసిన్‌, మోలియర్‌, వాల్టేర్‌, రూసో, ఎమిలీజోలా, మేటర్‌విరు, శామ్యూల్‌ బెకెట్‌, యూజినీ ఇయనెస్కో, జీన్‌పాల్‌ సాత్రే, ఆల్బర్ట్‌కామూ వంటి ప్రఖ్యాత రచయితలు ఫ్రెంచ్‌ నాటకరంగాన్ని సుసంపన్నం చేశారు. జీన్‌రేసిన్‌ ఫ్రెంచి నాటకాలు గ్రీకు, రోమన్‌ విషాద నాటకాలకు ధీటైనవని నిరూపించి, అనంతర రచయితలకు మార్గదర్శకుడ య్యారు. ఈయన రాసిన విషాదాంత నాటకాల్లో ఆండ్రోమాన్‌, బెరినైన్‌, ఫెడ్రా ప్రసిద్ధమైన నాటకాలు. ఈయన రాసిన ఫెడ్రా అనే నాటకం మన చిత్రాంగి, సారంగధరుల నాటకాన్ని పోలిన టువంటిది. గ్రీకు నాటకం హిప్పోలిటస్‌ అనే నాటకం ఈ నాటకానికి ఆధారం. మన ఆంధ్రనాటక పితామహుడు ధర్మవరం రామకృష్ణామాచార్యులు రాసిన విషాద సారంగధరం ఈసమయంలో గుర్తుకురాక తప్పదు. సవితి కొడుకును ప్రేమించిన ఫెడ్రా అనే యువతి కథ ఇది. మొలియర్‌ ప్రపంచ ప్రసిద్ధ హాస్య నాటకకర్తగా పేరు గడించాడు. ఎమిలీజోలా 'నేచురలిజం'ను అనుసరించి, నాటకాలు రాశారు. తరువాత కాలక్రమంలో జర్మన్‌, అమెరికా, బ్రిటన్‌, చైనా, జపాన్‌, రష్యా దేశాలతో పాటు పోలెండ్‌, ఐర్లాండ్‌, దేశాల్లో నాటక రంగం పురోభివృద్ధి చెందింది.

  • జర్మనీలో జాతీయ నాటకశాల..

జర్మనీలో 17వ శతాబ్ది ఉత్తరార్ధం వరకు సాంస్కృతిక కార్యకలాపాలకు వేదిక ఏర్పడలేదు. అయినా గ్రీకు, రోమన్‌ సాంప్రదాయాల పద్ధతిలో నాటకాలు ప్రదర్శించినట్లు తెలుస్తోంది. జర్మనీ దేశపు ప్రసిద్ధ నాటక రచయితల్లో గొట్టోల్డ్‌ ఎఫ్రయిమ్‌ లెస్సింగ్‌ ప్రథముడిగా చెప్పుకోవచ్చు. ఈయన తర్వాత క్రిస్టోఫ్‌ మార్టిన్‌ వీలాండ్‌ చక్కటి భాషలో షేక్స్‌పియర్‌ రాసిన 22 నాటకాలను జర్మనీలోకి అనువదించాడు. జర్మనీలో 1755లో గోతాలో మొదటి జాతీయ నాటకశాల నిర్మించబడింది. తరువాత అన్ని ముఖ్య పట్టణాల్లో నాటకశాలలు వెలిశాయి. జర్మనీలో గెటే షిల్లర్‌, ఇఫ్‌లాండ్‌ మొదలైనవారు జర్మనీ నాటక రంగానికి ఇతోధిక సేవ చేశారు. గెటే నాటకాల్లో ప్రసిద్ధమైనది 'డాక్టర్‌ ఫాస్ట్‌'. సృష్టి రహస్యాన్ని ఛేదించడానికి తన ఆత్మను సాటన్‌కు అప్పగించడమే ఈ నాటకంలోని ప్రధానాంశం. నవ సమాజాన్ని దృష్టిలో వుంచుకొని 1907లో స్థాపించిన మ్యూనిచ్‌ ఆర్ట్‌ థియేటర్‌లో రంగస్థల నిర్మాణాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. రీన్‌హార్ట్‌ జర్మనీలో మరొక ప్రసిద్ధ నటుడు. నాటక ప్రదర్శనలో అన్ని శాఖల మీద పట్టు వుండాలన్నది రీన్‌హార్ట్‌ విశ్వాసం.

