అక్షరాన్ని ఆయుధం చేసి
మెరుపులా మాలో
కవన వెలుగుల్ని నింపి
కదిలించిన వాడా!
మా యువకాశల ఊహల
సుమ గీతావరణంలో
మమ్మల్ని కవన కదన రంగాన
నడిపిన సాహితీ విశ్వరూపుడా !
అనితర సాధ్యపు అక్షరయోధుడా!
మహనీయుడా!
కలం విప్లవవీరుడా!
పతితుల, బాధాసర్పదష్టుల కోసం
అందని ఆకాశ కవితా
జగన్నాథ రథచక్రాలను
భూమార్గం పట్టించిన
విజయ రథసారథీ !
మహాప్రస్థాన మరోప్రస్థాన
జ్వలిత కావ్య నిర్మాతా!
తెలుగు కవిత్వాన్ని శ్వాసించి
తెలుగు పాఠకుల్ని శాసించి
ఎముకలు కుళ్లిన సోమరులను
చావండని పావన నవజీవన
యువశక్తులను రారండని ఆహ్వానించిన
యుగకవివి.. మహాకవివి.. నీవే !
ప్రపంచాగ్నికి సమిధవై
విశ్వవీణకు తంత్రివై
పీడిత జనఘోషను
విప్లవ విపంచిపై పలికించి
భావకవితా సుందరి పరిష్వంగ
మత్తులో మునిగిన
కలాలకు, కవులకు
కొత్త టానిక్, కొంగ్రొత్త రుధిరాన్ని నింపి, భూమార్గం పట్టించిన
సాహితీ ఉద్యమ నేతవు!
తరతరాల నీడల్ని పొగమేడల్ని
యుగాల దోపిడీని తుదముట్టించగ
సూర్యునితో సూదులతో క్రీడలాడుతూ
శ్రమైకజీవన సౌందర్య పిపాసిగా
ప్రపంచపు బాధను కవితలుగా
ఈ తరాన్ని కదిలించిన ధీరుడా !
మండే తన అక్షరాల నెగళ్ళతో
తెలుగు జాతిని నిద్ర మేల్కొలిపి
శృంఖలాలను పగులకొట్టే
స్ఫూర్తితో నేటి యువశక్తులను
కదం తొక్కించి, మునుముందుకు
నడిపిస్తూ తూరుపు వెలుగులకై
కోటి కొత్త గళాలకు జీవంపోసిన
ప్రళయ ప్రభంజన
ఝంఝా మారుతం శ్రీ శ్రీ !
(మహాకవి శ్రీ శ్రీ జయంతి నేడు )
- డా. కె. దివాకరాచారి
9391018972