Jan 29,2023 08:08

వంటింటి పనంతా పూర్తవడంతో తలుపులన్నీ మూసి బెడ్‌రూమ్‌లోకి అడుగుపెట్టింది రాజీ.
బాబు ఉయ్యాలలో హాయిగా నిద్రపోతున్నాడు.
'బాబును నిద్ర పుచ్చారా?' ఆనంద్‌కు గ్లాసుతో మజ్జిగ ఇస్తూ అడిగింది.
'మరి? ఇంటెడు చాకిరీ చేసి చేసి అలిసిపోతావ్‌ కదా! నీకామాత్రం సాయం చేయకపోతే ఎలా?' రాజీని క్రీగంట కొంటెగా చూస్తూ అన్నాడు.
'చూసింది చాలు. మజ్జిగ తాగండి ముందు' అంది నవ్వుతూ.
'ఏం ? నువ్వివ్వగానే తాగకపోతే మజ్జిగ చల్లారి పోతుందా?' అడిగాడు.
'మజ్జిగ చల్లారిపోవడం ఏమిటండీ? అదేమైనా టీయా, కాఫీయా.. చల్లారి పోవడానికి? ఈ రోజేంటో కొత్తగా మాట్లాడుతున్నారు. బాబు ఎంత ఏడ్చినా ఊరుకోపెట్టకుండా నన్ను పిలిచే మీరు బాబును నిద్రపుచ్చారు. మజ్జిగా.. వేడి.. అంటున్నారు. ఏమిటి కారణం?' మంచంపై ఆనంద్‌ పక్కన కూర్చుంటూ అడిగింది.
'కనిపెట్టేశావే రాజీ! నా ఫేసులో మార్పులు అద్దం కన్నా ముందే ఇట్టే కనిపెట్టేస్తావ్‌' అన్నాడు.
'అవునూ.. పిల్లల్ని కనిపెట్టడానికేగా మీరు నన్ను చేసుకున్నది. నేను కొలంబస్‌నీ కాను, మీరు అమెరికా అంతకన్నా కాదు. మీ తీరు వింతగా అనిపిస్తోంది అంతే' అంది రాజీ ఆనంద్‌ కేసి విచిత్రంగా చూస్తూ!
'చూసింది చాలుగానీ బాబుకు పేరేం పెడదాం?' అసలు విషయానికి వస్తూ అన్నాడు.
'ఏ మహేష్‌బాబో, విజరు అనో ఎంచక్కా సినిమా హీరో పేరు పెడదాం. మనవాడు హీరోలా వుంటాడుగా' అంది మురిపెంగా వాడికేసి చూస్తూ.
'సినీహీరో అని తెగ మురిసిపోకు. వాడు పెద్దయ్యాక హీరోయిన్స్‌ వెనుకపడి నిన్నూ, నన్నూ పట్టించుకోడు' అన్నాడు ముందుచూపుతో.
'నే చెప్పే పేరు నచ్చనప్పుడు, మీ మనసులో ఉన్న పేరు చెప్పేయచ్చుగా.. డొంక తిరుగుడెందుకు?' విసుక్కుంటూ గట్టిగా అంది రాజీ.
రాజీ అలా అరిచేసరికి ఉయ్యాలలో పడుకున్న బాబు ఉలిక్కిపడి లేచి, ఆరున్నొక్క రాగం అందుకున్నాడు. రాజీ మంచంపై నుండి అమాంతం లేచి, బాబుకు పాలు పట్టించే పనిలో పడింది.
'ఇక వాడు పడుకునేవరకూ రాజీ నన్ను పట్టించుకోదు. నామాట చెవిని పెట్టదు' అనుకుంటూ ఆరోజు ఉదయం ఆఫీసులో బాస్‌తో జరిగిన సంభాషణను గుర్తుచేసుకొన్నాడు.
బాస్‌ గదిలో ఆనంద్‌ అడుగు పెడుతూనే 'మే ఐ కమిన్‌ సర్‌?' అన్నాడు నెమ్మదిగా.
