Oct 01,2023 12:44

ఆరోజు నేను హాస్పిటల్‌కి వచ్చేసరికి నాకోసం ఒక స్త్రీ తన పిల్లవాడితో ఎదురుచూస్తూ కనిపించింది. ఉదయం నేను 12 గంటలకే ఒక సెమినార్‌ ఉందని వెళ్ళిపోయాను. రెండవ పూట నేను హాస్పిటల్‌కి వద్దామనుకోలేదు. కానీ వెళ్ళమనీ నా సిక్స్త్‌సెన్స్‌ ఎందుకో చెప్పినట్లనిపించి బయలుదేరి వచ్చాను.
ముందే నేను రానని చెప్పటం వల్లనుకుంటాను పెద్దగా పేషెంట్లు లేరు. నేను ఆంధ్ర యూనివర్సిటిలో ఎమ్‌బీబియస్‌ చదివి లండన్‌లో కార్డియాలజీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి అక్కడే ఓ ప్రముఖ హార్ట్‌ రీసెర్చి ఇన్స్టిట్యూట్‌లో నాలుగేళ్ళు పనిచేసాను. అక్కడ ఎన్నో గుండె ఆపరేషన్లు విజయవంతంగా చెయ్యటంతో నాకు మంచి కార్డియాలజిస్టు అన్న పేరు వచ్చింది. పెద్ద పెద్ద సర్జన్స్‌ చెయ్యలేని ఎన్నో ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలను నేను విజయవంతంగా చేసి ఎందరికో ప్రాణభిక్ష పెట్టేను. అందుకే నాకు తక్కువ సర్వీసు ఉన్నా రాయల్‌ కాలేజీ ఆఫ్‌ సర్జన్స్‌ (ఎఫ్‌.ఆర్‌.సి.ఎస్‌)లో నాకు ఫెలోషిప్‌ త్వరగా వచ్చింది.
ఆ తరువాత నేను ప్రియంవదని పెళ్ళి చేసుకొని ఇండియా వచ్చి స్వంతంగా హాస్పిటల్‌ కట్టి ప్రాక్టీస్‌ చెయ్యడం మొదలు పెట్టాను. నేను లండన్‌లో ఎఫ్‌ఆర్‌సియస్‌ అవటమే కాకుండా గుండెకు ఎన్నో విజయవంతమైన సర్జరీలు చెయ్యడంతో అనతి కాలంలోనే నాకు మంచి పేరొచ్చింది.
నేను ప్రతీరోజు ఈ సర్జరీల వల్ల రాత్రి 12 గంటల తరువాతే ఇంటికి వెళ్ళేవాడిని. తనకి సమయం ఇవ్వటం లేదన్న కోపంతో ప్రియంవద నన్నెప్పుడూ 'గుండెల్ని కోసే నీకు గుండె లేదు. అందుకే భార్య మనసు అర్థం చేసుకోవటం తెలీదు' అని దెప్పి పొడుస్తూ ఉంటుంది. అయినా నేనేం చెయ్యలేను. డాక్టరుగా ఇవి తప్పవు.
ఇంత చదువు ఎన్నో సర్జరీలు విజయవంతంగా చేసిన నాకు దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదు. ఒక విధంగా నాస్తికుణ్ణి. దానికి కాంట్రాస్టుగా ప్రియంవదకు భక్తి ఎక్కువ. నేను హాస్పిటల్లోని నా గది దగ్గరికి రాగానే ఆ స్త్రీ లేచి నిలబడి నమస్కారం చేసింది. ఆ సమయంలో వచ్చిన ఆ స్త్రీయే నా జీవితంలో ఓ పెద్ద మార్పుకి కారణం కాబోతోందని తెలియని నేను ఆవిడకు ప్రతి నమస్కారం చేసి కాంపౌండర్‌తో ఆమెను లోపలికి పంపించమన్నాను. కొద్ది క్షణాలలో ఆవిడ లోపలికి వచ్చింది. ఆవిడకు 40 ఏళ్ళు ఉంటాయి. తెల్లగా, సన్నగా, ఆకర్షణీయంగా వుంది. ఆమె వెనకాల ఐదారేళ్ళ పిల్లాడు. జీన్‌పేంట్‌, తెల్లటి షర్ట్‌లో సన్నగా, బలహీనంగా ఉన్నాడు.
