
'హరిత వస్త్రాన్ని ధరించి శోభిల్లుచున్న నా పుడమి తల్లిపై నానా / రూప సహితమై కళావిహీనంగా మార్చుచున్నది/ హిమాద్రి మొదలు కుమారి వరకూ వనమూలికా సహిత/ ఆరోగ్యకారక జలధారలను చాప క్రింద నీరు వలే ప్రవేశించి తన దురాక్రమణతో/ కలుషితం చేయుచున్నది... ప్లాస్టిక్ భూతం' అంటాడో కవి. ప్రపంచవ్యాప్తంగా మానవాళి నిత్యజీవితంలో భాగంగా మారిన ప్లాస్టిక్... పర్యావరణానికి పెను సవాలుగా మారింది. ఒకసారి వాడి పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వ్యర్థాలు కొండలా పేరుకు పోతున్నాయి. మనం నిత్యం పడేసే వ్యర్థాల్లో ప్లాస్టిక్ వాటా 10 శాతం. ప్లాస్టిక్ మోజులో పడి మానవాళి నష్టపోతోంది. దేశంలో ప్రతి రోజూ 25 వేల టన్నుల కంటే ఎక్కువగా చెత్త ఉత్పత్తి అవుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం... భారత్‌లో ఏటా 56 లక్షల టన్నుల చెత్త పోగు పడుతోంది. గత పదేళ్లలో మనం ఉత్పత్తి చేసిన ప్లాస్టిక్ గత శతాబ్దమంతా వాడిన దానికంటే ఎక్కువ. ఇలా వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు నాశనం కాకుండా నిల్వ ఉండి, కాలుష్యానికి కారణమౌతున్నాయి.
ప్లాస్టిక్ ఓ అద్భుతమైన రసాయన సమ్మిళిత పదార్థం. దీంతో అనేక వస్తువులు తయారు చేయవచ్చు. ఇవి అందంగాను, రంగురంగులతో వుండి అత్యంత చౌకగా వుండటంతో ప్లాస్టిక్ ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రచారంలోకి వచ్చింది. 'ధనస్వామ్యపు విలువలకు, దారిద్య్రపు బతుకులకు- నాగుపాములా వెంటపడుతుంది, అధికారం, ధనం గవ్వలకు దాసోహమై, ప్లాస్టిక్ భూతం ప్రేమ పరుగులు తీస్తుంది' అంటూ నేడు ప్రపంచమంతా ప్లాస్టిక్ మాయలో పడిపోయిందని చెబుతాడో కవి. దీని వ్యర్థాల వల్ల మానవాళికి కలిగే ముప్పు అంతా ఇంతా కాదు. బెంగాల్‌కు చెందిన హీరా షేక్ అనే మహిళ గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. అది క్రమేపీ పెరుగుతూ తీవ్రం కావడంతో స్థానిక ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్లు ఆ మహిళకు స్కానింగ్ చేయగా, రిపోర్ట్స్‌లో ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆమె పొట్టలో నుంచి 100 గ్రాముల ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించారు. ఇదొక తాజా ఉదాహరణ మాత్రమే. సముద్రాల్లోని జలచరాలు ప్లాస్టిక్ తినడం ద్వారా అసంఖ్యాకంగా చనిపోతున్నాయి. పెంపుడు జంతువులను సైతం ప్లాస్టిక్ భూతం వదల్లేదు. ప్రపంచవ్యాప్తంగా 50 శాతం పాస్టిక్ ఉత్పత్తులు ఒకసారి వాడి పారేయదగ్గవే. ఈ తరహా ప్లాస్టిక్ పర్యావరణానికి హాని కారకమవుతోంది. వీటిని నిషేధించకపోతే 2050 నాటికి భూగోళంపై జీవజాతులకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ఐక్యరాజ్యసమితి అయిదేళ్లుగా హెచ్చరిస్తోంది. ఇప్పటికే కెన్యా ఇలాంటి ప్లాస్టిక్ వస్తువుల నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. థాయ్ లాండ్, రువాండా తదితర దేశాలు అదే బాటన సాగుతున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను జులై 1 నుంచి భారత ప్రభుత్వం నిషేధించింది.
శాసనాలు, ప్రకటనలతో మాత్రమే మార్పు రాదు. వీటిని అమలు చేయాలంటే సవివరమైన, వాస్తవికమైన, ఆచరించదగిన ప్రణాళికలు కావాలి. 2022 కల్లా ప్లాస్టిక్ వాడకాన్ని అంతమొందిస్తామని ప్రధానమంత్రి మోడీ 2018లో ప్రకటించారు. ఈ ప్రకటన నాటకీయమైనదే తప్ప లక్ష్య సాధనకు ఆలోచించి చేసింది కాదని తేటతెల్లం అవుతోంది. ప్రకటనలకే పరిమితం కాకుండా చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ముందుగా హానికరమైన ప్లాస్టిక్ ఉత్పత్తులను పరిశ్రమల వద్దే నిలువరించాలి. అలా కాకుండా విచ్చలవిడిగా ప్రజల మీదికి వదిలేసి... మీరు వాడకండని చెప్పటం సమంజసం కాదు. అదే సమయంలో ప్రజలు కూడా ఈ ప్లాస్టిక్ జీవితం నుంచి బయట పడేందుకు పూనిక తీసుకోవాలి. 250 గ్రాములుండే సెల్‌ఫోన్‌ను జేబులో పెట్టుకు మోస్తున్నాం. సుమారు 30 గ్రాముల లోపే వుండే గుడ్డ సంచిని ఎందుకు మోయలేకపోతున్నాం. ఇంటి నుంచే పేపర్ సంచి గాని, గుడ్డ సంచి గాని, జనపనార సంచి గాని తీసుకెళ్లాలి. ప్లాస్టిక్ గ్లాసులకు బదులు స్టీలు, గాజు గ్లాసులు, ప్లాస్టిక్ విస్తర్లకు బదులు ఆకులతో చేసిన విస్తర్లు, ఫ్లెక్సీలకు బదులు గుడ్డతో చేసిన బ్యానర్లను వాడొచ్చు. పాఠశాల నుంచి ప్రధాని వరకు ప్లాస్టిక్ లేని జీవితం కోసం కృషి చేయాలి. అప్పుడే భూగోళాన్ని పర్యావరణ హితంగా మార్చగల్గుతాం. ప్లాస్టిక్ లేని భూమిని తయారుచేసుకుందాం. రేపటి తరాల భవిష్యత్తుకు బాటలు వేద్దాం. ప్లాస్టిక్ సంచులకు 'నో' చెబుదాం.