Feb 26,2023 09:42

చీకట్లు ముసురుకోవడం ప్రారంభమయ్యింది. చీకట్లను చీల్చుతూ వెన్నెల వెదజల్లుతున్నాడు చంద్రుడు. వెన్నెల కాంతిలో, విద్యుత్‌ దీపాల అలంకరణలో ఆ కళ్యాణ మండపం వెలిగిపోతుంది. కళ్యాణ మండపం అంతా పెళ్లి హడావుడి కనబడుతూనే ఉంది. ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ జనం అటూ ఇటూ కంగారుగా తిరుగుతున్నారు. కొందరు పెళ్లి పనులను పర్యవేక్షిస్తుంటే, మరికొందరు పెళ్లి పనులు టకటకా చేసుకుంటూ పోతున్నారు. పెళ్లి మండపంలో అలంకరించిన తాజా పువ్వుల పరిమళం అక్కడంతా అల్లుకుంది. ఇంకా భోజనాల దగ్గర హడావిడి అయితే మామూలుగా లేదు. పెద్దమనుషులు రుచులు చూడ్డం, తోచిన సలహా ఏదో ఒకటి ఇవ్వడం. బయట ఖాళీ ప్రదేశమంతా షామియానాలు వేశారు. వచ్చే అతిథులు వస్తున్నారు.. పనుల మీద బయటికి వెళ్లేవారు వెళ్తున్నారు. బయట కారులు బారులు తీరుతున్నాయి.
అందరిలోనూ ఉత్సాహం ఉరకలేస్తుంది. అందరూ అన్ని పనులూ పంచుకుని, చకచకా చేసుకుంటూ పోతున్నారు. కళ్యాణ మండపం పైన పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు మాట్లాడుకోవడానికి చిన్న ఏర్పాటు జరిగింది. కళ్యాణ మండపం పైకి నడిచి వచ్చింది పెళ్లికూతురు లక్ష్మి. అక్కడ ఆమె తప్ప ఇంకెవరూ లేరు. కళ్యాణ మండపం పైన ఒక మూలగా రెండు కుర్చీలు వేసి ఉన్నాయి. ఒక దాంట్లో కూర్చుంది లక్ష్మి.
పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రాకకై ఎదురుచూస్తూ ఆలోచిస్తోంది. ఆమెలో ఏదో తెలియని సిగ్గు. తన చీరని సరి చూసుకుంటూ ఆలోచనలలో పడిపోయింది.
ఇంతలో ఆ మేడ మీదకి ఎవరో వస్తున్నట్లు చెప్పుల శబ్దం. అవి పాత కాలంనాటి కిర్రు కిర్రుమనే చెప్పులు. అప్పుడు ఊరిలో పెద్దవారు ప్రత్యేకంగా తోలుతో కుట్టించుకునేవారు వాటిని. లక్ష్మి అవి ఇతనికి ఎక్కడ దొరికాయో అనుకుంది.
ఆ కిర్రు కిర్రుమనే శబ్దం దగ్గరై తన పక్కన ఆగింది. తలెత్తి చూసింది లక్ష్మి. తెల్లటి పంచె కట్టులో మెరిసిపోతున్నాడు పెళ్లి కొడుకు. ఆకాశంలో ఉన్న చంద్రుడికి పోటీగా ఉన్నాడు. లక్ష్మిని అతను చిరునవ్వుతో పలకరించి, పక్కనే ఉన్న మరో కుర్చీలో కూర్చున్నాడు.
వారి మధ్య కాసేపు మౌనం రాజ్యమేలింది. వారి నుంచి వచ్చే సుగంధ పరిమళమో, అత్తరు వాసనో గాలికి అక్కడంతా అల్లుకుంది. చంద్రుడు వధూవరులు ఏమి మాట్లాడుకుంటారోనని ఒక చెవి ఇటు వేసి ఉంచాడు.
ముందుగా వరుడు అయిన గోపాల్‌ మాట్లాడాడు. 'ఏంటి లక్ష్మీ! ఆలోచిస్తున్నావు. ఈ మొగుడితో రేపట్నుంచి ఎలా వేగాలోననా..?' దానికి లక్ష్మి సమాధానంగా, 'మీతో వేగేది ఏముంది! మీరు నాతో ఎలా వేగుతారో..! అని నా బాధ.'
