
పశ్చిమ దేశాలలో అమెరికా తరువాత ఫ్రాన్స్‌లోనే పోలీసుల చేతుల్లో ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఉక్రెయిన్ సంక్షోభం, ఆర్థిక దిగజారుడు పరిణామాలు, వలసదారుల అంశాల మీద ఐరోపా దేశాల్లో పరిస్థితి దిగజారుతోంది. ఇటువంటి స్థితిలో జనంలో ఉన్న అసంతృప్తి... ఇలాంటి ఉదంతాలు జరిగినపుడు ఊహించని రీతిలో వెల్లడౌతుంది. ఫ్రాన్స్ ఆందోళనకు పూర్వరంగమిదే. నహేల్ హత్య ఊహించని ఉదంతమైనా దానికి ప్రతికూల స్పందన గూడు కట్టుకున్న అసంతృప్తికి నిదర్శనం.
అల్జీరియా-మొరాకో సంతతికి చెందిన 17 సంవత్సరాల నహేల్ అనే కుర్రవాడు ట్రాఫిక్ సిగల్ నిబంధనలను ఉల్లంఘించాడంటూ పోలీసులు గుండెల మీద కాల్చి చంపిన దురంతం ప్రస్తుతం ఫ్రాన్స్‌ను ఊపివేస్తున్నది. జూన్ 27న పారిస్ శివార్లలోని నాన్‌తెరేలో ఈ దారుణం జరిగింది. ఇరవై తొమ్మిదవ తేదీన అంత్యక్రియల సందర్భంగా దేశమంతటా ఆగ్రహించినవారి తీవ్ర నిరసనలు, దాడులు కొనసాగుతున్నాయి. మధ్యేవాద, వామపక్ష పార్టీలు, శక్తులు ఈ ఉదంతాన్ని ఖండించాయి, నిరసనలో పాల్గొన్నాయి. ఒక మేయరు ఇంటి మీద తగులబడుతున్న కారును తోలి దాడికి పాల్పడ్డారంటే జాతి వివక్ష ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందో వెల్లడించింది. మైనారిటీల పట్ల దేశంలో ఉన్న జాతివివక్ష గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆందోళన రెండో వారంలోకి ప్రవేశించింది.
ఉదయం ఎనిమిది గంటలపుడు మెర్సిడెజ్ కారు నడుపుతున్న నహేల్ ఒక స్టాప్ వద్ద ఉన్న ఇద్దరు పోలీసుల మీద దురుసుగా కారును పోనిచ్చేందుకు చూశాడనే కథనాలు వెలువడ్డాయి. అది వాస్తవం కాదని, వారిద్దరూ కారు పక్కనే ఉన్నట్లు, కారు కదలక ముందే ఒక పోలీసు కారులో ఉన్న నహేల్ మీద తుపాకి గురిపెట్టినట్లు కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమంలో దర్శనమిచ్చాయి. కాల్పులు జరిపిన తరువాత అదుపుతప్పిన కారు సమీపంలోని ఒక స్థంభాన్ని ఢకొీట్టి ఆగింది. 'నీ తలలో బుల్లెట్ దిగుతోంది' అన్న మాటలు వినిపించినట్లు ఒక టీవీ ఛానల్ పేర్కొన్నది. కాల్పులు జరిపినపుడు నహేల్‌తో పాటు కారులో మరో ఇద్దరు ఉన్నారని వారిలో ఒకడు పోలీసులతో మాట్లాడినట్లు, మరొకడు కారు దిగి పారిపోయినట్లు చూసిన వారు చెబుతున్నారు. కాల్పులు జరపటానికి ముందు బస్సులు వెళ్లే మార్గంలో పోతున్న కారును ఇద్దరు పోలీసులు మోటారు సైకిళ్ల మీద వెంబడించి ఆపేందుకు చూడగా నహేల్ కారును ఆపలేదు, కొంత దూరం వెళ్లిన తరువాత ట్రాఫిక్ కారణంగా నిలపాల్సి వచ్చింది. వెనుకనే వచ్చిన పోలీసుల్లో ఒకడు కారు పక్కకు వచ్చి కాల్పులు జరిపాడు. ఈ తీరుతో జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చైనా పర్యాటకులు వెళుతున్న బస్‌పై జరిగిన దాడి తరువాత అనేక దేశాలు తమ పౌరులను హెచ్చరిస్తూ ఫ్రాన్స్ వెళ్లవద్దని సలహా ఇచ్చాయి.