నన్ను చూసి ఆమె నమస్కారం పెట్టగానే నేను కూర్చోమని చెప్పి కుర్చీ చూపించాను.
'నా పేరు మధూలిక. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ని. వీడు నా కొడుకు శ్రీరామ్‌. ఆరేళ్ళు. వీడు సంవత్సరం నుంచి ఆయాసంతో బాధపడుతున్నాడు. అప్పుడప్పుడు ముఖం నీలిగా మారిపోతూ ఉంటుంది. చాలామంది డాక్టర్లకు చూపించాను. కానీ సరిగ్గా డయాగసిస్‌ చెయ్యలేకపోయారు. ఈ మధ్యన ఆయాసం ఎక్కువై తరచూ గుండెల్లో నొప్పి అంటున్నాడు. మొన్న నా స్నేహితురాలు మీరు మంచి హార్ట్‌ స్పెషలిస్టనీ చెబితే వచ్చాను' అంది చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ. నేను ఆ అబ్బాయిని చూసి 'హారు! నీ పేరేంటి?' అని అడిగితే 'శ్రీరామ్‌' అని చెప్పాడు. నేను వెంటనే స్టెతస్కోపుతో ఆ అబ్బాయి గుండెను పరీక్షించాను.
'దగ్గు వస్తుంటుందా?' అని అడిగాను.
'వస్తుంటుంది డాక్టర్‌. ఈ మధ్యన ఎక్కువైంది. బరువు కూడా ఈ మధ్యన తగ్గుతున్నాడు. నిద్రలో సడెన్‌గా లేచి పోతుంటాడు' అంది మధూలిక.
' మేడం! అబ్బాయికి కొన్ని పరీక్షలు చెయ్యాలి. ఎక్సరే తియ్యాలి కింద మా లేబరేటరీ ఉంది. అక్కడ ఇవి చేయించి రేపు రండి' అని నేను రాసిన టెస్టుల ప్రెస్క్రిప్షన్ని ఆమెకు ఇచ్చాను.
డాక్టర్‌ ! బాబుకి పర్వాలేదా ?' అనీ ఆతృతగా అడిగిందామె.
'టెస్టుల రిపోర్టు చూస్తే గానీ ఏమీ చెప్పలేను. లెటజ్‌ వెయిట్‌. మీ బాధని అర్థం చేసుకోగలను' అన్నాను. ఆమె కాసేపు మౌనంగా ఉండి'ఒకే డాక్టర్‌, రేపు వస్తాను' అని లేచి నిలబడింది.
ఆమె వెళ్ళకుండా అలాగే నిలబడి ఉండటాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను.
'సార్‌! నేను సింగిల్‌ పేరెంట్‌ని. వీళ్ళ నాన్న క్రితం సంవత్సరం కారు ఏక్సిడెంట్‌లో చనిపోయాడు. నేను అభిరామ్‌ని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాను. మా ప్రేమ మా రెండు కుటుంబాలకు ఇష్టం లేదు. జీవితాంతం అభిరామ్‌ తోడుంటాడని ధైర్యంగా ఇంటి నుంచి అతనితో వచ్చేసాను. కానీ ఆ దేవుడు అన్యాయంగా అతన్ని తీసికెళ్ళిపోయి నన్ను ఒంటరిదాన్ని చేసాడు. పోనీ ఈ పిల్లణ్ణి చూసైనా బతుకుదామనుకుంటే వీడి అనారోగ్యం నాకు కునుకు లేకుండా చేస్తోంది. వీడికేమైనా అయితే నేను తట్టుకోలేను'. అంటూ ఏడుస్తూ ఆ పిల్లవాణ్ణి తీసుకొని వెళ్ళిపోయింది.