'ఓహో! మొగుడికి ముందే హెచ్చరికలు పంపి, భయపెడుతున్నావు. నిన్ను నేను పెళ్లి చేసుకోను కాక చేసుకోను!' అని లేచి నిల్చున్నాడు గోపాల్‌. 'సర్లే కూర్చోండి.. మీరేం చేసుకోవద్దు. నేనే మిమ్మల్ని చేసుకుంటాను!' అంది లక్ష్మి.
'ఆ.. అలా అన్నావు బాగుంది!' అని కుర్చీ ఆమె పక్కకు లాగి, కూర్చున్నాడు గోపాల్‌ చిన్నగా నవ్వుతూ, 'లక్ష్మీ నీలో హాస్యం ఏమాత్రం తగ్గలేదు.!'
'అంతా మీరు నేర్పించిందే!' అంది లక్ష్మి.
అవునవును అన్నట్లు తల ఊపాడు గోపాల్‌.
వారు మాటల్లో పడ్డారు. ముహూర్తం దగ్గర పడడంతో పెళ్లి పనులు వేగం పుంజుకున్నాయి. కెమెరా మ్యాన్‌ కూడా అడుగుపెట్టాడు. ప్రతి సంఘటనను ఫోటో రూపంలో జ్ఞాపకంగా నిక్షిప్తం చేస్తున్నాడు. ఆహ్వానితులంతా దాదాపు చేరుకున్నారు. భోజనాల వడ్డింపు ప్రారంభమైంది. పెళ్లి పందిరి అంతా వంటకాల ఘుమఘుమలతో నిండిపోయింది.
పెళ్లి మండపం దగ్గర పంతులు గారు చెప్పిన వస్తువులన్నీ సర్దుతున్నారు ఆడవారు. దూరం నుంచి వచ్చినవారికి చేసే ఏర్పాట్లలో హడావిడి పడుతున్నారు మగవారు.
మేడపై వధూవరులు ఇంకా తమ కబుర్లు కలబోసుకుంటున్నారు. 'ఏమోరు హనీమూన్‌కి ఎక్కడికి వెళ్దాం అంటావ్‌?' అన్నాడు గోపాల్‌. 'సిగ్గు లేకపోతే సరి' అని సిగ్గుపడింది లక్ష్మి. 'అదేమిటి అలా అంటావు, పెళ్లి తర్వాత హనీమూన్‌ ఉండాలి కదా!' అన్నాడు గోపాల్‌. 'ఊరుకోండి!' అని సిగ్గుపడుతూ మొఖం చాటుచేసుకుంది లక్ష్మి. గోపాల్‌ మీసం మెలేశాడు. ఒకరినొకరు చూసుకుని, కన్నులతోనే నవ్వుకున్నారు.
గోపాల్‌ తన వాచీ చూసుకుని 'ముహూర్తానికి సమయం దగ్గరపడుతుంది. ఇంకా మనం మాట్లాడుకోవడానికి కొద్ది నిమిషాలు మాత్రమే మిగిలాయి!' అన్నాడు. లక్ష్మి అవునన్నట్లుగా తలూపింది.
గోపాల్‌, లక్ష్మి ఇద్దరూ మళ్ళీ ఎవరి ఆలోచనలో వారు పడ్డారు. ఇద్దరి ఆలోచనలలో అప్పటిదాకా జరిగిన జీవితం తాలూకు సంఘటనలు తెరలు తెరలుగా కనిపిస్తున్నాయి. ఎన్నో మధురస్మృతులను వారు తలచుకుంటున్నారు. లక్ష్మి ఏదో గుర్తొచ్చిన దానిలా ఒక్కసారిగా గోపాల్‌ వైపు తిరిగి, 'శ్రీవారికి చిన్న కానుక తెచ్చాను!' అంది. గోపాల్‌ 'ఏమిటది?' అన్నాడు.
లక్ష్మి అప్పటిదాకా చీర కొంగులో దాచిన బాక్స్‌ తీసి, అతని చేతికి అందించింది. గోపాల్‌ అందుకుని, తెరచి చూశాడు. అది కొత్త కళ్ళజోడు. అప్పుడు గుర్తొచ్చింది అతనికి తన కళ్ళజోడు నాలుగు రోజుల క్రితం జారిపడి, పగిలిపోయింది అని.
