Jan 20,2023 06:44

ఎత్తైన ఎవరెస్టు హిమగిరి శ్రేణులు, భయానక లోయలు, ప్రకృతి అందాల విందులు, పర్వతారోహకుల సాహస గుంపులు, పర్యాటకుల సందడుల నడుమ నిత్యం నేపాల్‌ విమానాశ్రయాలు నిండుకుండలను తలపిస్తుంటాయి. గత ఆదివారం రోజున 72 మంది ప్రయాణీకులతో దిగడానికి సిద్ధంగా ఉన్న నేపాలీ 'యతి ఎయిర్‌ లైన్స్‌' విమానం కొండ ప్రాంతంలో కూలడం, మంటలు చెలరేగడంతో 70 ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలవడం అత్యంత విచారకరం. పర్యాటకమే జీవనాధారమైన హిమపర్వత నేపాల్‌ దేశంలో ఇలాంటి విమాన ప్రమాదాలు గతంలో కూడా జరిగిన చరిత్ర ఉంది. రాజధాని ఖాట్మండ్‌ నుంచి పర్యాటక ప్రదేశమైన 'పొఖార అంతర్జాతీయ విమానాశ్రయాని'కి బయలుదేరిన విమానం మరో ఐదు నిమిషాల్లో ల్యాండ్‌ అవుతుందనగా క్షణాల్లో అగ్గిరవ్వల నడుమ బొగ్గుగా మారడం దు:ఖదాయకం.
 

                                                                               ప్రపంచవ్యాప్త ప్రమాదాలు

గత మూడు దశాబ్దాల్లో 52 నేపాలీ విమానాలు కుప్పకూలడం, అందులో 720 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిపోయింది. 1990-2023 మధ్య కాలంలో విమాన ప్రమాదాలు జరిగిన 207 దేశాల జాబితాలో నేపాల్‌ 33వ స్థానంలో నిలిచింది. అత్యధికంగా అమెరికాలో 1,578 విమాన ప్రమాదాలు, రష్యాలో 464 ప్రమాదాలు, కెనడాలో 369 ప్రమాదాలు నమోదై మొదటి మూడు స్థానాలలో నిలిచాయి. ఇండియా 99 విమాన ప్రమాదాలతో 13వ స్థానంలో వుంది. 207 దేశాల ప్రమాద మరణాల జాబితాలో అమెరికాలో జరిగిన ప్రమాదాల్లో 5,445 మంది, రష్యాలో 2,730 మంది, ఇండోనేషియాలో 2,171 మంది, ఇండియాలో 1,020 మంది (7వ స్థానం) మరణించారు. విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రయాణీకుల సంఖ్యకు సంబంధించిన సూచీలో నేపాల్‌ 12వ స్థానంలో ఉంది. అమెరికాలో విమాన ప్రయాణీకుల రద్దీ, విమానాల సంఖ్య అత్యధికంగా ఉండడంతో ప్రమాదాల సంఖ్య అధికంగా కనిపిస్తున్నది. అమెరికాలో 1990-2023 మధ్య 324 మిలియన్ల విమానయానాలు, చైనాలో 57 మిలియన్ల విమానయానాలు జరిగాయి.
            నేపాల్‌లో విమానాల సంఖ్యతో (0.9 మిలియన్లు) పాటు ప్రయాణీకుల సంఖ్య కూడా స్వల్పంగా ఉన్నప్పటికీ ప్రమాదాలు, మరణాల రేటు (720 మరణాలు) అధికంగా నమోదు కావడం విచారకరం. నేపాల్‌తో పాటు నైజీరియా, పాకిస్థాన్‌, అంగోలా, శ్రీలంక దేశాల్లో కూడా ప్రమాదాలు, మరణాల రేటు అధికంగా ఉంది. గత మూడు దశాబ్దాల్లో నేపాల్‌కు చెందిన 'యతి ఎయిర్‌ లైన్స్‌'కు చెందిన ఆరు ప్రమాదాల్లో 99 మంది మరణించగా, 'తారా ఎయిర్‌ లైన్స్‌'కు చెందిన ఆరు ప్రమాదాల్లో 67 మంది, 'అగ్ని ఎయిర్‌ లైన్స్‌'కు చెందిన రెండు విమాన ప్రమాదాల్లో 29 మంది, 'నెకాన్‌ ఎయిర్‌ లైన్స్‌'కు చెందిన మూడు ప్రమాదాల్లో 20 మంది ప్రయాణీకులు, 'సీతా ఎయిర్‌ లైన్స్‌'కు చెందిన రెండు ప్రమాదాల్లో 19 మంది, 'ఎవరెస్ట్‌ ఎయిర్‌ లైన్స్‌'కు చెందిన ఒక ప్రమాదంలో 19 మంది, 'బుద్ధ ఎయిర్‌ లైన్స్‌'కు చెందిన ఒక ప్రమాదంలో 19 మంది, 'స్కైలైన్‌ ఎయిర్‌ లైన్స్‌'కు చెందిన రెండు ప్రమాదాల్లో 14 మంది ప్రయాణీకులు మరణించారు.
 

