Mar 12,2023 14:13

అడవి ఆకు రాలుస్తున్నది.
ఆకు రాల్చే అడవి ఆకు పచ్చని కోకని అల్లుకుంటున్నది
ప్రకృతికి తెలియని విద్యలా!
ఆకాశంలో లోలకంలా తిరిగే సూర్యునిలో
ప్రకృతి తన మౌన గమనాన్ని ఎరుక పరుస్తుంది...
నవ్వే నెలవంక పూర్ణ చంద్రుడై రాల్చే వెన్నెల పుప్పొడిలో
తన నిశ్శబ్ద చలనాన్ని ఒలక బోస్తుంది!

వీచే గాలి తన స్వభావాన్ని మార్చుకోవడం
కురిసే వాన స్థిర స్వరూపాన్ని నిలుపుకోవడం
మంచు మురిసిపోతూ, సిగ్గుమొగ్గై, వివర్ణమై, నునుపెక్కడంలోని సునిశిత చర్య
ప్రకృతి తాదాత్మ్యంతో చేస్తున్న ప్రవచనం!

రాలుతున్న ఎండుటాకు గలగలలలో ఏదో జీవన వేదం వినిపిస్తుంది.
మొలకెత్తే చిగుళ్ళలో ఇంకేదో జైవిక నాదం సుళ్ళు తిరుగుతోంది. వినాలి.... అంతే!
నీవు ఒకే ఒక ఏక కణమై కనాలి....అంతే !

రెక్కలు అల్లార్చేది, నిరంతరం ఒక ధ్వని తరంగమై పల్లవించేది
మనస్సు దు:ఖమై, కల్లోల సాగరమై సుళ్ళు తిరుగుతున్నప్పుడు ప్రశాంత విభూతిని చల్లేది
అనంత కోటి తారలని తన ఆభరణాలుగా ధరించేది ఈ నిసర్గ నిర్గుణ ప్రకృతియే !

ఏదో పిట్టకూతలో ప్రకృతి భాష వినిపిస్తుంది,
ఇంకేదో గడ్డిపరక మోములో
తన బాసను ప్రకటిస్తుంది .
నీలి తార నుంచి రాలే కాంతి రజనులో ఏదో సువార్త దాగుటుందేమో, ఎప్పటికైనా యత్నించాలి!
అడవి దేహంలో ఏ మనోహర సత్యాలున్నాయో
గుండెను దుర్బిణిని చేసి వెదకాలి!!

ఘల్లుమంది కొండ పైనుంచి
వాన చినుకుల గలగలలు !
తుర్రుమంది పిట్ట అడివంతా
ఆకుల గుసగుసలు!!
ఒక చిరుమేఘం చేస్తున్న చిలిపి నాట్యానికి
సూర్యుడు సిగ్గుపడి తలొంచుకుంటుంటే
కారు మబ్బులు ఉన్న పళంగా అడివిమీదకి వాలినట్లున్నాయి చెట్ల గుబుర్లు !
సంకీర్ణమై పోయింది పూల సువాసన అడివంతా !

చొరబడుతున్న చీకటిలో శబ్దాశబ్దాలు ఒకదానికొకటి తరుముకుంటూ, కలగలిసిపోతూ, ఫెటేల్‌ మని ముక్కలై
రాలి పోతుంటే
ఆ కంపనలో వాస్తవిక స్వప్నమైంది ప్రకృతి !
కొన్ని మన్వంతరాల కాలాన్ని
ఊయలగా చేసుకుని
ఊగుతూ తూగుతూ క్రీడిస్తున్నది ప్రకృతి !!

అలజంగి మురళీధర రావు
94403 35461