  • అమెరికాలో.. ఆర్థర్‌ మిల్లర్‌తోనే ప్రఖ్యాతి..

అమెరికాకు స్వాతంత్య్రం లభించిన తరువాతనే నాటక రంగంలో ఆశారేఖలు ప్రసరించాయి. అమెరికా నాటక రంగానికి ప్రఖ్యాతి తెచ్చిన వారిలో ఆర్థర్‌మిల్లర్‌, సమకాలిక సమస్యలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చిన రచయిత. 'ది డెత్‌ ఆఫ్‌ ఎ సేల్స్‌మెన్‌' ఈయనకు సుస్థిర స్థానం సంపాదించి పెట్టింది. కొత్త ఒరవడిని సృష్టించినవారిలో ఎల్మర్‌రైస్‌, నీల్‌సైమన్‌ ప్రముఖులు. రైస్‌ రాసిన 'ఆన్‌ట్రయిల్‌', సైమన్‌ మధ్యతరగతి మనస్తత్వాన్ని చిత్రీకరించిన 'ఆడ్‌కపుల్‌, చాప్టర్‌టు' ఆయనకు పేరు తెచ్చాయి.

  • బ్రిటన్‌లో.. షేక్స్‌పియర్‌ నాటకాలు

బ్రిటన్‌లో నాటక రంగానికి సేవ చేసినవారిలో ప్రథముడు షేక్స్‌పియర్‌. ఆయన సృష్టించిన పాత్రలు నేటికీ జనసామాన్యంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఆయన సమకాలీకులు బెన్‌ జాన్సన్‌, ఫ్లెచర్‌. వీరు కూడా నాటక రంగానికి ఎనలేని సేవ చేశారు. బెన్‌జాన్సన్‌ రాసిన 'వాల్‌పోన్‌, ది ఆల్‌ కెమిస్ట్‌' మొదలైన నాటకాల్లో సుప్రసిద్ధులు. ఈయనను ప్రభుత్వం ఆస్థాన కవిగా నియమించి, ఉపకారవేతనం ఇచ్చింది. సోమర్‌ సెట్‌ మామ్‌ కూడా 19వ శతాబ్దం చివరలో నాటక రచనకు పూనుకున్నాడు. 'లేడీ ఫ్రెడరిక్‌, మిసెస్‌డాట్‌' వంటి ఆహ్లాదకర నాటకాలు రచించాడు. 1908లో మామ్‌ రాసిన నాటకాలు ఒకేసారి వెస్టెండ్‌ నాటక మందిరాల్లో ప్రదర్శించారు. 'ది ఎక్స్‌ప్లోరర్‌, ది సర్కిల్‌, ది కాన్‌స్టాంట్‌ వైఫ్‌' మొదలైన మామ్‌ నాటకాలు ఒకేసారి వెస్టెండ్‌ నాటక మందిరాల్లో ప్రదర్శించారు.
ఆంగ్ల నాటక రంగంలో ప్రయోగాత్మక నాటకాలు రాసిన వారిలో హెరాల్డ్‌ప్రింటర్‌ ప్రముఖులు. ఈయన సుమారు 15 నాటకాలు రచించారు. ప్రింటర్‌ నాటకాలు అబ్బర్డ్‌ శైలికి చెందినవి. 'ది హౌమ్‌ కమింగ్‌, సైలెన్స్‌, బిట్రేయిల్‌' మొదలైనవి ముఖ్యమైనవి. ప్రింటర్‌కు 2005లో నోబెల్‌ బహుమతి లభించింది.

3
  • చైనీస్‌ లిటిల్‌ థియేటర్‌ ఉద్యమం..

