
ముంపు గ్రామాల గుర్తింపే ఓ పెద్ద యజ్ఞంలా, ప్రహసనంలా సాగితే ఇక గుర్తించిన వారికి సైతం ఇన్నేళ్ళుగా పునరావాస ప్యాకేజి ఇవ్వకపోవడం మరో బాధాకర ఘట్టం. ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రాజెక్టు వ్యవహారంలో ఇదే అతి పెద్ద వైఫల్యం. ఇంత వరకు ముంపులో ఉన్నది లక్షా ఆరు వేల కుటుంబాలైతే...అందులో పునరావాస ప్యాకేజీ ఇచ్చింది కేవలం 12 వేల కుటుంబాలకే. అంటే పద్దెనిమిదేళ్ళు గడిచినా 12 శాతం మందికి కూడా పునరావాస ప్యాకేజీ ఇవ్వలేకపోయిన పాలకులు మిగిలిన 88 శాతం మందికి ఇవ్వడానికి ఎన్ని దశాబ్దాలు పడ్తాయో కదా !
పోలవరం అంటే ప్రాజెక్టు మాత్రమే కాదు. అంతకుమించి త్యాగజీవులైన నిర్వాసితులకు పునరావాసం కల్పించడం కూడా. ప్రాజెక్టు మొదలెట్టి పద్దెనిమిదేళ్లయినా పునరావాసం పన్నెండు శాతం కూడా పూర్తికాకపోవడం నిర్వాసితుల పట్ల పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. పునరావాసం కల్పించకుండా వారిని జలసమాధి చేసి ప్రాజెక్టు నిర్మాణం చేయడాన్ని ఎవ్వరూ అంగీకరించరు. ప్రాజెక్టు నిర్మాణం అంటే పునరావాసం పూర్తి చేయడం ద్వారానే సాధ్యమని గుర్తించాలి. గతంలో ప్రకృతి ప్రకోపించడంతో గోదావరికి వరదలొచ్చేవి. నేడు ప్రాజెక్టు నిర్మాణం వల్ల వరదలు వస్తున్నాయి. గతంలో వరదలొస్తే వారం, పది రోజులు మెట్ట ప్రాంతాల్లో పునరావాసం పొందాల్సి వచ్చేది. కాపర్ డ్యాం నిర్మాణంతో నీళ్ళు ఎదురు తన్నడంతో వరదలొస్తున్నాయి. ఎప్పుడూ జులై నెలలో వరదలొచ్చేవి కావు. కానీ ప్రభుత్వ వైఫల్యం వల్ల 2022 జులైలో వరదలొచ్చాయి. 15 నుండి 3 నెలల పాటు కొండలు, గుట్టలు, పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. ఈ సందర్భంగా చాలామందికి ఉన్న గూడు కొట్టుకుపోయింది. వరదల సమయంలో ఒక కొవ్వొత్తి మాత్రమే ఇచ్చారు. ఈసారి వరదల్లో అగ్గిపెట్టె అయినా ఇస్తారా అని దీనంగా ప్రశ్నిస్తున్నారు. రేషన్ కార్డుపై ఒక మంచినీటి ప్యాకెట్ మాత్రమే ఇచ్చారు. నాడు ఇస్తానన్న వరద పరిహారం సంవత్సరం గడిచినా నేటికీ ఇవ్వలేదు. వరదలు తగ్గాక భూములు సాగుకు సాధ్యం కావడం లేదు. ఉపాధి లేదు. బతికే మార్గం గగనమయ్యింది. ముంపు ప్రాంతం పేరుతో మౌలిక వసతుల కల్పన సైతం ఆపేశారు. దీనితో మాకు రావాల్సిన పునరావాస ప్యాకేజి ఇచ్చి కాలనీలు కట్టిస్తే మా బతుకేదో మేం బతుకుతాం అంటూ వాపోతున్నారు. పాలకులలో మాత్రం కదలిక లేదు.