ఆ మర్నాడు 9 గంటలకే ఆమె మా హాస్పిటల్‌కి వచ్చింది. అప్పటికే ఆ అబ్బాయి రిపోర్టులు నా దగ్గరకు వచ్చేయి .ఆమె వస్తూనే 'రిపోర్టులో ఏముంది డాక్టర్‌' అనీ అత్రంగా అడిగింది.
'మధూలికా! మీరు ధైర్యం తెచ్చుకోవాలి. మీ అబ్బాయి గుండె బాగా వీక్‌ అయిపోయింది. నాలుగు వాల్వుల్లో 80 శాతం బ్లాకులున్నాయి. ఇతనికి గుండె జబ్బు పుట్టినప్పట్నుంచీ ఉంది. మీ కది తెలీలేదు. ఇప్పుడు మరింత అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌లో వుంది. అర్జెంట్‌గా ఇతనికి ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చెయ్యాలి. చేసినా బతికే ఛాన్స్‌ 30 శాతమే' అన్నాను.
నా మాటలతో ఆమె ఆందోళనకి గురైంది. కొద్దిసేపటికే ముఖం మీద చెమట మొదలైంది
'డాక్టర్‌! ఒకవేళ ఆపరేషన్‌ చెయ్యకపోతే?'
'చెయ్యకపోతే ఆరు నెలలు కన్నా ఎక్కువ బతకడు. ఏం చెయ్యాలో మీరు ఆలోచించుకోండి' అన్నాను.
నేను ఆమెతో ఆ విషయం చెబుతుండగానే ఆమె స్పృహ తప్పడాన్ని గమనించి వెంటనే నర్సుని పిలిచి ఒక ఇంజక్షన్‌ ఇప్పించాను. పదినిముషాల తరువాత ఆమె తేరుకుంది. నా దగ్గరకు వచ్చింది.
'మేడం! మీరు బలహీనంగా ఉన్నారు. తొందరేమీ లేదు. మీరింటికి వెళ్ళి తాపీగా ఆలోచించుకొని మీ నిర్ణయం చెప్పండి' అన్నాను ఆమెతో.
ఆమె ఒక్కసారిగా లేచి 'డాక్టర్‌! నేను నిర్ణయం తీసేసుకున్నాను' వెంటనే ఆపరేషన్‌కి ఏర్పాట్లు చెయ్యండి. దానికెంత ఖర్చవుతుందో చెబితే డబ్బు తెచ్చే ఏర్పాటు చేసుకుంటాను' అంది. ఇప్పుడామెను చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతోంది. ఇందాక బలహీనంగా ఉన్న ఆమేనా అనిపించింది.
'డబ్బు గురించి ఆలోచించకండి. మీరు ప్రశాంతంగా ఉండండి. ఈరోజే ఆపరేషన్‌ చేస్తాను.. అంటూ లేచాను.
ఆ రోజు సాయంత్రం శ్రీరామ్‌ ఆపరేషన్‌కి ఏర్పాట్లు చేసాను. అవసరం అయిన టెస్టులన్నీ చేసి వాణ్ణి ఆపరేషన్‌ థియేటర్లోకి తీసికెళ్ళాము. మధూలిక ఒకటే ఏడుపు. నాకు దండం పెట్టి వాణ్ణి ఎలాగైనా బతికించమని వేడుకుంది. ఆమె బాధలో నాకు ఆమె తల్లి మనసు కనిపించింది. కానీ నా చేతులో ఏం లేదు. నేనైతే పెద్దాపరేషనైనా, చిన్నదైనా ఒకే శ్రద్ధతో జాగ్రత్తగా చేస్తాను. ఇప్పటి దాకా నేను 3000 గుండె ఆపరేషన్లు చేసాను. ఎప్పుడూ ఒకే శ్రద్ధ. ఒకటే జాగ్రత్త. శస్త్రచికిత్స విజయవంతమైతే వచ్చే ఆనందం కోట్ల డబ్బు సంపాదిస్తే రాదు. 6 గంటలకి నేను ఆపరేషన్‌ థియేటర్లోకి ప్రవేశించాను. ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ కాబట్టి హార్ట్‌ మిషన్ని గుండె వాల్వులకు అమర్చి గుండె బదులు అది రక్తాన్ని శరీర భాగాలకి అందిస్తుంటే విశ్రాంతి తీసుకుంటున్న గుండెకు ఆపరేషన్‌ చెయ్యాలి.