                                                                  నేపాల్‌ విమాన ప్రమాదాలు - కారణాలు

1952-2022 వరకు నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాదాలు పర్వత శ్రేణుల్లో దట్టమైన మబ్బుల కారణంగా కుప్పకూలడం గమనించారు. ప్రస్తుత విమాన ప్రమాదం ఇరుకైన కొండల మధ్య జరగడం, తక్కువ రన్‌ వే కలిగిన ఎయిర్‌ పోర్టులతో విమాన లాండింగ్‌ పైలెట్లకు సవాళ్ళుగా నిలవడంతో ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయి. పర్వత ప్రాంత నేపాల్‌లో విదేశీ పర్యాటకులు, పర్వతారోహకుల రద్దీ అధికంగా ఉంటుంది. ఎత్తైన కొండలు, ఇరుకైన కొండ మలుపుల మార్గాలు, సంక్లిష్ట రన్‌వేలు, పైలెట్ల అధిక పని ఒత్తిడి, నిర్వహణ లోపాలు, శిక్షణ కొరవడిన విమానయాన సిబ్బంది, ప్రమాణాలను గాలికి వదిలేయడం లాంటి పలు కారణాలు ప్రమాదాలకు ఆజ్యం పోస్తున్నాయి.
        హిమాలయ దేశంలో జరిగిన ప్రస్తుత విమాన ప్రమాదంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. వరుస ప్రమాదాలతో అపకీర్తి పాలవుతున్న నేపాల్‌ ప్రభుత్వం తక్షణమే విమానయాన సురక్ష చర్యలను చేపట్టాలి. ప్రమాదాల నివారణకు శ్రద్ధ వహించాలి. నవ్వుతూ, కేరింతలు కొడుతూ ల్యాండింగ్‌కు సిద్ధంగా ఉన్న ప్రయాణికులు క్షణాల్లో అగ్నికి ఆహుతి కావడం మనసులను మెలిపెడుతోంది. వరుస విమాన ప్రమాదాలకు నేపాల్‌ ప్రభుత్వం బాధ్యత వహించాలి. బ్లాక్‌బాక్స్‌ విశ్లేషణల పేరుతో కాలయాపన చేయవద్దు. దర్యాప్తు సంఘాల నివేదికలు బుట్టదాఖలా చేయరాదు. వాతావరణ వైవిధ్యమని, భౌగోళిక ప్రాంతమని సాకులు చెప్పకుండా ఈ ప్రమాద పరిమాణాన్ని గుర్తించి నేపాల్‌ తగు చర్యలు చేపట్టాలి. తమ దేశ విమాన ప్రయాణాలకు భద్రత గొడుగును పట్టి పర్యాటకుల ప్రాణాలకు రక్షణ కల్పించి పర్యాటక పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలి.

- డా|| బుర్ర మధుసూదన్‌రెడ్డి
సెల్‌: 9949700037