ప్రాజెక్టు నిర్మాణానికి తొలి నోటిఫికేషన్ 2005 ఏప్రిల్ 15న వెలువడింది. అంటే 18 ఏళ్ళు పూర్తయ్యాయి. జాతీయ ప్రాజెక్టు, అధునాతన పరిజ్ఞానంతో నిర్మాణమని గొప్పగా చెప్తున్నా...నేటికీ ముంపు గ్రామాలేవో, నిర్వాసితులెవరో తేల్చకపోవడమే నిదర్శనం. పాలకులు ఇందుకు సిగ్గు పడాలి. ఫ్లడ్ రిజర్వాయర్ లెవల్ (ఎఫ్‌ఆర్‌ఎల్) అని మొదట్లో హద్దులు వేశారు. తర్వాత దశలు. కాంటూరు బ్లాకులు అంటూ విడదీశారు. తొలుత 41.15 మీటర్లు కాంటూరులో ఉన్న గ్రామాలకు పునరావాసం కల్పిస్తామంటున్నారు. తర్వాత 45.7 కాంటూరు పరిధిలోని వారికి పునరావాసం కల్పిస్తామన్నారు. ఈ కాకి లెక్కలతో నేటికీ ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు, రంపచోడవరం జిల్లాలో వి.ఆర్.పురం, చింతూరు, కూనవరం, ఎటపాక మండలాల్లో ముంపు గ్రామాల ఎంపికలో గందరగోళం సాగుతూనే ఉంది. దీంతో 18 ఏళ్ళైనా ఏ గ్రామాలు మునుగుతాయో, ఏవి మునగవో, మునిగిపోతున్న తమను నిర్వాసితులుగా గుర్తించారో లేదో అని ఆందోళనతోనే జీవిస్తున్నారు.
చిత్రమేమంటే 1986, 2022 సంవత్సరాల్లో వచ్చిన వరదల్లో పూర్తిగా మునిగిపోయిన గ్రామాలు సైతం 41.15 కాంటూరు లోకి రావని, ముంపు గ్రామాలు కావని అనడంతో నిర్వాసితుల ఆక్రోశం వర్ణనాతీతం. వరదల్లో తమ ఇళ్ళపై నుండి పడవలు తిరిగాయని ఇప్పుడు తమ గ్రామం ముంపులోకి రాదంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఇంకా విచిత్రమేమంటే నిర్వాసితులకు నిర్మిస్తోన్న కుకునూరు మండలంలోని కివ్వాక, వెంకటాపురం, కూనవరం మండలంలో భైరవపట్నం, ఎటపాక మండలంలో కన్నాయిగూడెం కాలనీలు ముంపుకు గురయ్యాయి. ఇక పునరావాస కాలనీలు కూడా మునిగిపోతే ఇక మా పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు ప్రభుత్వం నుండి సమాధానం లేదు. కుకునూరు మండలంలో 10 గ్రామాలు వేలేరుపాడు మండలంలో 9, చింతూరు 1, వి.ఆర్.పురం 9, కూనవరం 7 గ్రామాలను మొత్తం 36 గ్రామాలను తొలి దశలో పునరావాసం కల్పించే గ్రామాల జాబితాలో ప్రకటించారు. వేలేరుపాడు మండలంలో బోరేపల్లి, కొత్తూరు, వసంతవాడ, కట్కూరు గ్రామాలలో ఇదే పరిస్థితి. మిగిలిన మండలాలోనూ ఇలాంటి ఉదాహరణలెన్నో. గ్రామాలకు పునరావాసం 70 కి.మీ. దూరంలో కల్పిస్తున్నారు. వీరు ఆ భూముల్ని ఎలా సాగు చేస్తారన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఇక భూములు మునిగాక వాళ్ళెలా జీవించగలరనేది ఎవరికైనా తట్టే ప్రశ్న. కానీ ప్రభుతాలకు మాత్రం ఈ ప్రశ్న తట్టడం లేదు. అందుకే ప్రభుత్వం చెప్తున్నట్లుగా నిజంగానే కొన్ని గ్రామాలు ముంపుకు గురికావనే అనుకున్నా దీవుల్లా, దిబ్బల్లా మిగిలే గ్రామాలకు సాధారణ జీవితం, విద్యా, వైద్యం ఇతర మౌలిక సౌకర్యాలు ఎలా అందుతాయి? అందుకే ఈ కాకి లెక్కలు కట్టిపెట్టి మండలాన్ని యూనిట్‌గా తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలతో పాటు, సిపిఎంతో పాటు ఈ ప్రాంతపు సమస్యలపై కొద్దిపాటి అవగాహన ఉన్న వారంతా డిమాండ్ చేస్తున్నారు. ముంపు ప్రాంతాల గుర్తింపుకు ఇదే సరైన ప్రాతిపదిక కాగలదు. 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులకు పునరావాస ప్యాకేజీ ఇవ్వడంలోనూ ప్రభుత్వం అనేక మెలికలు పెడుతున్నది. యువతులకు ఇవ్వనని ఒకసారి...ఇప్పుడు ఫ్యామిలీ ప్యాకేజీ అని మాట మారుస్తున్నది. పోరాటాల ఫలితంగా కటాఫ్ తేదీ 2017 డిసెంబర్ నాటికి గుర్తించింది. నేటికీ అత్యధిక గ్రామాలకు పునరావాసం కల్పించకపోవడంతో, ఖాళీ చేయించే తేదీనే కటాఫ్ తేదీగా నిర్ణయించాలని ప్రజానీకం, సిపిఎం కోరుతున్నది.