'ఎస్‌' అంటూనే ఆనంద్‌ కేసి ఎందు కొచ్చావన్నట్టుగా చూశాడు బాస్‌.
ఆనంద్‌కు ఎలా అడగాలో తెలియక చుట్టూ ఉన్న కిటికీల కేసి, గోడల కేసి చూడసాగాడు.
'గోడల కేసి చూడటానికి వచ్చావా? నాతో మాట్లాడటానికి వచ్చావా?' బాస్‌ సీరియస్‌గా అడిగాడు.
బాస్‌ అరుపువిని ఉలిక్కిపడిన ఆనంద్‌ 'సార్‌! నా ప్రమోషన్‌ ఫైల్‌ మీద మీ సైన్‌ పెట్టమని అడగడానికి వచ్చాను సార్‌!' అన్నాడు అతి వినయంగా.
'నే సైన్‌ పెడితే ఏమౌతుందట?' కళ్ళు ఎగరేస్తూ ఏమీ ఎరగనట్టుగా అడిగాడు బాస్‌.
'నాకు.. ప్రమోషన్‌.. కన్ఫర్మ్‌ అవుతుంది.. సర్‌'! మెల్లగా అన్నాడు.
'అయితే నువ్వో పని చేయాలి' సీటులోంచి లేస్తూ ఆనంద్‌ వద్దకు వచ్చాడు బాస్‌.
'ఏం చేయాలి సర్‌? కొండ మీద కోతిని తేవాలా.. కరోనా కాలంలో మాస్క్‌ లేకుండా బయటకు వెళ్లి తిరగాలా.. లేక తిరుపతికి వెళ్లి మీకు బదులుగా నేను గుండు కొట్టించుకోవాలా.. చెప్పండి సర్‌.. సెలవివ్వండి సర్‌' ఆవేశంగా అన్నాడు ఆనంద్‌.
బాస్‌ ఆనంద్‌ భుజం మీద చేయి వేస్తూ 'అంత పెద్ద పెద్ద పనులు అవసరం లేదోరు. మీ అబ్బాయికి నేను చెప్పిన పేరు పెట్టాలి' అన్నాడు గంభీరంగా.
ఆనంద్‌ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. 'ఏంటి సార్‌.. మీరు పెడతారా.. మా బాబుకి పేరు..? అంతకంటే అదృష్టమేముంటుంది సార్‌! ఏం పేరో చెప్పండి సార్‌.. మీరు మా మీద ఇంత శ్రద్ధ చూపిస్తుంటే నాకెంత గర్వంగానో ఉంది సార్‌..' మనస్ఫూర్తిగా అన్నాడు ఆనంద్‌.
'పుల్లయ్య' ! అన్నాడు బాస్‌ చిరునవ్వుతో.
బాస్‌నోట 'పుల్లయ్య' మాట వినగానే ఆనంద్‌ ఆవేశం మీద నీళ్ళు చల్లినట్లయింది. ఆనందం చప్పున చల్లారిపోయింది. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది. మాట పెగల్లేదు. గొంతు సవరించుకుని..
'సర్‌! తెలుగు భాషలో నాకు నచ్చని ఓకే ఒక పదం ''పుల్లయ్య''. మీరు.. ఆ పేరు.. నేను పెట్టలేను సర్‌.. పెట్టనంటే పెట్టలేను!' ఎంతో దీనంగానే అయినా ఖరాఖండిగా అన్నాడు.
'లేదు ఆనంద్‌. పుల్లయ్య నాకెంతో ఇష్టమైన పేరు. మా నాన్న నన్ను ఆ పేరుతో ముద్దుగా పిలిచేవాడు. నాకు ఇద్దరూ కూతుళ్ళే అవడంతో ఆ పేరు పెట్టలేకపోయాను. నా కూతుళ్లకూ కొడుకులు పుట్టలేదు. దాంతో పుల్లయ్య పేరు తీరని కోరికగా మిగిలిపోయింది. నా కోరిక నువ్వు తీర్చు.. నీ కోరిక నేను తీరుస్తాను' బాస్‌ నిర్ద్వంద్వ నిర్ణయం.
