
భూముల కేటాయింపు నుండి భూములను చౌకగా కొట్టేసే ఈ క్రమంలో నష్టపోయింది మాత్రం భూములు కోల్పోయిన రైతులు, అప్పులు ఇచ్చిన బ్యాంకులు. అంటే ఆ బ్యాంకుల్లో దాచుకున్న మధ్యతరగతి ప్రజలు. ఉద్యోగాల ఆశ చూపి తమ పొలాలను పొందిన పెట్టుబడిదారులు, వారికి అండగా నిలిచిన రాజకీయ నేతలు... వేలు, లక్షల కోట్ల రూపాయలు లాభపడుతుంటే...భూములు కోల్పోయి అనాథలుగా మారిన రైతు, కూలీలు వలస జీవులుగా మారారు.
పాలకుల ఆశ్రయం వున్న పెట్టుబడిదారులు లెక్కలేనన్ని మార్గాల్లో సంపద పోగేసుకోవచ్చనడానికి సాక్ష్యం లేపాక్షి నాలెడ్జ్ హబ్. అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాకు లేపాక్షి నాలెడ్జ్ హబ్ రావడం ద్వారా వేల కోట్ల పెట్టుబడులు, లక్షన్నర ఉద్యోగాలు వస్తాయని పాలకులు హామీ ఇచ్చి 2008-09 సంవత్సరాల్లో భూసేకరణ చేపట్టారు. బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఆంధ్రప్రదేశ్ సరిహద్దు మొదలైనప్పటి నుండి సుమారు 18 కి.మీ దూరం పొడవున 8,844.01 ఎకరాల భూములు సేకరించారు. ఈ భూములు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపంలో వున్నాయి. ఇంత విలువైన భూములను రైతుల నుండి చౌకగా సేకరించారు. ఎసైన్డ్ భూమి ఎకరం రూ. లక్ష 75 వేలు, ప్రభుత్వ భూమికి రూ. 50 వేలు, పట్టా భూములకు గరిష్టంగా మూడు లక్షల రూపాయలకు నాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం సేకరించింది. 2009లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) లేపాక్షి నాలెడ్జ్ హబ్ సంస్థతో ఒప్పందం చేసుకొని అతి చౌకగా రూ.125 కోట్ల రూపాయలకు ఈ మొత్తం భూములను అప్పగించింది. లేపాక్షి నాలెడ్జ్ సంస్థ ఆ తర్వాత 'ఇందూ ప్రాజెక్ట్స్'కు చెందిన సంస్థగా మారింది. ఒప్పందం ప్రకారం భూములు స్వాధీనం చేసుకున్న 10 నుండి 15 సంవత్సరాల్లోపు 8 వేల కోట్ల నుండి 10 వేల కోట్ల పెట్టుబడులతో ఒకటిన్నర లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి. అయితే పరిశ్రమ స్థాపించిందీ లేదు. ఒక్క ఉద్యోగం ఇచ్చిందీ లేదు.