చైనాలో 1280 నుంచి నాటక రంగం అభివృద్ధి చెందింది. ఈనాటికీ చైనాలో 14వ శతాబ్దపు సాంప్రదాయ పద్ధతుల్లోనే నాటకాల్ని ప్రదర్శిస్తున్నారు. అలానే నడుస్తున్నాయి కూడా. 19వ శతాబ్దం రెండో భాగంలో 'పెకింగ్‌ ఒపెరా' అనే నూతన సంగీత బాణీలో నాటక ప్రదర్శనలు ఆరంభమయ్యాయి. అది ఇప్పటికీ ప్రజాదరణ పొందుతోంది. లిటిల్‌ థియేటర్‌ ఉద్యమం 1981 తర్వాత చైనాలో ప్రారంభమైంది. ఇది మన వీధి నాటకాల వంటిది. చైనాలో జింగ్‌ జియాంగ్‌, శామ్యూల్‌ బెకెట్‌, బెర్టోల్ట్‌ బ్రెక్ట్‌ మొదలైనవారు ప్రముఖులు. జియాంగ్‌ రచనల్లో బెకెట్‌, బ్రెక్ట్‌ రచనా పోకడలు కనిపిస్తాయి. అధికార పార్టీ ఈయన రచనలను నిషేధించింది. జియాంగ్‌ రాసిన 'ది అదర్‌ ఫోర్‌' నాటకాన్ని ప్రభుత్వం నిషేధించింది. 2000లో నోబెల్‌ బహుమతికి ఎంపిక చేసినా ఆయన నిరాకరించారు.

  • జపాన్‌లో మూడురకాల ప్రదర్శనలు..

జపాన్‌లో జిగాకు, బుగాకు, సరుగాకు అనే మూడు రకాల కళా ప్రదర్శనలు చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకొన్నాయి. ఇప్పుడు బుగాకు పద్ధతి ప్రదర్శనా రూపమే 'ణో' (ఎన్‌.ఓ.హెచ్‌) నాటక ప్రక్రియకు ఆధారం. ఇప్పుడు 'ణో' నాటకాలే ప్రదర్శిస్తున్నారు. 20వ శతాబ్దంలో జపాన్‌ రంగస్థలంలోకి పాశ్చాత్య నాటకాలు ప్రవేశించాయి. జపాన్‌లోని ఫ్రీ థియేటర్‌ సొసైటీ షేక్స్‌పియర్‌, ఇబ్బన్‌, బెర్నార్డ్‌ షా మొదలైనవారి నాటకాలను అనువదించి ప్రదర్శిస్తోంది.

5
  • రష్యాలో టాల్‌స్టాయ్  బోధన సాధనం..

రష్యాలో లియో టాల్‌స్టాయి నాటక రంగాన్ని తన బోధనలకు సాధనంగా వాడుకున్నారు. ఆంటోని చెకోవ్‌, కాన్‌స్టాన్‌టిన్‌ స్టానిస్లవిస్కీ, మాక్సిమ్‌ గోర్కీ, వఖ్తంఘోన్‌ మొదలైనవారు సుప్రసిద్ధులు. 1917 అక్టోబర్‌ విప్లవం నూతన రంగస్థల ప్రక్రియలకు బాటలు వేసింది. మాక్సిమ్‌గోర్కీ విప్లవానికి అతి సన్నిహితుడిగా, భావి రాజ్య పాలకులకు దగ్గరివాడిగా వుంటూ జార్‌ చక్రవర్తుల అన్యాయాలను తన నాటకాలలో చిత్రించాడు. ఇంకోవైపు ఆడ్రయోవ్‌ సోవియట్‌ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే విమర్శకుడుగా పేరు పొందారు. ప్రవాసానికి కూడా వెళ్ళారు. స్టాలిన్‌ మరణం తర్వాత ఈయన నాటకాలు ప్రదర్శించబడ్డాయి. ఏదేమైనా మొదటి నుంచీ కూడా రష్యాలో ప్రభుత్వం నాటక రంగాన్ని శాసించింది.

  • పోలండ్‌లో నేషనల్‌ థియేటర్‌..

