Sep 24,2023 08:29

పువ్వులు ఎంత అందాన్ని, ఆహ్లాదాన్నిస్తాయో.. కొంత మంది వాసన చూడాలంటే అంత భయపడిపోతారు. ఎందుకంటే వాటిలోని పుప్పొడి చాలా మందికి అలెర్జీ కలిగించి బాధిస్తుంది. ఒక్కోసారి గవదబిళ్లలు, జ్వరం కూడా వస్తాయి. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతతో కూడిన వాతావరణ మార్పుల కారణంగా ఈ పరిస్థితులు మరింతగా ఎదురవుతున్నాయి. అయితే, ఇదే పుప్పొడి రేణువులు పూర్వపు పర్యావరణ పరిస్థితులు తెలుసుకోవడానికి అత్యంత కీలకంగా మారాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ చిన్న అందమైన పుప్పొడి రేణువుల సహాయంతో గతంలో భూవాతావరణ సమాచారాన్ని నిస్సందేహంగా తెలుసుకోవచ్చంటున్నారు. అంతేకాదు.. వాతావరణ మార్పులను పరిశీలించడానికి, మొక్కల జీవన పరిణామాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు సహాయపడుతున్నాయి.. తద్వారా నిస్సందేహంగా పర్యావరణ వ్యవస్థలను పునర్నిర్మించి వృక్ష సంపదను పెంచవచ్చంటున్నారు పరిశోధకులు.
అదెలాగ అంటే.. దక్షిణాఫ్రికాలోని నెల్సన్‌ మండేలా విశ్వవిద్యాలయంలో పాలియోకాలజీ లాబొరేటరీ అధిపతి.. ఆయన బృందం దక్షిణాఫ్రికాలోని కేప్‌ ఫోల్డ్‌ బెల్ట్‌ పర్వతాలు, దక్షిణ కేప్‌ ప్రాంతంలోని బూమ్‌ప్లాస్‌ కేవ్‌, తూర్పు కేప్‌ ప్రావిన్స్‌లోని గ్కెబెర్హా నగరంలలో పుప్పొడిని సేకరించి పరిశోధిస్తున్నారు. ఈ శిలాజ పుప్పొడి రేణువుల ద్వారా పురాతన పర్యావరణాలు, పర్యావరణ వ్యవస్థల రహస్యాలను కనుగొనే అవకాశం కలిగింది అంటున్నారు వారు.

2

స్పోరోపోలెనిన్‌..

పుప్పొడి రేణువులు సాధారణంగా క్షీణించవు. ఇవి స్పోరోపోలెనిన్‌ అనే రసాయనిక జీవసంబంధ పదార్థంతో తయారై చాలా గట్టి పొరను కలిగి ఉంటాయి. మిలియన్ల సంవత్సరాల క్రితం అవక్షేప నిక్షేపాలలో కూడా ఇవి భద్రంగానే ఉంటాయి. ప్రయోగ సమయంలో సూక్ష్మదర్శినితో పుప్పొడిని పరిశీలించినప్పుడు అనేక రకాల పుప్పొడి రేణువులు కనిపించాయి. ఈ పరిశోధనలో మొక్కలు ఏఏ నిర్దిష్ట వాతావరణ పరిస్థితులలో పెరుగుతాయి అనేది తెలిసింది. ఈ అధ్యయనంలో తెలిసిన వక్ష చరిత్ర ద్వారా ఆయా ప్రాంతాల్లో వాటిని పునర్నిర్మించి వృక్ష సంపదను పెంచవచ్చు అంటారు శాస్త్రవేత్త కీవ్‌ విక్టర్‌.

మిడ్డెన్స్‌..

జిగురు లక్షణాన్ని కలిగి ఉండి, పర్వత ప్రాంతాలలోని రాతి పగుళ్లలో వేల సంవత్సరాల నాటివి కూడా పేరుకుపోయాయి. 'మిడ్డెన్స్‌' అని పిలువబడే ఈ నిక్షేపాలు పురాతన వాతావరణానికి సాక్ష్యాలు. అవి జీవించినప్పటి ఖచ్చితమైన కాల పట్టికను తెలుపుతాయి. అంతేకాదు.. యాభై వేల సంవత్సరాల క్రితం నాటి వక్ష, భౌగోళిక, భూగర్భ, వాతావరణ, పురావస్తు శాస్త్రాల గురించి అధ్యయనం చేసే అవకాశం ఉంది కేవలం ఈ పుప్పొడి రేణువుల సహాయంతో అంటోంది శాస్త్రవేత్తల బృందం.

3

అనూహ్య సూచన..

తూర్పు కేప్‌ ప్రావిన్స్‌లో ఆరువేల సంవత్సరాల నాటి పుప్పొడి లభ్యమయింది. దీని ద్వారా మూడువేల మూడు వందల సంవత్సరాల క్రితం ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ సంఘటన వక్షసంపదలో అనూహ్యమైన మార్పును తెచ్చినట్లు చూపిస్తోంది పరిశోధన. ఈ పుప్పొడి రేణువుల సహాయంతో మరిన్ని పూర్వ పర్యావరణ వ్యవస్థల్లోని వైవిధ్యాలను, ఆయా సందర్భాల్లో ప్రారంభ మానవులెలా స్పందించారో తెలుసుకుని సవివరంగా ప్రజలకు అందించాలని పరిశోధకులు భావిస్తున్నారు.
ఔరా! పుప్పొడికి ఇంత ప్రతిభా..! అనిపిస్తోంది కదూ.

4