
ప్రకాశం జిల్లా లోని శ్రమజీవుల్లో 2 లక్షల మంది నిత్యం వలసల్లోనే వుంటున్నారు. భవన నిర్మాణ, వ్యవసాయ పనుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. పట్టుమని వెయ్యి మందికి ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగ పరిశ్రమ ఒక్కటీ లేదు. నేటికీ యూనివర్శిటీ లేని జిల్లా ఇది. విద్య, ఉపాధి, వైద్యం కోసం వలసలే గతి. సగానికిపైగా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్ళవు. తాగు నీరే కాదు, అనేక గ్రామాలలో వాడుకునే నీరు కూడా కొనుక్కోవాల్సిన దయనీయ స్థితి.
ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించాలని, జిల్లా అభివృద్ధికి రూ.10 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించాలనే ప్రధాన డిమాండ్‌తో సిపిఐ(యం) పోరుబాట పాదయాత్ర (సెప్టెంబర్ 10-23) సాగించింది. ఈ యాత్ర ద్వారా ప్రజల కష్టాలు, కడగండ్లు, వనరులున్నా వినియోగం లోకి తీసుకురాని పాలకుల నిర్లక్ష్యం, నిత్యం కరువు కాటకాలు, వలసలతో గడుస్తున్న బడుగుల జీవితాలు, వారి బిడ్డలను సాకుతున్న అవ్వలు, తాతల యాతనను చూసి పాదయాత్ర బృందానికి గుండెలు బరువెక్కాయి.
'ప్రకాశం'ను వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని సిపిఐ(యం) 2016 నుండి నిరంతర ఉద్యమాలు సాగిస్తున్నది. ఆ కేసులు నేటికీ కొనసాగుతున్నాయి. పాలకులు, జిల్లా ప్రజా ప్రతినిధులు మాత్రం వెనుకబాటు ఊసే ఎత్తడంలేదు. పదవులు కాదు, ప్రజా సమస్యలు గుర్తించండని పాలకులను ప్రశ్నించాలని ప్రజల్ని మేల్కొల్పేందుకే ఈ పాదయాత్ర సాగింది.
వెనుకబడిన జిల్లాగా గుర్తించటానికి ఇవి చాలవా ?
జిల్లాలో వర్షపాతం సహజంగానే తక్కువ. అత్యధిక సాగుభూమి వర్షాధారమే. జిల్లా ఏర్పడిన ఈ 53 ఏళ్ళకాలం లో 38 సంవత్సరాలు తగిన వర్షాలు లేవని కేంద్ర ప్రభుత్వమే కరువు జిల్లాగా ప్రకటించింది. మరో ఐదారేళ్ళు భారీ వర్షాలు, వరదలతో పంటలు లేక, పనులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి.
ఇవి చాలవా వెనుకబడిన జిల్లాగా ప్రకటించటానికి. అక్షరాస్యత రాష్ట్రంలో 67 శాతం వుంటే జిల్లాలో 63 శాతం. మహిళలు, దళిత, గిరిజనుల్లో ఇది మరీ తక్కువ. జిల్లా లోని శ్రమజీవుల్లో 2 లక్షల మంది నిత్యం వలసల్లోనే వుంటున్నారు. భవన నిర్మాణ, వ్యవసాయ పనులకు సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. పట్టుమని వెయ్యి మందికి ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగ పరిశ్రమ ఒక్కటీ లేదు. నేటికీ యూనివర్శిటీ లేని జిల్లా ఇది. విద్య, ఉపాధి, వైద్యం కోసం వలసలే గతి. సగానికిపైగా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్ళవు. తాగునీరే కాదు, అనేక గ్రామాలలో వాడుకునే నీరు కూడా కొనుక్కోవాల్సిన దయనీయ స్థితి.
వనరుల్ని ఒడిసిపట్టే నాథుడేడి ?
జిల్లాలో గుండ్లకమ్మ, మూసి, పాలేరు, మన్నేరు, అట్లేరు, తీగలేరు, సగిలేరు లాంటి నదులతోపాటు, అనేక వాగులు, వంకల ద్వారా వర్షం కురిసినప్పుడు వృధాగా సముద్రం పాలౌతున్న నీరు 55 టి.యం.సి.లు వుంటుందని నిపుణులు చెబుతున్నారు. వాటికి చెక్‌డ్యామ్‌లు, ఆనకట్టలు, రిజర్వాయర్లు ఏర్పాటు చేసి ఒడిసిపట్టే ఆలోచన చేయని పాలకుల నిర్లక్ష్యం వల్ల నిత్యం నీటికరువు ఏర్పడుతున్నది. పశ్చిమ ప్రాంత ప్రజల ఆశాజ్యోతి వెలుగొండ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో అంతుబట్టటం లేదు. లోపల వున్న నిర్వాసిత ప్రాంతాల్లో మౌలిక వసతులు పాతికేళ్ళుగా నిలిచిపోయాయి. వారి బాధ వర్ణానాతీతం. దొనకొండ మండలం కొచ్చర్లకోట వద్ద గుండ్లకమ్మపై చెక్‌డ్యాం నిర్మించడం ద్వారా 7 చెరువులకు నీరు చేరితే...సగం మండలం ప్రజల అవసరాలు తీర్చే అవకాశం వుంది. దానికి రూ.15 కోట్లు కేటాయిస్తే చాలు. చీమకుర్తి వద్ద యన్.యస్.పి. కాలువ కారుమంచి మేజర్‌కు గండిపడి 25 గ్రామాలకు చెందిన పంటలు ఎండిపోతున్నా పట్టించుకున్న దిక్కు లేదు. సంగమేశ్వరం ప్రాజెక్టు రూ.50.55 కోట్ల అంచనాతో ప్రారంభమైంది. ఒక గొయ్యి మాత్రమే తీశారు. నేడు అది పూర్తికావడానికి రూ.206 కోట్లు కావాలట. గుండ్లకమ్మ ప్రాజక్టు గేట్లు కొట్టుకొని పోయి ఏడాది దాటింది. 3.87 టి.యం.సిల నీరంతా సముద్రం పాలౌతున్నా ప్రభుత్వానికి పట్టలా. 42 గ్రామాలు, జిల్లా కేంద్రానికి తాగునీరు, 80 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టుపట్ల పాలకుల తీరిది. పాలేటిపల్లి రిజర్వాయర్ కాల్వల పని మొదలేకాలేదు. రామతీర్థం జలాశయం ఆశయం నెరవేరేదెప్పుడో? మొగిలి గుండాల చెరువు, ఎర్ర ఓబనపల్లె లిఫ్టు, కంభం చెరువు, కాల్వల పూడిక తొలిగింపు, కోటకట్ట చెరువు, మోపాడు రిజర్వాయర్ తదితర మధ్యతరహా నీటి వనరుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. అధికార పార్టీల నేతలు ట్యాంక్లర్ల ద్వారా నీరు తోలుతూ తమ స్వార్ధ ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారు తప్ప, ప్రజల గొంతు తడిపే శాశ్వత ఆలోచనలు చేయడం లేదు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గెలాక్సీ గ్రానైట్, పలకల పరిశ్రమలు ప్రభుత్వాల పన్నుల భారంతో సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఉన్న ఉపాధి కాస్తా అడుగంటుతున్నది. పండ్ల తోటల ఆధారంగా జ్యూస్ ఫ్యాక్టరీలు, కోస్తా ప్రాంతంలోని ఇసుక ఆధారంగా పింగాణి పరిశ్రమ, సుబాబుల్, జామాయిల్ కర్రతో పేపర్ మిల్లు, 4 వేల ఎకరాల వ్యాన్‌పిక్‌లో పరిశ్రమలు, దొనకొండ మండలంలోని 25,856 ఎకరాల పడావు భూముల్లో పారిశ్రామిక కారిడార్, పామూరు, పి.సి.పల్లి మండలాల్లో 14,231 ఎకరాల్లో 'నిమ్జ్' ఏర్పాటు ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామన్న మాటలు నీటిమూటలయ్యాయి.
రైతు-కూలీల దుస్థితి
కొలభీమునిపాడులో రూ.1200 ఖర్చు చేసి బీరకాయ విత్తనాలు తెచ్చి పంట వేస్తే చీడ అంటుకుని రూ.300 వచ్చాయని ఓ రైతు చెప్పాడు. ఆ పక్క గ్రామంలో గోరుచిక్కుడు ఎకరం వేసిన భార్యాభర్తలిద్దరూ రోజుకు బస్తా కోస్తే కేజీ పది రూపాయల చొప్పున రూ.500 వచ్చాయి. గిట్టుబాటు కాలేదు, కూలి రేటు కూడా రాలేదన్నారు. మిర్చి పంట 1.30 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరాకు సగటున రూ.1.25 లక్షలు ఖర్చవుతున్నది. రేటు నిలకడ లేక అప్పులతో బతుకుతున్నామని వాపోయారు. మిర్చి కొనుగోలు కేంద్రం జిల్లాలో ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని కోరారు. 2 లక్షల ఎకరాలకు పైగా కంది పంట వేస్తున్నారు. తగినన్ని కొనుగోలు కేంద్రాలు లేవు. కొండేపిలో ఏర్పాటు చేయాలని కోరారు. కరివేపాకుకు మద్దతు ధర లేదని చెప్పారు. 2 లక్షల ఎకరాల్లో సాగు కావలసిన వరి పంటకు పాలకులు ఉరివేశారు. దీంతో కూలీల పని దినాలు కూడా క్రమంగా పడిపోతున్నాయి.
