ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ (అన్నమయ్యజిల్లా) : రెండు మాసాలుగా సుబ్బారెడ్డి పార్టీ మారనున్నట్లు వస్తున్న వదంతులు నిజమయ్యాయి. రాజంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, వైసీపీ నాయకులు పోలి సుబ్బారెడ్డి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడలోని టిడిపి కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. చిన్నిల్లుగారి పల్లెకు చెందిన సుబ్బారెడ్డి రాజంపేట వైసీపీలో ముఖ్యమైన నేతగా ఉంటూ పోలి తదితర గ్రామాల రాజకీయాలపై ప్రభావం చూపే వ్యక్తిగా ప్రసిద్ధి. అలాంటి కీలకమైన నాయకుడు వైసిపిపై అసంతృప్తి కారణంగా ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును కలవడంతో నియోజకవర్గంలో పెద్ద కలవరం రేగింది. వైసీపీ పెద్దలు సుబ్బారెడ్డికి బొజ్జగింపులు కార్యక్రమాలు చేపట్టినట్లు కూడా సమాచారం. మంతనాలు, బుజ్జగింపులు సరిపడని నేపథ్యంలో రెండు రోజులు కిందట వైసీపీ అధిష్టానం క్రమశిక్షణ చర్యల కారణంగా రాజంపేట మార్కెటింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న పోలి సుబ్బారెడ్డి తల్లి రామసుబ్బమ్మతో పాటు సుబ్బారెడ్డిని కూడా సస్పెండ్ చేయడం జిల్లాలోనే పెద్ద చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి శుక్రవారం టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి బత్యాల చెంగలరాయుడుతో హుటాహుటిన సమావేశమై మంతనాలు జరిపి విజయవాడలో చంద్రబాబు నాయుడు సమక్షంలో శనివారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ విషయం నియోజకవర్గంలోనే కాక జిల్లా వ్యాప్తంగా రాజకీయ వర్గాలలో పెద్ద చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు ప్రస్తుత జనసేన నాయకురాలు పత్తిపాటి కుసుమకుమారి తిరిగి తన సొంత గూడు అయిన టిడిపి లో చేరి కండువా కప్పుకున్నారు. సుబ్బారెడ్డి టిడిపి కండువా కప్పుకున్న కార్యక్రమంలో ఆయనతోపాటు బత్యాల చెంగల రాయుడు, రాజంపేట నియోజకవర్గంలోని ముఖ్య టిడిపి నాయకులు పాల్గొన్నారు.










