Jan 13,2023 10:48

న్యూఢిల్లీ : భారత రాజ్యాంగమే అన్నిటికీ సర్వోన్నతమైనదని సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి అదే రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలనే సవాలు చేయడం ఉపరాష్ట్రపతి కార్యాలయానికి తగదని ఆయన హితవు పలికారు. అఖిల భారత ప్రిసైడింగ్‌ ఆఫీసర్స్‌ సమావేశంలో ఉపరాష్ట్రపతి జగదీష్‌ ధనకర్‌ మాట్లాడుతూ పార్లమెంటే సర్వోన్నతమైనదంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో సీతారాం ఏచూరి తన అభిప్రాయాన్ని పోస్టు చేశారు. భారత రాజ్యాంగమే పార్లమెంటును ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. కార్యానిర్వాహక విభాగం (ప్రభుత్వం), శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థ ఇలా అన్ని విభాగాలూ తమ అధికారాలను, విధులను రాజ్యాంగం ద్వారానే పొందాయని తెలిపారు. అంతే కానీ వాటికి ఇంకెక్కడి నుంచో అధికారాలు దఖలు పడలేదన్నారు. రాజ్యాంగమే సర్వోన్నతమైనదని ఆయన స్పష్టం చేశారు. సంఖ్యా బలం ఉన్నంత మాత్రన ఏ ప్రభుత్వం కూడా మన గణతంత్ర వ్యవస్థలోని ఈ ప్రాథమిక నిర్మాణాన్ని తక్కువ చేయజాలవని ఏచూరి పేర్కొన్నారు. ఇలాంటి ఘటనల నుంచి మనల్ని కాపాడుతూ వస్తున్నది ఈ 'ప్రాథమిక నిర్మాణ సూత్రమే'నని తెలిపారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి ఇప్పుడు అదే రాజ్యాంగ 'సర్వోన్నత'ను ప్రశ్నించేలా వ్యాఖ్యలు చేయడం భావి తరాలకు తప్పుడు సంకేతాలను ఇస్తుందని ఏచూరి అన్నారు. భారత సార్వభౌమాధికారాన్ని కూడా రాజ్యాంగం ప్రజలకే అప్పగించిందని తెలిపారు. అందుకనే మన రాజ్యాంగం 'భారత ప్రజలమైన మేము..' అని ప్రారంభమౌతుందని ఆయన గుర్తు చేశారు. ఈ సర్వోన్నతమైన అధికారాన్ని 'రాజ్యం'లోని ఏ విభాగమూ భర్తీ చేయలేదని ఏచూరి పేర్కొన్నారు. ఐదేళ్లకు ఒకసారి తమ ప్రతినిధులను తాత్కాలికంగా ఎన్నుకునేందుకు ప్రజలు తమకు లభించిన ఈ సార్వభౌమాధికారాన్ని వినియోగిస్తారని తెలిపారు. శాసనకర్తలు తమకుతాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారని తెలిపారు. కార్యానిర్వాహక వ్యవస్థ ( ప్రభుత్వం) శాసన వ్యవస్థ (పార్లమెంటు)కు జవాబుదారీ వహించాల్సివుంటుందని, ఎంపీలు ప్రజలకు జావాబుదారీవహించాల్సిందేనని తెలిపారు. ఈ మొత్తం రాజ్యాంగ నిర్మాణ క్రమంలో ఎక్కడ కూడా ప్రజల సార్వభౌమాధికారాన్ని భర్తీ చేసే వ్యవస్థ మరొకటి లేదని ఏచూరి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారత గణతంత్ర, లౌకిక, ప్రజాతంత్ర లక్షణాన్ని ధ్వంసం చేసి ఆ స్థానంలో అసహన ఫాసిస్టు హిందూత్వ రాష్ట్ర ఏర్పాటుకు జరుగుతున్న ఈ కుట్రలను అడ్డుకొని వాటిని తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు