Mar 09,2023 07:18
  •  ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌ నిర్వాకం
  •  ప్రతిపక్షాల ఆగ్రహం

న్యూఢిల్లీ : బెంగాల్‌ గవర్నర్‌గా వివాదాస్పదుడైన జగదీప్‌ ధన్‌కర్‌ ఉపరాష్ట్రపతి అయ్యాక రోజుకో వివాదాన్ని సృష్టిస్తున్నారు. రాజ్యసభ చైర్మన్‌ కూడా అయిన ధన్‌కర్‌ రాజ్యాంగ నియమనిబంధనలు, పార్లమెంటరీ సాంప్రదాయాలను అన్నిటినీ తుంగలో తొక్కి తన వ్యక్తిగత సిబ్బంది నుంచి ఎనిమిది మందిని వివిధ పార్లమెంటరీ స్థాయీ సంఘాలకు సభ్యులుగా నియమించారు. తద్వారా అసాధారణమైన రీతిలో ఒక చెడు సాంప్రదాయానికి ఆయన తెర తీశారు. ఉపరాష్ట్రపతి చర్యపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజ్యసభ సభ్యులకు బదులు, తన వ్యక్తిగత కార్యదర్శులను (పిఎస్‌లను), రాజ్యసభ సెక్రటేరియట్‌కు అధికారులను 20 స్టాండింగ్‌ కమిటీల్లో సభ్యులుగా నియమిస్తూ మంగళవారం రాజ్యసభ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొంది. కమిటీలో కొత్తగా చోటు చేసుకున్న అధికారుల్లో రాజ్యసభ చైర్మన్‌ కార్యాలయంలో ఆఫీసర్‌ ఆఫ్‌ స్పెషల్‌ డ్యూటీ (ఒఎస్‌డి)గా విధులు నిర్వర్తిస్తున్న అఖిల్‌ చౌదరి, పర్సనల్‌ సెక్రటరీ అదిత్‌ చౌదరి, ప్రైవేట్‌ సెక్రటరీ సుజిత్‌ కుమార్‌, అదనపు ప్రైవేట్‌ కార్యదర్శి సంజరు వర్మ తదితరులు వున్నారు. ఇదొక అసాధారణమైన చర్య అని పేరు తెలపడానికి ఇష్ట పడని రాజ్యసభ సెక్రటేరి యట్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇది పార్లమెంటరీ సాంప్రదాయాలను నిలువునా మంట గలపడమేనని ప్రతిపక్షాలు విమర్శిం చాయి. ధనకర్‌ రాజ్యసభ ఎక్స్‌ అఫీషియో సభ్యుడే తప్ప మామూలు సభ్యుడు కాదని కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారి పేర్కొన్నారు.సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్టాండింగ్‌ కమిటీకి అధ్యక్షులుగా ఉన్న కాంగ్రెస్‌ నాయకులు జైరాం రమేష్‌ వ్యాఖ్యానిస్తూ 'ఇటువంటి విడ్డూరం ఇదివరకెన్నడూ చూడలేదు' అని అన్నారు. కమిటీ అధ్యక్షుడిగా ఇలాంటి ఏకపక్ష చర్యను సహించను. ఇవి రాజ్యసభ స్టాండింగ్‌ కమిటీలు, చైర్మన్‌ల స్టాండింగ్‌ కమిటీలు కాదు' అని విమర్శించారు.. దీనిపై రిటైర్ట్‌ సెక్రటరీ జనరల్‌ ఒకరు మాట్లాడుతూ 'ప్రతీ కమిటీకి జాయింట్‌ సెక్రటరీ స్థాయి అధికారి సేవలందిస్తారు. ఇప్పటికే సజావుగా పనిచేసే అధికారులు ఉన్నప్పుడు అదనపు సిబ్బందిని తీసుకురావాల్సిన అవసరం ఏమిటో బోధపడడం లేదని అన్నారు. 2014లో 67 శాతంగా ఉన్న బిల్లల పరిశీలన ప్రస్తుతం 14 శాతానికి పడిపోయిందని ప్రతిపక్ష నాయుకులు పేర్కొన్నారు.