పాలకుల తోడుంటే కోట్లల్లో లాభం
లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల బాగోతం పరిశీలిస్తే ఆశ్రిత పెట్టుబడిదారుల దగ్గర పెద్దఎత్తున సంపద ఎలా పోగుబడుతుందో అర్థమవుతుంది. భూముల సేకరణ, నకిలీ సంస్థల ఏర్పాటు, వివిధ సంస్థల మధ్య భూముల బదలాయింపు, బ్యాంకుల్లో రుణాలు పొందడం, ఎగవేతలు, దివాలా పేరుతో అతి తక్కువ మొత్తాన్ని నిర్ణయించడం, ప్రజా సంపద లూఠీ చేయడం వంటి వివిధ దశల్లో జరుగుతుంది. అన్ని దశల్లో పెట్టుబడి లాభపడడం దీని ప్రత్యేకత. ఈ ప్రక్రియలో మొదటి దశ భూముల సేకరణ. భూములు పొందిన ఇందూ సంస్థ ఇక్కడ పరిశ్రమలు స్థాపించడం కంటే ఈ భూములను ఇతర సంస్థలకు అమ్మడం, బ్యాంకుల్లో తాకట్టు పెట్టి భారీ ఎత్తున సంపద పోగేసుకోవడమే తన లక్ష్యంగా అడుగులు వేసింది. నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి వాటికి భూ బదలాయింపు చేయడం రెండవ దశ. లేపాక్షి హబ్‌కు ఇచ్చిన భూముల్లో కొన్ని వేల ఎకరాలను వివిధ సంస్థలకు అమ్మివేసేందుకు లేపాక్షి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, లేపాక్షి హెరిటేజ్ వెల్‌నెస్ విలేజ్ ప్రైవేట్ అనే రెండు కొత్త సంస్థలను సృష్టించింది. మొదటి సంస్థకు 2,000 ఎకరాలు, రెండో సంస్థకు 650 ఎకరాలను ఇందూ సంస్థ బదిలీ చేసింది. ఇలా బదిలీ చేయడానికి అవసరమైన ఖర్చుల కోసం ఢిల్లీకి చెందిన 'గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండియా లిమిటెడ్'తో రూ.5 కోట్లను లేపాక్షి నాలెడ్జ్ అప్పుగా తీసుకుంది. లేపాక్షి తాను సృష్టించుకున్న రెండు సంస్థలకు బదిలీ చేసిన 2,650 ఎకరాల భూమిని ఈ గ్లోబల్ సంస్థకు రూ.238.5 కోట్ల కు 2012 మార్చి 19న ఇందూ సంస్థ అమ్మివేసింది. లేపాక్షి భూముల సేకరణలో జరిగిన అక్రమాలపై విచారణ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ భూములను తన ఆధీనంలోకి తీసుకుంది. ఇందూ కంపెనీ గ్లోబల్‌కు రూ.5 కోట్ల అప్పు చెల్లించలేదు.
తాము ఇందూ సంస్థకు ఇచ్చిన రూ.5 కోట్లు వడ్డీతో కలిపి రూ.25.84 కోట్లు అయిందని, తమకు ఇస్తామన్నా 2,650 ఎకరాల భూమిని లేపాక్షి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్, లేపాక్షి హెరిటేజ్ సంస్థలు ఇవ్వలేదని అందువల్ల ఆ రెండు సంస్థలపై దివాలా చర్యలు చేపట్టాలని గ్లోబల్ సంస్థ 2021లో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) బెంగళూరులో పిటిషన్ వేసింది. 2,650 ఎకరాల భూమి కోసం రూ.238.5 కోట్లు చెల్లించాల్సిన గ్లోబల్ సంస్థ ఇందూకు రూ.5 కోట్లు అప్పు ఇవ్వడమేమిటి?! వందల కోట్ల ఇందూ సంస్థ రూ.5 కోట్ల అప్పు తీర్చలేకపోవడమేమిటి?! అప్పు తీర్చలేదు కాబట్టి దివాలా పద్ధతులు అనసరించి 2,650 ఎకరాల భూమిని (ప్రస్తుత ధర ప్రకారం ఆ భూముల ధర సుమారు రూ.1500 నుండి రూ.1700 కోట్లు) ఆ రూ.5 కోట్లకే గ్లోబల్ సంస్థకు అప్పగించే ప్రయత్నాలు చూస్తుంటే ఆశ్రిత పెట్టుబడి ఎలా సంపదను పోగేసుకుంటుందో అర్థమవుతుంది.