గోపాల్‌ లక్ష్మిని చూసి 'భర్తకు ఏమి కావాలో బాగానే తెలుసుకుంటున్నావు. నీకోసం నేనూ ఒకటి తెచ్చాను!' అన్నాడు. ఆమె ఏమిటి అని కళ్ళతోనే ప్రశ్నించింది. అతను లేచి వెళ్ళి మెట్ల దగ్గర దాచిన గిఫ్ట్‌ బాక్స్‌ తెచ్చి, ఆమె చేతికి అందించాడు.
లక్ష్మి గిఫ్ట్‌కు ఉన్న కవర్‌ని మెల్లగా తెరిచి చూసింది. చూస్తూనే ఆమె కంట నీరు నిలిచింది. అది ఒక ఫోటోఫ్రేమ్‌ పాత ఫోటోకి ఇప్పుడు చక్కటి అద్దం కూర్చి, వెండి ఫ్రేమ్‌ చేయబడింది. అది ఆమె కుటుంబం.
దానిని చూసి ఆమె కంట నీరు పెట్టుకుంటుంటే, అతని కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. 'ఏడిస్తే మాత్రం వాళ్లు వస్తారా ఏమిటి? వదిలేరు లక్ష్మీ!' అన్నాడు గోపాల్‌.
'అవునులెండి. అయినా ఫ్రేమ్‌ బాగుంది!' అని కన్నీళ్లు తుడుచుకుంది లక్ష్మి. ఈ శుభముహూర్తాన కన్నీరు కూడా మంచిది కాదు అనుకున్నారు ఇద్దరూ. అయినా వారి గుండెలు బాధతో బరువెక్కాయి. ఈ రోజే కాదు వారు ఎన్నో సార్లు అలా బాధపడ్డారు. కానీ ఈ రోజు మరింత ప్రత్యేకం.
వాళ్లు అలా ఉండగానే మేడ పైకి మనుషులు వస్తున్న అలికిడి వినిపించింది. వారిద్దరూ కళ్లు తుడుచుకుని, అటు వైపు తిరిగారు. ఈ లోపు బిలబిలమంటూ జనం పైకి వచ్చారు. అందులో పెద్ద వారి నుండి చిన్నపిల్లల వరకు ఉన్నారు.
ఆ గుంపులో ఒకరు అన్నారు, 'ముహూర్తానికి టైము దగ్గర పడుతుంటే వధూవరులిద్దరూ ఇక్కడ కూర్చుని సరసాలు ఆడుకుంటున్నారు!' అన్నారు. గుంపంతా నవ్వులమయం అయ్యింది.
అందరూ కలిసి వధూవరులను వివాహ వేదిక దగ్గరికి తీసుకుపోయారు. కళ్యాణ మండపం జనంతో కళకళలాడుతుంది.
ఇద్దరినీ పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు. వారిద్దరూ సిగ్గుల మొగ్గలు అయ్యి, పెళ్లి పీటల మీద తలవంచుకుని కూర్చున్నారు. అది గమనించిన పంతులు గారు ఇలా అన్నారు.
'ఏమిటయ్యా మొదటిసారి పెళ్లి చేసుకుంటున్నట్లు ఇద్దరూను. మీ ఇద్దరికీ ఇది రెండోసారి పెళ్లి.. అనగా షష్టిపూర్తి. కొందరికి మాత్రమే జరిగే మహాభాగ్యం!' అన్నారు. పెళ్లి తంతు మొదలైంది.
అవును గోపాలరావు, లక్ష్మీలకు ఇది షష్టిపూర్తి. అతను ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. రాత్రిపూట పిల్లలకు ఉచితంగా ట్యూషన్లు చెప్పేవాడు. వాళ్ళింటికి వచ్చే విద్యార్థులకే కాదు, ఏ మనిషికైనా ఆమె కాదనకుండా భోజనం పెట్టి, పంపించేది.
వారికి ఇద్దరు కొడుకులు. పట్నం పంపి మరీ పెద్ద పెద్ద చదువులు చదివించారు. వారికి పెద్దపెద్ద ఉద్యోగాలు వచ్చాయి.. పెళ్లిళ్లయ్యాయి. వాటితో పాటే కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త వ్యామోహాలు పుట్టుకొచ్చాయి. తల్లిదండ్రులకు వయస్సు మీద పడింది.. ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు.