గుర్తించినా పునరావాసం దక్కలేదు
ముంపు గ్రామాల గుర్తింపే ఓ పెద్ద యజ్ఞంలా, ప్రహసనంలా సాగితే ఇక గుర్తించిన వారికి సైతం ఇన్నేళ్ళుగా పునరావాస ప్యాకేజి ఇవ్వకపోవడం మరో బాధాకర ఘట్టం. ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రాజెక్టు వ్యవహారంలో ఇదే అతి పెద్ద వైఫల్యం. ఇంత వరకు ముంపులో ఉన్నది లక్షా ఆరు వేల కుటుంబాలైతే...అందులో పునరావాస ప్యాకేజీ ఇచ్చింది కేవలం 12 వేల కుటుంబాలకే. అంటే పద్దెనిమిదేళ్ళు గడిచినా 12 శాతం మందికి కూడా పునరావాస ప్యాకేజీ ఇవ్వలేకపోయిన పాలకులు మిగిలిన 88 శాతం మందికి ఇవ్వడానికి ఎన్ని దశాబ్దాలు పడ్తాయో కదా! ప్యాకేజీ పొందిన వారిలో పోలవరం, దేవిపట్నం మండలాల వారే వున్నారు. అయితే వారి మీద ప్రత్యేక ప్రేమతో పునరావాసం కల్పించలేదు. వీరిని అక్కడి నుండి తరలించనిదే ప్రాజెక్టు పనులు సాధ్యం కావని, వీరి పునరావాస కల్పన నిర్వాకానికి నిర్వాసితులు ఎక్కడ ప్రాజెక్టు పనులకు అడ్డుపడతారోనని వీరికి పునరావాస ప్యాకేజీ ఇచ్చి కాలనీలకు తరలించారు. పోలవరం మండలంలో ఆదివాసీల్ని పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, మండలాలకు పునరావాసం కల్పించింది. ఇతరులకి పోలవరం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం మండలాల్లో పునరావాసం కల్పించారు. మోసపూరిత మాటలతో మరికొందర్ని, పోలీసులతో బెదిరించి మరికొందర్ని, దళారుల మాయ మాటలతో ఇంకొందర్ని పునరావాస కాలనీలకు తరలించారు. ఇందుకు నిలువెత్తు ఉదాహరణ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలోనే సాగాయి. ప్రాజెక్టు నిర్మాణ గ్రామం, ఆదివాసీలున్న షెడ్యూల్డ్ గ్రామం దేవరగొందిని నాన్ షెడ్యూల్ ప్రాంతానికి తరలించారు. నాటి కలెక్టర్ ఎల్.అగర్వాల్ ఈ వికృత చర్యకు పాల్పడ్డాడు. త్వరలోనే పునరావాస కాలనీని షెడ్యూల్ ప్రాంతంగా గుర్తించేలా చేస్తానని నమ్మబలికాడు. నాడు ఈ చర్యను వ్యతిరేకించినందుకు సిపిఎం నేతల్ని నిర్బంధించడంతో పాటు పునరావాసానికి అడ్డొస్తున్నారంటూ ప్రచారం చేశారు. నాటి నుండి 2022 జులై వరదల్లో కూడా వేలేరుపాడు బోరెడ్డిగూడెం, కోయిదా గ్రామాల వారిని పునరావాస కాలనీలకు వెళ్ళిన మరుక్షణమే ప్యాకేజీ మొత్తం ఇస్తామన్నా నేటికీ బకాయిలున్నాయి. పదేళ్ళక్రితం తరలించిన గ్రామాల్లో సైతం 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులకు ప్యాకేజీని పదుల సంఖ్యలో కూడా ఇవ్వలేదు. వేలేరుపాడు మండలంలో తేప్రాకగొమ్ములో 450 కుటుంబాల్లో కేవలం 5 గిరిజన