Jul 31,2022 06:58

    ప్రజాశక్తి దినపత్రిక పుచ్చలపల్లి సుందరయ్య కలల పంట. ప్రజాతంత్ర ఉద్యమాల ఆకాంక్ష. రాష్ట్ర ప్రజలంతా సహకరిస్తే ప్రజాశక్తి దినపత్రికగా తేగలమని...ప్రియతమ నేత సుందరయ్య 1979లో ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ జిల్లా కమిటీలన్నీ వెనువెంటనే ఎంతో ఉత్సాహంగా కదిలి నిధులు సేకరించి పంపించాయి. పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ రెండు దఫాలుగా మొదట 70 వేల రూపాయలు, రెండవసారి 40 వేల రూపాయలు ప్రజల నుండి సేకరించి పంపించాయి. మహిళలందరం నిత్య జీవితంలో రూపాయి, అర్ధ పొదుపు చేసి పార్టీకి ఇచ్చేవాళ్లం. స్కూలుకి వెళ్లే పిల్లలతో కూడా పొదుపు చేయించేవాళ్లం. ప్రజాశక్తి పేపరు అంటే అది మా జీవితంలో భాగంగా, అది ఒక పండగలాగ భావించేవాళ్లం. పాలకొల్లు చేనేత సొసైటీ కాలనీ లోని మహిళా సంఘం వారమంతా ప్రజాశక్తి నిధికి ఎంతోకొంత పంపించాలనుకొన్నాం. అందరం ఒకరోజు రెండెకరాలు వరి కోత కోసి ఆ నిధిని పత్రికకు పంపాం. ఇక దినపత్రిక వెలువడిన రోజు...మహనీయుడు కారల్‌ మార్క్స్‌ ముఖ చిత్రంతో ఎంతో ఉత్తేజాన్నిచ్చే మొదటి పత్రిక ప్రతులు తీసుకుని...ముందుగా ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వేస్టేషను మాష్టర్లు, ఉపాధ్యాయులు షాపు యజమానులు, ఫుడ్‌ కార్పొరేషను లోని సివిల్‌ సప్లై అధికారులు తదితరులందరినీ కల్సుకొని చందాలు కట్టించాం. ఆ రోజు మాకు గొప్ప పర్వదినం అయ్యింది. మా చేనేత కాలనీలో రోజూ రూపాయి పెట్టి పత్రిక కొనలేని స్థితిలో నలుగురు, ముగ్గురు కలిసి తలో 25 పైసలు ఇచ్చి పేపరు కొనేవారు. ప్రజాశక్తి పఠన కేంద్రాన్ని ఏర్పరచాం. పత్రికలో వచ్చే వీర వియత్నాం విజయాలు మొదలైన వార్తలు ఎంతో ఉత్తేజాన్నిచ్చేవి. మహిళా సంఘానికి పత్రికే సలహాదారుగా ఉండేది. ప్రజా ఉద్యమాల నిర్వహణకు ఉత్తేజాన్నిచ్చేది.
      ప్రజాశక్తి వారపత్రికగా ఉన్నప్పుడు పత్రిక ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్లం. ప్రజాశక్తి అంటే తల్లీతండ్రీగా భావించేవాళ్లం. ప.గో జిల్లా భీమవరం పట్టణంలోని డి.ఎన్‌.ఆర్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసే మా నాన్నగారు ప్రజాశక్తి వార పత్రికగా ఉన్నప్పుడే కాలేజీకి తీసుకుపోయి మోటూరు హనుమంతరావు గారి వ్యాసాలను విద్యార్థులకు చదివి వినిపించేవారు. ఆయన వ్యాసాలు చదివితే ఇక ఏ గ్రంథాలు చదవక్కరలేదని ఎప్పుడూ అనేవారు. ఆయన మరో రెండు రోజులకు చనిపోతారనగా నా చేతిలో వున్న ప్రజాశక్తి పేపరు చూచి, విప్పారిన ముఖంతో 'ప్రజాశక్తి అన్నిటినీ దాటేసింది' అన్నారు. మా నాన్నగారి లాగే అనేక మంది విద్యావంతులు, మేధావులు ప్రజాశక్తిని అభిమానించేవారు. భవిష్యత్తులో మరింత శక్తివంతంగా...సామాజిక న్యాయం కోసం...పీడిత ప్రజల ఆశాజ్యోతిగా ప్రజాశక్తి నలువైపుల విస్తరించగలదని ఆశిస్తూ అభినందనలు.
 

- అల్లూరు అమ్మాజీ