1764లో చివరి పోలాండ్‌ రాజు స్టానిస్‌లాస్‌ ఆగస్ట్‌ సోనియా టోవ్‌స్కీ మొదటి పోలండ్‌ పబ్లిక్‌ థియేటర్‌ను 1765లో నిర్మించి, దానికి నేషనల్‌ థియేటర్‌ అని పేరు పెట్టాడు. 1791 నాటి వార్సా పోలండ్‌ నాటక రంగానికి ప్రధాన బిందువుగా నిల్చింది.
పోలండ్‌ నాటక రంగంలో టాడ్యుజ్‌ కేంటర్‌, గ్రోతోవ్‌స్కీ, హెన్రీ టమాస్‌ జూనాస్కీ, జోజెఫ్‌ జాజ్‌నా, ప్లావోమిక్‌ మోజ్‌క్‌లు స్థాపించిన నాటకశాలలు వారి రచనలను ప్రదర్శిస్తూ పేరు ప్రఖ్యాతులు పొందాయి. పోలండ్‌ నాటక రంగంలో ప్రస్తుతం 60 నాటక కంపెనీలు ప్రదర్శనలు ఇస్తున్నాయి. దాదాపు ఆరు వేల మంది సుశిక్షితులైన నటులు వున్నారు. వీటన్నింటికీ ప్రభుత్వం సబ్సిడీలు కల్పించింది. అక్కడ ఆరు నాటక విద్యా సంస్థలున్నాయి. ఇక్కడ నాటకరంగం క్రియాశీలకంగా వుంది.

9
  • ఐర్లాండ్‌లో లిటరరీ థియేటర్‌..

ఐర్లాండ్‌లో 1898లో ఐరీష్‌ లిటరరీ థియేటర్‌ పేరుతో విలియమ్‌ బట్లర్‌ఈట్స్‌, లేడే అగస్టా గైగరీ, జార్జి మూర్‌, ఎడ్వర్డ్‌ మార్టిన్‌లు స్థాపించారు. వీరు 1899 - 1902లో మధ్య కాలంలో ఏడు నాటకాలను ప్రదర్శించటంలో ఐరీష్‌ నాటక రంగం ప్రారంభమైంది. ఐర్లండ్‌ నాటక రంగంలో జాన్‌మిల్లింగ్టన్‌ సింజ్‌ అనే సంచలన నాటక రచయిత రాసిన నాటకాలు ఇతర దేశాలలోనూ ప్రాచుర్యం పొందాయి. సింజ్‌ రాసిన 'ఇన్‌ ది షాడో ఆఫ్‌ ది గ్లెన్‌' అనే నాటకం వివాదాస్పద నాటకంగా పేరొందింది. దానికి కారణం పురుషాధిక్య ప్రపంచాన్ని నిరసించి, పురుషుని దౌష్ట్యానికి, అణచివేతకు గురైన భార్య అతని అహంకారాన్ని సహించలేదు. చివరకు అతనిపై తిరుగుబాటు చేసి మరొకరితో భార్య వెళ్ళిపోవటం అనేది ఇతివృత్తం. ఇది స్త్రీ వాదానికి దగ్గరగా వుంది. ఈయన రాసిన ది ప్లేబారు ఆఫ్‌ ది వెస్ట్రన్‌ వరల్డ్‌, రైడర్స్‌ ఆఫ్‌ ది సీ, ది టింకర్స్‌ వెడ్డింగ్‌ అనే నాటకాలు కూడా వివాదాస్పద సంచలనాత్మకమైన నాటకాలుగా ప్రసిద్ధి చెందాయి. సీన్‌ ఒకాసీ అనే నాటక రచయిత కూడా కమ్యూనిస్టు వామపక్ష భావజాల సిద్ధాంతాలకు ప్రభావితుడయ్యారు. ఒకాసీ నాటకాలన్నీ వివాదాస్పదమైనవే. ఆయన సుమారు ఎనిమిది నాటకాలు ఆయన మరణానంతరం కూడా ప్రదర్శిస్తున్నారు. ఈయన నాటకాలు ప్రదర్శిస్తున్న ఆబీ థియేటర్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
ప్రపంచ దేశాలలో నాటక రంగం నేటి వరకు అనేక ఉత్థాన పతనాలను చవిచూసింది. అయినా నానాటికి ప్రయోగాలతో పరిపుష్టి చెంది, కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంది. భారతీయ నాటక రంగం కూడా ప్రపంచ నాటక రంగంలోని పరిణామాలను సంలీనం చేసుకుంటూ నూతన మార్గాలలో ప్రయాణిస్తోంది. తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి అనుగుణంగానే పయనిస్తున్నాయి.