గత వారం రోజులుగా దేశమంతటా వేలాది మంది సాయుధ పోలీసులను మోహరించి హింసాకాండను ఆపేందుకు పూనుకున్నారు. వేలాది మందిని అరెస్టు చేశారు. హింసాకాండకు పాల్పడుతున్న వారు తన మనవడి మరణాన్ని సాకుగా చూపుతున్నారని అమ్మమ్మ నాదియా ఒక టీవీలో చెప్పింది. ఆందోళనలు విరమించాలని కోరింది. నహేల్ ఉదంతం ఇలాంటి పరిస్థితిని ఎందుకు సృష్టించిందన్నది ప్రశ్న. 2020లో అమెరికాలోని మినియాపోలిస్ పట్టణంలో పోలీసులు జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతి యువకుడిని ఊపిరాడకుండా చేసి చంపిన తీరును చుట్టుపక్కల ఉన్నవారు తీసిన వీడియో సంచలనంగా మారి ఆందోళనకు దారితీసింది. నహేల్‌ను కాల్చి చంపుతున్న వీడియో కూడా అలాంటి ప్రతిస్పందననే కలిగించింది. 2005లో పోలీసులు వెంటాడినపుడు ప్రమాదానికి గురై ఇద్దరు మరణించినపుడు దేశమంతటా మూడు వారాల పాటు తీవ్ర ఆందోళనలు జరిగాయి. ఆ తరువాత ఇప్పుడు అదే మాదిరి ఫ్రాన్సులోని మైనారిటీలు ఆందోళనకు పూనుకున్నారు. ఫ్రెంచి పోలీసుల దుర్మార్గపూరిత వైఖరి, జాతి వివక్ష తీరుతెన్నులకు ఈ ఉదంతాలు నిదర్శనం.
నెలల తరబడి సాగిన పెన్షన్ సమ్మెలు, ఇతర ఆందోళనలతో అట్టుడికిన ఫ్రాన్స్‌లో అధికారాన్ని నెట్టుకువస్తున్న మాక్రాన్ ప్రభుత్వానికి తాజా ఆందోళనతో ఎదురైన సవాలు అత్యంత తీవ్రమైనది. అందుకే బ్రసెల్స్‌లో జరుగుతున్న ఒక సమావేశం నుంచి మాక్రాన్ ముందుగానే స్వదేశానికి చేరుకున్నారు. అంతేగాక, జర్మనీ పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. పెన్షన్ సంస్కరణలకు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న సమయంలో బ్రిటన్ రాజు చార్లెస్ కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఫ్రెంచి టూర్‌ను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మన దేశంలోని మణిపూర్‌లో పరిస్థితి ఎంతగా దిగజారిందో తెలిసిందే. శాంతిగా ఉండాలని కనీసం ప్రధాని నరేంద్ర మోడీ నోటి వెంట ఒక్క ముక్క రాలేదు, స్వయంగా పరిస్థితిని తెలుసుకొనేందుకు అక్కడకు వెళ్లలేదు. తమ రాష్ట్రంలో శాంతి నెలకాల్పాలని కోరుతూ ఢిల్లీ వచ్చిన ఆ రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల ప్రతినిధులను కూడా కలుసుకొనేందుకు అవకాశం ఇవ్వలేదు. అమెరికా, ఈజిప్టు వెళ్లి సుభాషితాలు చెప్పి వచ్చారు. సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు ఫ్రెంచి అధ్యక్షుడు మాక్రాన్ మంగళవారం నాడు దేశంలోని 220 మంది మేయర్లతో (స్థానిక సంస్థల అధిపతులు) సమావేశం కానున్నట్లు వార్తలు వచ్చాయి.
అల్జీరియా ఫ్రెంచి వలసగా ఉన్న కాలంలో ఫ్రెంచి దళాలు జరిపిన దారుణ మారణకాండలు ఇప్పటికీ గుర్తుకు వస్తాయి. అనేక మంది అల్జీరియన్లు ఫ్రాన్స్‌లో స్థిరపడ్డారు. అలాంటి కుటుంబానికి చెందిన వాడే గత నెలలో పోలీసుల చేతిలో మరణించిన నహేల్. వలస వచ్చిన ఆఫ్రికా అరబ్బులు, ఇతరులు అంటే ఫ్రెంచి అధికార యంత్రాంగానికి చిన్న చూపు, నేరగాళ్లుగా చూస్తారు. వారితో మమేకం కావటానికి బదులు దమనకాండ ప్రదర్శిస్తారు. అందుకే వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో తరచూ వివాదాలు జరుగుతుంటాయి. పశ్చిమ దేశాలలో అమెరికా తరువాత ఫ్రాన్స్‌లోనే పోలీసుల చేతుల్లో ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఉక్రెయిన్ సంక్షోభం, ఆర్థిక దిగజారుడు పరిణామాలు, వలసదారుల అంశాల మీద ఐరోపా దేశాల్లో పరిస్థితి దిగజారుతోంది.ఇటువంటి స్థితిలో జనంలో ఉన్న అసంతృప్తి ఇలాంటి ఉదంతాలు జరిగినపుడు ఊహించని రీతిలో వెల్లడౌతుంది. ఫ్రాన్స్ ఆందోళనకు పూర్వరంగమిదే. నహేల్ హత్య ఊహించని ఉదంతమైనా దానికి ప్రతికూల స్పందన గూడు కట్టుకున్న అసంతృప్తికి నిదర్శనం. ఇటీవలి కాలంలో ఫ్రెంచి అధినేత మాక్రాన్ తమకు మరింత వ్యూహాత్మక స్వయం నిర్ణయాధికారం ఉండాలని, ప్రపంచ వ్యవస్థలో బహుళ నాయకత్వం ఉండాలని గట్టిగా చెబుతున్నారు. ఇది అమెరికా గురించే అన్నది స్పష్టం. మాక్రాన్‌ను దారిలోకి తెచ్చుకొనేందుకు పెత్తందారీ ఏకఛత్రాధిపత్యం చెలాయించాలని చూస్తున్న శక్తుల హస్తం కూడా తాజా కొట్లాటల వెనుక ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. అమెరికాకు నచ్చని వైఖరిని తీసుకున్నపుడల్లా ఫ్రాన్స్‌లో కొట్లాటలు జరగటాన్ని బట్టి ఇలా అనుమానించాల్సి వస్తోందని చెబుతున్నారు. అందువలన ఇది ఒక్క ఫ్రాన్స్‌కే కాదు, ఐరోపా సమాఖ్యకు, దేశాలకు ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు.