మా స్టాఫ్‌ ఆపరేషన్‌ థియేటర్లో సర్జరీకి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసారు. నేను ఆపరేషన్‌ టేబుల్‌ దగ్గరికి వెళ్ళగానే శ్రీరామ్‌ నవ్వుతూ నాకు విష్‌ చేసాడు. ఆ పిల్లవాణ్ణి చూడగానే నాకు ఒక్కసారిగా మధూలిక గుర్తుకొచ్చి నా కళ్ళ వెంట నీళ్ళు చెమ్మగిల్లసాగాయి. ఇప్పుడు వీడు నవ్వుతున్నాడు. ఆపరేషన్‌ అయిన తరువాత ఉంటాడో! ఉండడో! తెలియదు. ఎందుకంటే దీని సక్సెస్‌ రేటు 20 శాతమే. నాలుగు వాల్వులు 80 శాతానికి పైగా మూసుకుపోయాయి. ఆ బ్లాకులు తియ్యడం అంత సులభం కాదు.
ఇంతలో శ్రీరామ్‌ నాతో 'అంకుల్‌ ! నాకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేస్తారట కదా. ఇందాకా అమ్మ చెప్పింది అంటే గుండెని కోసి మొత్తం ఓపెన్‌ చేస్తారా?' అని అమాయకంగా అడిగాడు.
నేను వాడి మాటలకు ఆశ్చర్యపడి వాడు భయపడుతున్నాడేమోనని ఆలోచించి 'బాబూ! నువ్వేం భయపడకు. నీకు నొప్పి తెలీకుండా మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి ఆపరేషన్‌ చేస్తాను. సరేనా అన్నాను.
వాడు వెంటనే ' భయపడటం లేదు అంకుల్‌. మా అమ్మ ఇందాక గుండెలో దేవుడుంటాడని చెప్పింది. మీరు గుండెను కోసి ఆపరేషన్‌ చేసినప్పుడు దేవుణ్ణి చూసి ఆపరేషన్‌ అయిపోయిన తరువాత నాకు తెలివిరాగానే ఎలా ఉంటాడో చెప్పండి' అన్నాడు.
వాడి మాటలకు ఒక్కసారిగా నేను ఉలిక్కిపడ్డాను 'దేవుడిని చూసి చెప్పాలా? అదీ దేవుడంటే నమ్మకం లేని నేను. వాడికేం చెప్పాలో అర్థం కాలేదు నాకు. అబద్ధం ఎప్పుడూ చెప్పని నేను ఆ సమయంలో వాడి కోసం 'అలాగే చూసి చెబుతాను' అని అబద్ధం చెప్పాను.