  • ఇలా వచ్చింది...

వియన్నాలో ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇన్‌స్టిట్యూట్‌ వారు 1961లో నిర్వహించిన తొమ్మిదవ ప్రపంచ కాంగ్రెస్‌లో ఆనాటి అధ్యక్షుడు 'ఆర్వికివియా' ప్రపంచ రంగస్థల దినోత్సవ ప్రతిపాదన చేశారు. సభ్యులందరూ ఆయన ప్రతిపాదనను అంగీకరించారు. ఆ తర్వాత ఏడాది (1962లో) పారిస్‌లో జరిగిన రంగస్థల సమాఖ్యలో పూర్తిస్థాయిలో మార్చి 27వ తేదీన ఈ దినోత్సవం ప్రారంభమైంది. ఆ తర్వాత రంగస్థల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, ఐక్యరాజ్యసమితి, యునెస్కో వారి గుర్తింపు, ప్రాధాన్యత సంతరించుకుంది. 1962లో మొదటి ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశాన్ని 'జీన్‌కాక్టే' (ఫ్రాన్స్‌) అందించారు.

1
  • మూసపద్ధతులు విడనాడాలి : యం.రాం ప్రదీప్‌

ఏ కళా రూపమైనా ఆలోచనతో మొదలై సృజనాత్మకతతో ముగియాలి. అప్పుడే ఆ కళ.. దేశ భాషలు, సంస్కృతి సంప్రదాయాలకు అతీతంగా నిలుస్తుంది. అంతర్జాతీయ సమస్యలను ప్రపంచదేశాలకు ఏకీకృతంగా చూపించగలుగుతుంది. మూస పద్ధతిలో ప్రదర్శిస్తున్న నాటకాల పోకడలకు కొత్త బీజం వేస్తూ రచయితలు సామాజిక, రాజకీయ సమస్యలను, సార్వజనీనకంగా ఉన్న రచనల్లో సమగ్రంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి నాటకాలను ప్రదర్శించడానికి ప్రయోక్తలు, టెక్నీషియన్స్‌ ఎన్నో అధ్యయనాలు చేసి సంగీతంలోనూ, లైటింగ్‌లోనూ పాత్రల ఫ్రీజింగ్‌ లాంటివి సాంకేతికంగా చొప్పిస్తున్నారు. ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ అసోసియేషన్‌ 1943లో దేశంలో ఆవిర్భవించింది. ఈ ఏడాదికి సరిగ్గా 80 ఏళ్లు. నాటి నుండి నేటి వరకు ప్రజలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక కళారూపాల ద్వారా ప్రదర్శనలివ్వడం జరుగుతోంది. సాంఘిక నాటకం ప్రారంభమైంది ఇఫ్టా ద్వారానే. వీరి కళారూపాలతో ప్రజలను, కార్మికులను చైతన్యవంతం చేయడం జరిగింది.. జరుగుతోంది.

  • రంగస్థలం నుంచే సినీరంగానికి..

