Feb 05,2023 07:52

పదవీ కాంక్షాలోలురై
అధికారమే నిత్యమనీ, నిఖిలమనీ
భ్రమపడుతూ, మిడిసిపడుతూ
నాయకులు కొందరు-
స్వార్థాలు, మోహాలకు చేరువై
నీతి, నియమాలకు దూరమై
నైతిక విలువలకు తిలోదకాలిస్తూ
శుష్క వాగ్దానాలు గుప్పిస్తూ
ఉచితాల ప్రలోభాలతో
ప్రజలను ఉన్మత్తులుగా చేసి
ఆశల మత్తులో ఓలలాడుతూ
ఓట్లు దండుకొని
అధికార పీఠాలెక్కి కులుకుతూ
అభివృద్ధిని అటకెక్కించి
సంక్షేమాన్ని దారిమళ్లించి
నియంతృత్వ పోకడలతో
అకృత్యాల వికృత రాజకీయ క్రీడలతో
పౌరహక్కులను కసిగా కబళిస్తూ
ప్రశ్నించే గొంతులు నొక్కేస్తూ
సాగించే అప్రజాస్వామిక పాలనలో
ప్రజాస్వామ్యం
దుర్రాజకీయ గ్రహణం పాలై
రాహువు మింగిన చంద్రునిలా
నిర్వీర్యమైపోతోంది...
అందుకే
యోచించాలి ఓటరు
విజ్ఞతతో.. విచక్షణతో..
పురోగమించాలి ఓటరు
కర్తవ్యశూరుడై.. చైతన్యధీరుడై..
నడుంకట్టి నడిచిరావాలి ఓటరు
గ్రహణపీడను వదిలించి
పరిపూర్ణ ప్రజాస్వామ్య నిర్మాతగా
కదలి రావాలి.. కదం తొక్కాలి..

పి.వి.ప్రసాద్‌, 94401 76824