Jul 09,2023 07:40

ఓట్ల ఫెస్టివల్‌ వస్తేనే చాలు
పొలిటికల్‌ లీడర్ల గణాలు
ముష్టోళ్ళ వేషం వేస్తారు
పార్టీ జెండాల జోలే వేసుకు
భిక్షాటనకు ఉపక్రమిస్తారు
ఊరువాడల్లో కలియ తిరిగి
ఉత్తుత్తి ప్రచారాలు చేస్తారు
పాత ప్రగతి పాటకు కైగట్టి
కొత్త రాగాలు అలపిస్తారు
ప్రజలే మా దేవుళ్ళు అని
దొంగ జపం ఆచరిస్తారు
కపట నాటక ప్రదర్శనతో
జనాలను రక్తి కట్టిస్తారు
ఏకంగా సీటును కొల్లగొట్టి
అధికార పీఠం అధిష్టించ
తెగ తిప్పలుపడ్తున్నారు
అపుడు ఓటు దాతలు
ఉన్మత్తునిలా నటించాలి
నయా ముష్టోళ్ల కుట్రలు
మాటుగానే కనిపెట్టాలి
మొక్కుబడిగా 'ఊ'కొట్టి
దాతృత్వం ప్రకటించాలి
ఎన్నికల శుభ వేళలో
గురుతునెరిగి గురి చూసి
ఓటు అస్త్రం సంధించాలి
స్వార్థపరుల్ని గద్దె దించి
సమర్ధులకు పట్టంగట్టాలి
ప్రజాస్వామ్యాన్ని రక్షించి
ఓటరు ''విలువ'' చాటాలి
(రాజకీయ నేతల నైజం ఊటంకిస్తూ)

కోడిగూటి తిరుపతి
95739 29493