రామాపురం అనే గ్రామంలో భీమయ్య అనేక వర్తకుడు ఉండేవాడు. అతను చాలా పిసినారి. ఎంగిలి చేత్తో కాకికి కూడా విదిల్చేవాడు కాదు. దానధర్మాలు అంటే ఏమిటో తెలియదు. ఎంత మంచి వస్త్రాలున్నప్పటికీ చినిగిన బట్టలే కట్టుకునేవాడు. ఒకసారి అతని స్నేహితుడు కృష్ణయ్య ఇలా అన్నాడు : 'భీమయ్యా.. ఏమిట్రా ఈ పిసినారితనం? దీనివలన నీవు మున్ముందు ఎన్నో కష్టాలు అనుభవిస్తావు' అని హితబోధ చేసాడు. అయినా భీమయ్య వినలేదు.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, భీమయ్యకు బుద్ధి వచ్చే సమయం రానే వచ్చింది. ఒకరోజు భీమయ్య సరుకులు కొనడానికి పొరుగూరికి బయల్దేరాడు. కొత్తగా కొనుక్కున్న చెప్పులు వేసుకొని బయల్దేరాడు. కొంతదూరం నడిచాక 'అరె, చెప్పులు వేసుకొని నడిస్తే అవి అరిగిపోతాయి కదా, అసలే కొత్తవి కూడాను' అనుకుంటూ చెప్పులు తీసి, చంకలో పెట్టుకొని నడవసాగాడు. అసలే అడవిమార్గం, మార్గంమధ్యలో అతని కాలుకి 'పెద్దముల్లు' గుచ్చుకుంది. ఆ.. ముల్లే కదా అని నిర్లక్ష్యంగా , అలాగే నడవసాగాడు. పనంతా చూసుకుని, తిరిగి ఇంటికి పయనమయ్యాడు. రెండురోజుల తర్వాత ముల్లు గుచ్చుకోవడం వలన అతని కాలంతా వాచిపోయి, చీము పట్టింది. పిసినారితనంతో సొంతవైద్యం చేయడం వలన అది వికటించి, కాలు సెప్టిక్ అయ్యింది. అది తెలుసుకున్న స్నేహితుడు కృష్ణయ్య వచ్చి, 'నీ పిసినారితనం తగలెయ్య.. పదా వైద్యుని దగ్గరకు' అని ఒక పెద్దాసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ వైద్యుడు 'ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. కాలు తీసెయ్యాల్సిన పరిస్థితి. దీనికి ఖర్చు కూడా చాలా అవుతుంది' అని చెప్పాడు. వేరే దారి లేక భీమయ్య సరే అన్నాడు. అతని పిసినారితనం వల్ల కాలు పోగొట్టుకున్నాడు. ధనం కూడా చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చింది.
రామవరపు సాయిప్రసన్న,
9వ తరగగతి, గురుజాడ స్కూలు,
విజయనగరం జిల్లా
ఫోన్ : 9440976910, 7382069828