తెలుగు సినిమా తొలినాళ్ల నుంచే నాటకం ఎంతో ప్రభావం చూపింది. నాటకం చెప్పిన పాఠాల నుంచే సినిమాలు తయారయ్యాయి. నాటకం నుంచి వచ్చిన ఎందరో కళాకారులు తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగారు. టాలీవుడ్‌ ప్రముఖులైన ఎన్‌టి రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, చిత్తూరు నాగయ్య, ఎస్‌వి రంగారావు, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌ రెడ్డి ఇలా ఎందరో గొప్ప నటులు రంగస్థలం నుంచి వచ్చినవారే. అప్పట్లోనే కాదు.. ఇప్పుడు కూడా థియేటర్‌ అనుభవం కలిగిన నటులు టాలీవుడ్‌లో ఉత్తమ నటనను కనబరుస్తూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన నాటక రంగం కళ నేడు వెలవెల బోతుంది. అయినా ఇప్పటికీ నాటకాన్ని ఇష్టపడేవారు ఎందరో ఉన్నారు. నాటకం ద్వారా నేర్చుకున్న పాఠాలే, ఎందరో కళాకారుల్ని వెండితెరపై స్టార్లను చేసింది.

1
  • అంతిమంగా స్పృశించేది నాటకమే..

'నాటకాంతం హి సాహిత్యం' అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ చివరిగా స్పృశించవలసిన అంకం నాటకమని అర్థం. కవిత్వం, వ్యాసం, కథ.. ఇలా అన్ని సాహిత్య ప్రక్రియలను స్పృశించిన తరువాత మాత్రమే నాటకాన్ని రచించాలన్నాడు. అప్పుడు మాత్రమే నాటక రచనకు నిండుదనం చేకూరుతుందని ఆయన భావన. ప్రపంచ సాహిత్యంలో ''మాళవికాగ్నిమిత్రం'', ''అభిజ్ఞాన శాకుంతలం'' వంటి నాటకాల ద్వారా చిరస్థాయిగా నిలిచిపోయిన కాళిదాసు అభిప్రాయం నూటికి నూరుపాళ్ళూ నిజమని ఆధునిక రచయితలు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు. నాటకానికి అంత శక్తి ఉంది. కాబట్టే, ''నాటకం రసాత్మకం కావ్యం'' అన్నాడు.
నాటకం సంగీతం, పాటలు, నృత్యాలతో కూడుకొన్న ప్రక్రియ. యక్షగానానికి రూపాంతరమైన నాటకానికి సూత్రధారుడే ఆయువుపట్టు. ఇందులోని పాత్రలన్నీ తమను తామే పరిచయం చేసుకొంటూ రంగప్రవేశం చేస్తాయి. పదహారవ శతాబ్దంలో ప్రారంభమైన నాటక ప్రక్రియను 'చిందు భాగవతము, యక్షగాన నాటకం, వీధి భాగవతం, బయలాట' అనీ పిలుస్తారు. వీధి నాటకాలను ఎక్కువ ప్రచారంలోకి తెచ్చినవారు కూచిపూడి భాగవతులు. కాకతీయుల కాలంలో ప్రదర్శించిన క్రీడాభిరామం కూడా ఒక నాటకమే. తెలుగు నాటకరంగ చరిత్ర, తెలుగులో ఆదికవిగా పేరుగాంచిన నన్నయ్య తన భారత అవతారికలో రసాన్విత కావ్యనాటకముల్‌ పెక్కుజూచితి అనడాన్ని బట్టి, నన్నయ కాలానికి నాటక ప్రదర్శనలుండేవని అర్థం చేసుకొవచ్ఛు.

  • తెలుగు రాష్ట్రాల్లో..