చౌకగా భూములు కొల్లగొట్టడం
గ్లోబల్ సంస్థకు బదిలీ చేయాల్సిన 2650 ఎకరాలు పోగా మిగిలిన భూముల్లో 4,191 ఎకరాలను ఇందూ సంస్థ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పెద్ద ఎత్తున రుణాలను తీసుకోవడం మూడో దశ. ఇలా ఇందూ ప్రాజెక్టు వివిధ భూములను 11 బ్యాంకుల్లో తాకట్టుపెట్టి తీసుకున్న అప్పులు 2019 మార్చి నాటికి రూ. 4,189.95 కోట్లు. ఇందులో లేపాక్షి నాలెడ్జ్ భూములు కూడా వున్నాయి. ఇందూ సంస్థకు ఇచ్చిన మొత్తం రుణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది రూ.996.62 కోట్లతో మొదటి స్థానం. ఇందూ ప్రాజెక్ట్స్ సంస్థ దివాలా తీసినట్లు ఆ తర్వాత మరో అంకానికి తెరతీసింది. రైతులు పంటల సాగు కోసం తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించకపోతే వేలం నోటీసులు పంపి, ఆ రైతు అకౌంట్‌లో ఏ డబ్బు పడ్డా వాటిని పాత అప్పుకు వడ్డీతో సహా జమ చేసుకుంటున్న ప్రభుత్వ విధానాలు... బడా కంపెనీలకు ఎలా ప్రజా సంపదను దోచి పెడతాయో ఇందూ ప్రాజెక్ట్స్ దివాలా ప్రక్రియ స్పష్టం చేస్తుంది.
ఈ సంస్థకు అప్పు ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్లెయిమ్ చేసిన మొత్తం 2019 మార్చి 5 నాటికి రూ.4,189.94 కోట్లు కాగా రూ. 4,138.54 కోట్ల అప్పులను రద్దు చేసుకోవడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అమోదించాయి! ఎవరి సొమ్ము ఎవరికి దానం చేశారు? మిగిలిన మొత్తాన్ని ఎర్తిన్ ప్రాజెక్టు అనే కంపెనీ, ట్రాన్స్‌మిషన్ అండ్ ప్రాజెక్ట్స్ భాగస్వామ్యంతో రూ.500 కోట్లు చెల్లించగలమని ప్రతిపాదించడం, అప్పులు ఇచ్చిన సంస్థలు అంగీకరించడం వెంటవెంటనే జరిగిపోవడం ఆశ్రిత పెట్టుబడిదారుల పరిణామంలో నాలుగో దశ. ఎర్తిన్ సంస్థ రూ.500 కోట్లు చెల్లించడానికి అంగీకరించడంతో ఇందూ సంస్థ తాకట్టు పెట్టిన ఆస్తులన్నీ ఎర్తిన్ కంపెనీకి వెళ్తాయి. ఇందులో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు సంబంధించిన 4,191 ఎకరాలు వున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఎకరం భూమి రూ. 45 లక్షల నుండి రూ. ఒకటిన్నర కోటి వరకు వుంటుంది. ఈ లెక్కన రూ. 500 కోట్లు చెల్లించే ఎర్తిన్ సంస్థకు లక్షల కోట్ల భూమి స్వంతం అవుతుంది. ఈ ఎర్తిన్ ప్రాజెక్ట్స్‌లో డైరెక్టర్‌గా నేటి ముఖ్యమంత్రి మేనమామ, కమలాపురం శాసనసభ్యుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి కుమారుడు రామానుజుల రెడ్డి వుండడం...కార్పొరేట్ సంస్థలకు, రాజకీయ నాయకులకు ఉన్న బంధానికి నిదర్శనం. భూముల కేటాయింపు నుండి భూములను చౌకగా కొట్టేసే ఈ క్రమంలో నష్టపోయింది మాత్రం భూములు కోల్పోయిన రైతులు, అప్పులు ఇచ్చిన బ్యాంకులు. అంటే ఆ బ్యాంకుల్లో దాచుకున్న మధ్యతరగతి ప్రజలు.
ఉద్యోగాల ఆశ చూపి తమ పొలాలను పొందిన పెట్టుబడిదారులు, వారికి అండగా నిలిచిన రాజకీయ నేతలు... వేలు, లక్షల కోట్ల రూపాయలు లాభపడుతుంటే...భూములు కోల్పోయి అనాథలుగా మారిన రైతు, కూలీలు వలస జీవులుగా మారారు.
/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /
వి. రాంభూపాల్