Jun 15,2023 06:35

మోడీ ప్రభుత్వం వల్లిస్తున్న సహకార ఫెడరలిజం వట్టి బూటకమని ఇప్పటికే తన చేతల్లో రుజువు చేసుకోగా, తాజాగా తమిళనాడులో డిఎంకె మంత్రి వి.సెంథిల్‌ బాలాజీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి) మెరుపుదాడి సమాఖ్య వ్యవస్థపై కేంద్ర బిజెపి సర్కారు జరిపిన మరో ఘాతుకం. ఎప్పుడో ఎఐడిఎంకె ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగ నియామకాల్లో వెల్లడైన ఆరోపణలపై ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూపీ లాగడం మొదలు పెట్టాయి. రెండు వారాల కింద ఆదాయపన్నుశాఖ (ఐ.టి) అధికారులు ఒక విడత సెంథిల్‌ బంధువులు, అనుచరుల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. మంగళవారం ఏకంగా రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో మంత్రి సెంథిల్‌ కార్యాలయంలో ఇ.డి. సోదాలు నిర్వహించింది. సెంథిల్‌ను గంటల కొలది ప్రశ్నించింది. ఆపై అర్థరాత్రి సమయంలో అరెస్టు చేసినట్లు ప్రకటించింది. వైద్యపరీక్షల కోసం అస్పత్రికి తరలించే క్రమంలో సెంథిల్‌కు ఛాతినొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షల అనంతరం బైపాస్‌ సర్జరీ అత్యవసరమని వైద్యులు సిఫారసు చేశారు. ఇ.డి. సెంథిల్‌ను అంతలా హింసించిందని డిఎంకె ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర బిజెపి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు నిరసనగా డిఎంకె శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయి. సెంథిల్‌ అరెస్టును ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ ఖండించారు.
మంత్రి సెంథిల్‌పై ఇ.డి. దర్యాప్తు ముమ్మాటికీ మోడీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో చేపట్టిన వేధింపు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదివారం తమిళనాడులో పర్యటించగా, తదుపరి రెండు రోజులకే సెంథిల్‌ అరెస్టు జరగడం యాధృచ్ఛికం కాదని రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసు. కొంతకాలంగా తమిళనాడులో రాజకీయ పరిణామాలు పరిశీలించిన ఎవరికైనా బిజెపి కుయుక్తులు ఇట్టే అర్థమవుతాయి. జయలలిత అస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ఎలాగైనా తమిళనాడులో ఉనికి చాటుకోవాలన్న బిజెపి తాపత్రయం కనిపించింది. అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో ఎఐడిఎంకెతో పొత్తు పెట్టుకున్నా బిజెపి ఆశలు నెరవేరకపోగా ఘోర పరాజయంతో తలబొప్పి కట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే పునరావృతమైంది. ఆ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన డిఎంకె కూటమి ప్రభుత్వం కేంద్ర విధానాలను, ముఖ్యంగా రాష్ట్రాల హక్కుల హననాన్ని, సమాఖ్య వ్యవస్థపై దాడిని వ్యతిరేకించి నిలబడింది. సహించలేని మోడీ ప్రభుత్వం గవర్నర్‌ను అడ్డం పెట్టుకొని ప్రజలెన్నుకున్న డిఎంకె ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతోంది. స్టాలిన్‌ ప్రభుత్వం కేంద్ర ఆగడాలను సమర్ధవంతంగా ఎదుర్కోవడంతోపాటు బిజెపి యేతర రాష్ట్ర ప్రభుత్వాల, పార్టీల ఐక్యతకు కృషి చేస్తోంది. గిట్టని బిజెపి ఎలాగైనాసరే డిఎంకె ప్రభుత్వాన్ని అస్థిరపాల్జేయాలన్న కట్రతోనే ఐ.టి., ఇ.డి. కేసులు బనాయిస్తోంది. ఆ పూర్వరంగంలోనిదే మంత్రి సెంథిల్‌పై ఇ.డి. కేసు. దక్షిణాదిలో ఉన్న ఏకైక కర్ణాటక చేజారాక తమిళనాడుపై బిజెపి మరింతగా గురి పెట్టింది.
మనీలాండరింగ్‌ వంటి ఆరోపణలపై ఒక రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా కేంద్రం సెక్రటేరియట్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ ఇ.డి. సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయడం మామూలు విషయం కాదు. అలాంటి అధికారాలు కావాలంటున్నారు మోడీ. అదేమీ అవినీతి, అక్రమాలు, నల్లధనం నిరోధించడానికి కాదు. విపక్ష పార్టీలను బెదిరించడానికి, బ్లాక్‌మెయిల్‌ చేయడానికి, లొంగకపోతే ఇబ్బంది పెట్టడానికి. ఢిల్లీలో మద్యం స్కాంలో కేజ్రీవాల్‌ ప్రభుత్వంలోని మంత్రి సిసోడియా అరెస్ట్‌ అయినా, తెలంగాణలో కవితపై కేసైనా. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, లల్లుప్రసాద్‌.. ఏ కేసైనా రాజకీయ ప్రేరేపితమే. మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలలోని కీలక నాయకులే లక్ష్యంగా తన అధీనంలోని ఇ.డి, ఐ.టి, సిబిఐ, ఎన్‌ఐఎ వంటి సంస్థలను ఉసిగొల్పి దుర్వినియోగం చేస్తోంది. ఈ నెల 23న పాట్నాలో ప్రతిపక్షాల భేటీ జరుగుతున్న వేళ బీహార్‌లో నితీష్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కుట్రలు చేస్తోంది. దేశానికి పీడలా తయారైన బిజెపికి ఎదురొడ్డి ఐక్యంగా నిలబడటం ద్వారానే ప్రతిపక్షాలు మనగలుగుతాయి. బిజెపిని ఓడించడానికి అదే మార్గం.