ఐరోపాలో ఇటీవలి కాలంలో ముస్లిం వ్యతిరేక వైఖరితో ఉన్న పచ్చిమితవాద శక్తులు రెచ్చిపోతున్నాయి. ఫ్రాన్స్ కొట్లాటల్లో పాల్గొన్నది వలస వచ్చిన లేదా ఎప్పటి నుంచో అక్కడ స్థిరపడిన ముస్లింలు, అరబిక్ లేదా ఆఫ్రికన్ దేశాల నుంచి వలస వచ్చిన వారని చెబుతున్నారు. తాజా పరిణామాల గురించి మీడియాలో చర్చ జరుగుతున్నది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే పోలీసులకు మరింత శిక్షణ అవసరమని, జాతి వివక్ష అంశాన్ని పరిష్కరించాలని, పేదలు-ధనికుల మధ్య పెరిగిన అంతరాన్ని తగ్గించాలని, నిరుద్యోగం పెరుగుదల గురించి సూచనలు చేస్తున్నారు. నిజానికి ఇవి కొత్తవి కాదు. ఎప్పటి నుంచో ఉన్నవే. ప్రపంచీకరణ తెచ్చిన సంక్లిష్ట సమస్యలు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ప్రపంచీకరణ క్రమంలో ఉత్పత్తి ఖర్చు అధికంగా ఉందనే కారణంతో ఇతర దేశాల నుంచి పారిశ్రామిక వస్తువులను దిగుమతి చేసుకొని సేవారంగం మీద కేంద్రీకరించాయి. ఈ విధానంతో నిరంతర వృద్ధి సాగదని తేలింది. ప్రపంచ అభివృద్ధిలో అసమతూకానికి దారి తీసింది, ప్రపంచీకరణకు వ్యతిరేకతను పెంచింది. కరోనా, ఉక్రెయిన్ సంక్షోభం సమస్యల తీవ్రతను వేగతరం కావించింది. ఆర్థిక మందగమన ప్రతికూల పర్యవసానాలు పేద, మధ్య తరగతి మీద భారాలను మోపుతున్నాయి. స్థిరమైన ఉపాధి, అవసరాలకు అనుగుణంగా పెరిగే రాబడి, కుటుంబ జీవనం సంతోషంగా ఉంటుందనే అంశాల మీద ఆశలను తుంచివేస్తున్నది. వీటికి జాత్యహంకారం కూడా తోడైతే ఇక చెప్పనవసరం లేదు. గడచిన ఐదు దశాబ్దాల్లో ప్రపంచీకరణ తెచ్చిన మార్పు ఫ్రాన్సులోనూ ఇతర పశ్చిమ దేశాల్లోనూ అనేక పరిణామాలు, ఉద్యమాలు, ఆందోళనలకు దారి తీసింది. పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే అభిప్రాయం రోజురోజుకూ బలపడటానికి దారితీస్తోంది. గత రెండు దశాబ్దాల్లో ఏ నేతా ఎదుర్కోనటువంటి తీవ్ర సవాలును మాక్రాన్ ఎదుర్కొంటున్నట్లు కొందరు విశ్లేషించారు. పార్లమెంటు లోని 577 స్థానాలకు గాను మాక్రాన్ నాయకత్వంలోని రినైజాన్స్ పార్టీకి 251 సీట్లే ఉన్నాయి. రెండవ సారి ఎన్నికైనపుడు సంపూర్ణ మెజారిటీ రాకపోవటంతో ద్వితీయ రౌండ్‌లో మితవాది మారినే లీపెన్ మీద 58 శాతం ఓట్లతో గెలిచాడు. మరో నాలుగు సంవత్సరాలు అధికారంలో కొనసాగేందుకు పార్లమెంటులో ప్రతిపక్షాల సహకారంతోనే గట్టెక్కే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జరగనున్న పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా మక్రాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఎం. కోటేశ్వరరావు