ప్రముఖ హాస్య రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం 1889లో నాటక రచన ఆరంభం చేశారు. వీరి నాటకాలలో ''గయోపాఖ్యానం'' సుప్రసిద్ధమైనది. 1891లో ''నాగానంద'' ఆంధ్రీకరణతో తెలుగు నాటకరంగంలో అడుగుపెట్టిన వేదం వెంకటరాయశాస్త్రి రచించిన ''ప్రతాపరుద్రీయం'' బహుళ ఖ్యాతి పొందింది. కల్పనా శక్తి రచయితకు సాహిత్య రంగంలో ఎంతటి ఉన్నత స్థానాన్ని అందిస్తుందో ఈ నాటకమే ఉదాహరణ. ఈ నాటకంలో వీరి కల్పిత పాత్రైన యుగంధర మంత్రి చారిత్రక పురుషుడుగా ఆంధ్ర సారస్వతంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. అట్లే పేరిగాడు, విద్యానాథుడు, చెకుముకు శాస్త్రి, ఎల్లి మొదలగు పాత్రలు వీరి రచనా చమత్కారం వలన చిరస్మరణీయమైన పాత్రలుగా రూపొందారు. సుమారు 138 సంవత్సరాల చరిత్ర కలిగిన సురభి కళాకారులు నేటికీ ఎక్కడ నాటకం ఉందంటే అక్కడికి పెట్టేబేడా సర్దుకుని పొట్ట చేతబట్టుకుని వెళ్లి నాటకం ఆడుతున్నారు. ఎక్కడో ఒక మూలనైనా రంగస్థల కళలను ఆదరించే మారాజులు లేకపోతారా అని వారి ధీమా.

2
  • వ్యవహారిక భాషలో సంచలనం..

1887లో ప్రకటితమైన గురజాడ అప్పారావుగారి ''కన్యాశుల్కం'' వ్యావహారిక భాషలో రచించబడ్డ అత్యుత్తమైన నాటకం. 1892, ఆగస్టులో విజయనగరంలోని జగన్నాథ విలాసినీ నాటక సమాజం వారు దీనిని ప్రథమంగా విజయవంతంగా ప్రదర్శించారు. వ్యావహారిక భాషలో ఓ కొత్త మలుపు తెచ్చిన నాటకమిది. ''ప్రతాపరుద్రీయం'', ''కన్యాశుల్కం'' రెండు రాత్రుల రూపకాలు కాగా 1894 ప్రాంతాల నుంచి వివిధ నాటక రచనలు చేసినవారు కోలాచలం శ్రీనివాసరావుగారు. వీరు అధికంగా చారిత్రక నాటకాలు రచించడంచేత ''చారిత్రక నాటక పితామహుడు''గా పేరొందారు. అదేవిధంగా పానుగంటి లక్ష్మీ నరసింహారావు రచించిన తొలి నాటకం ''నర్మదా పురుకుత్సీయము'' 1900లో ప్రకటితమైంది. ముప్పైకి పైగా స్వతంత్ర నాటకాలు రచించిన వీరికి షేక్‌స్పియర్‌ ఆదర్శం. వీరి వచన రచన వ్యావహారికానికి దగ్గరగా ఉండే సరళ గ్రాంధికం. వీరి రచనలలో లోకోక్తులు, పలుకుబడులు అధికం. వీరి నాటకాలలో ''రాధాకృష్ణ'', ''పాదుకాపట్టాభిషేకం'', ''కంఠాభరణము'' ప్రసిద్ధమైనవి. ''కంఠాభరణము'' తెలుగులో పరిపూర్ణమైన స్వతంత్ర స్వతంత్ర ప్రహసనము. 1900 నాటికి తెలుగు నాటక రచన, ప్రదర్శన వ్యాసంగాలు తెలుగురాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకూ వ్యాపించాయి.

  • పెన్షన్‌ ఇచ్చి గౌరవించాలి..

సినిమాకి ముందు నాటకాలకు విపరీతమైన ఆదరణ ఉండేది. విలియం షేక్స్పియర్‌ వంటి ఆంగ్ల కవులు విషాదానికి, హాస్యం జోడించి రచనలు చేశారు. ప్రస్తుతం నాటకాలు ఒకవైపు ప్రేక్షకుల ఆదరణ లేక, మరోవైపు ప్రభుత్వాల నుంచి సరైన ప్రోత్సాహం లేక ఉనికిని కోల్పోతున్నాయి. కళాకారులు కూడా ఉపాధి లేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వాలు నాటకాలను ప్రోత్సహించాలి. కళాకారులకు తగిన గౌరవం ఇవ్వాలి. వారికి అధిక మొత్తంలో పెన్షన్‌ ఇవ్వాలి.

- స్నేహ డెస్క్‌ 9490099006