కుటుంబాలకే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించారు. ఇది కూడా మండలంలో 70 గ్రామాలకు 50 గ్రామాలు మునుగుతుంటే 31 గ్రామాలను ముంపులో గుర్తించి 5 గ్రామాల్లో మాత్రమే పరిహారమిచ్చారు. కుకునూరు మండలం భువనగిరిలో చీరవల్లిలో సగం మందికి పరిహారమిచ్చారు. ఈ మండలం పరిస్థితీ ఇంతే. మొత్తం 90 గ్రామాలుంటే 70 గ్రామాలు ముంపుకు గురవుతుంటే 18 గ్రామాలను ప్రభుత్వం గుర్తించింది. వాటిలో ఒక గ్రామంలో పూర్తిగానూ, మరో గ్రామంలో పాక్షికంగానూ పరిహారం చెల్లించారు. ఇక అల్లూరి జిల్లాలో 4 మండలాల్లో ఇంతకంటే ఘోరం. పోడు భూములకు హక్కు పత్రాలు లేవనే సాకుతో ఎవ్వరికీ పరిహారం ఇవ్వలేదు. పునరావాస ప్యాకేజీ రూ.10 లక్షలు, భూమికి పరిహారం రూ.5 లక్షలు ఇస్తామన్న జగన్ ఎన్నికల హామీలు నాలుగున్నరేళ్ళు గడిచినా అతీగతీ లేదు. బటన్ ముఖ్యమంత్రిగా 'నేను కన్నాను. విన్నాన'న్న జగన్ గారికి నిర్వాసితుల కష్టాలు కనపడడం లేదా? మా ప్యాకేజీ బటన్ కూడా నొక్కొచ్చు కదా అన్న వారి మాటలు వినపడ్డం లేదా ?
నిర్వాసితుల కాలనీల్లో సౌకర్యాలేవీ ?
రెండు జిల్లాల్లోని 8 మండలాల నిర్వాసితులకు సుమారు 70 కాలనీలు నిర్మిస్తున్నారు. వీటిలో 8 మండలాల గిరిజనే తరులకు జంగారెడ్డిగూడెం మండలంలో చల్లావారిగూడెం (తాడువాయి)లో 10 వేల కుటుంబాలకు ఇళ్ళు నిర్మిస్తున్నారు. గిరిజనులకు షెడ్యూల్ మండలాల్లో నిర్మిస్తున్నారు. రెండేళ్ళు కాకుండానే ఇల్లంతా వాన కురుస్తున్నది. గతంలో మేం పూరిపాకలో వుండేవాళ్ళం. ఇల్లంతా వాన కురిసేది. కురిసేచోట పాత్రలు పెట్టేవాళ్ళం. నేడు కాంక్రీట్ బిల్డింగ్‌లో పాత్రలు పెట్టుకున్నాం. తేడా ఏముందన్న నిర్వాసితుల ప్రశ్నకు పాలకులే జవాబివ్వాలి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 25 సౌకర్యాలతో కాలనీలు నిర్మించాలంటున్నా వాటి జాడే లేదు. ఇప్పటికీ పలు భవనాలు పునాది స్థితిలోనే ఉన్నాయి. పూర్తయ్యాయని చెప్పిన చోట మంచినీళ్ళు కూడా లేక అల్లాడుతున్నారు. వేలేరుపాడు మండలం బోరెడ్డి గూడెం గ్రామస్తులకు జీలుగుమిల్లి మండలంలో నిర్మించిన కాలనీలో 3 రోజుల వరకు నీరు రాకపోవడంతో పొరుగున రైతు బోరు నుండి నాల్గో రోజు నీళ్ళు తెచ్చుకున్నారు. కాలనీకో వీధిలైటు అన్నా పలు చోట్ల ఒక్క లైట్ వెలుగుతున్నది. అత్యధిక చోట్ల అంతర్గత రహదారులు నిర్మించలేదు. పోలవరం మండలం కొరుటూరు కాలనీకైతే లింకు రోడ్డు కూడా లేక అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. కాలనీల్లో ఎక్కడా అంగన్‌వాడీ కేంద్రాలు, బడులు, పి.హెచ్.