'సార్‌! తప్పదంటారా'?
'పేరుపెట్టు - ప్రమోషన్‌ కొట్టు. ఇక నోమోర్‌ డిస్కషన్స్‌'! వెళ్ళమన్నట్టుగా చూస్తూ వెళ్లి సీట్‌లో కూర్చున్నాడు బాస్‌.
'సార్‌.. సార్‌.. పుల్లయ్య అనే పేరు పెట్టలేను సార్‌' బాధగా వెడుతున్నవాడు కాస్తా వెనక్కు తిరిగి మళ్ళీ అన్నాడు.
'ఏం?' బాస్‌ అడిగాడు.
'అలా అడిగారు బావుంది. ఆ పేరు మా మామగారి పేరు. ఆయన బతికుండగానే..' అని నసిగాడు.
'ఫర్వాలేదు. ఇంకేం మాట్లాడకు, వెళ్ళు' బాస్‌ ఆర్డర్‌ వేసినట్టుగా బైటకి వెళ్లమని చెప్పాడు.
చేసేది లేక కాళ్ళీడ్చుకుంటూ బయటకు వచ్చేశాడు ఆనంద్‌.
రాజీ పెట్టే గురక చప్పుడుకు ప్రస్తుతంలోకి వచ్చాడు. 'నిద్రలోకి వెడితే కుంభకర్ణుడూ, నువ్వు ఒక్కటే!' అనుకున్నాడు. ఉయ్యాలలో హాయిగా నిద్రపోతున్న బాబు దగ్గరకు వెళ్ళాడు. 'ఏరా బాబూ! ఏడుస్తూ పుట్టే బదులు, నీపేరు కూడా పెట్టేసుకుని పుట్టచ్చు కదరా. ఇప్పుడు నీ పేరుకీ, నా ప్రమోషన్‌కీ లింక్‌ పెట్టి చచ్చాడు మా బాస్‌. ఏం చేస్తాం? ఏదొకటి చేసి ప్రమోషన్‌ కొట్టాలి. ఏదొకటేమిటి? ఆ పేరే పెట్టాలి. లేకపోతే బాస్‌ అసలే చండశాసనుడు. చెప్పింది చేస్తేనే ప్రమోషన్‌ ఫైల్‌ పై సంతకం పెడతాడు' అనుకుంటూ చిన్నగా నిట్టూర్చి నిద్రలోకి జారుకున్నాడు.
మర్నాడు అలవాటులో భాగంగానే ఆఫీసుకెళ్ళాడు. బాస్‌ దగ్గరకు వెళ్లి, 'సర్‌ పేరు పుల్లయ్య అనే పెట్టాలా?' ఒకరోజు గడిస్తే బాస్‌ తీరు మారుతుందేమోనన్న ఆశతో అడిగాడు.
'పేరు పెట్టు-ప్రమోషన్‌ కొట్టు' బాస్‌ మళ్ళీ పాడిన పాటే పాడే సరికి నిరాశగా వెనుతిరిగాడు.
ఆ రాత్రి పడుకునే ముందు, 'రాజీ! మన బాబుకు 'పుల్లయ్య' అని పేరు పెడదాం. ఎలా వుంది?' అన్నాడు రాజీని గమనిస్తూ.
రాజీ ఆశ్చర్యపోతూ దిగ్గున లేచింది.
'ఏమండీ! ఒకసారి నన్ను గిల్లండి' అంటూనే ఆనంద్‌ని గట్టిగా గిచ్చింది.
కెవ్వుమన్న ఆనంద్‌ 'నీకిదేం ముచ్చట?' అన్నాడు చేతిని రుద్దుకుంటూ.