జిల్లాలో 1.50 లక్షల వ్యవసాయ కార్మిక కుటుంబాలుండగా వీరిలో 70 శాతం మందికి పైగా సెంటు సాగు భూమి లేదు. జిల్లాలో వున్న 1.30 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ప్రభుత్వం పేదలకు పంచిన భూమి కూడా పెత్తందార్లు కాజేస్తున్నారు. తాడివారిపల్లిలో 7 దశాబ్దాలుగా 80 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్న పేదలను బలవంతంగా తొలిగించి అక్రమార్కులకు కట్టబెట్టే ప్రయత్నం అధికార పార్టీ నేతలు చేస్తున్నారు. గ్రామీణ ప్రజలకు కొంత ఆసరాగా వున్న ఉపాధి హామీ ఈ కాలంలో గ్రామాల్లోని అధికార పార్టీ నేతల అక్రమాలతో పేదలకు దూరమౌతున్నది. పనుల కోసం అమ్మా, అయ్యా సుదూర ప్రాంతాలకు వలస పోతే బిడ్డల ఆలనా పాలనా బాధ్యత అవ్వాతాతల మీద పడింది. పరిస్థితి అద్వానంగా మారి చిన్నారుల చదువు చట్టుబండలౌతున్నది. ఇళస్థలాలు, పక్కా గృహాల సమస్య తీవ్రంగా వుంది. 69,539 జగనన్న ఇళ్ళు మంజూరైతే 15,266 పూర్తి అయ్యాయని ప్రభుత్వం చెబుతున్నది. క్షేత్ర స్థాయిలో చూస్తే అత్యధిక ప్రాంతాల్లో నిర్మాణాలు ప్రారంభించక కాలనీ స్థలాలు కంపచెట్లతో నిండి వున్నాయి. 5 పట్టణాల్లో మంజూరైన 24,360 టిడ్కో ఇళ్ళలో 9,508 నిర్మాణంలో ఆగిపోయి శిధిలావస్థకు చేరుకుంటున్నాయి.
కన్నీళ్ళు తెప్పిస్తున్న కిడ్నీ బాధితుల గాధలు
ఆహారం లేకపోయినా నీరు తాగి కొంత కాలం బతకొచ్చంటారు. కానీ జిల్లాలోని మూడు వంతుల భూభాగంలో ఫ్లోరిన్ శాతం అధికంగా వున్నందున ప్రజలు ఆ విషపు నీరు తాగి 30 ఏళ్ళకే ముసలోళ్లవుతున్నారు. కిడ్నీ వ్యాధితో కొందరు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. కనిగిరి నియోజక వర్గంలో ఫ్లోరిన్ పీడ మరీ అధికం. ప్రస్తుతం ప్రతి గ్రామంలో పదికి తగ్గకుండా వ్యాధిగ్రస్తులు వారానికి రెండుసార్లు కనిగిరి వచ్చి డయాలసిస్ చేయించుకొంటూ జీవచ్ఛవాల్లా వున్నారు.
మౌలిక వసతులు ఏవీ ?
నివాస ప్రాంతాల్లో రోడ్లు వేసిన చోట కాల్వలు లేక మురుగు పెరిగి దోమల ఆవాసాలుగా మారాయి. పారిశుధ్యం పడకేసింది. పంచాయతీలు బ్లీచింగ్ చల్లటానికి కూడా నిధులు లేక నీలుగుతున్నాయి. విలేజి హెల్త్ సెంటర్లు పేరుకే పరిమితం అయ్యాయి. ప్రజలు రోగాలతో పెద్దాసుపత్రులకు వెళ్ళి అప్పుల పాలౌతున్నారు. మార్కాపురం మెడికల్ కాలేజి పనులు, నడికుడి శీకాళహస్తి రైల్వే మార్గం పనులు నత్తనడకన సాగుతున్నాయి. రక్షిత మంచినీటి పథకాలకు ఉద్దేశించిన 28 స్కీములు కదలడం లేదు. కొత్తగా మంజూరైన పథకాల పనులు సాగటం లేదు. ఆసియా లోనే పెద్దదైన పాల పొడి ఫ్యాక్టరీ మూలబడింది. ప్రభుత్వ, సహకార రంగంలోని ప్రకాశం పాల ఉత్పత్తిదారుల సహకార కేంద్రం (పాల డెయిరీ) అమూల్ పరమైంది. దాని భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. పాడి రైతులు జీవితాలు దిక్కుతోచని స్థితిలోకి నెట్టబడ్డాయి. జిల్లా ప్రజల దుర్భర జీవితాలను, వారి దురవస్థలను ప్రత్యక్షంగా చూసిన పాదయాత్ర బృందం...ప్రజా సమస్యల పట్ల పాలకుల నైజాన్ని ప్రశ్నించాలని, పోరాటాల ద్వారానే పథకాలు, చట్టాలు, హక్కులు సాధ్యమౌతాయని తెలియచెప్పే ప్రయత్నం చేసింది. వాటి సాధనకు మరో ఉద్యమం చేపట్టాలని భావించింది.
/వ్యాసకర్త సిపియం ప్రకాశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, సెల్:9490300370/
కంకణాల ఆంజనేయలు