ఒకరోజు ఉదయాన్నే పిల్లలిద్దరూ వచ్చారు. నానా గొడవ చేశారు. నాన్న మీద, అమ్మ మీద లేని ప్రేమంతా ఒలకబోసి ఆస్తులను, అమ్మానాన్నలను సమానంగా పంచేసుకున్నారు. పెద్దవాడి దగ్గర నాన్న, చిన్నవాడి దగ్గర అమ్మ అని విడదీసుకుపోయారు.
గోపాల్‌, లక్ష్మీలకు ప్రత్యేక విడాకులు మంజూరయ్యాయి. కాకపోతే కోర్టు ద్వారా కాదు కొడుకుల ద్వారా. ఎలాగోలా వారు విడివిడిగా ఉండలేక, ఉండి.. మాటలు పడలేక, వారితో ఇమడలేక కొడుకులకు చెప్పి, ఒకే వృద్ధాశ్రమంలో చేరిపోయారు.
ఆశ్రమానికి తలా ఒకింత కడతారు. గోపాల్‌ ఆ వృద్ధాశ్రమానికి అనుబంధంగా ఉన్న అనాధాశ్రమంలో పిల్లలకు సైన్స్‌, లెక్కలు పాఠాలు చెబుతారు. వృద్ధులకు అండగా ఉంటారు. ఆవిడ అక్కడ వంటలలో సహాయపడి, అందరికీ ఇంటి భోజనం అంత రుచిగా వండిపెడుతుంది. అందరితో అభిమానంగా ఉంటుంది.
వీరంటే ఆ ఆశ్రమంలోని వారికే కాదు, వారితో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఎనలేని అభిమానం, ప్రేమ. ఇలా ఉన్న సమయంలో గోపాల్‌కి అరవయ్యవ జన్మదినం రాబోతుందని వారికి తెలిసి, షష్టిపూర్తి జరపాలని నిర్ణయించారు. గోపాల్‌ దగ్గర చదువుకున్న పిల్లలు, ఆమె చేతి భోజనం తిన్నవారు, అందరూ కలసి ఘనమైన ఏర్పాట్లు చేశారు. అందరూ తలా ఒక పనిలో పాలుపంచుకున్నారు.
అయితే ఇందాక గోపాల్‌ ఇచ్చిన వెండి ఫోటో ఫ్రేమ్‌లో వీరి కొడుకులే ఉన్నారు. మళ్లీ ఏం ఖర్చు చేతికి అంటుకుంటుందో అని లేని కారణాలను సృష్టించుకుని, షష్టిపూర్తికి రాలేదు. అయినా వాళ్ళ పిల్లలులేని, కాదు పిల్లలు రాని ఆ షష్టిపూర్తి కార్యక్రమం అందంగా అందరిలో జరిగిపోయింది.
వీరి కొడుకులే కాదు.. ఇలాంటి కొడుకులు కూతుర్లవి రాతి హృదయాలు. కాదు కాదు రాయిని చెక్కితే విగ్రహంగా మారుతుంది. అది వరాలు ఇస్తుందనే నమ్మకమన్నా ఉంటుంది. కానీ వీళ్లు.. ఉన్నవి ఉడ్చుకుపోతారు. వీరు ఆ వెండి ఫోటో ఫ్రేమ్‌లోనే చూడడానికి బాగుంటారు, బంగారం లాంటి మనస్సులు కలిగినవారే బయట ప్రపంచానికి బాగుంటారు.
అక్కడ ఆ రాత్రి అంగరంగ వైభవంగా ఆ దంపతులకు మరొక్కసారి పెళ్లి జరిగిపోయింది. అప్పుడే కెమేరా మ్యాన్‌ అక్కడ కట్టిన పెళ్లి బ్యానర్‌ను వీడియో తీస్తూ జూమ్‌ చేశాడు. దానిమీద అక్షరాలు ఇలా ఉన్నాయి. 'నంద గోపాలరావు వెడ్స్‌ వరలక్ష్మిల షష్టిపూర్తి వేడుక.. అందరూ ఆహ్వానితులే.!'

చిక్కాల జానకిరామ్‌
8985925219