'మా నాన్న పేరు పుల్లయ్య అని, బాబుకు పెడదాం అని నేను వీడు పుట్టినప్పుడే అంటే, మీరు నాతో ఏమన్నారు? ఛీ! ఛీ! పుల్లయ్య.. అదీ ఒక పేరేనా? అయినా పెద్దల పేర్లు అనాధ శరణాలయాలకు పెడితే పుణ్యం. పిల్లలకు పెడితే పాపం అన్నారు కదా.. అటువంటిది మీనోటి నుండి ఏ దేవుడు ఆ పేరు పలికించాడో కానీ నేను నమ్మలేకపోతున్నాను.. ఆ దేవునికి శతకోటి దండాలు పెడుతున్నానండీ' అంది ఆనందంగా.
'వాడు దేవుడు కాడు, నా పాలిట దెయ్యం' బాస్‌ గురించి భార్యతో చెబితే లోకువ అయిపోతానని మనసులోనే అనుకున్నాడు.
ఆ ఆనందంలో రాజీ మజ్జిగ గ్లాసును ఆనంద్‌ చేతికిచ్చాననుకుని కాళ్ళపై పడేసింది. ఆనంద్‌ అరుస్తున్నా వినిపించుకోకుండా ఆనందంగా 'బాబూ! నువ్వు నా ముద్దుల పుల్లయ్యవిరా!' అంటూ బాబుకు ముద్దులు కురిపిస్తోంది.
'ఏమండీ! పుల్లయ్య పేరు చెప్పగానే బాబు నవ్వుతున్నాడండీ!' అంది.
'వాడి బాబు ఏడుస్తున్నాడు' అంటూ మూలిగాడు ఆనంద్‌.
ఆనంద్‌ అత్తమామలు బారసాలకు వారం రోజులు ముందే వచ్చి తిష్ట వేశారు. బారసాల కార్యక్రమం మొదలయ్యింది. మామ పుల్లయ్య పక్కనే బాస్‌ వచ్చి కూర్చున్నాడు.
'బాబు పేరు రాయండి బాబూ!' అంటూ పంతులుగారు బియ్యం పోసిన పళ్ళాన్ని ఆనంద్‌ చేతిలో పెట్టాడు.
ఆనంద్‌ బాస్‌ను క్రీగంట చూస్తూనే 'పుల్లయ్య' అని రాశాడు.
'శహబాష్‌!' బాస్‌ బొటన వేలు పైకెత్తి థమ్స్‌ అప్‌ లెవెల్లో చూపుతూ ఆనంద్‌తో అన్నాడు.
'రాజీ! బాస్‌ మంచి మూడ్‌లో ఉన్నాడు. ముందుగా అతని ఆశీర్వాదం తీసుకుంటే ఆ మూడ్‌లోనే నా ప్రమోషన్‌ కాగితాలు చేతిలో పెట్టేస్తాడు.. పద' అన్నాడు ఆనంద్‌.
'మీ ఆనందాన్ని నేనెందుకు కాదంటాను' అంటూ రాజీ ఆనంద్‌ను అనుసరించింది.
తన కాళ్ళమీద పడబోతున్న దంపతులను వద్దని వారిస్తూ- 'నా కంటే వయసులో పెద్దవాడు. ముందుగా వాడి ఆశీర్వాదం తీసుకోండి' అంటూ పక్కన కూర్చున్న పుల్లయ్యను చూపించాడు బాస్‌.
'థాంక్స్‌ బాబారు! మీ ఋణం ఎప్పటికీ తీర్చుకోలేను' రాజీ సంతోషంగా బాస్‌తో అంది.
'మా నాన్న కాళ్ళకి దణ్ణం పెట్టడానికి పదండీ' రాజీ గట్టిగా అంటున్నా, బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోయాడు ఆనంద్‌.
అప్పటికిగానీ బాస్‌ కుట్ర భార్య ప్రమేయంతోనేనని అర్థం కాలేదు. ఆనంద్‌ స్పృహ తప్పి పడిపోయేవాడే.. కానీ ప్రమోషన్‌ గుర్తొచ్చి వెర్రిమోహంతో బాస్‌కి నమస్కరించాడు.

కె.వి. లక్ష్మణరావు
9014659041