ఆ తరువాత వాడికి ఎనస్తీషియా ఇచ్చి, గుండె దగ్గర కార్డియో పల్మనరీ బైపాస్‌ మెషిను రెడీ చేసి ఉంచాము. దీన్ని హార్ట్‌ లంగ్‌ మెషినంటారు. ఈ మెషిన్‌ గుండెకు ఆపరేషన్‌ చేస్తున్నంత సేపు గుండె చేసే పని అంటే అన్ని భాగాలకు రక్తాన్ని పంపుచెయ్యడం, ఆక్సిజన్‌ అందించడం చేస్తుంది. వెంటనే గుండెను ఓపెన్‌ చేసి గుండె నుంచి అన్ని శరీర భాగాలకు రక్తాన్ని, ఆక్సిజన్ని అందించే రక్తనాళాలను హార్ట్‌-లంగ్‌ మెషిన్‌ ట్యూబులకు కనెక్ట్‌ చేసి ఆపరేషన్‌ మొదలు పెట్టాను. ఆపరేషన్‌ పూర్తవడానికి రెండు గంటలు పట్టింది. వాల్వులన్నీ క్లీన్‌ చేసి అవసరమైన చోట్ల స్టంట్లు వేసాను.
అప్పటికి నా ముఖమంతా చెమటలు పట్టేసాయి. కొద్ది సెకన్లలో గుండె పనిచెయ్యడం ప్రారంభిస్తే ఆపరేషన్‌ సక్సెస్‌. మా డాక్టర్లంతా ఏం జరుగుతుందోనని ఆసక్తిగా గుండె వైపు చూస్తున్నారు!
పది, ఇరవై, ముప్పై సెకనులు! ఒక నిముషం అయిపోయింది. కానీ గుండెలోకి రక్తం రావటం లేదు. అంతా పొడిగా ఉంది. నాకు చెమటలు మరింత ఎక్కువవుతున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది! దాని శబ్దం నాచెవుల్లో వినిపిస్తోంది. లాభం లేదు. నా శ్రమ వృథా అయింది.
నా బాధ అందుకు కాదు. ఆ పిల్లవాడి తల్లి మధూలికకు నా ముఖం ఎలా చూపించాలి? ఆమెకు ఏం చెప్పాలి? ఆ ఆలోచన నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
వెంటనే ఆలోచనల్లోంచి బయటపడి 'డాక్టర్స్‌! ఆపరేషన్‌ ఫెయిల్‌ అయింది' గుండెలోకి రక్తం రావటం లేదు. కమాన్‌బీ మెషిన్‌ ఆపు చెయ్యండి. క్విక్‌! పేషెంట్‌ ఈజ్‌ నో మోర్‌. అయామ్‌ హెల్ప్‌లెస్‌' అన్నాను కళ్ళ నుంచి కారుతున్న నీటిని తుడుచుకుంటూ. ఎప్పుడూ రాని ఏడుపు ఆ క్షణంలో నాకు రాసాగింది.
అలా ఏడుస్తూ పక్కనే ఉన్న టేబుల్‌ మీద కూర్చుండిపోయాను. కొద్ది క్షణాలు ఏం జరుగుతుందో నాకు తెలియటం లేదు. నా మైండంతా బ్లాంక్‌. ఇంతలో నర్స్‌ గట్టిగా 'డాక్టర్‌! రక్తం వస్తోంది' అని అరిచింది. అంతే! ఒక్కసారిగా నేను ఆపరేషన్‌ టేబుల్‌ దగ్గరికి పరిగెత్తి చూసాను. నాలుగు వైపుల నుంచి ఐదు వాల్వుల గుండా రక్తం గుండెలోకి ఒక ప్రవాహంలా వస్తోంది!
నాకు అప్పుడు కలిగిన ఆనందం జీవితంలో ఎప్పుడూ కలగలేదు. అప్పుడు గట్టిగా ఆనందంతో నేను అరిచిన అరుపు ఆపరేషన్‌ థియేటరంతా ప్రతిధ్వనించింది. వెంటనే నేను 'కమాన్‌! మిషన్‌ ఆన్‌ చెయ్యండి. క్విక్‌బీ పేషెంట్‌ బతికాడు. గుండె పనిచేస్తోంది' అని అరిచాను.