సి లు ప్రారంభం కాలేదు. దీంతో విద్య, వైద్యం అందని ద్రాక్షగా ఉంది. జీలుగుమిల్లి కాలనీలకు చెందిన వారు 7 కిలోమీటర్ల దూరంలోని తాడువాయి పాఠశాలకు వెళ్ళలేక చదువులు చాలిస్తున్నారు. గతంలో ఎత్తైన పాపికొండలపై జీవించారు తెల్లదిబ్బల గ్రామస్తులు. నేడు చెరువులో కాలనీ నిర్మాణంతో నిత్యం నీళ్ళు నిలిచిపోతున్నాయి. చివరికి చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయడానికి సైతం శ్మశాన భూమి కేటాయించక పోవడంతో వారి ఆక్రోశం వర్ణనాతీతం. సిరివాక, సరుగుడు, తల్లవరం, పల్లపూరు, రామన్నగూడెం, పలు గ్రామాల వారికి శ్మశానవాటిక లేక ఆందోళన చేయగా...భూములైతే చూపించారుగానీ వాటికి దారులు లేవు.
స్థానిక గిరిజనుల సాగులో ఉన్న భూములను గిరజనేతర భూస్వాములు... అధికారులు, ప్రజా ప్రతినిధులతో కుమ్మక్కై తప్పుడు రికార్డులతో పరిహారం పొందారు. పలు చోట్ల ఆ భూములే నిర్వాసిత గిరిజనులకు అంటగట్టారు. ఘర్షణలు తలెత్తిన చోట తమకు సంబంధం లేదన్నట్టు అధికారులు చేతులెత్తేశారు. కొరుటూరు గ్రామస్తుల భూమి నేటికీ వివాదాల్లో ఉంది. పలుచోట్ల పాత భూయజమానులే కౌలు పేరుతో భూములు తమ గుప్పెట్లో ఉంచుకున్నారు. అన్నింటికీ మించి ఉపాధి కల్పనపై నిర్వాసితులకు జీవనం పొందడమే దుర్లభమై పోయింది. ఇప్పటికే యాంత్రీకరణతో వ్యవసాయ పనులు స్థానికులకే తగ్గిపోయాయి. నేడు వారక్కడికి చేరడంతో పనులు దొరకడమే గగనమవుతుంది. ఉపాధి హామీ పనులు చూపడానికి కూడా 'మా మండలంలో మీ జాబ్ కార్డులు లేవు. మీ గ్రామాలు గుర్తింపు లేద'ంటూ నిరాకరిస్తున్నారు. చట్టం చెప్పినట్లు ఇంటికో ఉద్యోగం అన్న మాట కాగితాలకే పరిమితం అయ్యింది. చివరికి ఎస్టీ సర్టిఫికెట్లు జారీ చేయటంలో సైతం రికార్డులు మా దగ్గర లేవనే పేరుతో తిప్పుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను సైతం నిరాకరిస్తున్నారు. ఇప్పుడు వరద గోదావరంత కష్టాలున్న నిర్వాసితులకు పునరావాసంతో మాకు సంబంధం లేదంటూ కేంద్రం, వారు నిధులిస్తేనే మీకు పునరావాసం అంటున్న రాష్ట్ర ప్రభుత్వంపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ తరుణంలో సిపిఎం చేపట్టిన మహా పాదయాత్ర వారికి కొండంత ధైర్యాన్నిచ్చింది. ఐక్యంగా పోరాడితేనే పునరావాసం దక్కుతుందని నిర్వాసితులకు నచ్చజెప్పింది. పోరు కేక పోరుబాటగా మార్చడమే పరిష్కారంగా మహా పాదయాత్ర ద్వారా నిర్వాసితుల్ని చైతన్యపరిచింది. ఆ బాటే వారికి పునరావాసపు బాటలు వేస్తుంది.
/ వ్యాసకర్త సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి/ ఎ. రవి