అరగంట తరువాత మిషన్ని తీసి దానికి అమర్చిన రక్త నాళాలను గుండెకి అమర్చి కుట్టేసాము. శ్రీరామ్‌ని ఐసీయూకి షిఫ్ట్‌ చేసాము.
రెండు రోజుల తరువాత మధూలికను ఐసీయులోకి తీసికెళ్ళి శ్రీరామ్‌ని చూపించాను.
ఆమె ఆనందంతో నాకాళ్ళకు నమస్కారం పెట్టి 'డాక్టర్‌! నిజంగా మీరు దేవుడు. మీరే నా కొడుకు ప్రాణాలు కాపాడారు' అంది పైట కొంగుతో కళ్ళను తుడుచుకుంటూ...
'అమ్మా! ఆపరేషన్‌కు ముందు శ్రీరామ్‌ 'గుండెల్లో దేవుడుంటాడనీ మా అమ్మ చెప్పింది. ఆపరేషనప్పుడు అతనెలా ఉంటాడో చూసి చెప్పండి ' అని అడిగాడు ఇప్పుడు వాడికి నేనేం చెప్పాలి? పిల్లలకి అమ్మ ఏం చెప్పినా నిజమని నమ్మేస్తారు. వాడికి నేను దేవుడు లేడని చెప్పి అమ్మ మీద వాడికున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యలేను. అలా అని ఉన్నాడనీ అబద్ధం చెప్పలేను. మొన్నటి నుంచి నాలోని ఈ ఘర్షణ నన్ను నిద్ర పోనివ్వటం లేదు' అన్నాను.
అప్పుడు మధూలిక 'డాక్టర్‌! ఇప్పుడు మాత్రం అమ్మ చెప్పింది అబద్ధమెలా అయింది? నిజమే అయింది. ఆపరేషన్‌ ఫెయిలై రక్తం గుండెల్లోకి రాని సమయంలో మళ్ళీ రక్తం ఎలా వచ్చింది? దేవుడు గుండెలో ఉన్నాడు కాబట్టే అలా రక్తం నాలుగువైపుల నుంచి తన్నుకు వచ్చి వాడికి ఆయుష్షు పోసింది. లేకపోతే సాధ్యమా చెప్పండి. దేవుంటే వ్యక్తే కానక్కర్లేదు. మీరే దేవుడు రూపంలో వచ్చి వాడిని బతికించారు. దేవుడంటే అనుభవం. మీరు వాడి గుండెల్లో రక్తాన్ని చూసి ఆనందాన్ని అనుభవించారు. ఆ అనుభవమే దేవుడు. మీరు వాడితో దేవుణ్ణి చూసాననీ, రక్తంలో కలిసిపోయి ఎర్రగా రక్తంలా ఉన్నాడనీ చెప్పండి!' అంది ఆనందంతో.
మధూలిక మాటలు నా చెవులకు అమృత ప్రాయంగా వినిపించ సాగాయి. ఆమె మాటలు విన్న తరువాత నాకు 'ఎదలో వినిపించేది సవ్వడి కాదనీ, అది ప్రణవనాదమనీ అనిపించింది. వెంటనే ఆమెకు రెండు చేతులు జోడించి దండం పెట్టాను. పదిరోజుల తరువాత శ్రీరామ్‌ డిశ్చార్జి అయి ఇంటికి వెళ్ళిపోయాడు.
మధూలిక ఫీజు గురించి నన్ను అడిగినపుడు ' ఫీజు ఇవ్వక్కర్లేదు. వాడు పెద్దవాడై , వృద్ధిలోకి వచ్చినపుడు అన్నార్తులకు సహాయం చెయ్యమనండి. ఇప్పుడు వాడిని కాపాడిన దేవుడు అప్పుడు సంతోషిస్తాడు.' అని నేను చెప్పగానే ఆమె, పిల్లాడు శ్రీరామ్‌ నాకు దండం పెట్టి వెళ్ళిపోయారు.

గన్నవరపు నరసింహ మూర్తి, 

93267 35406